కాజీపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న మణుగూరు ఎక్స్ప్రెస్ వేగంగా తన గమ్యంవైపు వెళుతుంది. జనరల్ బోగీలో జనం కనీసం నిల్చునే వీలులేకపోయినా నిద్రాదేవి కౌగిలిలో ఊగుతూఎక్కడ నిల్చున్నారో అక్కడే కూర్చుని నిద్రపోతున్నారు. బయట వణికిస్తున్న చలి అక్కడ జనాలమధ్యలో అంతరాలను చెరిపేసింది.కనీసం పరిచయం అయినా లేనివారి పక్కన వారికి ఆనుకొని మునగదీసుకుని కూర్చుని నిద్రపోతున్నారు.
ఇంకో అరగంటలో ట్రైన్ సికింద్రాబాద్ చేరుతుందనగా ఒకవ్యక్తి అందరినీ తొక్కుతూ తన్నుతూ వారిమధ్య నుండి హడావిడి గా రైలు ద్వారం దగ్గరకు చేరుకున్నాడు.మధ్యలో జనమంతా అయ్యో తొక్కేస్తున్నావ్ తన్నేస్తున్నావ్ అంటూ అరుస్తున్నా అవేం పట్టనట్టు వచ్చిజనగామ దాటాక మరే స్టేషన్ లేకపోవడంతోచలిగాలిరాకుండా గేటువేసేసి బాసింపట్టు వేసి నిద్రపోతున్న జనాలను లేపాడు గేటుకు అడ్డంలెమ్మని.అంతే అప్పటివరకు కమ్మగా నిద్రపోయిన సుందరం నిద్ర చెడడంతో కోపం నషాళానికంటింది.
"ఏందయ్య ఏడికి పోతావు .ట్రైన్ పోతా ఉందిగా.దూకి చస్తావా ఏంది "అన్నాడు పరుషంగా.
"అదికాదు బాబయ్య హైదరాబాద్ వచ్చేస్తాందంటగా ." "ఎవడన్నాడు ఇంక అరగంట పట్టుద్ది.మేమంతా కూడా ఆడికే పోయేది.రైలంతా ఖాళీ అయితది.దానికోసరమా మా నిద్ర చెడగొట్టింది."
"నాకు తెలియదు బాబయ్య.మొదటి సారి వత్తాండ.ఎవరో వచ్చేసిందంటే కంగారుపడి వచ్చేసినా" అన్నాడు కాలిపై దోమ కుట్టిన చోట గోక్కుంటూ. అది చూసిన సుందరం "ఓ అయ్యో ఏందా గీకుడేంది.ఆ లోకమేంది.నువ్వట్టా బర్రాబర్రా గీకుతుంటే ను వంటి కున్న మురికంతా రాలిపడతా ఉంది.స్నానం చేసి ఎన్నెళ్ళయ్యే.హా "అన్నాడు వ్యంగ్యంగా సుందరం. కొంచం ఎదరగా సీట్లో కొడుకును ఒళ్ళోపెట్టుకుని కూర్చున్న అతడి భార్య మణి సుందరం మాటలకు చిరాకుగా ఎవరో ఈ మనిషికి దొరికేసినట్టుంది. మాటలతో నరకం చూపిస్తడు అనుకుంది.
"అదేంలేదు బాబయ్య పని నుండి నేరుగా వచ్చేసుండా.అంతే నయ్యా అన్నాడు" ఆ మనిషి.
"చూసినావా ఈడందరూ ఎట్టుండారు.డీసెంట్గా లేరు.నీటుగా స్నానం చేసి మంచిబట్టలు కట్టుకుని పోవాలే ఏడికన్న పోతే.అంతేకాని చూసుకున్నావా నీ అవతారం" అంటూ తేరిపారా చూసాడు మరోసారి..
మట్టికొట్టుకుపోయి ఉన్న చొక్కా రంగుమారిపోయుంటే కింద కట్టిన లుంగీ పల్లెటూరి వాడని తెలియచెబుతోంది.
"గబ్బువాసన కొడుతుండావు మనిషివి.ఏమి మనిషివయ్యా నువ్వు అంటుంటే" అప్పటివరకు లేనివాసనేదో ముక్కుపుటాలను తాకినట్టు ముక్కు మూసుకున్నారు కొందరు సుకుమారులు. కొందరు సుందరం మాటలకు వెకిలిగా నవ్వుతున్నారు.
"తప్పయిపోయిందయ్యా.బిడ్డ దాని మొగుడు హైదరాబాద్ లో కూలిపని చేసుకోడానికి వచ్చుండారు. నాకూతురు కాన్పుకి నొప్పులొస్తుండాయంట ఆస్పత్రిలో చేర్చామని అల్లుడు ఫోన్ చేసుండాడు.మా ఆడది ఆడనే ఉండాది.అందుకే పనినుండి కంగారుగా వచ్చి ట్రైన్ ఎక్కేసా" అన్నాడు చిన్నతనంగా.
