ఆ రోజు నిజామాబాద్ బస్టాండ్ మొత్తం రద్దీగా ఉంది, కరీంనగర్ బస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను, కాన్ఫరెన్స్ కోసం ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజికి వక్త గా వచ్చాను, నేను పని చేసేది కరీం నగర్ లో, ఎక్కడికైనా నా కారులోనే వెళ్ళేవాడిని, కానీ ఈసారి ఎందుకో, ఆర్.టి.సి బస్సు లో వచ్చాను, తిరిగి కరీంనగర్ బయల్దేరదాం అని బస్టాండుకు వచ్చిన నాకు అక్కడి నోటీసు బోర్డు రూపంలో పెద్ద షాకు తగిలింది, ఆ బోర్డు ప్రకారం, జగిత్యాలలో బహిరంగ సభ జరుగుచున్న కారణంగా దాదాపు బస్సులు అన్నింటినీ అక్కడికి పంపించడం జరిగింది, కావున ప్రయాణీకులు సహకరించవలసినదిగా ప్రార్థన!! అప్పుడు అనిపించింది అనవసరంగా బస్సులో వచ్చాను అని, క్లుప్తంగా ఇప్పుడు ఇక్కడి పరిస్థితి ఏంటి అంటే, ప్రయాణీకులు ఎక్కువ, బస్సులు తక్కువ. ఓ గంట తరువాత, దుమ్ము లేపుకుంటూ వచ్చింది చక్కటి ఆర్డినరి బస్సు, వచ్చీ రాగానే, నాతో పాటు, జనం అందరూ ఎగబడ్డారు సీటు కోసం మరియు చోటు కోసం, నేను వెంటనే పరిగెత్తుకు వెళ్ళి, కండక్టర్ గారి పక్క సేటులో నా కర్చీఫ్ వేశాను,
సీటు దొరికింది అన్న ధైర్యం ఒక వైపు, నా కర్చీఫ్ ఎవరైనా తీసివేస్తారో అన్న భయం ఇంకో వైపు, ఎలాగోలా అందరితో పాటే లోపలికి నెట్టుకుని వచ్చి, నేను కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పని ఇప్పుడు చేస్తోంటే నాకు సరదాగా ఉంది, ఓ పది నిమిషాల విరామం తరువాత, బస్సు స్టార్టు చేసాడు డ్రైవర్. ఊపిరి కూడా ఆడనంతగా జనంతో నిండిపోయింది బస్సు మొత్తం, వెనకాల వేరే బస్సు వస్తోంది అని కండక్టర్, డ్రైవర్ చెప్పినా కూడా ఎవ్వరూ దిగడం లేదు, బస్సు ఓవర్ లోడు అవుతుండడంతో, కొంత మందిని అక్కడి బస్టాండ్ ట్రాఫిక్ కంట్రోలర్ గారు బలవంతంగా దించివేసారు, హమ్మయ్యా, ఇప్పుడు గాలి ఆడుతోంది కొంచం, చాలా విచిత్రంతో కూడిన అనుభవం ఇది నాకు, కొత్తగా ఉంది,
ఊరు బయటిప్రాంతం మొదలవగానే చల్లటి గాలి వస్తోంది కిటికీలో నుంచి, మెల్లగా కునుకు పట్టింది, ఎంతసేపు నిద్రపోయానో తెలియదు కాని, "డిచ్ పల్లి వచ్చింది, దిగేవారు ముందుకు రండి" అన్న కండక్టర్ పిలుపుతో మెలుకువ అయ్యింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి, బస్సులో నుండి దిగిన వారి కన్నా ఎక్కువే వచ్చారు లోపలికి, డోరు దగ్గరగా ఉండడంతో, ఎక్కేవారిని గమనిస్తూ ఉన్నాను, ఎక్కేవారి రాపిడి వలన పక్కకు జరిగిన నా బ్యాగును సరిచేసుకుంటూ ఉండగా, నా కాళ్ళ మీద ఓ చెయ్యి గట్టిగా పట్టుకున్నట్టు పడింది, వెంటనే కాళ్ళు లోపలికి లాగేసుకుని, అటు వైపు చూసా, ఓ ముసలాయన, పాపం, పట్టు కోసం నా కాళ్ళు పట్టుకుని ఉంటాడు అనుకుని నా చెయ్యి అందించా పైకి రమ్మని, "వద్దులే బిడ్డా, నేను ఇక్కడనే కూసుంటా" అన్నాడు.
