ముందడుగు - శింగరాజు శ్రీనివాసరావు

mundadugu

వారి మధ్య మౌనం, యుద్ధానికి యుద్ధానికి మధ్య శాంతిలా వుంది. గత నెలరోజుల నుంచి వారి మధ్య అదే విషయం గురించి చర్చ జరుగుతూనే వుంది. ఎన్నో సంవత్సరాలుగా రగులుతున్న సమస్య ఇది. ఏళ్ళు గడుస్తున్నా మారని స్థితిగతులకు ఓ చిన్నపాటి పరిష్కారంగా తోస్తున్నది వారి ఆలోచన. కానీ దీన్ని ఎంతమంది హర్షిస్తారు. కనీసం తల్లిదండ్రులైనా తమకు మద్దతు ఇస్తారో, ఇవ్వరో. మరెంత మంది తమను నిందిస్తారో. తలతిక్క ఆలోచనని దూషించేవారు ఎంతమందో. అలా సాగుతున్న ఆలోచనలని ఛేదిస్తూ అడిగాడు వ్యాస్.

" మన నిర్ణయంలో తప్పేముందిరా. అది మనలాంటి ఇంకొంతమంది పైకి రావడానికి ఉపయోగపడుతుంది"

అంతేకాదు. మన ఆలోచనలు ఇంకొందరికి మార్గదర్శక మవుతాయి" అన్నాడు రవి.

" ఏమోరా. మనం ఇంకా పైపైకి ఎదిగే అవకాశాన్ని చేతులారా జారవిడుచుకుంటున్నామేమో" చైతన్య సందేహం.

" మా నాన్న దీన్ని ససేమిరా ఒప్పుకోడు" ధీరజ్ బల్లగుద్దుడు.

వీరు నలుగురు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు. సమాజాన్ని చదువుతో పాటే బాగా చదివిన వాళ్ళు. జాషువా, శ్రీశ్రీ, చలం లాంటి అభ్యుదయ వాదుల రచనలకు ప్రభావితమైన వాళ్ళు. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని గట్టిగా నమ్మేవారు. కాలేజిలో వీరికి చాలా మంది ఫాలోయర్స్ కూడ ఉన్నారు. వీరి సరికొత్త ఆలోచనలతో ర్యాగింగ్ రూపు రేఖలనే మార్చారు. వికృత రూపు దాల్చిన ఆ జాడ్యాన్ని విజ్ఞాన భరితంగా మార్చారు. వీరి ర్యాగింగ్ విచిత్రంగా ఉండేది. పట్టుచీర కట్టుకు రమ్మనో, వేమన, సుమతి శతకాలు ఒక రోజులో కంఠస్థం చేయాలనో, పురాణాలలో ప్రశ్నలతోనో, దేశభక్తుల జీవితచరిత్రల పైన ప్రశ్నలతోనో సాగుతూ అందరి మన్ననలను పొందేది. అందుకే వీరంటే విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకు కూడా అభిమానం ఉండేది. అలా కాలేజి జీవితం గడుపుతున్న వారికి సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే తపన కలిగింది. ఎంతో ఆలోచించి, పలుమార్లు చర్చించుకుని ఒక స్థిరమైన ఆలోచనకు వచ్చారు. ఎవరు తమను అనుసరించినా, అనుసరించకున్నా వారు మాత్రం తాము అనుకున్న పని చేయాలని, అందుకు ప్రభుత్వ అంగీకారం తీసుకోవాలనే నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాన్ని జరుగబోయే చివరి వార్షికోత్సవ సభలో తెలియజేయాలని నిర్ణయించుకొని, ఆ బాధ్యతను వ్యాస్ పైన పెట్టారు.

*******

వార్షికోత్సవ ముగింపు సభకు విద్యాశాఖా మంత్రిని, జిల్లా కలెక్టరు గారిని ఆహ్వానించారు కాలేజి యాజమాన్యం. యువతీ, యువకుల ఆటపాటలతో, పెద్దల ప్రసంగాలతో సందడి సందడిగా సాగింది. చివరగా బహుమతి ప్రధానోత్సవం, తదనంతరం వ్యాస్ ముగింపు పలుకులు, వందన సమర్పణ మిగిలాయి.

బహుమతులలో సగానికి పైగా ఆ నలుగురికే రావడం వేదిక పైన ఉన్న వారికి ఆశ్చర్యం వేసింది. వారి అనుమానాన్ని నివృత్తి చేస్తూ ప్రిన్సిపాల్ మూర్తి గారు, వారు కాలేజిలో చేసిన కార్యక్రమాలను, వారి నిబద్దతను, డబ్బున్న వారి కుటుంబాల నుంచి వచ్చినా విద్య మీద వారికున్న శ్రద్ధను, వినయశీలతను సభాముఖంగా గర్వంగా చెప్పారు . ఈ సందర్భంగా కాలేజి బెస్ట్ స్టూడెంట్ గా ట్రోఫి అందుకున్న వ్యాస్ ను మాట్లాడవలసినదిగా కోరాడు.

వేదికపైన అందరికీ నమస్కరించి మైకును అందుకున్నాడు వ్యాస్.

