కోమలి కి ఏం చెయ్యడానికీ పాలుపోవడం లేదు. చేస్తున్న ఔట్సొర్సింగ్ ఉద్యోగ౦ ఎప్పటికైనా ‘పర్మనెంటు’ కాకపోతుందా! అని ఆశ పడుతుంటే ..బడ్జెట్ ఇయర్ పూర్తవుతున్న సమయంలో .. తెల్లవారేసరికి పిడుగు లాంటి వార్త,. జలయజ్ఞంకు సంబంధించి కొన్ని యూనిట్లు తొలగించడంతో పాటు, ఉంచిన యూనిట్లలో కొన్ని పోస్టులు తగ్గించేసింది గవర్నమెంటు.
కోమలి పనిచేసే యూనిట్ ఉంచినప్పటికీ, తగ్గించిన లిస్టులో .. ఒకటే ఔట్సొర్సింగ్ పోస్టు ఉంచారు. తన కన్నా సీనియర్స్ చాలా మందే ఉన్నారు తను అందరి కన్నా జూనియరు. కాబట్టి, తనకక్కడ స్తానం ఉండకపోవచ్చు. బయటకొచ్చే వాళ్ళలో తనూ ఒక్కతి.
వచ్చే జీతానికి, పరిస్తితి అంతంత మాత్రం అనుకుంటు౦టే .. ఏదో ఒకనాటికి పోస్టు పర్మనెంటు కాకపోతుందా! అని రోజులు నెట్టుకొస్తు౦ది., ఇప్పుడు ఈ వార్త ‘పుట్టి’ ముంచేసింది.
ఇక తన పరిస్తితి ఏమిటి? చింటూగాడిని ఎలా చదివించాలి? ఫీజులు ఎక్కువైనా మంచి స్కూల్ లో వేసింది. ఈ వార్తతో, నడి సముద్రంలో నావలా .. దిక్కుతోచకుండా పోయింది. పిన్ని, బాబాయిల మీద ఎన్నాళ్ళు ఆధారపడగలదు. మెడలో మంగళసూత్రం .. అలంకారప్రాయం. సంపాదన పేరుతొ భర్త మస్కట్ లోఉంటున్నాడు ఏడాదిగా. ఇంటికి రూపాయి పంపించాడా! అంటే .. అదీ లేదు. ఎవరైనా “ మీ ఆయనేమైనా పంపిస్తున్నడా” అంటే “ అప్పు చేసే కదా వెళ్ళింది. ముందు అవి తీరాలి” అంటూ ఎదుటివాళ్ళ నోర్లు మూసేది మరో మాట మాట్లాడనివ్వకుండా. అన్ని మాటలూ ఎదుటివాళ్ళ మాట్లాడేస్తే తను మాట్లాడడానికి ఏం మిగలవుమరి.
ఇంకా చెప్పాలంటే .. అసలు చింటూకి తండ్రంటే సరిగా తెలీదు. శ్రీనివాసు .. అప్పుడపుడు వచ్చి వెళ్ళే నాన్న. అంతే. కోమలి బాబాయినే ‘డాడి’ అంటాడు. డాడి తోటిదే లోకం.
***
కోమలి చిన్నపుడే తల్లీ, తండ్రి ఆక్సిడెంట్ లో పోయారు. అప్పటి నుంచీ నాయనమ్మ వెంకట రమణమ్మ .. కోమలిని చేరదిసింది. ముసలమ్మ చిన్నకొడుకు రామణరాజు దగ్గర ఉండడంతో, కోమలి అక్కడే పెరిగింది.
రామణరాజు భార్య పద్మావతి కూడా కోమలిని .. తనకూతురు లాగే పెంచిది. ఒక్క పిలుపులో తేడా తప్ప. అంతా తన కూతుర్లలాగానే చూసేది. ఆమెకీ ఇద్దరు కూతుళ్ళు.
కోమలి చిన్నప్పటి నుంచి చాలా బక్కపలచగా ఉండేది. పెరిగి పెద్దదైనా అలానే ఉంది. గెడ కర్రకు చీరే కట్టినట్టు. డిగ్రీ వరకూ చదివించి, నాయనమ్మ సంబందాలు చూడడం మొదలు పెట్టింది.“ చదువుకున్నానుగా .. ఏదైనా ఉద్యోగం చేస్తాను ” మారాం చేసింది..ముసలమ్మ మాటను ఆ ఇంట్లో కాదనే వాళ్ళులేదు. నాలుగైదు సంబందాలు వచ్చాయి. “ పిల్ల మరీ సన్నగా ఉంది” అని వెళ్లిపోయారు. మరికొందరు జాతకాల పేరుతొ వెనక్కు తగ్గారు.