"ఏయ్, ముసలోడా, పైకి రా" అన్న కండక్టర్ హెచ్చరికను లెక్కచెయ్యకుండా అక్కడే ఫుట్ బోర్డు మీద కూర్చున్నాడు. ఆ ప్రమాదకరమైన ఫుట్ బోర్డు మీద కూర్చోవడమే కాకుండా, తన చేతికర్రను అడ్డుగా పెట్టాడు, పైగా అక్కడ ఉన్న జనం అందరినీ వెనక్కి తోసేస్తున్నాడు, వినకపోతే కర్రతో కొడుతున్నాడు, "ఏంటయ్యా, పిచ్చివారిని బస్సు ఎక్కిస్తారా?" అంటూ కండక్టర్ మీద ఓ ప్రయాణీకుడి అరుపు. ఏదైతేనేం బస్సు మళ్ళీ ముందుకు కదిలింది, అక్కడే కూర్చున్న ముసలాయన వైపు డ్రైవర్ చూస్తున్నాడు, పది నిమిషాలకొకసారి, ఇక తప్పదు అన్నట్టు బస్ సైడుకి ఆపి, తాత దగ్గరికి వచ్చి తిట్లు మొదలెట్టాడు, ఎంత అరుస్తున్నా, తిడుతున్నా ఆ తాత మాత్రం, నాకేం సంబంధం లేదన్నట్టు అక్కడే కూచున్నాడు.
"ముసలాయన కదా నిలబడలేక కూర్చున్నాడేమో లే అన్నా!!! వదిలెయ్" అని డ్రైవరుకు కండక్టర్ సర్దిచెప్పడంతో బస్సు మళ్ళీ ముందుకు కదిలింది. ఈ సంభాషణంతా వింటూ నేను తాతనే గమనిస్తూ ఉన్నా, వయసు మీద పడింది అన్నట్టు మొహం మీద ముడతలు, సత్తువ లేదు అన్నదానికి నిదర్శనంగా వణుకుతున్న చేతులు, అయినా కూడా ఫుట్ బోర్డు మీద కూర్చున్నాడు ధైర్యంగా. బస్సు దిగే లోపు ఈయనతో మాట కలపాలి అని నిర్ణయించుకున్నాను. ఓ గంట సేపు తరువాత కామారెడ్డి బస్ స్టాండ్ వచ్చింది, ఎదైనా తినడానికి తీసుకుందామని కిందకి దిగాను, బస్సు మొత్తం ఖాలీగా ఉంది ఇప్పుడు, దాదాపు అందరూ కూర్చునే ఉన్నారు, నాకు తాత కనపదలేదు, అయ్యో మాటలు కలపకుండానే దిగిపోయాడేమో అనుకున్నాను, సరిగ్గా బస్సు కదులుతుండగా మళ్ళీ ఎక్కి కుర్చున్నాడు ఆ ఫుట్ బోర్డు మీద, అతన్ని చూసి తల పట్టుకున్నాడు కండక్టర్, డ్రైవర్, కారణం, ఈయనకు ఎదైనా జరిగితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా, సీతయ్య లాగ ఎవ్వరి మాటా వినకుండా అక్కడే కుర్చున్నాడు ఈ తాతయ్య అని అనుకున్న నాకు నవ్వొచ్చింది.
బస్సు ఆగిన ప్రతీ ఊరిలోను ఈయన దిగడం, తరువాత జనం దిగడం, ఎక్కడం, చివరికి ఈయన ఎక్కి కూర్చుని కర్ర అడ్డు పెట్టడం. దాదాపు గంట ప్రయాణం తరువాత సిరిసిల్ల వచ్చింది, ఇక్కడ బస్సు ఖాళీ అవ్వడంతో, సీటులోకి వచ్చి కూర్చున్నాడు తాత, కండక్టర్ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం నేను గమనించాను, "హమ్మయ్యా, ఎట్టకేలకు సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు" అనుకున్న నాకు అది తప్పని తర్వాత తెలిసింది. సిరిసిల్ల ఊరి బయట బస్ స్టాప్ లో అంతకు మించి జనం బస్సు లోకి రావడంతో, తాత పరిగెత్తుకుంటూ వచ్చి, డోర్ దగ్గర ఉన్న వారిని వెనక్కి తోసేసి కింద కూర్చున్నాడు, డోరుకు అడ్డంగా. సీటు ఖాళీగా ఉంటే అక్కడికెళ్ళి కూర్చోవడం, ఖాళీ లేదు అంటే, డోరు దగ్గర ఉన్న జనాన్ని వెనక్కు నెట్టేసి అక్కడే కూర్చోవడం చేస్తున్నాడు. ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడో, నాకు ఏం అర్థం కావడం లేదు, నేను ఇంటికి వెళ్ళేలోపు, కచ్చితంగా ఈయనతో మాట్లాడాలి అనుకున్నా, నా ఆలోచనకు తగ్గట్టు, ఓ కుటుంబం మొత్తం, వరదవెల్లి అనే ఊరిలో దిగేసారు, ఒకేసారి పది సీట్లు ఖాలీ అయ్యాయి కదా, డోరు దగ్గర జనం ఎవ్వరూ లేరు, ఇక ఈయన చేతి కర్ర, బ్యాగు ఎత్తుకుని ఖాలీ సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు. తాతయ్యతో మాట కలపడానికి ఇదే సరైన సమయం అనుకుని, వెళ్ళి పక్కన కూర్చున్నా, మెల్లగా మొదలుపెట్టా................
