పల్లె పిలుస్తోంది - ఆర్.ఉమాదేవి

pall pilustondi
ఆఫీస్ కు వచ్చాడన్నమాటే గాని రాత్రి నాన్న ఫోన్లో చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి రాజీవ్ కు.

“మన ఊర్లో భూములు కొనడానికి ఎవరో సిటీ వాళ్ళు వస్తున్నారట. మనోళ్ళు అందరూ మంచి ధర వస్తోందని అమ్మాలనుకుంటున్నారు. మన ఇంట్లోనూ చెల్లి పెళ్ళికి ఎదిగింది. వ్యవసాయమూ అంతంత మాత్రమే. వర్షాలు లేక, ఉన్న నీళ్ళు సరిపోక సేద్యం చేయడం కష్టంగానే ఉంది. అందుకే మన భూమి కూడా అంతా కాకపోయినా కొంతైనా అమ్మి చెల్లి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావ్? నువ్వు కూడా సరే అంటే సంతకాలు పెట్టడానికి ఈ శనివారం తప్పకుండా రావాలి .”

ఊర్లో నాన్నకు వ్యవసాయం చేయడం ఎంత కష్టంగా ఉందొ తనకు తెలియంది కాదు. ఇక్కడ తన ఉద్యోగం కూడా ఉండనా.. ఊడనా ..అన్నట్టు ఉంది. తన సహచరులు ఒక్కొక్కరే పింక్ స్లిప్ తీసుకుని వెనుతిరుగుతున్నారు. తన వంతు కూడా రేపో...మాపో... ఇక్కడ ఉద్యోగం లేక, అక్కడ ఉన్న భూములు అమ్ముకుంటే తమ భవిష్యత్ ఏమిటి? ఆలోచనలు తెగడం లేదు అతనికి.

తన ఉద్యోగం ఇలా గాల్లో దీపంలా ఉందన్న విషయం ఇంకా ఇంట్లో చెప్పలేదు. తను చేతికి అంది వచ్చాడని, నాన్న భూములు లేకపోయినా పరవాలేదని అనుకుంటున్నాడు. ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోయినా రాజీవ్ ఆ వారం ఇంటికి వెళ్ళాడు.

“నేను చెప్పింది ఏం ఆలోచించావ్ చిన్నా?” అందరూ భోంచేసి విశ్రాంతిగా కూర్చున్నాక అడిగాడు తండ్రి.

“భూములు అమ్మడం వద్దనిపిస్తోంది నాన్నా! మన వాళ్ళు కూడా ఎందుకు అమ్మేస్తున్నారు? నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడి చెప్తాను.” అన్నాడు రాజీవ్.

ఆ సాయంత్రం రాజీవ్ అందర్నీ కలిశాడు. అందరితో ఏం మాట్లాడాడో తెలియదు కానీ వారిలో చాలా మంది భూమి అమ్మడం విరమించుకున్నారు.

అతడి తండ్రికి అతడు ఏం చేయబోతున్నాడో అంతు పట్టలేదు.

“నాన్నా! నేను మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఈ సారి ఉద్యోగం వదిలేసి వస్తాను. నేను కూడా ఇక్కడే ఉండి వ్యవసాయం చేయబోతున్నాను. నేలను నమ్ముకున్న వాడికి ఎపుడూ అన్యాయం జరగదు అని నిరూపిస్తాను.”

“నీకేమైనా పిచ్చా చిన్నా! ఇన్ని ఏళ్ళ నుండి చేస్తున్న మాకే సేద్యం చేయడం సాధ్యం కావడం లేదు. మా రెక్కల కష్టంతో నిన్ను చదివించింది నువ్వైనా సుఖపడతావని. బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి ఇలా మట్టి పిసుక్కోవడానికి వస్తానంటున్నావ్?” కోప్పడ్డాడు అతడి తండ్రి.

