మా నాన్న నా పదో తరగతి నుండి చెపుతూనే వున్నాడు ఈ సంవత్సరం బైక్ తీసి ఇస్తాను రా... మాధవ్... రేపు సంవత్సరం తీసిస్తానురా... మాధవ్ అని కానీ బైక్ తీసి ఇచ్చిందేమో లేదు' అనుకుంటూ
ఈ రోజు నాన్న ఇంటికి రానీ తాడో పేడో తేల్చేయాలి. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి' అని మాధవ్ అనుకుంటూ ఉండగా గేటు తీసిన శబ్దం వచ్చింది. చూస్తే మాధవ్ వాళ్ళ నాన్న రమేష్ , మాధవ్ చెల్లెలు కుసుమప్రియ వచ్చారు.
" ఏరా మాధవ్, కాలేజ్ అయిపోయిందా" అని నవ్వుతూ పలకరించాడు మాధవ్ తండ్రి రమేష్. " హా.. అయితేనే కదా ఇంటికొచ్చాను" అన్నాడు చిరాకుగా మొహం మాడ్చుకుంటూ మాధవ్." నేను ఏమన్నాను రా... అంతలా విసుకుంటున్నావ్?" అన్నాడు రమేష్. మధ్యలో కుసుమప్రియ " అన్నయ్య గురించి తెలిసిందే కదా నాన్న. ఈరోజు కొత్తేమి కాదుగా.స్నానంచేసి రా నాన్న కాపీ కలుపుకొస్తాను" అంటూ లోనికి వెళ్ళింది కుసుమ ప్రియ. " ఈ ప్రేమలకేమీ తక్కువ లేదు. ఎదిగిన కొడుకు కనీస అవసరాలు తీర్చాలని లేదు కానీ... అలాంటి తండ్రికి నేను పుట్టటం నా దౌర్భాగ్యం " అంటూ లోనికెళ్ళి ఫోన్ నొక్కుతూ కోపంగా కూర్చున్నాడు మాధవ్.
రమేష్ స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు మాధవ్ ఎదురుగా. కుసుమప్రియ కాపీ తీసుకొచ్చింది. కుసుమ తండ్రి రమేష్ కాపీ తీసుకున్నాడు. మాధవ్ " నాకు కాపీ వద్దు ఏమి వద్దు " అని చిరాకుగా అన్నాడు. అంతలో కుసుమ " రే.. అన్నయ్యా నీ కాపీ కూడా నేనే తాగేస్తాలే" అంటూ వెక్కిరించింది. అంతలో రమేష్ కలగజేసుకొని " అమ్మా, కుసుమ వాడు కోపంలో ఉన్నట్టు వున్నాడు. నువ్వు తమాషా చేయకు. ఆడపిల్లలా అలిగి మూడురోజులు మూలలో ముడుచుకుంటాడు" అన్నాడు రమేష్. " అన్నయ్య కోపం ఎంతసేపులే నాన్న మన మీదేగా చూపిస్తాడు పోనీలే" అన్నది కుసుమ. మాధవ్ మాత్రం తలక్రిందకు దించి ఫోన్ వైపు చూస్తూ వున్నాడు. అంతలో రమేష్ " ఏరా,మాధవ్ ఎప్పుడూ ఆ ఫోన్ నొక్కుతూ ఉంటావు. వేరే పనిలేదా? అరే , ఇంట్లో నాన్న ,చెల్లెలు వున్నారు అని మరచిపోయావు రా, ఆ సెల్ ఫోన్ మాయలో పడి నీలాగా చాలా మంది ఈ ఫోన్ లకు అలవాటు పడి ఇంట్లో వాళ్ళు చెప్పేది కూడా చెవికి వేసుకోకుండా ప్రవర్తిస్తూ అడ్డమైన దారులు దొక్కుతూ చెడిపోతున్నారు. చాలా మంది రోజూ పేపర్లలో టీవీలో ఈ ఫోన్ల వల్ల యువత ఎంత మంది చెడిపోతున్నారో!? మరికొందరైతే అదేదో సెల్ఫీలు అంట , బిల్డింగ్ మీద ఎక్కి తీసుకుంటూ పడి చచ్చినోళ్లు ఉన్నారు. రోడ్లలో వెళుతూ చాటింగ్ అంటూ బస్సుల క్రింద పడిన వారు ఉన్నారు " అంటూ చిరాకుగా మాట్లాడాడు రమేష్.