నేను - ఏం తాతా? ఎక్కడికి పోతున్నావ్?
తాతయ్య - ఇక్కడికే కరీం నగర్ కు పోతున్నా.
నేను - కరీం నగరు కా, మీ సొంత ఊరా??
తాతయ్య - కాదు బిడ్డా, నాది డిచ్ పల్లి దగ్గర ఉన్న మిట్టపల్లి.
నేను - ఇంత అవస్థలో ఎందుకు పోతున్నావు కరీం నగరు కు??
తాతయ్య - మా కోడలు హాస్పిటల్ లో ఉంది, చూడడానికి పోతున్నా!!
నేను - హాస్పిటల్ లోనా? ఎమైంది తాత?
తాతయ్య - మా కోడలు క్వారీ లో దినకూలి గా పని చేసేది, ఆ దుమ్ము, ధూళి వలన ఊపిరితిత్తులు పాడయినాయి. ఆపరేషను చెయ్యాలి అన్నారు డాక్టరు, నాకాడేమో పైసలు లేవు, ఉన్న పైసలు తో మందులు కొనుక్కుని ఇవ్వడానికి వెళుతున్నా..
నేను - మరి నీ కొడుకు ఏం చేస్తాడు??
తాతయ్య - లేడు కదా, మొన్న బస్సు ప్రమాదంలో చనిపోయాడు, అప్పటినుంచి మాకు కష్టాలు మొదలయినాయి, బెంగతో నా భార్య చనిపాయే, ఇప్పుడేమో కోడలికి ఇలా అయిపాయే.
నేను - ఎలా చనిపోయాడు తాత?
తాతయ్య - మా అబ్బాయి సాఫ్టువేరు కోర్సు చదివినాడు, హైదరాబాదు లో ఉద్యోగం, నెలకు ఒకసారి ఊరికి వచ్చి పోతోండే, జాతరకు ఊరు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, తిరుగు ప్రయాణంలో నిండుగా ఉన్న బస్సు ఎక్కి ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తుండగా పట్టు తప్పి, జారిపోయి చక్రాల కింద పడి చనిపొయాడు.!!
నేను - అయ్యో, సారీ తాత, మరి నీ కొడుకు డోరు దగ్గర నిలబడి చనిపోయాడని తెలుసు కదా, నువ్వెందుకు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు, నీకు తెలియదా అక్కడ ప్రమాదం పొంచి ఉందని!!??
తాతయ్య - నాకు తెలుసు బిడ్డా, అందుకే బస్సు నిండుగా ఉంటే నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా!!
నేను - అదేంటి తాత, నువ్వు పట్టు తప్పి జారిపొతే??
తాతయ్య - నాకు వయసు ఐపొయింది కదా బిడ్డా, నేను జారి కింద పడి చనిపోయినా ఫరవాలేదు, నా కొడుకు లాగా ఇంకొకరు చనిపోకూడదు అని నేను కూర్చోవడమే కాకుండా నా చేతి కర్రను అడ్డం పెట్టుకుంటా, అక్కడ ఉన్న వారందరినీ వెనక్కి తోసేస్తా. ఈ తాతయ్యది ఎంత మంచి మనసు, తన ఇంట్లో జరిగిన ప్రమాదం, ఇంకెవ్వరికీ జరగకూడదు అని ఎంతమంది తిట్టినా, చిరాకు పడినా, డోరు దగ్గర మనుషుల ప్రాణాలకు కాపలా కాస్తున్నాడు. కన్నీళ్ళు మర్చిపోయిన నా కళ్ళు, ఈరోజు చిన్నగా సన్నటి ధారను విదిల్చాయి. నా సంభాషణను కొనసాగించాను..........