వెంకటరమణమ్మ దిగులు పడసాగింది. ఈ పిల్లకు పెళ్లవుతుందా? నేను బ్రతికి ఉండగా పెళ్లి చెయ్యగలనా! అని. ఇలాంటి నేపద్యంలో .. శ్రీనివాసు గురించి తెలిసింది. శ్రీనివాసు పర్వలేదు. ఓ మోస్తరుగా ఉన్నాడు .. అటు లావూ కాదు సన్నం కాదు. ఆస్తులు అంతగా లేకపోయినా .. ఫోటో స్టూడియో ఉంది ఏలూరు సెంటర్లో . జరుగు బాటుకి ఇబ్బంది లేదు అనుకున్నారు..
శ్రీనివాసుకి .. కోమలి కన్నా ఆమెకు ఉన్న రెండు ఎకరాల పొలం, ఆమె వంటి మీద ఉన్న ఇరవై తులాల బంగారం బాగా నచ్చినయ్. కట్నం కూడా సంతోష పడేలాగే ఉంది. శ్రీనివాసుకి అక్క తప్ప మరెవరూ లేరు. తల్లితండ్రులు కాలక్రమంలో పోయారు.. ఎంతో ఆలోచించినమీదట పిల్ల ‘సన్నగా’ ఉంటే ఏమిటి .. తన చిన్న స్టూడియోని .. పైకి తేవాలంటే తనలాంటి ఒంటరిగాడికి .. కాస్త ఆసరా కావాలనిపించింది. ‘సరే అన్నాడు’ మనసుతో రాజీ పడుతూ. వెంకటరమణమ్మ సంతోషానికి హద్దులేదు. పిల్లని ఇష్టపడ్డారు. అంతేచాలు. అత్త లేని కోడలు ఉత్తమురాలు. ‘రాజమండ్రికి .. ఏలూరుకీ ఏమంత దూరం .. ఇక్కడ రైలేక్కితే అర గంటలో అక్కడుంటాం’ అనుకున్నారు.
***
పెళ్లయింది.
అత్తవారింటికి మొదటిసారిగా వెళుతున్నపుడే, ఇస్తామన్న కానుకలతో పాటు .. పొలం తాలుకు డాక్యుమెంట్లు కూడా కోమలితో పాటు వెళ్ళాయి.. అన్ని సజావుగానే జరిగాయి.
పెళ్లి పనులు పూర్తవగానే శ్రీనివాసు అక్క వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఇంట్లో శ్రీనివాసు, కోమలి ఇద్దరే ఉన్నారు, చిలకా గోరింకల్లా. స్టూడియోకు కూడా అంతగా .. వెళ్ళకుండా .. ఇంటి పట్టునే ఉండిపోయాడు కొద్దీ రోజులు. కొత్త మోజు అనుకుంది. ఓ రోజు అడిగితే ..
“స్టూడియో సరిగా నడవడం లేదు, షాపు అద్దె డబ్బులు రావడమే కష్టంగా ఉంది. దాన్ని ఇంకా డెవలప్ చెయ్యాలంటే .. పెట్టుబడి కావాలి” అన్నాడు,
అంటే ఏమిటో మొదట్లో అర్ధం కాలేదు. నెమ్మది మీద తెలిసింది, తన పుట్టింటి తాలుకు భూమి అమ్మి.. డబ్బు తెస్తే .. స్వంతగా షాపే .. పెట్టుకోవచ్చని .. మనసులోని మాట బయటపెట్టాడు.ఆ మాటకు హతాసురాలయ్యింది కోమలి. అందరు తను ‘సన్నగా’ ఉందని వెనక్కి వెళ్ళిపోయినా .. ఇతను చేసుకున్నాడంటే కట్నకానుకలకి ఆశించినా .. కాస్త మంచి మనసు కూడా ఉండి ఉంటుందనుకుంది..నెలలో పుట్టింటికి తీసుకొచ్చారు కోమలిని.. ఇంట్లో విషయం అంతా చెప్పి౦ది. ఇంటిల్లపాదీ బాధ పడ్డారు. ఆడపిల్లగలవాళ్ళు అంతకుమించి ఏం చెయ్యగలరు. ఆషాడం పూర్తయిన తరువాత శ్రీనివాసు వచ్చి కోమలి తీసుకెళ్ళాడు.షరా మామూలే. శ్రీనివాసు అక్క కూడా శ్రీనివాసునే సమర్దించింది. “ పెళ్ళయిన తరువాత పెళ్ళాం ఆస్తి .. మొగుడు ఆస్తి అని వేరు వేరుగా ఉండాల్సిన పనిలేదు ..
