విషబీజం - మౌద్గల్యస

vishabeejam telugu story by moudgalyasa

పావని అక్కడికొచ్చేసరికి అక్కడున్న వాళ్లంతా కబుర్లో మునిగి ఉన్నారు. తన రాకను అంతగా పట్టించుకోలేదు. అక్కడున్న సోఫాలో ఖాళీగా ఉన్న చోట సర్దుకుని వాళ్ల మాటలను వినసాగింది.

‘‘ఆ మూడో ఇంట్లో సౌమ్య లేదూ... నిన్నరాత్రి వాడెవడి కార్లోనో దిగింది. ఇంతకు ముందు కూడా వాడితో రాసుకుపూసుకుని తిరగటం చూశాను. రాత్రి మాత్రం అసహ్యం పుట్టింది’’

వర్దనమ్మ చెప్పుకుపోతోంది. మిగిలిన వాళ్లంతా చెవులు రిక్కించి వింటున్నారు.

వాళ్లంతా ఆ అపార్టుమెంట్లో ఉన్న ఇల్లాళ్లు. భర్తలని ఆఫీసులకి, పిల్లలను చదువులకు పంపించి... భోజనాలు కానిచ్చి అక్కడ చేరతారు.

వర్దనమ్మకి నలభై ఏళ్లుంటాయి. చామనచాయ... మంచి మాటకారి. పదేళ్లకు పైగా అక్కడే ఉంటోంది. ఆ అపార్టుమెంట్లోకి కొత్తగా ఎవరొచ్చినా ఆమెను కలవవలసిందే. చిన్నాచితకా అవసరాలకు ఆమెపై ఆధారపడవలసిందే. అలా ఆమె దగ్గరకు రాని వాళ్ల ప్రవర్తన గురించి చెడుగా ప్రచారం చేయటం ఆమెకు అలవాటు.

అలా ఆ రోజు సౌమ్య గురించి మాట్లాడటం ప్రారంభించింది.

‘‘కారులో నుంచి దిగగానే ఆమె వెనకే వాడూ దిగాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత ఏదో అన్నాడు. ఇది కిసుక్కున నవ్వింది.

ఆ తర్వాత ఇకఇకలు... పకపకలు... నడిరోడ్డుమీదే ఇలా ఉన్నారంటే... ఇక ఆ పక్క కారులో ఒకరి పక్కన మరొకరు ఆనుకుని కూర్చుని ఏం చేస్తారో? ఆఫీసులో నాలుగు గోడల మధ్య గంటల కొద్దీ ఉంటూ ఏం చేస్తున్నారో?

రామ... రామ... నా నోటితో చెప్పలేకపోతున్నాను.’’

‘‘ఆంటీ... మీరు చెబుతున్నది నిజమా...’’ నమ్మలేనట్టుగా ఒకేసారి అడిగారు అక్కడున్న నలుగురూ.

‘‘ఔనమ్మా నా కళ్లతో చూసింది మీకు చెబుతున్నా’’ అంది వర్ధనమ్మ.

సాధారణంగా వర్ధనమ్మ మాట్లాడుతుంటే మిగతా వాళ్లు వింటం...

ఆమె చెప్పిన దానికల్లా తలాడించటం తప్ప, పెద్దగా ఎదురుచెప్పరు. అలాంటివాళ్లనే ఆమె చేరదీస్తుంది. ఇంటికి రాగానే టీతో పాటు తినటానికి స్నాక్స్ లాంటివి ఇస్తూంటుంది.

పావని వాళ్లు రెండ్రోజుల క్రితమే కొత్తగా అక్కడికొచ్చారు. అందరినీ పరిచయం చేసుకుందామని అక్కడి కొచ్చిన పావనికి ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది.

అక్కడ లేని మూడో వ్యక్తి గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం తప్పనిపించింది. ప్రేక్షకురాలిగా చూడసాగింది.

వర్ధనమ్మ ఇంకా చెబుతోంది.