“ లేదు నాన్నా! నేను వదిలివేయక పోయినా వాళ్ళే నన్ను ఉద్యోగం లోంచి తీసేసే పరిస్థితి ఉంది. మరో ఉద్యోగం వెతుక్కోవాలి. అదైనా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. నా మనసులో ఒక ఆలోచన ఉంది నాన్నా! అది ఆచరణలో పెట్టడానికే ఇక్కడికి వచ్చేస్తున్నా. మీరు ఏ భయం పెట్టుకోకండి. నన్ను నమ్మండి.” అన్నాడు రాజీవ్.

“ఏంటోరా! నీడ పాటున పెరిగిన వాడివి. వ్యవసాయం చేస్తానంటున్నావ్. నాకేం అర్థం కావడం లేదు. నీకు ఎలా నచ్చితే అలా చేయి.” అన్నాడాయన.

రాజీవ్ ఆఫీస్ కు వెళ్లి తన స్వచ్చంద పదవీ విరమణ ను సమర్పించాడు. ఆ ఆఫీస్ రూల్స్ ప్రకారం అతడికి పది నెలల జీతం చెల్లించారు. ఇంకా అతడు చేసిన పొదుపు ఖాతాలు, పి యఫ్ లు అన్ని కలిపి పదిహేను లక్షల దాక వచ్చాయి. ఆ వారంలోనే అక్కడ అన్ని పనులు పూర్తి చేసి పల్లెకు చేరుకున్నాడు రాజీవ్.

ఊరిలో మిగతా వాళ్ళని అందర్నీ ఒకచోట పోగు చేసాడు. తన కార్యాచరణ అంతా వాళ్ళకి వివరించాడు.

“మన ఊరి చుట్టూ కొండలు, గుట్టలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఆ నీరు అంతా వృధాగా పోతోంది. చిన్న చిన్న కాలువలు తీసి ఆ వర్షపు నీరు ఎండిపోయిన మన బావులకు మళ్లిద్దాం. భూగర్భ జలాలు పెరుగుతాయి. బావుల్లోనూ ఎప్పుడూ నీరు ఉంటాయి. కరెంటు కష్టాలు తీరాలంటే సౌర శక్తి ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇస్తోంది. ఆ పనులు అన్ని నేను చూసుకుంటాను. డ్రిప్ ఇరిగేషన్ పద్దతికి కూడా ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. మీకు ఇన్ని రోజులు వాటి గురించి సరిగా తెలియక పోవడం వల్ల, తెలిసినా వాటిని పొందే పద్ధతి తెలియక సరిగా వినియోగించు కోలేకపోయారు.

అధునాతన పద్ధతులు,యంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను మీకు వాటి గురించి తెలుసుకుని చెప్తూ ఉంటాను. మనం చేయవలసిందల్లా మనమందరం సమిష్టిగా ఉండి పనులు చేసుకోవడమే. ఎవరికి ఇష్టమైన పంటలు వారు వేసుకోండి. అందరూ ఒకే రకమైన పంటలు వేయవద్దు. ప్రతి ఒక్కరూ మూడు నాలుగు రకాలైనా సాగు చేయాలి. ఎక్కడా భూమిని కానీ, నీటిని కానీ వృధా చేయవద్దు. పంటలు పండాక వాటి మార్కెటింగ్ కూడా మనమే చేద్దాం. దళారీల చేతిలో మోసపోవద్దు. మన ఊరిని తిరిగి పచ్చగా చూడటమే నా బలమైన ఆకాంక్ష.”

రాజీవ్ ఎంతో ప్రేరణాత్మకంగా చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ౦దరిలో ఉత్సాహం ఉరకలు వేసింది.

“సరే చిన్నా! ఈ సారికి నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. నువ్వు చెప్పేది వింటుంటే ఏదో సాధించగలవనే అనిపిస్తోంది. ఇక మీద మనందరిది ఒకటే మాట.”అన్నారు వాళ్ళు.

మరుసటి రోజే ఊరిలో పిన్నలు, పెద్దలు అందరూ పలుగులు, పారలు పట్టుకుని వాన నీటికి వాలుగా కాలువలు తవ్వడం ప్రారంభించారు. అనుకూలంగా ఉన్న ప్రతి చోట కాలువలు తీసి బావులకు మళ్ళించారు.