అంతా కలిసే ఉండాలి” అని. కోమలి వప్పుకోలేదు. “అది నా తల్లి నుంచి వచ్చిన ఆస్తి, పుట్టింటి జ్ఞాపకార్ధం అలా ఉంచుకోవాలే గాని .. అమ్మేది లేదు. దాని మీద వచ్చే శిస్తు అవసరాలకు ఉపయోగించుకుందాం! అయినా బాబాయిని అడిగితే .. ఏదో మార్గం చూపించక పోడు. ఇప్పటి నుంచే అస్తులమ్ముకుంటే .. ముందు .. ముందు ఏం చెయ్యాలి” వాదించింది. ఆ మాటలు శ్రీనివాసుకి రుచించలేదు. ఏడ మొహం పేడ మొహం అయ్యింది. మళ్ళీ రెండవసారి పుట్టింటికి వెళ్లి .. కొంత డబ్బు తీసుకొచ్చింది. అత్తవారింటికి.. వచ్చేనాటికీ . తను పుట్టింటి నుంచి తెచ్చిన వెండి కంచం, గ్లాసు, వెండి చెంబు లాంటివి ఇంట్లో కనిపించలేదు. అడిగితే సమాదానం లేదు. గట్టిగా అడగడంతో గోడవై౦ది. చెయ్యి చేసుకున్నాడు. తరువాత .. తరువాత అదే అలవాటుగా మారిపోయింది.
“నా ప్రాణానికి శనిలా దాపురించావు. నిన్ను పక్కనేసుకుని .. నడవాలంటేనే సిగ్గుగా ఉంది. అందరూ నన్నే వింతగా చూస్తున్నారు. వీడికి, ఇదేక్కడ తగిలిందిరా అన్నట్టు” అంటూ కొత్త మాటలు మొదలుపెట్టాడు. సినిమాలూ, షికార్లూ పూర్తిగా అడుగంటుకు పోయాయి.
ఏదో కారణానికి ‘ఏడవ’ని రోజంటూ లేదు. తనను అంతగా అసహ్యించుకునేటపుడు .. ఆ నరకంలో ఉండలేనని పించిది. తన కన్నా తన ఆస్తులకే విలువ నిచ్చేటపుడు .. అవి కరిగిపోయిన తరువాత ఏం చేస్తుంది. ఆ రోజు తన ముఖం అయినా చూస్తాడా! ఓ రోజు బాబాయి చూడడానికి వస్తే, బాబాయితో పాటు వచ్చేసింది. ఇక ఆ ఇంటికి వెళ్ళనంది. .అక్కడికి వెళ్ళాలనుకోకపోయినా .. ఆ ఇంటి గుర్తుని వెంట తెచ్చుకుంది. మూడవనెల గర్భవతి.
***
కాలగమనంలో మూడేళ్ళు గడచి పోయినాయి. చంటిపిల్లాడిని తీసుకుని కూడా కోమలి ఒక్కసారీ ఏలూరు వెళ్ళలేదు. శ్రీనివాసే అప్పుడపుడు వచ్చి .. పిల్లాడిని చూసి వెళుతుంటాడు. అందుకే చింటూకి ‘నాన్న’ అంటే ఎవరో కొత్త మనిషి. రామణరాజు .. శ్రీనివాసుని రాజమండ్రి మకాం వచ్చెయ్యమని, ఆ స్టూడియో ఏదో ఇక్కడే నడుపుకోవచ్చని సలహా ఇచ్చాడు. శ్రీనివాసు స్వంత ఇంటిని, బందువుల్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. బాబాయి ప్రయత్నం ఫలించలేదు. తన ఒంటరి బ్రతుక్కి ఆలంబన వీడైతే .. వీడిని చూడడానికి తనకో ఆలంబన కావాలనుకుంది. అదే బ్రతుకు తెరువు .. ఉద్యోగం. బాబాయి సలహా మేరకు, చాలా దూరపుబందువైన, తమ వర్గానికే చెందిన ఓ ‘మంత్రి’ గారిని కలుసుకుంది. విషయం అంతా తెలుసుకుని, జాలిపడి .. తనకు తెలిసిన ‘రాజమండ్రికే’ చెందిన .. ఓ స్పెషల్ యూనిట్ ఆఫీసరుగారికి ..‘ఫోన్’ చేసి చెప్పారు. ‘ఈ అమ్మాయికి ఏదైనా పోస్ట్ చూపించమని’.