" చాలు చాలు, నాన్న... ఇంక ఆపండి మీ సోది.
నా పదో తరగతి నుండి అడుగుతున్నా బైక్ కొనివ్వండి నాన్న అని. అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలం గడుపుతున్నారు కానీ తీసి ఇచ్చిందేమో లేదు. నేను అడిగి అడిగి నోరు నొప్పి వచ్చి అడగటం మానేయాల్సిందేనేమో! మాట్లాడితే అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అంటూ తలతింటారు. ఇంతకు మొన్న ఏమైంది తెలుసా?" అన్నాడు మాధవ్.
" ఏమైందో చెప్పు రా మాధవ్" అన్నాడు మాధవ్ తండ్రి రమేష్ ఆశ్చర్యంగా మొహం పెట్టి.
" మా ఫ్రెండ్ వినయ్ గాడు రే మాధవ్, ఎన్నాళ్లు ఇలా మా బైక్ మీద తిరుగుతావు రా, నీకంటూ ఒక్క బైక్ కొనుక్కోవచ్చు కదా!" అని మా ఫ్రెండ్స్ అందరూ ముందు ఎగతాళి చేసాడు. పైగా ఒక్కోడు ఒక్కోమాట అన్నారు. మీరు నాకు బైక్ తీసి ఇచ్చి ఉంటే వాళ్ళ దగ్గర మాట పడేవాడిని కాదుగా. కాలేజీకి బస్సులు ఆటోలకోసం ఎదురుచూస్తూ క్లాస్లులు మిస్ అయ్యేవాడిని కాదుగా నాన్న" అంటూ మాధవ్ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. బదులుగా రమేష్ " చూడరా నాన్నా మాధవ్, భాదపడకు. మీ అమ్మ చనిపోయినప్పటి నుండి మీకు ఏలోటు లేకుండా పెంచుతున్నా అని గర్వపడేవాడిని. పరిస్థితులు బాగలేక నీకు బైక్ కొనివ్వలేదు. ఇంతలా భాదపడుతున్నావు అని తెలిస్తే ఏ అప్పో సప్పో చేసి తీసి ఇచ్చేవాడిని. నా జీవితం మనం తినటానికి మీ ఇద్దరి చదువులకు సరిపోతుంది మీకు తెలియనిది ఏముంది రా. అయినా నాకెవరున్నారురా మీరు కాకపోతే!? నా సంపాదన ప్రతి రూపాయి మీకే కదా.అయినా నీమనసులో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసింది రా మాధవ్. ఈసారి మీ చెల్లిది కూడా పదో తరగతి అయిపోతుంది. నాకు జీతం కూడా పెరుగుతుంది పెర్సొనల్ లోన్ పెట్టి తప్పకుండా నీకు బైక్ కొనిస్తాను. నామాట నమ్మురా నాన్న మాధవ్. నీకు మీ ఫ్రెండ్స్ దగ్గర అవమానం జరిగితే నాకు జరిగినట్టే కదరా మాధవ్" అన్నాడు రమేష్ చిన్నమొహం పెట్టి.
" మీరు ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పి కప్పిపుచ్చటం నేను వినటం అలవాటు అయిపోయిందిలే నాన్న.ఈ సారి సమ్మర్ హాలిడేస్ లోపు అయినా తీసి ఇవ్వు నాన్న.ప్లీజ్ నాన్న ప్లీజ్ " అన్నాడు మాధవ్.
