దసరా మామూళ్లు - ఓట్ర ప్రకాష్ రావు

dasara mamoollu

"స్వాతీ ....బాగున్నావా అమ్మా "అంటూ ఫోన్లో అమ్మ అడిగింది. |

"బాగున్నానమ్మా ....అక్కడ అంతా బాగున్నారా "అడిగింది స్వాతి.

"అంతా బాగున్నారు ...ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఫోన్ చేసాను" అంది జయంతి

" ఏమిటమ్మా ....."

" దసరాకు నిన్నూ అల్లుడిని పిలుద్దామని అనుకొంటున్నాను "

"అమ్మా, కొత్త అల్లుడు దీపావళికి రావడం అంటే మర్యాద ....దసరాకు రావడమంటే అందరూ ఏమనుకొంటారు ,ఆ తరువాత రెండు మూడు వారాలకు వచ్చే దీపావళికి రావాలి .....ఉన్నట్లుండి ఏమిటి దసరాకు రమ్మని అడుగుతున్నావు " అడిగింది స్వాతి

"ఇప్పుడే మా అన్నయ్యలతో మాట్లాడాను .వారి పిల్లలకు దసరాకు పది రోజులు సెలవులు ఉండటం వల్ల ఊరికి రావాలని నిర్ణయించుకొన్నారంట . దీపావళికి,సంక్రాంతికి రారంట. వారి పిల్లలు అందరూ నిన్నూ అల్లుడినీ చూసి సరదాగా గడపాలనుకొంటారను కొంటున్నారు ,మీ అక్కయ్య ప్రతిమ భర్త పిల్లలతో కలసి దసరాకు వస్తానంది" అంది జయంతి.

"దీపావళికి రావడానికి ముందుగానే ప్లాన్ వేసి మన ఊరికి వచ్చి వెళ్ళడానికి ట్రైన్లో టికెట్స్ బుక్ చేశారు .దసరా సెలవుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు .బడి నుంచి వచ్చాక అడుగుతాను "అంది స్వాతి.

" స్వాతీ , టికెట్స్ రిజర్వేషన్ దొరకకపోయినా ఎలాగోలా రామ్మా ...తిరుగు ప్రయాణంలో మా అన్నయ్య ట్రైన్లో ఎలాగైనా సీట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు.ఇక ఉంటానమ్మా "అంటూ ఫోన్ పెట్టేసింది.

బడి నుండి ఇంటిలోపలకు వస్తున్న భర్త శ్రీవాత్సవను చూడగానే దగ్గరకెళ్ళి అతని చేతిలోని సంచిని తీసుకొంటూ చిరునవ్వు నవ్వింది స్వాతి

"స్వాతీ ఈ వేళ ఐదవ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి కింద పడి తలకు గాయం ఏర్పడింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండటంతో సరిపోయింది లేకుంటే చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది "

"మాస్టార్లు ఎవరైనా బలంగా కొట్టారా "

" ప్రభుత్వ బడులలో పిల్లలకు గాయం అంటూ అయిందంటే తోటి విద్యార్థులే కారణంగా ఉంటారు ....మాస్టార్లు ఎన్నటికీ అలా కొట్టరు. కానీ తమాషా ఏమిటంటే తోసిన అబ్బాయి ప్రమాణం చేసి నేను కొట్టలేదు అంటూ చెబుతుంటే నాలో నాకే నవ్వు వచ్చింది .గాయం తిన్న అబ్బాయికి కట్టు వేయడానికి ఐదు నిమిషాలయితే .మంచి మాటలతో తోసిన వాడిచేత నిజం చెప్పించడానికి ఒక గంట ఎంతగానో శ్రమపడ్డాను”

"శ్రమ పడినా ఆ అబ్బాయి చేత నిజం చెప్పించారుగా ...అదే మీ టాలెంట్ " అంది స్వాతి.

"చిన్న పిల్లలు కల్ముషం లేని పిల్లలు అడిగే పద్దతిలో మృదువుగా అడిగితే నిజం చెబుతారు "

"మీ అంత ఓపిక నాకు ఉండదు "

"జూనియర్ స్వాతి వచ్చిందంటే నీలో ఎంతటి ఓపిక ఉందొ తెలుసుకొంటాను "అంటూ మృదువుగా భుజంపై తట్టాడు శ్రీవాత్సవ

" మీరు రావడానికి ముందు మా అమ్మ ఫోన్ చేసింది" అంటూ దసరాకు రమ్మని చెప్పిన సంగతి తెలిపింది.