నేను - తాత, అయితే ఇప్పుడు మీ కోడలి పరిస్థితి ఏంటి?
తాతయ్య - ఏముంది బిడా, ఆపరేషను చేస్తే బ్రతుకుతాది, లేదంటే లేదు, నాకున్న పొలం అమ్మకానికి పెట్ట, అది అమ్ముడుపోతే ఆపరేషను చేయిస్తా, లేదంటే మా కర్మ ఇలాగే ఉంది అనుకుంటా.
నేను - మంచి వారికి మంచే జరుగుతుంది తాత, కరీం నగర్ లో దిగినాక నా కారులో నిన్ను హాస్పిటలుకు తీసుకెళ్తా, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం.
బస్సు కరీం నగర్ లో ఆగింది, నేను, తాత నా కారులో హాస్పిటలుకు చేరుకున్నాం, అక్కడ ఉన్న కోడలిని చూసిన నాకు కన్నీరు ఆగలేదు, ఒంటరిగా పడుకుని ఉంది దీనంగా, పక్కన ఎవ్వరూ లేరు, తాతను చూడగానే, చిన్నగా నవ్వింది, అప్పుడే వచ్చిన నర్సు తాతను చూసి కోపం తెచ్చుకుని నన్ను చూసి ఆగిపోయింది. "తాతా, ఇక్కడ వద్దు, నాకు తెలిసిన మంచి హాస్పిటల్ ఉంది అక్కడికి వెళదాం" అంటూ ఫోన్ తీసుకుని ఆంబులెన్సుకి ఫోన్ చేసి వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసాను. "ఇది ఎవరి హాస్పిటల్ బిడ్డా??", అని అడిగిన తాతకు, "నాకు బాగా కావలిసిన వారిది తాత, నేను చెప్తే మంచిగా ట్రీట్మెంటు ఇస్తారు, నీ కోడలికి ఇంకేం భయం లేదు, నేను చూసుకుంటా కదా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను పిలిచినప్పుడు లోపలికి రా" అని ధైర్యం చెప్పి, డాక్టర్ రూములోకి నడిచాను, అప్పటికే నా కోసం ఎదురుచూస్తున్న జూనియర్ డాక్టర్లందరూ లేచి నమస్కారం చేసారు, నేను నా కుర్చీలో కూర్చుంటూ, ఆ అమ్మాయికి సంబంధించిన రిపోర్ట్స్ తెప్పించాను, ఆ రిపోర్ట్స్ పరిశీలించగా చిన్న ఆపరేషనే అని నాకు అర్థం అయ్యింది.
తాతను నా రూములోకి తీసుకురమ్మని, సిస్టర్ కు చెప్పాను. వినయంగా చేతులు కట్టుకుని వచ్చిన తాత నాకు నమస్కారం చేయబోతూ ఆశ్చర్యపోయాడు. "బాబూ మీరేంటి ఈ కుర్చిలో ఉన్నారు?" అని అడిగాడు. "తాత, ఈ హాస్పిటల్ నాదే, అనుకోకుండా నేను ఆ ఊరికి బస్సులో రావడంతో మీకు సహాయం చేసే అవకాశం దొరికింది, మీ కోడలికి నేనే ఆపరేషను చెయ్యబోతున్నాను" అని నేను మాట్లాడుతుండగానే తాత కళ్ళళ్ళో నీళ్ళు తిరగడం నేను గమనించాను. నిండుగా ఉన్న బస్సులో ఎవ్వరికీ ప్రమాదం జరగకుండా మీరు సహాయం చేసారు, పరుల భద్రత గురించి ఆలోచించిన మీకు సహాయం చెయ్యడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకో రెండు రోజుల్లో స్పెషలిస్టు డాక్టర్లు వస్తున్నారు, వారితో కలిసి నేను మీ కోడలికి ఆపరేషను చేస్తున్నాను, అంతే కాదు మీరు, మీ కోడలు ఒప్పుకుంటే ఇక్కడే, ఇదే హస్పిటల్లో ఉద్యోగం ఇస్తాను. ఈ మాట అంటున్నప్పుడు........చిరునవ్వుతో నిండి ఉన్న తాత మోము చూడడానికి ఎంత బాగుందో....!!