‘‘ఈ మగవాళ్లని అనాలి. ఉద్యోగాల పేరుతో పెళ్లాల్ని బయటకు పంపుతారు. అది బయట ఏం చేస్తోందో... ఎవరెవరితో తిరుగుతోందో వీళ్లకి అవసరంలేదు. నెలనెలా నాలుగు డబ్బులు తీసుకొచ్చి చేతిలో పోస్తే చాలు. నోళ్లు ఠక్కున మూత పడతాయి.

‘‘సౌమ్య వాళ్లాయన బాగా అన్యోన్యంగా ఉంటారట కదా...’’ మధ్యలో అందుకుంది మీనాక్షి. ‘‘ సెలవ రోజున ఒక్క నిముషం కూడా విడిచి ఉండరట... ఇంట్లో అన్ని పనులు ఆయనే చేస్తారట’’ తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది వాగ్దేవి.

సౌమ్యను పొగడటం వర్ధనమ్మకు అంతగా నచ్చలేదు.

‘‘నెలకి రూ.60, రూ.70 వేలు సంపాదించి చేతుల్లో పోస్తుంటే... ఆ మాత్రం చూసుకోడూ’’ అంది మెటికలు విరుస్తూ.

‘‘సరిగ్గా చూసుకోకపోతే రేపెవడితోనన్నా ఎగిరిపోతే...

అసలే ఉద్యోగం చేస్తున్నదాయె... ఆ భయం ఉండుంటుంది మగాడికి’’

వర్ధనమ్మ ఇలా అనగానే ఏమనాలో తెలియక ఊరుకున్నారు.

‘‘మేకప్ బాగా దట్టించి, ఒళ్లంతా కనపడేలా బట్టలు వేసుకోవటం... ఉద్యోగం పేరుతో బజార్లకెక్కి కనిపించిన మొగాడినల్లా కవ్వించటం... రోత పుడుతోంది ఈ ఆడవాళ్లని చూస్తుంటే’’

అసహ్యించుకున్నట్టుగా మొహం పెట్టింది.

అప్పటి వరకూ పావని అక్కడే ఉన్నా వర్దనమ్మ పెద్దగా పట్టించుకోలేదు.

ఆమె వైపు చూస్తూ ‘‘నువ్వేం మాట్లాడలేదే అమ్మాయ్’’ అంది.

పావని నవ్వి ఊరుకుంది... ‘‘నీకు కొంచెం బిడియం ఎక్కువలా ఉందే. రోజూ వస్తూండు. హుషారు పెరుగుతుంది’’

అలాగే నంటూ తలాడించింది.

‘‘పిల్లలొచ్చే టైమయ్యింది. టిఫిన్ రెడీ చేయాలి’’

వాగ్దేవి అనగానే మిగతావాళ్లంతా బయటకు వెళ్లటానికి సిద్దమయ్యారు.

‘‘తప్పనిసరిగా రేపు రా అమ్మా...’’ గుమ్మం దాటుతున్న పావనితో మరోమారు చెప్పింది వర్ధనమ్మ.

ఆ రాత్రి యాథాలాపంగా కారు చప్పుడయితే పిట్టగోడ మీద నుంచి కిందకు చూస్తున్న పావనికి కారులో నుంచి దిగుతూ కనిపించింది సౌమ్య.

మామూలుగా అయితే అదేమంత పట్టించుకునేది కాదు.

ఆ మధ్యాహ్నం వర్ధనమ్మ చెప్పిన మాటలు మనసులో మెదిలాయి.

ఆసక్తిగా అటువైపు చూసింది.

సౌమ్య రూపం ఆకట్టుకునేలా ఉంది. మనిషి నాజూకుగా ఉంది. నల్ల జీన్స్ ప్యాంటు పైన తెల్లచారల షర్టు టక్ చేసింది. ప్రొఫెషనల్ కాలేజీలో చదివేలా అమ్మాయిలా ఉంది.