*** *** ***

"ఇల్లంతా సందడిగా ఉన్నా ఏదో చిన్నలోటు. పిల్లలందరూ స్వాతి భర్తతో కలసి వస్తుందని ఊహించారు .వాళ్లిద్దరూ రాకపోవడంతో ఇల్లంతా ఇంత సందడిగా ఉన్నా ఏదో వెలితిగా ఉన్నట్లనిపిస్తోంది " అంది జయంతి

"అసలు వాళ్లిద్దరూ ఎందుకు రాలేదు ...... మేమందరమూ వస్తున్నట్లు చెప్పావా "అడిగాడు చిన్నీ

"మొదట కూతురితో చెప్పాను .... ఆ తరువాత అల్లుడితో నేను మీ మామ మాట్లాడాము "

"శ్రీవాత్సవ ఏంచెప్పాడు"

" దసరా పండుగ వల్ల రాలేక పోతున్నాను అని చెప్పాడు"

"దసరా పండుగ ఇక్కడ అందరితో జరుపుకోకుండా అక్కడ వాళ్లిద్దరే ఏం చేస్తారంట "

"అన్నా ,ఈ దసరాకు బడి పిల్లలతో కలసి దసరా మామూళ్లు వసూలు చెయ్యాలంట ..." అన్న జయంతి మాటలు వినగానే అక్కడి వారందరూ పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కి పడ్డారు. "ఏమిటీ దసరా మామూళ్లు కోసమా ......"ఇంచుమించు అందరూ ఒకేసారి అన్నారు
"ప్రతిమా ,మా రోజుల్లో దసరా సెలవలప్పుడు మాస్టార్లు పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్ళే వారు, అయ్యవారికి చాలు ఐదువరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు.... అంటు పాటలు పాడేవాళ్ళం. వారు ఇచ్చే చిరుకానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు.నా అల్లుడు పాత పద్దతిని మరలా ప్రజల మధ్యలోనికి తీసుకొని వస్తున్నాడు నా అల్లుడు రియల్లీ గ్రేట్ "జనార్దనం కూతురు ప్రతిమ వైపు చూస్తూ అన్నాడు "నాన్నా ... మామూళ్లు అంటే లంచం అన్న అర్థం తెలుసా" కోపంగా తండ్రి వైపు చూస్తూ అంది ప్రతిమ

"ఎవరెన్ని చెప్పినా సరే నా అల్లుడు మంచివాడు ....కట్నం ఆశించని వ్యక్తి నా అల్లుడు " జనార్దనం అన్నాడు.

"ఈ రోజు వరకు నేనూ శ్రీవాత్సవపై గొప్పగా ఊహించుకొన్నాను ....కానీ ఈ రోజు ....ప్చ్ ,,,,,,,ఈ కాలంలో ఎవరినీ అర్థం చేసుకొనలేకపోతున్నాము " అసహనంగా అన్నాడు చిన్నీ

"స్వాతి భర్త దసరా మామూళ్లు కోసం ఇక్కడకు రాకుండా పోవడం ఆశ్చర్యంగా ఉంది . పిల్లలందరూ స్వాతిని చూడాలని చాలా ఉబలాట పడ్డారు.అంత దూరాన ఉన్న వీళ్ళు ఇక వేసవి సెలవులకు వచ్చినప్పుడు చూడాలి "బాధగా అంది చిన్నీ భార్య..

".ఒకరు ముంబైనుండి ,ఇంకొకరు చెన్నై నుండి ,ఇంకొకరు బెంగుళూరు నుండి మీ ముగ్గురు అన్నయ్యలు ఇక్కడకు వచ్చారు. మనం ఇక్కడ దసరా పండుగ జరుపుకొనే బదులు మనమందరమూ స్వాతి ఇంటికి వెళ్లి జరుపుకొందాము .ఇక్కడినుండి ట్రైన్ లో వెళ్తే ఐదు గంట లేగా. రేపుఉదయం మూడుగంటలకు బయలుదేరే ట్రైన్ కు వెల్దాము . మీ అన్నయ్య ను వీలైతే రిజర్వేషన్ లో ప్రయత్నిస్తాడు . లేకుంటే జనరల్ లో వెల్దాము "అంటూ భార్యతో చెప్పాడు జనార్దనం . పెద్దలకన్నా పిల్లలే మరింత సంతోషంతో యెగిరి గంతులెయ్యసాగారు

"అన్నా ,శ్రీవాత్సవ దసరా మామూళ్లు ఎలా వసూలు చేస్తాడో చూడవచ్చు "అన్నాడు చిన్నీ తమ్ముడు. మూడు గంటలకు ట్రైన్లో బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకంతా చేరుకొన్నారు. .శ్రీవాత్సవ ఇల్లు స్టేషన్ కు దగ్గరలో ఉండుటవలన మరో పదినిమిషాలలో చేరుకొన్నారు. అందరినీ చూడగానే శ్రీవాత్సవ, స్వాతిలు సంతోషంతో ఉప్పొంగిపోయారు. వారు రావడానికి ముందే టిఫన్లు సిద్ధంగా తయారు చేసిఉండటం వల్ల అందరూ టిఫన్లు పూర్తి చేశారు.

