కరుణామయి' నర్సింగ్ హోమ్ లో పేషెంట్సు పల్చగా ఉన్నారు. డాక్టర్ లావణ్య తన కన్సల్టింగ్ రూములో కూర్చుని పరమపిత బ్రహ్మ కుమారి ఆశ్రమ ధ్యానమందిరం గురించి ఆలోచిస్తోంది.
" డాక్టరమ్మా , దండాలు." ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది.
" ఎవరమ్మా , నువ్వు. ఏమిటి సమస్య" చెప్పు.
" నా పేరు వనజ.రిక్షా కాలనీలో ఉంటాను.నానిప్పుడు కడుపుతో ఉన్నాను. ఈ కడుపు నాకొద్దు , తీసేయండి " ఏడుస్తూ ప్రాధేయపడింది.
" ఏమైందమ్మా , ఎందుకు గర్భస్రావం చేయించుకోవాలనుకుంటున్నావు? " అనునయిస్తోంది డాక్టర్ లావణ్య.
" వద్దు, డాక్టరమ్మా! ఈ పిండం నా కడుపులో పెరిగితే నానుపేనాలతో ఉండను. ఇప్పటికే నాకు ముగ్గురు ఆడ గుంటలు. ఈపాలి మగ పిల్లాడిని కని తీసుకు రాకపోతే ఈ గడపలో కాలెట్టొద్దని అత్తమ్మ, ఆడపడుచులు భయ పెట్టినారు. నా పెనిమిటి ఆటో నడుపుతూంటాడు. రాత్రేల తాగొచ్చి ఒల్లు హూనం సేస్తాడు. నాను కడుపుతో ఉన్నానని తెల్సి ఈపాలి మగపిల్లోడితో వత్తేనే ఈఇంట్లో ఉంటావు. లేదంటే నిన్నొగ్గి ఇంకో లగ్గం సేసు కుంటానని అమ్మోరింటికి తగిలేసాడు. ఇట్టాంటప్పుడు నన్నేం సేయమంటారు ? " గొల్లుమంది వనజ.
" నీ కడుపులో పెరుగు తున్నది ఆడపిల్లని ఎలా తెలుసు " అడిగింది డాక్టరు.
" మా ఊల్లో చిన్న డాటరు మిసీను పరీచ్చ చేయించి నీ కడుపులో బిడ్డ ఆడదేనని " చెప్పిండు." స్కేనింగు పరీక్షలన్నీ నిజమవుతాయని లేదు. తప్పుడు రిపోర్టులు కావచ్చు ". ఒకసారి లోపలికి రమ్మని ఎగ్జామ్ రూములో వనజ ప్రిగనెన్సీని నిర్దారణ చేసింది.
" వనజా, నీ కడుపులో పెరుగుతున్న పిండం గర్భస్రావానికి వీలుకాదు. సమయం మించిపోయింది. ఈ పరిస్థితిలో ఆపరేషను చేస్తే నీ ప్రణానికే గండం.కనక నా మాట విని ఈ ప్రయత్నం మానుకో" సలహా ఇచ్చింది డాక్టర్ లావణ్య.
" లేదు,డాక్టరమ్మా! నా ముగ్గురు ఆడగుంటల మొహాలు సూసి ఆగినాను , లేదంటే మా ఊరి సెరువులో దూకేసేదాన్ని."ఒక్కసారి బావురుమంది వనజ.
' ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా' అని తర్జన బర్జన పడుతోంది డాక్టర్ లావణ్య.ఏమీ తోచడం లేదు. దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయాని కొచ్చింది. తనది వంటరి జీవితం. వనజకు పుట్టే ఆడ శిసువును తనే దత్తత తీసుకుని పెంచాలని నిశ్చయించుకుంది.ఏకాకిగా మిగిలిన తనకూ ఒక తోడు కావాలనుకుంది.వెంటనే నర్సుని పిలిచి తోడుగా వనజని రక్త మూత్ర పరీక్షల కోసం లేబోరేటరీకి పంపింది.తన కన్సల్టింగ్ రూమ్ లో ఎదురుగా గోడ మీద ధ్యాన ముద్రలో ప్రశాంత వదనంతో బుద్ధుడు , పక్కన చిరు నగవుతో మదర్ థెరీసా ఏదో సందేశాన్నిస్తోందని పిస్తోంది. ఆలోచనలతో తన జీవితం ఎలా మలుపులు తిరిగిందీ అవగతం చేసుకుంది డాక్టర్ లావణ్య.