పావని చూస్తుండగానే సౌమ్య కారు దిగటం... ఆ వెంటనే ఆమె కొలీగ్ దిగటం... షేక్ హ్యాండ్ చేయటం, అచ్చుగుద్దినట్టు వర్ధనమ్మ చెప్పినట్టుగానే సాగాయి.

‘ఛీ’... అసహ్యించుకుంటున్నట్టుగా అనుకుంది.

మరుసటి రోజు మిగతా వాళ్లందరికంటే ఓ అడుగు ముందుగానే వర్ధనమ్మ ఇంటికి వెళ్ళింది పావని.

‘మీ వారేం చేస్తారు?’’ సంభాషణను ప్రారంభిస్తూ అడిగింది వర్ధనమ్మ.

భర్త పనిచేస్తున్న కంపెనీ, అతని హోదా తదితర వివరాలు చెప్పిన తర్వాత మరో ప్రశ్న వేసింది ఆవిడ.

‘‘జీతం ఎంత వస్తుందో?’’...

పావని చెప్పింది.

‘‘ఆఫీసుకు కారులో వెళతారా? టూవీలర్ పైనా?’’

‘‘కొంత దూరం లోకల్ ట్రెయిన్లో వెళ్లి అక్కడి నుంచి సర్వీసు ఆటోలో వెళతారు’’.

‘‘క్యాంపులవీ ఉంటాయా?’’...

వర్ధనమ్మ వరుసగా ప్రశ్నలడుగుతూండటం పావనికి ఇబ్బందిగా అనిపించింది.

‘‘మార్కెటింగ్ జాబ్ కాబట్టి తరచూ క్యాంపులుంటాయి’’ నిగ్రహించుకుంటూ చెప్పింది.

‘‘జాగ్రత్త అమ్మా... మీ ఆయన్ని కొంచెం కనిపెట్టుకుని ఉండు’’ అసలే క్యాంపుల ఉద్యోగం అంటున్నావు’’...

‘‘ఆయన అలాంటి వారు కారులెండి. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. కనీసం సిగరెట్టు కూడా తాగరు’’ గర్వంగా చెప్పింది పావని.

దానికి వర్ధనమ్మ తలాడించలేదు. పెద్ద క్లాస్ తీసుకుంది పావనికి.

‘‘సిగరెట్టు, మందు కళ్లకి కనిపిస్తాయి. ఆడవాళ్ల పిచ్చి... అంత కంటే పెద్ద వ్యసనం. పెళ్లాల కళ్లకు గంతలు కట్టి ఈ మగవాళ్లు కోర్కెలు తీర్చుకుంటారు’’...

పావని మనసులో అనుమానం బీజం పడింది.

మళ్లీ కొనసాగించింది వర్ధనమ్మ.

‘‘మీరున్న పోర్షన్ లోనే ఇంతకు ముందు ఉండేవాళ్లు. ఆయన పెద్ద కంపెనీలో పనిచేసేవాడు. పూర్తిగా క్యాంపుల ఉద్యోగం. నెలలో ముప్పాతిక వంతు బయటే గడిపేవాడు. ఎక్కడెక్కడ తిరిగొచ్చేవాడో తెలియదు గానీ... ఒళ్లంతా జబ్బుల పుట్ట. అవన్నీ వాళ్ల ఆవిడకూ అంటుకున్నాయి.

ఆవిడ ఎంత అందంగా ఉండేదనుకున్నావ్... చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అలాంటిది ఆ వెధవ వల్ల రోగాల పాలయ్యింది’’

ఎందుకోగానీ పావనికి అక్కడ ఉండాలనిపించలేదు. ఆమె ఆలోచనలన్నీ ముందు రోజు రాత్రి క్యాంపు కెళ్లిన భర్త చుట్టూ తిరగసాగాయి.


**** **** **** ****


‘‘ఇంత ఆలస్యంగా వచ్చారే?’’...

ఊరి నుంచి వచ్చిన భర్తను గుమ్మం దగ్గరే నిలదీసింది పావని. ‘‘ఉదయం 8.30కి ఊళ్లో దిగిన వాళ్లు ఇప్పుడా వచ్చేది? ఎక్కడెక్కడ ఊరేగొస్తున్నారు?’’ గోడగడియారం వైపు చూస్తూ అడిగింది.