"దసరా మామూళ్లు మాకు ఇస్తారా ...."సరదాగా అన్నాడు చిన్నీ

"మీరు వస్తున్న సంగతి తెలియగానే మీకూ దసరా మామూళ్లు ఇవ్వాలని చెప్పాను.మీరందరూ రావాలి " అన్న శ్రీవాత్సవ మాటలు అక్కడి వారందరినీ అర్థంకాని అయోమయంలో పడవేసింది

"ఏంటీ అల్లుడూ ఈ ఊరి వారు అంత అమాయకులా ....మీకు కాకుండా మీ ఇంటికి వచ్చిన ఇంత మంది బందువులకు దసరా మామూళ్లు ఇవ్వడానికి ...."

"అమాయకులు కాదు నామీద గౌరవం కలిగిఉన్న చాలా మంచి వారు , మీరు వస్తున్న సంగతి చెప్పగానే మీకూ దసరా మామూళ్లు ఇవ్వడానికి అంగీకరించారు "చిరునవ్వుతో అన్నాడు శ్రీవాత్సవ వాళ్లకు నమ్మకం కుదరకపోయినా ఈ విషయం ఏమిటో తేల్చుకోవాలనన్న ఆసక్తి కలిగి అందరూ రావడానికి సిద్ధమయ్యారు

"ఏమండీ ప్రయాణాపు బడాలిక లో ఉన్నారు ఒకటి రెండు ఇండ్ల వరకు తీసుకొని వెళ్లి ఆ తరువాత వారిని ఇంటికి పంపండి "అంది స్వాతి
“ఈ ఊరిలో మొత్తం ముపై విద్యార్థుల ఇండ్లు ఉంది ,వాళ్లకు ఓపిక లేకుంటే ఒకటి రెండు ఇండ్లు చూసి తిరిగి వచేస్తారులే. రేపు ప్రక్క గ్రామానికి వెళ్ళాలి ఆసక్తి ఉన్నవారు రేపు కూడా రావచ్చు "అన్నాడు శ్రీవాత్సవ

*** *** ***

శ్రీవాత్సవ బంధువుల వైపు చూస్తూ "మీరందరూ ఇక్కడే ఉండండి ,పిల్లలందరూ ఈపాటికి బడిలో వచ్చివుంటారు వారిని తీసుకొని ఇక్కడము వస్తాను అందరం కలసి ఈ వీది చివరనున్న ఇంటికి వెల్దాము" అన్నాడు

శ్రీవాత్సవ వెళ్లి మరికొంతసేపటికి సుమారు యాభై మంది పిల్లలతో వచ్చాడు

“ శ్రీవాత్సవా నీవు ఎలిమెంటరీ స్కూల్ కు హెడ్ మాస్టర్ అని తెలుసు మరి మీ స్కూల్ నందు పని చేస్తున్న మాస్టర్లు ఎవరూ లేరే " అడిగాడు ప్రతిమా భర్త రమేష్

"మిగిలిన ముగ్గురూ ఆడవారు ....వారు ప్రక్క గ్రామానికి చెందినవారు ...రేపుఉదయం ఆ గ్రామానికి వెళ్ళాలి ,వారు తప్పకుండా వస్తారు " వస్తారు

“దసరా మామూళ్లు అంటే రాకుండా ఉంటారా "అంటూ రమేష్ చెప్పగా శ్రీవాత్సవ ముసిముసినవ్వు నవ్వాడు .ఆ వీధి చివర ఇంటిముందు విద్యార్థులందరూ నిలబడి కోరస్ గా ఒకే గొంతుతో ఇలా పాడసాగారు

“దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
ఇంటిలో లేదని చేతులు చూపించక
నాణెములు ఇచ్చినా ..పట్టేది లేదు,
రూపాయలిచ్చినా ముట్టేది లేదు,
కానుకలిచ్చినా అంటేది లేదు
మీరిచ్చు మొక్కలే పుచ్చుకొంటాము
అయ్య వారికి చాలు ఐదు చెట్ల మొక్కలు
పిల్ల వారికి చాలు పూల మొక్కలు
ప్రతి ఇంటా ఆ మొక్కలు నాటి వెళ్తాము
జయీభవా...దిగ్విజయీభవా “

ఆ ఇంటిలోని వారు వీరికోసం సిద్ధంగా ఉంచిన మట్టితో నింపియున్న గుడ్డ సంచిలో కల మొక్కలను శ్రీవాత్సవకు, బందువులకు ,మరి కొంతమంది పిల్లలకు ఇచ్చారు. హిమాలయం ఎత్తు ఎదిగిన శ్రీవాత్సవ వైపు మనసులోనే మెచ్చుకొంటూ చూసారు .మొక్కలు నాటే పనికి పిల్లలను వద్దంటూ సున్నితంగా మందలించి అంతకు ముందే పిల్లలు సిద్ధంగా ఉంచుకొన్న గడ్డపార ,పార తీసుకొని శ్రీవాత్సవ బంధువులు ఒక్కొక్క ఇంటిముందు గొయ్యితవ్వి సంతోషంతో మొక్కలు నాటసాగారు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న