రాజీవ్ రైతులను వెంటబెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగి లోన్లు, డ్రిప్ ఇరిగేషన్ కు కావలసిన సామగ్రి తీసుకొచ్చాడు. అందరూ ఉత్సాహంగా పని చేయ సాగారు. తన దగ్గరున్న డబ్బు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో కలిపి రాజీవ్ తన రెండెకరాల పొలంలో పాలీ హౌస్ కట్టించి, యురోపియన్ కీరకాయ సాగు ప్రారంభించాడు. పెట్టుబడి పెట్టడానికి మరో ఇద్దరు ఆసక్తి చూపితే వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేసాడు.
వారి ఉత్సాహాన్ని చూసి వరుణుడు కూడా కరుణించాడు. వారు కాలువలు తవ్విన వారం రోజుల తర్వాత నాలుగైదు రోజుల పాటు కుంభ వృష్టి కురిసింది. వర్షం నీరంతా కాలువల ద్వారా బావులకు చేరింది. చుట్టుపక్కల బోర్లు రీఛార్జి అయ్యాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత బావుల్లో నీరు చూసి ఊరంతా సంబర పడ్డారు.

“బావుల్లో నీళ్ళు చూసి దశాబ్దం దాటిందిరా మనవడా! ఇక ఎప్పటికి చూస్తానని కూడా అనుకోలేదు. ఒక నెల రోజుల్లోనే నువ్వు దాన్ని సాధ్యం చేసావ్.” ఊరిలో ఒక తాతగారు రాజీవ్ ను అభినందించారు.

“ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది తాతా! మనమే సరిగా వినియోగించుకోవటం లేదు. అయినా ఇదంతా నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? అందరూ కలిసుంటేనే ఏదైనా సాధించగలం.” అన్నాడు రాజీవ్.

“వాళ్ళందరిని ఒక తాటి మీదికి తెచ్చింది నువ్వే కదరా! ఇక మన ఊరు బాగు పడుతుందని ఆశ కలుగుతోంది. చల్లగా ఉండు నాయనా!” ఆశీర్వదించారు తాతగారు.

పల్లెలో ఇప్పుడు అన్ని మోటార్లు ఇప్పుడు సోలార్ తో పని చేస్తున్నాయి. ఆ ఏర్పాట్లు కూడా రాజీవ్ చూసుకున్నాడు. పాడి ఎక్కువగా ఉన్న వారితో చర్చించి, పంటలకు సేంద్రియ ఎరువులు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. పంటలకు వచ్చే తెగుళ్ళు నివారించడానికి ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడంలో అందరికీ మెళకువలు నేర్పించారు. రాజీవ్ ఎప్పటికప్పుడు అంతర్జాలం ద్వారా అవసరమైన సమాచారం సేకరించి అందరికీ అందచేస్తున్నాడు. పొలం పనులకు అవసరం అయ్యే అధునాతన యంత్రాలు అందరూ కలిసి తెచ్చుకోవడంతో ఖర్చు తక్కువ అయ్యేది. చురుకైన యువకులకు ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు రాజీవ్.

కూరగాయల పంటల మధ్య అంతర పంటలుగా పూల మొక్కలు వేసారు. ఏడాది పొడుగునా ఏదో ఒక రకమైన ఆదాయం వచ్చేలా పంటలు వేయించారు. పొలం పనులు కూడా వంతుల వారిగా అన్ని పనులు అందరూ చేశారు.

ఆరు నెలలు గడిచాయి. వారి కష్టం వృధా పోలేదు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, పంటలు కొనడానికి బహుళ జాతి సంస్థలు పోటి పడ్డాయి. వాటి మార్కెటింగ్ కూడా రాజీవ్ అంతర్జాలం లో పెట్టి మంచి ధరలు వచ్చేలా కృషి చేసాడు. దగ్గరలో ఉన్న సిటీ లో అపార్ట్ మెంట్ సముదాయాల యజమానులతో మాట్లాడి వారానికి ఒకరోజు అక్కడ కూరగాయల స్టాల్ పెట్టుకునేందుకు అనుమతి తీసుకున్నాడు. నాణ్యమైన తాజా కూరగాయలు మార్కెట్ ధర కంటే తక్కువ గానే దొరుకుతూ ఉండటంతో వారందరూ ఆనందంగా అంగీకరించారు. రైతులు తీసుకెళ్ళిన కూరగాయలు, పూలు గంట తిరక్కుండానే అమ్ముడైపోయేవి. సమయం వృధా లేకుండా మళ్ళీ వచ్చి పొలం పనులు చూసుకునే వారు.

