గౌతమ్ ఇంటర్వ్యూ నుండి తిరిగి వచ్చాడు. ఇంట్లో అడుగు పెడుతూనే తల్లి ఏమీ అడగక పోయినా ఆమె కళ్ళల్లో ఏమైందన్న ఆతృత కనపడుతోంది.
తల్లి కి ఏం చెప్పలేక తిన్నగా తన గది లోకి వెళ్ళి పోయాడు గౌతమ్. ఆమెకి అర్ధం అయ్యింది. ఈసారి కూడా ఉద్యోగం రాలేదని.
' దేవుడా, ఇంక ఆయన వస్తారు. ఈసారి కూడా ఉద్యోగం రాలేదని తెలిస్తే వాడిని ఏదో ఒకటి అంటారు. వాడి మనసు బాధ పడుతుంది. ఏదో ఒక ఉద్యోగం చేయమంటే తనకి తగినది వచ్చే వరకు చేయనని వాడు, ఏదో ఒకటి చేయవచ్చు కదా అని ఈయన, ఇద్దరి మధ్య నలిగి పోతూ తను ఎప్పటికి ఈ సమస్య తీరేను.' అనుకుంటూ వంట చేస్తోంది సరోజ. ఇంతలో బయట స్కూటర్ చప్పుడు విని 'అమ్మో, ఈయన వచ్చేసారు' అనుకుంటూ గుమ్మం లోకి ఎదురెళ్లి శంకర్రావు చేతిలో టిఫిన్ కారేజీ అందుకుని వెనుతిరిగింది.
"అయ్యగారు వచ్చినట్లున్నారు." అన్నాడు శంకర్రావు.
"ఇందాకే వచ్చాడు." అని లోపలికి వెళ్ళి పోయింది.
"ఏమైందిట ఇంటర్వ్యూ." అడిగాడు శంకర్రావు
" ఏమోనండీ నేనడగలేదు." అంది సరోజ సమాధానంగా.
"అడగక్కర్లేదు. సెలెక్ట్ అయితే ఎగురుకుంటూ రాడూ. కాలేదు కాబట్టి కిమ్మనకుండా లోపలికి దూరాడు." అన్నాడు శంకర్రావు వెటకారంగా.
గౌతమ్ ఈ సంభాషణ వింటూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కానీ ఏమీ అనలేక పోతున్నాడు.
' ఛ, రోజు రోజుకు లోకువైపోతున్నాను' అని మనసులో తనని తాను తిట్టుకున్నాడు . ఇంతలో సరోజ తండ్రి కొడుకులను భోజనానికి పిలిచింది. గౌతమ్ కి తినాలని అనిపించలేదు.
" అమ్మా, మీరు తినండి, నాకు ఆకలి లేదు,"అన్నాడు.
" ఏం దొరగారు బైట తిని వచ్చారా. ముందుగా చెపితే ఆయన కోసం వండరు కదా. ఇప్పుడు వండినది పారేయాలా" అన్నాడు శంకర్రావు.
" ఊర్కోండి. ఏమిటా మాటలు. వాడు వింటే బాధ పడతాడు" అంది సరోజ
" అవును మరి. నీకు కొడుకు బాధ అర్థం అవుతుంది. నా బాధ అర్థం కాదు. నా కష్టం కూడా నీకు కనపడదు." అన్నాడు శంకర్రావు కొంచెం కోపంగా. సరోజ అతని వైపు చూసి చేతులు జోడించి 'ఊర్కోండి' అన్నట్లు సైగ చేసింది. శంకర్రావు మాట్లాడకుండా భోజనం చేయడం ప్రారంభించాడు ఇంతలో గౌతమ్ బైటికి వచ్చి "అమ్మా అన్నం పెట్టు" అంటూ కూర్చున్నాడు. సరోజ మారు మాట్లాడకుండా భోజనం పెట్టింది. తండ్రి కొడుకులు మౌనంగా భోజనం చేసి వెళ్లి పోయారు. తర్వాత తను కూడా తిని వంటగది పని పూర్తి చేసి గది లోకి వెళ్ళింది. అప్పటికే శంకర్రావు నిద్రలోకి జారుకున్నాడు.
గౌతమ్ కి రాత్రంతా నిద్ర పట్టలేదు. తన దుస్థితి కి చాలా బాధ కలిగింది. బి.టెక్ చదివినప్పుడు క్యాంపస్ లో సెలెక్ట్ కాలేదు. తర్వాత నుంచి ఏడాది గా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం కుదరడం లేదు. తనకి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. తన చదువు కి తగిన ఉద్యోగం వచ్చేవరకు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఉద్యోగం త్వరగా దొరకడం లేదు. నాన్న తనను అర్థం చేసుకోవడం లేదు. తనకి బలాదూర్ తిరగడమే ఇష్టం అనుకుంటారు. కానీ తనెంత బాధ పడుతున్నాడో ఆయనకి అర్థం కాదు.
తను ఇల్లు వదిలి వెళ్లి ఉద్యోగం వచ్చేవరకు తిరిగి రాకూడదు. అని మనసులోనే నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లారి లేచేసరికి నాన్న ఆఫీస్ కి వెళ్లి పోయారు.