" అలాగే తప్పకుండా కొనిస్తాను లే నాన్నా, మాధవ్ నీవు భాదపడకు రా. నీవు కుసుమ తప్ప నాకెవరున్నారు రా మాధవ్ " అన్నాడు మాధవ్ తండ్రి రమేష్. అనుకున్నట్టుగానే సమర్ హాలిడేస్ వచ్చేసాయి. కుసుమప్రియకు పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. దగ్గర్లోనే మహిళా యూనివర్సిటీలో ఫ్రీ సీటు వచ్చింది. మాధవ్ డిగ్రీ మూడో సంవత్సరంలో అడుగుపెట్టాడు. 'నా పిల్లలు బాగా చదువుతున్నారు.దేవుడి దయవల్ల నాకు జీతం కూడా పెరిగింది. వెంటనే మాధవ్ కి బైక్ తీసి ఇవ్వాలి. మళ్ళీ వాడు అడిగేవరకూ పెట్టుకోకూడదు' అనుకుంటూ కుసుమతో ఇలా అన్నాడు రమేష్
" ఇన్నేళ్లకు కొద్దిగా నెమ్మదిగా వుందమ్మ. నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చావు. మాధవ్ కూడా బాగా చదివి అన్నింట్లో పాసైయాడు. నాకు జీతం పెరిగింది. పెర్సొనల్ లోన్ కూడా ఇస్తామన్నారు. మాధవ్ రాగానే ఈ విషయం చెప్పాలి. రేపు మాధవ్ నేను ఇద్దరం వెళ్లి బైక్ కొని తీసుకువస్తాము కుసుమ " అంటూ రమేష్ సంతోషంగా చెపుతున్నాడు. "చాలా ఆనందంగా ఉంది నాన్న అన్నయ్యా కోరిక తీరబోతుంది. మనకు మంచి రోజులు రాబోతున్నాయి " అన్నది కుసుమ.
అంతలో ' ఒంట్లో కాస్త అలసటగా, గుండెలో ఎదో గుచ్చుకున్నట్టు అనిపిస్తున్నట్టు వుందే ' అనుకుంటూ అమ్మా, కుసుమ నేను బయట వెళ్ళొస్తాను. నేను వచ్చేలోపు మన మాధవ్ వచ్చినా బైక్ గురించి మనం మాట్లాడుకున్న మాటలు చెప్పకు. నేనే చెపుతాను వాడికి. సర్ప్రైజ్ చేద్దాం" అన్నాడు. కుసుమ "సరే నాన్న, అలాగే. మీరు అన్నయ్య వచ్చేలోపు వంట కూడా రెడి చేస్తాను. త్వరగా వచ్చేయండి. వేడిగా అందరం కలిసి తింద్దాం" అంటూ కుసుమ లోనికి వెళ్ళింది. 'నొప్పిగా అనిపిస్తుందే' అనుకుంటూ రమేష్ హాస్పిటల్ కు వెళ్ళాడు. వెళ్ళీ వెళ్ళగానే డాక్టర్ చూసి " ఓహ్! రమేష్ గారు , చాలా రోజులకు వస్తున్నారు. ఆరోగ్యం బాగున్నట్టే కదా. ట్రీట్మెంట్ కే రావలసిన పనిలేదు. సన్నిహితుడుగా నన్ను పలకరించటానికి కూడా రావచ్చు " అని డాక్టర్ అనగానే మొహంలో చిరునవ్వుతో "అలాగే డాక్టర్ గారు, మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మానసికంగా ఎంతో బాధపడే నన్ను మీ మందులతో కంటే మీ మాటలతో నయం చేశారు" అన్నాడు రమేష్. " గుండెల్లో నొప్పి మళ్ళీ మొదలైంది డాక్టర్ గారు , ఉండుండి వస్తుంది నొప్పి. మీరు ఇచ్చిన మందులు వాడుతున్నాను. ఈమధ్య బాగానే వుంది. ఈరోజు అనుకోకుండా నొప్పి మొదలైంది" అన్నాడు రమేష్.
" సరే ,రమేష్ గారు లోనికి రండి చెక్ చేస్తాను " అని డాక్టర్ చూసి" కొత్తగా ఏమీలేదు రమేష్ గారు ముందున్నదే. మీ గుండెపోటు ఉపద్రవంలా ముంచుకొస్తుంది. ముందే చెప్పాను కదా ఆపరేషన్ చేయాలి అందుకు విదేశీ డాక్టర్లు మాత్రమే చేయగలరు అని. అందుకు చాలా ఖర్చు అవుతుందని. నేను అంత పెట్టుకోలేను డాక్టర్ గారు" అన్నారు మీరు. "ఆలోచించుకోండి రమేష్ గారు. త్వరగా నిర్ణయం తీసుకోండి మీ కండీషన్ బాగాలేదు.ప్రస్తుతానికి ఈ మందులు వాడండి" అన్నారు డాక్టర్. " అలాగే డాక్టర్ గారు" అని మందులు తీసుకొని ఇంటికొచ్చాడు రమేష్. మొహం నీరసంగా కనిపించేసరికి కుసుమ,మాధవ్ ఇద్దరూ కంగారుపడ్డారు. ' ఏమైంది నాన్న ఏమైంది' అంటే " బయట తిరిగొచ్చాను కదా.అందుకే ఇంకేమిలేదులే. భోజనం తింద్దాం" అంటూ అందరూ భోజనం చేశారు. మరునాడు ఉదయం " నాన్న నేను బయట వెళ్ళొస్తాను. కుసుమకు ఏవో బుక్స్ కావాలంట" అన్నాడు మాధవ్. " నేను వస్తాను, కలిసి వెళ్దాం, వుండురా మాధవ్. మనకు బయట వేరే పనికూడా ఉంది " అన్నాడు రమేష్.