" సభకు నమస్కారం. వేదిక నలంకరించిన ప్రముఖులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారములు. తోటి విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనములు. ఈ రోజు మేమిలా పదిమంది దృష్టిని ఆకర్షించగలిగామంటే దానికి కారణం మా ఉపాధ్యాయులే. మా కోసం వారి సమయాన్ని, అదనపు గంటలను వెచ్చించి మా సందేహాలను తీర్చి, మా పురోగతికి బాట వేసిన మా ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకు మా విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను, మా మిత్రులు రవి, ధీరజ్, చైతన్య మేమంతా చాలా రోజుల నుంచి ఒక విషయంపై తీవ్రంగా ఆలోచించాము. సమాజంలో ఉన్న ఈ అసమానతలను ఎలా తొలగించాలా...అని. మా చిన్ని బుర్రలకు ఒక ఆలోచన వచ్చింది. అది మంచో, చెడో మాకు తెలియదు. కాని మా మటుకు మేము దాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నాము. దానికి ప్రభుత్వ ఆమోదం కావాలి. అనుమతిస్తే ఆ ఆలోచనను చెప్తాను" అంటూ వేదిక వైపు చూశాడు. ప్రిన్సిపాల్ గారు చెప్పమన్నట్లు తల ఆడించాడు.

" మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, రిజర్వేషన్ వసతులు అమలులో వున్నా దాని ఫలం కొద్దిమందికే తప్ప అందరికీ అందుతున్నట్లుగా మాకు అనిపించడం లేదు. దీనికి కారణం దాని వలన లబ్ది పొందిన వారే ఆర్థికంగా స్ధిరపడి, ఆ అవకాశాన్ని తమ బిడ్డలకు కూడా కల్పిస్తూ ఒకే కుటుంబం తరతరాలుగా ఆ ఫలాన్ని అనుభవిస్తున్నారు. కాని వారి తోటి వారు చాలా మంది, వీరి పోటీకి తట్టుకోలేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోతున్నారు. అందువలన ఏర్పడ్డ ఆర్థిక అసమానతలు తొలగాలి అంటే ఒక తరం వారు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే, ఇక తరువాత తరం రిజర్వేషన్ల అవకాశాన్ని స్వచ్ఛందంగా వదులుకుని విద్యలో గాని, ఉద్యోగాలలో గాని ఓపెన్ కాంపిటీషన్ లో అందరితో పాటు పోటీ పడాలి. ఇలా వైదొలగినపుడు ఆ అవకాశం తమలాటి మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని తరాలు జరిగితే కొంత కాలానికి మహామహులు, చట్టాల నిర్మాతలు ఆశించిన విధంగా రిజర్వేషన్ ఫలసాయం అందరికీ చేరి ఆర్థిక అసమానతలు తొలుగుతాయని మా నమ్మకం. అందుకే మేము నలుగురం ఇకనుంచి ఎక్కడా మా రిజర్వేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోము. ఇందుకు కావలసిన ఆమోదాన్ని ప్రభుత్వం ద్వారా మాకు అందించాలని మంత్రి గారిని వేడుకుంటున్నాము. ఇది చాలా మందికి పిచ్చి పనిగా అనిపించవచ్చు. కానీ సమాజం కోసం జీవితాలే త్యాగం చేసిన మహానుభావుల ముందు మేం చేసేది ఎంత స్వల్పమో మాకు తెలుసు. మేము వేసే ఈ ముందడుగుకు తోడుగా ఎందరు అడుగువేస్తారో తెలియదు. కాని మా ప్రయత్నం ఆగదు.

మరొకమాట.. ఎవరో కొందరు స్వార్థపరులు నెలకొల్పిన ఈ కుల, మత విభేదాలు కార్చిచ్చులై, ఎందరి బ్రతుకులనో బుగ్గిపాలు చేస్తున్నాయి. ప్రేమించిన హృదయాలను బీటలు వారుస్తూ, పరువు పేరిట వారి ప్రాణాలను బలిగొంటూ అనారికులుగా ప్రవర్తించేలా సమాజాన్ని పురికొలుపుతున్నది, ఈ కుల మత మహమ్మారి. దీనిని రూపుమాపాలంటే అసలు దరఖాస్తులో వీటి వివరాలను అడిగే 'కాలమ్' ను తొలగించాలి. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించే ప్రభుత్వాలు, వాటి ప్రస్తావనే లేని లోకాన్ని సృష్టింవచ్చుగా. వారి వారి స్వార్ధం కోసం అనేకమంది కులాన్ని పావులా వాడుకుంటున్నారు అన్న సత్యాన్ని మనమే తెలుసుకుని అడుగులు వేయాలి. ఆ దిశగా మన ఆలోచనలు ఆచరణకు నోచుకున్నా చాలు అసమానతలు తొలగి అందరమూ భారతీయులమనే భావన సమాజంలో నాటుకుంటుంది. దయచేసి మేధావులు, విద్యార్ధులు, ప్రజా నాయకులు ఈ విషయంపై సమగ్ర చర్చ జరిపి కుల, మత నిర్మూలనకై చర్యలు చేపట్టాలని కూడ కోరుతున్నాను. సమ సమాజ నిర్మాణం కోసం మాతో కలిసి వచ్చే యువతకు మా ఆహ్వానం పలుకుతున్నాము. నాకు ఈ అవకాశమిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు" అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు వ్యాస్.

సభలో చప్పట్లు మారుమ్రోగాయి.

" వ్యాస్ నీ వెనుకనే మేమంతా. మాకీ కులాలు వద్దు. భారతీయత కావాలి. సమ సమాజం కావాలి" అంటూ నినాదాలు మిన్నుముట్టాయి.

తనకూ ఒక గుర్తింపు రానున్నదని మురిసిపోయింది భరతమాత

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న