మంత్రి గారు చెప్పినట్టే .. ఆ ఆఫీసరు గారిని కలిసింది. అన్ని విషయాలు అడిగి తెలుసుకుని “ ప్రస్తుతం ఖాళీలు ఏమీ లేవు. నెల రోజుల తరువాత కనిపించు” అన్నారు. కొండంత ఆశ .. నిరాశ పడినా, అలాగే చేసింది. ఇదిగో .. అదిగో అంటూ, సంవత్సర౦ తిప్పి,” పెద్దాపురం యూనిట్లులో ఓ ఖాళీ .. కనిపిస్తుంది, చేస్తావా” అన్నారు, అప్పటికే తిరిగి .. తిరిగి వేసారి ఉందేమో, ‘ఎక్కడైనా పర్వాలేదు. గవర్నమెంటు ఆఫీసులోకి అడుగుపెడితే చాలను’కుంది. రొజూ రాజమండ్రి నుండి సామర్లకోట రైలులో వచ్చేది. అక్కడ నుంచి ఆటో పట్టుకుంటే, రోడ్డు మీదే ఆఫీసు. కాదంటే బస్సు. నెల తిరిగే సరికి దారి ఖర్చులు నాలుగవ వంతు జీతానికోచ్చేవి. అయినా అలాగే కష్టపడింది. సర్వీసుని బట్టి, ఏదో ఒకనాటికి పర్మనెంటు కాకపోతుందా అన్నట్లు..
శ్రీనివాసుకి జీవితం పట్ల స్తిరత్యం లేకుండా పోయింది. స్టూడియో మానేసాడు. ఎవరో చెబితే, ఫారిన్ వెళ్ళే ప్రయత్నం మొదలుపెట్టాడు. వద్దనలేదు కోమలి. ఇప్పటి వరకూ గోదారికి అటోకళ్ళు .. ఇటోకళ్ళు అయితే ఇప్పుడు ఆ దేశంలో ఒకళ్ళు ..ఈ దేశంలో ఒకళ్ళు అంతే. ఏరోజైనా వంటరితనమే.
ఏదైనా ‘మిరాకిల్’ జరిగితే బాగుండును. ‘యూనిట్ ఎప్పటిలా ఉండేలా చెయ్యి స్వామి’ దేవుడిని అస్తమానం ప్రార్దిస్తుంది. అలా అయితేనే లైను చివ్వర నిలబడిన తనకు అవకాశం.
“ ఫర్వాలేదులే రెండేళ్లనుంచి అలాగే అంటున్నావు. రొజూ ఆఫీసుకి వెళుతూనే ఉన్నావు. ఇప్పుడూ అలాగే జరుగుతుందిలే” అంది పిన్ని ధైర్యం చెబుతూ.
“ ఏమో! పిన్నీ. ఈసారి అస్సలు చాన్స్ లేదంటున్నారు. అలాగే గనుక జరిగితే, ఈ శనివారం .. అంటే ఈరోజే ఆఖరుగా, నేను ఆఫీసుకి వెళ్ళడం” దిగులుగా పలుకుతూ .. బేగ్గు బుజానికి తగిలించుకు౦ది. ఆమెలాంటి వాళ్ళ ప్రార్ధనలు ఫలి౦చో .. యునియన్ లీడర్ల కృషి ఫలితమో! చివరి నిముషంలో జీ.ఓ మీద ‘స్టే’ వచ్చింది, అంటే .. యూనిట్ యధాతదం.
కోమలి కొత్త బడ్జెట్ ఇయర్లో కూడా ఆఫీసుకి బయలుదేరింది, పిన్ని చెప్పినట్టుగానే.