సోషల్ మీడియా లో సేంద్రియ ఉత్పత్తుల వివరాలు పెట్టడం తో ఎక్కడెక్కడి నుండో ప్రజలు స్వయంగా వచ్చి కొనుగోలు చేయడం వల్ల రైతులు బాగా లాభపడ్డారు. ఎప్పుడైనా ఒకో రకం పంట ధరలు పతనమై నిరాశ పరచినా, మరో రెండు మూడు పంటలు ఊరి వారిని లాభాల్లో ముంచెత్తాయి. దళారీల ప్రమేయం లేకుండా నేరుగా సంస్థలే వచ్చి కొనుగోలు చేసుకునేలా రాజీవ్ రైతులతో ఒప్పందాలు చేయించాడు.
రాజీవ్ వేసిన యురోపియన్ కీరకాయ పంట కూడా అతడికి లాభాల వర్షం కురిపించింది. సేంద్రియ ఎరువులు వాడటం వలన నాణ్యమైన పంట దిగుబడి వచ్చింది. సిటీ లో కొన్ని స్టార్ హోటల్స్ అతడితో ఒప్పందం చేసుకున్నాయి. అతడు పెట్టిన పెట్టుబడి అంతా మొదటి ఏడాదిలోనే తిరిగి వచ్చేసింది. మరో రెండు ఎకరాలకు పాలి హౌస్ విస్తరించాడు రాజీవ్. మరుసటి ఏడాదిలోనే చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు. కొడుకు సాధించిన విజయానికి అతడి తండ్రి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. తను బాగు పడటమే కాకుండా ఊరిని అంతటిని బాగు చేసిన కొడుకుని చూసి గర్వంతో పొంగిపోతున్నాడు ఆయన.

రాజేవ్ వాళ్ళ ఊరు రాష్ట్రం లో ఆదర్శ గ్రామం గా ఎంపికయ్యింది. రాజీవ్ చేసిన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అతనిని తగు విధంగా సత్కరించింది. అతడు సాధించిన విజయాలు వార్తా పత్రికలూ, టీవీ చానెళ్ళు ప్రసారం చేసాయి.

“ఉద్యోగం చేసే రోజుల్లో నా మీద ఎంతో మానసిక ఒత్తిడి ఉండేది. ఇప్పడు పొలాల మధ్య ఎంతో సంతోషంగా ఉన్నాను. మరొకరి కింద పనిచేసేటపుడు లేని స్వేచ్చను, నా వాళ్ళతో కలిసి జీవించడంలోని ఆనందాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నాను. నేను, నా ఊరు బాగుండాలనే నా కోరిక ఇలా తీరటం నాకెంతో ముదావహం. ఎన్నో వృత్తులకు ప్రత్యామ్నాయాలు కనిపెట్ట బడ్డాయి. కాని వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదు. యువత అందరూ ఆధునిక వ్యవసాయం వైపు దృష్టి సారించాలని కోరుకుంటున్నా. మనసు పెట్టి చేస్తే వ్యవసాయం కూడా లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగం చేయడం లో ఉండే తలనొప్పులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు నాకు ఇప్పుడు ఏవీ లేవు. మంచి శారీరక శ్రమ వలన ఆరోగ్యంగా ఉన్నాను. చుట్టూ అందరినీ సంతోషంగా ఉంచడం వలన మానసిక సంతృప్తి పొందాను. ఉన్న వనరులను ఉపయోగించుకోవడం, ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకోవడం, అందరూ కలిసి సమిష్టిగా పనిచేయడం...ఇవే మా ఊరి విజయానికి కారణాలు.” ఇంటర్వ్యూ లో రాజీవ్ చెప్పిన మాటలకు హర్షధ్వానాలు మిన్నంటాయి.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న