కుసుమ ప్రియకు నాన్నగారు ఇలా అనగానే అర్థమైయింది. "అమ్మ కుసుమ , మేము బయట వెళ్ళొస్తాము.కాస్త అలస్యమవుతుంది జాగ్రత్త అమ్మ" "సరే నాన్న వెళ్ళిరండి. రాత్రి చెప్పిన చోటికెనా నాన్న?" " అవునమ్మ, అక్కడికే " అంటూ రమేష్ ,కుసుమ నవ్వుకున్నారు. మాధవ్ కి ఏమి అర్థం కాలేదు. ఇద్దరు ఆటో ఎక్కి వెళ్తుండగా మాధవ్ " నాన్న, చెల్లెలు మీతో ఏదో అన్నది. నాకేమి అర్థం కాలేదు" అన్నాడు మాధవ్. " కాసేపు అగరా నీకే అర్థం అవుతుంది" అన్నారు రమేష్. మాటల్లో చేరవలసిన చోటు వచ్చి ఆటో దిగారు ఎదురుగా ఉన్న బైక్స్ షోరూం వైపుకు రమేష్ అడుగులేశారు. మాధవ్ "ఎక్కడికి నాన్న " అంటే "నువ్వు రా రా నాన్న" అంటూ భుజం మీద చేయి వేసుకొని తీసుకెళ్లి " రే మాధవ్ , నీకు నచ్చిన బండి కొనుక్కో డబ్బుగురించి వెనకడుగు వేయకు,సరేనా" మాధవ్ మొహంలో సంతోషాల వెల్లువ స్పష్టంగా కనపడుతూ ఉంది. కలా నిజమా, అర్థం కాని పరిస్థితి మాధవ్ ది. నచ్చిన బైక్ తీసుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చి పూజ చేయించి ఆనందంగా బయట తీసుకెళ్లాడు. ఓ వైపు రమేష్ కుసుమ కూడా చాలా సంతోషపడ్డారు.
సెలవులు కాస్త అయిపోయాయి. కుసుమ చదువుకోవటానికి యూనివర్సిటీ హాస్టల్ లో చేరింది. కుసుమకు రమేష్ సెల్ ఫోన్ కొనిచ్చాడు. తరచు మాట్లాడుతూ వుండేది. కుసుమకు అక్కడ కొత్తపరిచయాలు ఏర్పడ్డాయి. మొదట్లో కష్టంగా బెంగగా అనిపించినా అలవాటు చేసుకొని అందరితో కలిసిపోయింది. స్నేహితులను చూసి ఫేస్బుక్ ,వాట్సాప్ వాడటం మొదలు పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో ఒరిజినల్ పేరు పెట్టకూడదు అని, లవ్లీ హాసిని అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చెసి ఇచ్చారు. రకరకాల మనుషులు , చాటింగ్, రకరకాల పోస్టింగ్స్ చూస్తూ చాలా సంతోషంగా ఫేస్బుక్ లో కొత్తలోకాన్ని చూస్తూ లీనమైపోయింది. కుసుమ అప్పుడే లక్కీ సీను అనే పేరుగల ఫేసుబుక్ నుండి రిక్వెస్ట్ వచ్చింది. చూడగానే యాక్సెప్ట్ చేసింది. వెంటనే తను చాటింగ్ చేయటం మొదలెట్టాడు.
ఏదో తెలియని ఆనందం రోజు తనతో చాటింగ్స్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేది కుసుమ.
ఒక రోజు లక్కీ సీను నెంబర్ అడిగాడు. అందుకు లవ్లీ హాసినిగా పేరు ఉన్న కుసుమప్రియకు ఆలోచన వచ్చింది, ' ఇతనేవరో తెలియదు నెంబర్ ఇస్తే ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు' అనుకొని మోహమాటపడకుండా 'లేదు సీను, నాకు నెంబర్ ఇవ్వటానికి ఇష్టం లేదు నేను ఇవ్వను'అని చెప్పింది హాసిని.