‘‘రైలు దిగి... స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసు కెళ్లా.’’

మామూలుగా చెప్పాడు ప్రసాద్.

భార్య తన కోసం ఎదురుచూస్తూ విసుగుతో మాట్లాడుతుందనుకున్నాడు.

‘‘ఇంటి కొచ్చి వెళ్లచ్చుగా... అంత తొందరేం ఉంది?’’

‘‘ఓ ముఖ్యమయిన ఫైల్ ఒకటి అందచేయవలసి ఉంది. అది అక్కడ ఇచ్చేసొస్తే ఈ రోజుకి ఆఫీసుకి వెళ్లవలసిన పని ఉండదు’’ కూల్ గా చెప్పాడు. ‘‘ఇక ఈ రోజంతా నీతోనే కాలక్షేపం.’’

ఆ మాటలేం పట్టించుకోకుండా పావని మళ్లీ అడిగింది

‘‘క్యాంపుకి ఎవరెవరు వెళ్లారు?’’ ఆరా తీసింది.

‘‘నేనూ, మా మార్కెటింగ్ మేనేజర్... ఏం అలా అడిగావు?’’

‘‘మరేంలేదు...

‘‘మీ ఆఫీసులో ఆడవాళ్లకి కూడా క్యాంపులుంటాయా?’

‘‘ఆ... నిన్న జరిగిన జోనల్ మీటింగుకి పన్నెండు మంది మేనేజర్లు హాజరయితే అందులో నలుగురు ఆడవాళ్లే...’’

‘‘వాళ్లూ హోటల్లోనే దిగుతారా? మీతోపాటు...’’

‘‘అవును. దాదాపు అందరం ఒకే చోట ఉంటాం..’’

అంతే పావని కళ్ల ముందు రకరకాల దృశ్యాలు కదలాడాయి. పరాయి ఆడవాళ్లతో మగవాళ్లు సన్నిహితంగా మెలగటాన్ని చాలా సినిమాల్లో ఆమె చూసి ఉంది.
భర్త హాయిగా సుఖించి ఉంటాడన్న భావన ఆమెలో మొదటిసారిగా కలిగింది. అతన్ని పరీక్షగా చూడటం మొదలుపెట్టింది.

‘‘ఏంటి? నన్ను కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తున్నవేంటి?’’ అడిగాడు.

ఆమె జవాబు చెప్పలేదు. తల అడ్డంగా ఊపింది.

‘‘ఈ మగవాళ్లు గ్రంథసాగులమ్మా’’ అన్న వర్దనమ్మ మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి.

పావని ఏం ఆలోచిస్తోందో అర్ధం కాని ప్రసాద్ కాసేపు ఆమెను గమనించి ఆ తర్వాత స్నానానికని బాత్రూంలో దూరాడు.


**** **** **** ****


ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నదల్లా

వెనక నుంచి కారు సడన్ బ్రేక్ తో వచ్చి ఆగడంతో ఉలిక్కి పడింది పావని.

‘‘ఇంకా నయం... బ్రేక్ పడింది కాబట్టిసరిపోయింది. లేకపోతే ఈపాటికి...’’ అనుకుంటూండగా అందులో నుంచి ఓ మహిళ కిందకు దిగింది.

‘‘అదేంటండీ... రోడ్డు మధ్యలో అలా నడుస్తున్నారు’’ అంది కంగారుగా దగ్గరకు వచ్చి.

ఆమెను చూడగానే గుర్తుపట్టింది పావని. తన అపార్టుమెంట్లోనే పై పోర్షన్లో ఉండే సౌమ్య.

భుజం మీద ఆప్యాయంగా చేతులు వేసి...

‘‘పదండి. కారెక్కండి. నేనూ ఇంటికే...’’ అంది.