*****
నాన్న పుట్టి పెరిగిన అగ్రహారం గ్రామంలో నిరక్షరాస్యత , సంప్రదాయ కట్టుబాట్లు, బాల్య వివాహాలు, అమాయక జనం, మూఢ నమ్మకాలతో చదువుకు దూరంగా ఉంటూ ప్రజలు దుర్భర జీవితం గడిపే వారట.ఆడపిల్లలకు ఆంక్షలు మరీ ఎక్కువట. తాతయ్య ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడిగా అగ్రహారం చుట్టు గ్రామాల్లోనే ఉధ్యోగం చేసేవారట. నాన్నకి చదువుమీదున్న శ్రద్ధ వల్ల తాత గారికి నచ్చచెప్పి పట్నం వెళ్లి పట్టుదలగా చదివి డిగ్రీ పూర్తి చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి సెంట్రల్ గవర్నమెంటు ఉధ్యోగం సంపాదించారు. నాన్న జిల్లా దాటి ఉధ్యోగాని కెళ్లడం తాతయ్యకి ఇష్టం లేదట.ముగ్గురు కొడుకులు తన కళ్లెదుటే ఉండాలని ఆయన కోరిక. పెద నాన్నని తనలా టీచర్ చేసారట. రెండవ పెద నాన్న పంచాయతీ గుమస్తాగా పక్క ఊళ్లో ఉండేవారు. అలా పెద్ద వాళ్లిద్దరు ఆయన కళ్లెదుట కనబడే వారు. తాతయ్య కాలం చేసేనాటికి డిల్లీలో ఉన్న నాన్న ఆయన అంత్య క్రియ లకు అగ్రహారం చేరుకోలేక పోయారట. తాతయ్య నాన్నని చూడాలన్న అంతిమ కోరిక కూడా తీర్చలేదన్న అపవాదు వేసారు పెద నాన్నలు.
తాతయ్య చనిపోయిన తర్వాత ఊళ్లో కుటుంబ వాతావరణం మారి పోయిందట. ఉన్న కొద్ది పాటి ఆస్థీ పెద నాన్నలిద్దరూ పంచేసుకుని నాన్నకు మొండి చెయ్యి చూపించారట.నీది పెద్ద గవర్నమెంటు ఉధ్యోగమనీ, వ్యవసాయం అమ్మా నాన్నల సంరక్షణ అంతా మేమే చూసుకునే వాళ్లమని ఏవో కుంటి సాకులు చెప్పేరట. తర్వాత నాన్నకి అగ్రహారంతో సంబంధం తెగిపోయింది. ఈ కుటుంబ విషయాలన్నీ తర్వాత నాన్న చెబితే తెలిసాయి.
****
బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నాన్న అబ్యుదయ భావాలు గల వ్యక్తి. కాలంతో పాటు మనమూ మారాలన్నది ఆయన సిద్ధాంతం. సర్వీసులో ఉండగా ఒక సమయంలో తను జబ్బు పడి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వార్డులో నర్సుగా రాత్రింబవళ్లు సేవ చేసి ప్రాణం పోసిన అమ్మని పెళ్లి చేసుకున్నారు. అమ్మ ఒక విధి వంచితురాలని తెల్సి అక్కున చేర్చుకున్నారు నాన్న. వారి దాంపత్య జీవితంలో నేను పుట్టిన తర్వాత నా బాగోగులు చూడటం కోసం అమ్మ నర్స్ ఉధ్యోగాన్ని వదిలి గృహిణిగా స్థిరపడింది. నాన్నతో పాటు ఆయన ఉధ్యోగ రీత్యా దేశం అనేక ప్రాంతాల్లో తిరగవలసి వచ్చేది మా కుటుంబం. అనేక భాషలు, సంప్రదాయాలు ఆహార వ్యత్యాసాలు తెలిసేవి. నాన్న ప్రభావంతో నాలో కూడా అబ్యుదయ భావాలు మొలకెత్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత , అస్ప్రుస్యత, సమాజంలో కట్టుబాట్లంటూ స్త్రీల పట్ల చిన్న చూపు తెలుసుకుని బాధ కలిగేది.
నా చదువుకి అంతరాయం కలగకూడదని తలిచి నన్ను హైదరాబాద్ లో హాస్టల్లో ఉంచి స్టడీస్ మొదలెట్టారు. నాన్నకి నన్ను సివిల్సు రాయించి ఐ.ఎ.యస్. చెయ్యాలని కోరిక. అమ్మ కోరిక మేరకు రోగులకు సేవ చెయ్యాలనే సంకల్పంతో ఇంటర్ బై.పి.సీ. గ్రూప్ లో చేర్పించి మెడికల్ ఎంట్రెన్సు ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇప్పించి మెరిట్ లిస్ట్ లో మెడిసిన్ సీటు సంపాదించి యం.బి.బి. యస్ పూర్తి చేసి పి.జి. కోర్సులో గైనకాలజిస్టుగా ప్రాక్టీసు మొదలెట్టాను. విధి విచిత్రమైంది. జీవితంలో టర్నింగ్ పాయింటు ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు. అది ఆ వ్యక్తి జీవితంలో మంచిగానైనా లేక చెడుగానైనా జరగవచ్చు.