"లేచావా. నాన్న నిన్నుఈ ఎడ్రస్ కి వెళ్లి కలవమన్నారు " అంటూ ఒక విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టింది. గౌతమ్ చిరాగ్గా చూసి కార్డ్ జేబులో పెట్టుకొన్నాడు.
" చూడు నాన్నా, మీ నాన్న అంటున్నారు అని కోపం తెచ్చుకోకు. ఆయనకి నీ గురించి బెంగ. కాకపోతే ఆయన మాట కరుకు. కానీ మనసు చాలా మంచిది. ఆయన చెప్పిన చోటుకు వెళ్ళు. లేకుంటే ఆయన కి మళ్లీ కోపం వస్తుంది. ఆయన నీ కోసమే కదరా చెప్తారు" అంది సరోజ మళ్లీ.
"అలాగే లేమ్మా, వెళ్తాను. తప్పుతుందా. ఉద్యోగం లేకనే కదా నాకు ఈ అవమానాలు." అన్నాడు గౌతమ్ .
"అలా అనుకోకు రా. నువ్వు బాగుండాలనే కదా నాన్నా, నేను కోరుకునేది." అంది సరోజ బాధగా. గౌతమ్ మరేం మాట్లాడకుండా తల్లి పెట్టిన టిఫిన్ తిని తండ్రి ఇచ్చిన ఎడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎడ్రస్ త్వరగానే దొరికింది. విజిటింగ్ కార్డ్ రిసెప్షన్ లో చూపించాడు. రిసెప్షనిస్ట్ కొంచెం సేపు వెయిట్ చేయమని ఎదురుగా ఉన్న సోఫా చూపించింది. గౌతమ్ ఒక గంట వెయిట్ చేసాక పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని విష్ చేసాడు. అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని గౌతమ్ ఫైల్ తీసుకుని తిరగేశాడు.
"ఓకే. ఇన్నాళ్లు ఖాళీగా ఉండి ఏంచేశారు." అడిగాడు
"జాబ్ కోసం ట్రై చేశాను." అన్నాడు
" ట్రై చేస్తున్నాను అనుకుంటూ చాలా టైం వేస్ట్ చేశారు." అంటూ అతని ఫైల్ తిరిగి ఇస్తూ "మీకు ఏ విషయం ఫోన్ చేసి చెప్తాం." అన్నాడు.
"థాంక్యూ సర్." అని బైటికి వచ్చి ' ఇంతోటి దానికి రమ్మనడం ఎందుకో ' అనుకుంటూ బైటికి వస్తూండగా తన సీనియర్ రాజేష్ ఎదురయ్యాడు.
"హాయ్ గౌతమ్ నువ్వేంటి ఇక్కడా!" అంటూ.
"ఏముంది అన్నా, మా నాన్నగారు ఇక్కడ ఏదో ఆపర్చునిటీ ఉందంటే వచ్చాను. కానీ నాకేం అలా అనిపించడం లేదు. అందుకే వెళ్లి పోతున్నాను. మరి నువ్వు ఏం చేస్తున్నావ్ ఇక్కడ! " అడిగాడు గౌతమ్.
" నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా." అన్నాడు రాజేష్.
"నీకు జాబ్ ఎందుకు అన్నా! మీ నాన్నగారికి పెద్ద కంపెనీ ఉందిగా" అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా.
"గౌతమ్, కంపెనీ నాన్నగారిది. నేను అందులో ఏ పొజిషన్ లో ఉన్నా ఎవరూ కాదనరు. కానీ నాకు కొంత అనుభవం కావాలి. అందుకే మా నాన్నగారిని ఒప్పించి ఈ కంపెనీ లో చేరాను.
ఇక్కడైనా అసిస్టెంట్ గా ఉన్నాను. కనీసం ఒక ఏడాదైనా అనుభవం సంపాదించిన తర్వాత మా ఆఫీసుకి వెళ్తాను." అన్నాడు రాజేష్.
" అయితే వచ్చే ఏడాది కి ఎం.డి వి అవుతావు" అన్నాడు గౌతమ్ నవ్వుతూ.
" లేదురా, నేను తొందర పడను. ఇక్కడ పని లో అనుభవం సంపాదించి, మా ఆఫీసులో కూడా నా పొజిషన్ కి తగ్గట్టు పనిని నేర్చుకోవాలి అప్పుడే బాధ్యతలు చేపట్టేది." అన్నాడు రాజేష్.
" ఓకే అన్నా, నేను వెళ్తున్నాను. వీళ్ళు ఏమైనా పిలిస్తే మళ్లీ కలుద్దాం." అన్నాడు గౌతమ్.
"ఓకే రా బై. ఆల్ ది బెస్ట్ రా " అంటూ లోపలికి వెళ్ళి పోయాడు రాజేష్.
గౌతమ్ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. తల్లి ఎదురు వచ్చింది.