లక్కీ సీను "నీ ఇష్టం, నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను" అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు చాటింగ్ నడిచింది. ఇద్దరి మధ్య ఆ చాటింగ్ కాస్త ప్రేమ వైపు దారితీసింది. సరదాగా మాట్లాడుకుంటూ ,తిట్టుకుంటూ, డార్లింగ్,డియర్ అనుకుంటూ, ప్రేమ చాటింగ్ హద్దులు లేకుండా వెళ్ళిపోయింది. కొన్నిరోజులకు లవ్లీ హాసిని గా ఉన్న కుసుమకు లక్కీ సీనుని చూడాలనిపించింది. ఆ విషయం చాటింగ్ లో చెప్పింది. అందుకు సీను "నేను నెంబర్ అడిగినా, ఫోటో అడిగినా పంపించలేదు. ఇక కలుద్దాం అంటే నువ్వు ఒప్పుకోవు అని నేను అడగలేదు. ఇప్పుడు నా బంగారం నోట్లో నుండినే ఈ మాట వచ్చింది. చాలా హ్యాపీ" అంటూ లక్కీసీను ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
" మనం రేపే కలుద్దాం సీను" అంటూ హాసిని పేరుతో ఉన్న కుసుమ మెసేజ్ పెట్టింది.
"రేపు 10గంటలకు బాలాజీ కాలనీ దగ్గర వెస్ట్ రైల్వే స్టేషన్ పక్కన పార్క్ దగ్గర కలుద్దాం"అని చెప్పిందిహాసిని.
" అలాగే" అంటూ మరునాడు లక్కీసీను ముందుగానే అక్కడికి చేరుకున్నాడు. లవ్లీ హాసిని కూడా పార్క్ ముందుకు వచ్చింది. ఒక్కసారిగా షాక్ అయ్యింది ఎందుకంటే ఆ పార్క్ ముందు వాళ్ళ అన్న మాధవ్ బైక్ ఉంది. కుసుమకి రకరకాల అనుమానాలు వచ్చాయి.
' నాలాగా అన్నయ్య కూడా లవర్ ను తీసుకొచ్చాడా ? అన్నయ్యకు కనపడకుండా సీనుని కలిసి వేరే చోటుకు తీసుకెళ్లాలి. ఇక్కడ ఉంటే ప్రమాదం' అంటూ ఫోన్ తీసి లక్కీ సీనుకు మెసేజ్ పెట్టింది.
"ఎక్కడ వున్నావు" అని. "లవర్స్ క్యాబిన్ అని ఉంది చూడు, అక్కడ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, చేతిలో గిఫ్ట్ బాక్స్ పట్టుకువున్నాను చూడు" అన్నాడు సీను.
"వస్తున్నా , ఇక్కడే ఉన్నా ,నిన్నే వెతుకుతున్నా" అని మెసేజ్ పెట్టటం క్లోజ్ చేసింది హాసిని. తలయెత్తి ఎడమవైపు చూడగానే వాళ్ళ అన్నయ్య మాధవ్ కనపడ్డాడు. ఒక్కసారిగా భయపడింది.మళ్ళీ ఒక్కసారి బాగా చూసింది మాధవ్ కూడా వైట్ షర్ట్ ,బ్లాక్ ప్యాంట్ వేసుకొని అటువైపు తిరిగి వున్నాడు. కుసుమ పక్కనున్న చెట్ల చాటునుండి ఫోన్ తీసి మెసేజ్ చేసింది.
" సీను ఇక్కడ వైట్ షార్ట్ వేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. నువ్వు ఉన్నచోట నుండి ఓ సారి చేయి పైకిలేపు" అని. మెసేజ్ చూసిన సీను ఇటువైపు తిరిగి చేయి పైకి లేపాడు. ఒక్కసారిగా హాసినిగా ఉన్న కుసుమ షాక్...ఆ లక్కీ సీను ఎవరో కాదు అన్నయ్య మాధవ్ అని తెలిసింది. ఏమి చేయాలో అర్థం కాని కుసుమ అక్కడి నుండి ఏడ్చుకుంటూ పరుగులు పెట్టి తను చేసిన తప్పుకు ఏమి చేయాలో అర్థం కాకుండా ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ హాస్టల్ కి చేరింది కుసుమ.