ఒకసారి నేను బ్రహ్మపిత బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్ర కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. అక్కడ కలిసిన అనేక వర్గాల సామాజిక నేపధ్యమున్న సోదరీమణులు సంసార జీవితాన్ని త్యాగం చేసి ఆధ్యాత్మిక, సమాజ సేవకు అంకిత మయారు. సాంప్రదాయం, కట్టుబాట్లు, మూఢ నమ్మకాల పేరుతో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అపవాదులు కళ్లకి కట్టునట్టు కనిపించాయి.సమాజానికి నా వంతు సేవ చెయ్యాలని నిశ్చయాని కొచ్చాను.పెళ్లి చేసుకుని సంసార బంధనంలో చిక్కుకోకూడదనుకున్నాను. వీలున్నప్పుడల్లా బ్రహ్మకుమారి కేంద్రాని కెళ్లి నావంతు సేవలు అందిస్తున్నాను.
నాన్న గవర్నమెంటు సర్వీసు నుంచి రిటైరైన తర్వాత హైదరాబాదు వచ్చి సెటిలయారు.ఆయన పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో నర్సింగ్ హోమ్ విస్తరించి ఆధునిక సౌకర్యాలు సమకూర్చడమైంది. విశాలమైన స్థలంలో పెద్ద బిల్డింగు కట్టించి ముందు భాగంలో నర్సింగ్ హోమ్ వెనక రెసిడెంటు బ్లాకు ఏర్పాటు చేసారు. అమ్మా నాన్నా నన్ను సంసార బంధనంలో ఉంచాలనుకున్నా నా అభిప్రాయం తెలుసుకుని వత్తిడి చేయలేదు.
****
" డాక్టరమ్మా! " వనజ పిలుపుతో గత జీవిత జ్ఞాపకాలకు స్వస్తి పలికిన డాక్టరు లావణ్య " సరే, వనజా ! నీకు నెలలు నిండి పుట్టిన బిడ్డ ఆడ శిసువైతే పెంపకం భాధ్యత నేను చూసుకుంటాను. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. క్రమం తప్పకుండా వచ్చి పరీక్షలు చేయించుకో." ఆమెకి నచ్చ చెప్పి గర్భస్రావం జరగకుండా చేసింది. తన నర్సింగ్ హోమ్ లో వనజకు నెలనెలా గర్భిణీ పరీక్షలు జరుపుతు నెలలు పూర్తి చేయించింది. ప్రసవ సమయం ఆసన్నమైంది. వనజకు పుట్టబోయేది ఆడ శిసువని తనకు తెలుసు. ఆ బిడ్డ భవష్య జీవితం గురించి ఒక నిర్ణయాని కొచ్చింది. ముందుగా డెలివరీ రూమ్ స్టాఫ్ తో సంప్రదించి ఏం చెయ్యాలో ప్లాన్ చేసింది.
వనజకి అర్థరాత్రి సమయంలో ప్రసవం జరిగింది. అనుకున్నట్టు ఆడ శిసువు పుట్టింది. ఆమెకు తెలిస్తే కుంగి పోతుందని, ముందుగా ప్లాన్ చేసినట్టు మృత శిసువును ఆమె బెడ్ మీదకు చేర్చేరు డెలివరీ రూమ్ స్టాఫ్. తనకి ప్రసవం జరిగి ఆడ మృత శిసువు పుట్టిందని తెలిసి వనజ ఏడవ సాగింది.అలా జరగడం కూడా మేలే అనుకుంది. అత్త వారింటి నుంచి కొంతయినా ఊరట దొరుకుతుందని సరిపెట్టుకుంది.ప్రసవంలో తల్లి చనిపోయిందని చెప్పి తన బిడ్డకే చనుపాలు ఇచ్చే ఏర్పాటు చేసారు స్టాఫ్. కొద్ది రోజుల తర్వాత ఇంటి వివరాలు సేకరించి నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ చేసారు వనజని.