ఎందుకో ఆమె మాటల్లో మృదుత్వం పావనిని ఆకర్షించింది. తిరస్కరించటానికి పెద్ద కారణం కనపడలేదు. వెంటనే కారెక్కింది.

వెనక సీట్లో ఎవరో ఉన్నారు. తనని చూడగానే ఆ వ్యక్తి కొంచెం వెనక్కి జరిగాడు.

పావని కూర్చోగానే సౌమ్య కూడా వచ్చి పక్కన కూర్చుంది.

‘‘ఒకే అపార్టుమెంట్లో ఉంటున్నా... మనం ఒకరినొకరు పలకరించుకోలేదు. ఇలా కలవాలని రాసుందున్నమాట’’ అంది నవ్వుతూ.

పావని కూడా నవ్వి ఊరుకుంది.

‘‘మా సాఫ్ట్ వేర్ వాళ్ల జీవితాలన్నీ ఇంతేనండీ... పైన పటారం... లోన లొటారం...

రోజంతా ఆఫీసులో పని ఒత్తిడి. పోటీ... పోటీ... పోటీ... ఇంటికొచ్చాక చాకిరీ...

ఇల్లు, ఆఫీసు చూసుకోవలసి వస్తుంది. ఇతరుల గురించి పట్టించుకోటానికి అంత తీరుబాటు ఉండదు’’

సౌమ్య చెప్పటం పూర్తికాలేదు. పక్కనున్న వ్యక్తి అందుకున్నాడు.

‘‘మీరు దాన్ని పట్టించుకోకండి. ఇంటి పనంతా వాళ్లాయన పైన పడేస్తుంది.

ఆఫీసులో నాలాంటి బకరాలమీద ఆధారపడుతుంది. ఏమయినా అంటే... నేను టీం లీడర్ అని ఫోజ్ కొడుతుంది. ఎప్పటికయినా దీని కంటే పెద్ద పొజిషన్ కెళ్లి దీని పొగరు అణచాలనుంది’’

సౌమ్య ఆ మాటలకి నవ్వింది.

‘‘నోర్ముయిరా... నా పరువు తీయకు.’’ అంది.

‘‘ఉన్న మాట అంటే నీకు ఉలుకెందుకు?’’ అన్నాడు ఆమెను రెచ్చగొడుతున్నట్టు.

‘‘వీడు మా పెద్దమ్మ కొడుకు. నేనంటే చాలా ఇష్టం.’’ చెప్పింది సౌమ్య.

‘‘... నా ఆఫీసులోనే చేరాడు. రోజూ నన్ను సతాయిస్తూంటాడు. పనయ్యాక నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళుతూంటాడు’’ అంది అతని వీపుపైన గట్టిగా చరుస్తూ.

ఇద్దరూ పగలబడి నవ్వుతున్నారు.

‘‘మీరెంత అదృష్టవంతులండీ... హోమ్ మేకర్ గా ఇంటిని, కుటుంబాన్ని చూసుకుంటున్నారు’’... అంది సౌమ్య కారు అపార్టుమెంట్లో పార్కు చేస్తూ.

ఆమెనుంచి వీడ్కోలు తీసుకుంటుంటే తెలియకుండానే పావని గుండె బరువెక్కింది.

వర్దనమ్మ మాటలు విని తను సౌమ్యను తప్పుగా అర్ధం చేసుకుంది. ప్రేమగా చూసిన భర్తను కూడా అనుమానించింది. అది మనసులో మెదిలి ఆమెలో అపరాధభావం మొదలయ్యింది.

‘‘కొందరు వ్యక్తులంతే. పరాయి వాళ్ల గురించి లేనిపోనివి చెప్పి విషబీజాలు నాటతారు. ఇలాంటి వారికి సాధ్యమయినంత దూరంగా ఉండటం మంచిది.’’

రాత్రి పడుకోపోయే ముందు గట్టిగా అనుకుంది.

ఆ తర్వాత మరెప్పుడూ పావని వర్ధనమ్మ ఇంటి ఛాయలకు పోలేదు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