"అమ్మా, ఆ కంపెనీ కి వెళ్ళాను. వాళ్ళు ఫోన్ చేసి చెప్తాం అన్నారు. నాన్నగారికి చెప్పు." అన్నాడు గౌతమ్. ఆ మాత్రానికే సంతోషపడింది సరోజ. గౌతమ్ లోపలికి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. అతనికి రాజేష్ గుర్తు వచ్చాడు. చదువు అయిపోగానే అలా వెళ్లి తండ్రి కుర్చీలో కూర్చో వచ్చు. రాజేష్ డబ్బున్న వాడు. పై చదువులు కూడా చదివాడు. అయినా పని నేర్చుకోవాలని చిన్న ఉద్యోగం లో చేరాడు. తన కన్నా ఎక్కువ చదివాడు. అవకాశం ఉండి కూడా పెద్ద పదవి చేపట్టకుండా క్రింది స్థాయి నుంచి పైస్థాయి కి ఒకొక్క మెట్టు గా వెళ్ళాలని కల్పించాడు. మరి అతని కన్నా తను ఎందులో ఎక్కువ! తండ్రి ఇన్నాళ్లు కష్టపడి చదివించారు. ఆయనకి కొంత చేదోడువాదోడుగా ఉందామన్న ఆలోచన కూడా తనకి రాలేదు. ఆయనకి తన వలన ఏ ఉపయోగం లేదు. ఇక తను మారాలి. మారుతాడు. ఒక నిర్ణయానికి వచ్చిన గౌతమ్ ప్రశాంతంగా నిద్ర పోయాడు. చాలా సేపటి వరకు మెలకువ రాలేదు. గదంతా చీకటిగా ఉంది. లేద్దామని అనుకుంటూనే బద్దకించాడు. ఇంతలో తల్లి వచ్చి "గౌతమ్, లే నాన్నా, మళ్లీ రాత్రి నిద్ర పట్టదు. " అంటూ లేపే సరికి లేచి టైం చూసాడు. రాత్రి ఏడవుతోంది. లేచి ఫ్రెష్ అయి బైటికి వెళ్తానని తల్లి కి చెప్పి బయటకు వెళ్ళాడు. కాస్త అటూ ఇటూ తిరిగి ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయింది. తండ్రి అప్పటికే భోజనం చేసి గది లోకి వెళ్ళి పోయాడు రాగానే తల్లి ని అడిగాడు.
"అమ్మా, నాన్నగారికి చెప్పావా, నేను చెప్పింది " అని.
"చెప్పాను నాన్నా, సరే అన్నారు. రా భోజనం చేద్దాం" అంది తల్లి. వస్తున్నానంటూ బట్టలు మార్చుకుని వచ్చాడు. మరునాడు రోజంతా ఫోన్ కోసం ఎదురు చూసాడు. సాయంత్రం వరకు ఏ ఫోన్ రాలేదు. కానీ సాయంత్రం ఫోన్ వచ్చింది. మరునాడు రమ్మని చెప్పారు. అదే విషయం తల్లి తండ్రులకు చెప్పి మరునాడు మళ్లీ వాళ్ళు చెప్పిన టైం కి వెళ్ళాడు గౌతమ్. ఈ సారి అతను ఎంత కష్టమైనా ఈ ఉద్యోగం వదులుకో కూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆఫీస్ లో అతనికి నైట్ డ్యూటీ ఇచ్చారు. దానికి కూడా అంగీకరించి ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు. ఇంటికి వెళ్ళి తనకు ఉద్యోగం వచ్చింది అని తల్లి కి ఆనందంగా చెప్పాడు. తండ్రి కి కూడా తానే చెప్పాడు. ఆ రోజు రాత్రి గౌతమ్ చాలా తృప్తిగా భోజనం చేసి పడుకున్నాడు. మరునాడు ఉద్యోగం లో చేరి కొద్ది కాలం లోనే కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాడు. దానితో జీతం తో పాటు తన పొజిషన్ కూడా మారుతూ ఉండటంతో ఎంతో సంతృప్తిని పొందాడు. ఆరోజు తండ్రి చెప్పడం తో ఆ ఆఫీస్ కి వెళ్ళాక పోయినా, రాజేష్ ని కలవకపోయినా తన జీవితం లో మార్పు వచ్చేది కాదని ఇప్పటికీ రాజేష్ ని గుర్తు చేసుకుంటాడు. కానీ ఉద్యోగం లో చేరిన కొత్తలో రోజూ నైట్ డ్యూటీ చేసే తనకి నిద్ర రాక హాల్ లోకి వచ్చి నప్పుడు తండ్రి మాటలు వినిపించాయి. "సరూ, నాకు వాడంటే కోపమనిఅనుకుంటావు. కానీ కాదు. వాడిని దారిలో పెట్టడం నా బాధ్యత. అందుకే వాడితో కటువుగా ఉంటాను. అంతే కాని ప్రేమ లేక కాదు." ఈ మాటలు గౌతమ్ లో తండ్రి పట్ల తన భావన ఎంత తప్పో తెలియ చేశాయి.
ఆనాటి నుండి గౌతమ్ కష్టపడి తన పని లో విజయం సాధించ గలిగాడు. అతని విజయానికి కారణం గా తండ్రి నీ, మిత్రుడు రాజేష్ నీ ఎప్పటికీ మర్చిపోడు.