*****
వనజకి పుట్టిన ఆడ శిసువుకి ' శ్రీ వాణి ' గా నామకరణం చేసి పోషణ కోసం ఆయాను తోడుగా ఉంచి తన అమ్మా నాన్నలకు అప్పగించింది డాక్టర్ లావణ్య. తను నర్సింగ్ హోమ్ ప్రాక్టీసు , సమాజ సేవ కార్యక్రమాలతో వత్తిడిగా ఉన్నా చిన్నారి వాణితో కాలక్షేపం సమయం గడిచిపోతోంది. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. లావణ్య అమ్మా నాన్నలు వయసు మీరి వృద్ధాప్యాని కొచ్చారు. ముద్దు ముద్దు మాటలు, ఆట పాటలతో అందర్నీ అలరిస్తూ శ్రీవాణి పెరిగి పెద్దదైంది. లావణ్యను తనలాగ డాక్టరు కోర్సు చదివిద్దామన్నా శ్రీవాణి మాత్రం ' లా ' కోర్సు చదివి సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయ సేవ చేస్తానని డిగ్రి తర్వాత యల్.యల్.బి. పూర్తి చేసి లాయర్ గా సీనియర్ అడ్వకేట్ వద్ద అసిస్టెంటుగా చేరింది. కోర్టు కేసుల్లో క్లైంట్ల తరపున వాదిస్తూ అనుభవం సంపాదించి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించింది. సమాజంలో స్త్రీలకు కట్న వేధింపులు, విదేశాల్లో ఉంటూ కట్నం కోసం అనేక పెళ్లిళ్లు చేసుకునే ప్రబుద్ధులు, ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వంచన చేసే ఆవారాగాళ్లను కటకటాల వెనక్కి పంపేది. బడుగు బలహీన వర్గాల ఆడవారికి జరుగుతున్న అన్యాయాల్ని కోర్టుల్లో ఉచితంగా వాదిస్తూ గవర్నమెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సెలక్టయి అంచెలంచలుగా మేజిస్ట్రేటు , సీనియార్టీతో హైకోర్టు జడ్జిగా పదోన్నతి సంపాదించింది. కాల గమనంలో డాక్టరు లావణ్య కూడా వార్దక్యానికి చేరుకుంది. తన సంరక్షణలో అమ్మా నాన్నల జీవితాలు ముగిసిపోయాయి.ఈ వృద్ధాప్యంలో తనకు వారసురాలు, తోడునీడగా ఉన్నది జస్టిస్ శ్రీవాణి మాత్రమే కాని మనసులో ఒక బాధ పీడిస్తోంది. శ్రీవాణి జన్మ వృత్తాంతం దాచి పెట్టి అన్యాయం చేస్తున్నానను న కొద్ది సంవత్సరాల కిందట మనసులోకి వచ్చి వనజకు పుట్టిన ఆడబిడ్డను దత్తత తీసుకుని పెంచి విధ్యాబద్ధులు చినట్టు, నిజమైన కన్నతల్లి ఎవరో తెలిస్తే శ్రీవాణి చదువులో ఏకాగ్రత దెబ్బ తింటుందని భావించి అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నట్టు అబద్ధం చెప్పవలసి వచ్చింది. తను చనిపోయేలోపు అసలు నిజం శ్రీవాణికి చెప్పాలను కుంది డాక్టరు లావణ్య. హాస్పిటల్ పాత మెడికల్ రికార్డులు వెతికించి వనజ ఆచూకీ కోసం ప్రయత్నించింది. లావణ్య ప్రయత్నం ఫలించింది.
వృద్ధాప్యంలో కంటి చూపు మందగించి చేతికర్ర సాయంతో నడుస్తున్న వనజమ్మ జాడ తెల్సింది. తన కారులో తోడుగా స్టాఫ్ ను పంపి నర్సింగ్ హోమ్ కి రప్పించింది. తన దత్త పుత్రిక జస్టీస్ శ్రీవాణికి సర్ ప్రైజ్ సని రప్పించి వనజమ్మను చూపి అసలు విషయం చెప్పింది.తనకి జన్మ నిచ్చిన అసలైన కన్న తల్లిని చూసి చెప్పలేని అనుభూతిని అనుభ వించింది.ఆడపిల్లని తనని గర్భస్రావం కాకుండా కాపాడి పునర్జన్మ నిచ్చి పెంచి పెద్ద చేసి సమాజంలో గౌరవమైన హోదా కల్పించిన డాక్టరులావణ్యను చూసి ఆనందాశ్రువులు కార్చింది జస్టీస్ శ్రీవాణి.ప్రధాని నరేంద్ర మోదీ గారి " బేటీ బచావో ---బేటీ పఢావో" నినాదం సాకారమైంది.