'హాసిని కలుస్తుంది ' అని సీనుగా ఉన్న మాధవ్ ఎదురుచూస్తున్నాడు. పక్కనే ఉన్నానని చెప్పిన హాసిని రాలేదే' అని కంగారుపడుతూ మెసేజ్ లు పెట్టాడు. ఎన్ని మెసేజ్ లు పెట్టినా రిప్లై లేకపోతే బాధగా ఏమైందో అని టెన్షన్ గా ఏడుస్తూ ఇల్లు చేరాడు.
ఆ మరునాడు కుసుమ ఉన్న హాస్టల్ నుండి కుసుమ తండ్రి రమేష్ కి కాల్ వచ్చింది. నెంబర్ చూడగానే 'ఇదేంటి అమ్మాయి ఫోన్ నుండి కాకుండా, హాస్టల్ నుండి వస్తుందే' అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు. హాస్టల్ వార్డెన్ " హలో కుసుమ తండ్రి రమేష్ గారా?" అన్నది.
"అవునండి, నేనే చెప్పండి వార్డెన్ గారు"అన్నాడు రమేష్. వార్డెన్ ఒక్కసారిగా గుండెపగిలే వార్త చెప్పింది ' మీ అమ్మాయి కుసుమప్రియ సూసైడ్ చేసుకొని చనిపోయింది.ఎందుకు అన్నది సరైన ఆనవాళ్ళు లేవు. వచ్చి తీసుకెళ్లండి బాడీని ' అని చెప్పింది. ఆ మాటతో రమేష్ గొంతులో తడి ఆరిపోయింది. నోటి నుండి మాట రాలేదు ,గట్టిగా ' నా కూతురు ' అని అరిచాడు. లోపల ఉన్న మాధవ్ పరిగెట్టుకొచ్చి "నాన్న ఏమైంది!?" అంటూ ప్రశించాడు. రమేష్ ఏడుస్తూ " మన పాప సూసైడ్ చేసుకుందంట రా మాధవ్ " అని గుండెలు బాదుకున్నాడు.
హాస్టల్ కి వెళ్లి కుసుమ డెడ్ బాడీ తెచ్చి అంత్యక్రియలు జరిపించారు. కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో రమేష్ తనలో తాను లేకుండా నిర్జీవంగా ఒరిగాడు. మాధవ్ ఒక్క వైపు తన ప్రియురాలు ఏమైందో అనుకుంటూ బాధపడుతున్న తరుణంలో చెల్లెలు మరణం బాగా క్రుంగదీసింది. రమేష్ ఈ బాధను తట్టుకోలేక , ముందే గుండెపోటు మనిషికి ఒక్క సారిగా గుండెపోటు వచ్చింది. అంత బాధలో ఉన్న మాధవ్ నాన్నకు ఇలా అయ్యే సరికి దిక్కుతోచక హాస్పిటల్ తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే రమేష్ కళ్ళు మూసాడు. అటు చెల్లి మరణం, ఇటు నాన్న మరణం ఓ వైపు ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందని పుట్టెడు దుఃఖంతో శోకసంద్రమైపోయాడు. మాధవ్ ఇంటి ఓనర్ వచ్చి 'బ్యాచులర్ కుర్రోళ్లకు మా ఇల్లు ఇవ్వటం కుదరదు, ఏదైనా వేరే ఇల్లు చూసుకొని ఖాళీ చెయ్ ' అని మాధవ్ కి చెప్పి వెళ్ళాడు. ఒక్కరోజు ఏదో సర్దుతుంటే మాధవ్ కు నాన్న రమేష్ డైరి దొరికింది. అందులో రమేష్ చదువుకునే రోజుల నుండి భార్య మరణం, కూతురి మరణం వరకు ప్రతి విషయం రాసిపెట్టి వున్నాడు.
డైరీ చదువుతూ ఉంటే మధ్యలో రమేష్ ఇలా రాసి వున్నాడు ' మాధవ్, నువ్వు బైక్ అడుగుతున్న కొనిస్తాను కొనిస్తాను అని కాలం గడుపుతూ ఎందుకు కొని ఇవ్వలేదో... నీకు ప్రతి సారి చెప్పాలి అనుకున్నా కానీ చెప్పలేకపోయాను. నేను చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని అనుకుంటూ. నోటి వరకు వచ్చిన మాట చెప్పలేకపోయాను. దాదాపు నీకు బైక్ తీసి ఇవ్వటానికి నాకు ఐదేళ్లు పట్టింది. అంత సమయం ఎందుకు పట్టిందంటే ఇప్పుడు మనం ఉంటున్నది అద్దె ఇల్లు కదా ఎన్నాళ్లకు అద్దె ఇంట్లో వుండలేము కదా, మనం ఎలాగూ అలా ఇలా బ్రతికేస్తున్నాము మన బిడ్డలకు ఎలాగైనా ఓ సొంత ఇల్లు కటించాలని మీ అమ్మ చనిపోకముందు ఎప్పుడూ నాతో అంటూనే ఉండేది. రూపాయికి రూపాయి కూడబెట్టి మీకు ఇల్లు కట్టించాను. అందుకే మీరు అడిగిన ఏ కోరికా తీర్చలేకపోయాను. నన్ను క్షమించు నాన్న మాధవ్ మన కొత్త ఇంటి వివరాలు ,పేపర్లు బీరువాలో ఉంచాను ఇదంతా ఎందుకు రాస్తున్నా అంటే నాకు గుండెపోటు ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒకవేళ నేను చనిపోతే నీకు తెలియాలి కదా అందుకే డైరీలో రాస్తున్నా మాధవ్ ' అంటూ తన డైరీలో రాసాడు. ఒక్కసారిగా మాధవ్ కళ్ళు చెమ్మగిల్లి నాన్న డైరీని గుండెలకు హత్తుకున్నాడు.
' నాకోసం తన జీవితాన్ని త్యాగం చేసాడు మా నాన్న' అని విలపిస్తూ, 'నాన్న ఏది చేసినా మన మంచికే చేస్తారు. అనవసరంగా ఎన్నో సార్లు తిట్టాను మిమ్మల్ని చాలా నిందించాను, నన్ను క్షమించు నాన్న' అంటూ విలపించాడు మాధవ్. ఇల్లు కాళీ చేసి మన కొత్త ఇంటిలోనికి అడుగు పెడుదాం అనుకుంటూ సర్దుతున్నప్పుడు కుసుమప్రియ ఫోన్ కనపడింది మాధవ్ కి చెల్లెలు చనిపోవటానికి ఈ ఫోన్ లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దాం అని ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసాడు. ఫోన్ నెంబర్ లిస్ట్ చూసాడు ,వాట్సప్ చూసాడు, ఏమి కనపడలేదు. ఫేస్ బుక్ మీద నొక్కాడు. ఓపెన్ కాగానే లవ్లీ హాసిని అని ప్రొఫైల్, ఆమె కవర్ పేజీగా పెట్టిన రోజా పువ్వుల చిత్రం కనిపించింది. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఠక్కుమని మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసాడు. లక్కీ సీను తో చేసిన చాటింగ్ మొత్తం అందులో ఉంది. ' నా చెల్లెలితోనా నేను ఇలా చాట్ చేసింది. నా మూలంగా నా చెల్లెలు చనిపోయింది' అంటూ గుండెలు బాదుకున్నాడు మాధవ్. 'ఆ రోజు పార్క్ లో నన్ను చూసి అన్నయ్య తో మనం ఇన్నాళ్లు ఇలా మాట్లాడాము అని అర్థమయ్యి నా చెల్లెలు చనిపోయి ఉంటుంది ' అనుకుని తనలో తాను కుమిలిపోతూ ఓ నిర్ణయానికి వచ్చాడు.
'సోషియల్ మీడియాలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి , జీవితాలు నాశనమవుతున్నాయి. నా చెల్లిని నా చేతులారా చంపుకున్నాను. మరి ఎవరికీ ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు. నేటి నుండి యువతను మేల్కొలుపుదాం' అనుకొని అప్పటి నుండి తనవంతుగా విద్యార్థులను మోటివేట్ చేయటం, యువతను మంచి మార్గంలో నడిపిస్తూ, సమాజంలో తల్లి తండ్రి విలువలు చర్చిస్తూ అందరిని ప్రగతి పధంలో నడుపుతూ నలుగురికీ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఉపయోగపడుతున్నాడు మాధవ్.