కొందరికి మనసులో కలుక్కుమంది ఆ తండ్రి ప్రేమకి.ఏమైనా అనాలన్నా అనాలోచితంగా మాట్లాడుతున్న సుందరంనోటికి బయపడి నోళ్ళు పెగలడంలేదు."ఓ గొప్పపనిచేసుండావు .అలా నుంచో దూరంగా" అంటూ చిరాకు పడడంతో ఎవరికీ తగలకుండా ఉండడానికి సీటు రాడ్డుకి జారపడి నిల్చొనే ఖాళీ లేక ఒంటికాలితో నిల్చోలేక అవస్థలు పడుతున్నాడు అవమానభారంతో కుచించుకుపోయి.నిద్రతేలిపోవడంతో సుందరం ఆ మనిషిని ఆటపట్టించే పనిలోపడ్డాడు.ఓ అయ్యో ఇంతకీ ఏం పేరునీది.సత్తయ్య బాబుగారు అన్నాడు వినయంగా. చూడు ఇప్పుడుచేస్తేచేసావు.ఇంకెప్పుడు ఇలా చెయ్యమాక.అన్నాడు మధ్యలో రైల్వేడిపార్ట్మెంట్ని నానామాటలు అన్నాడు తనలాంటి ఉద్యోగస్తులని ఇలాంటి గబ్బు మనిషిని ఒకేబోగిలో ప్రయాణం చేసేలా చేసినందుకు. మాటల్లోనే సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది. జనం దిగడానికి ఉరుకుతుంటే సుందరం భయపడి భార్యనికేకేశాడు అందరూ దిగాకదిగుదామంటూ. భార్యమీద ప్రేమనుకునేరు. మామగారికి బాలేదని చూడడానికి పోయి సిగ్గు లేకుండా అత్తగారితో వండించుకొస్తున్న పిండివంటలు పాడవుతాయనేది అతని బాధ.అందరూ దిగాక భార్యభర్తలిద్దరు సామానంగా కిందకు చేర్చారు. అన్నీ లెక్కపెట్టుకుంటుండగా గుర్తొచ్చింది మణికి కొడుకెక్కడని.అదే అడిగింది భర్తను. నువ్వు చూడాలిగా అంటే నువ్వు చూడాలిగా అంటూ వాళ్ళ గొడవపడుతుంటే రైలు కూతపెట్టి బయలుదేరింది.అప్పుడు చూశారు వాళ్ళ కొడుకు ఆరేళ్ళ బబ్లూ వీళ్ళుదిగిన గేటునుండి కాక మరో గేటునుండి దిగాలని ప్రయత్నిస్తుంటే అతడు వేసుకున్న బ్యాగు గేటుకున్న హ్యాండిల్కి తగిలి ఊడిరాక గింజుకుంటున్నాడు.
రైలు స్పీడందుకుంటుంటే పరిగత్తడం మొదలుపెట్టారు సుందరం అతడిభార్య బాబు అని అరుస్తూ.అతడి గింజులాటకి ,రైలు కదలడం మొదలుపెట్టేసరికి గేటు జరిగి పిల్లాడు బయటకు వేళ్ళాడుతున్నాడు.బబ్లూ భయంతో అరస్తున్నాడు అమ్మా అని.ప్లాట్ఫాం మీద జనమంతా ఒక్కక్షణం శిలలైపోయారు ఆ పిల్లాడిని చూసి.ముందుగా రైలు దిగిన సత్తయ్య నడుచుకుంటూ వెళుతున్నాడు రైలు పక్కగా.తన పక్కనే వేళ్ళాడుతూ వెళుతున్న బాబుని చూడగానే పరుగందుకున్నాడు.రైలు వేగాన్ని అందుకుని బ్యాగుని లాగి పిల్లాడిని పట్టుకునివెనకకి తిరిగేసరికి అదుపుతప్పి పడబోతున్నవాడు కాస్త బాబుకి ఏమీ కాకూడదని పక్కకి తిరగడంతో బరువంతా చేతిపై పడి కలుక్కుమంది.
ఒక్కక్షణం ఆలస్యమయితే ఇద్దరూ ఫ్లాట్ ఫాం దాటిపోయి కిందపడిపోయేవారు.
అదృష్టవంతులంటూ జనమంతా బాబుని సత్తయ్య ని పైకిలేపారు పరుగెత్తుకొచ్చిన మణి బాబుని పట్టుకుని గుండెలకు హత్తుకుంది.భయంతో బిగుసుకుపోయిన బబ్లూ తల్లినిచూడగానే చేతులతో గట్టిగా పట్టేసుకున్నాడు. అందరూ సత్తయ్యను పొగుడుతుంటే సుందరం భార్య కృతజ్ఞతగా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది. సత్తయ్య సిగ్గు పడిపోతూ "అదేందమ్మా అట్టా దండం పెడతాండారు.ఎవరిబిడ్డయితేంది పసిబిడ్డ జాగ్రత్త" అని చెబుతున్న సత్తయ్య కాళ్ళపై పడ్డాడు సుందరం. హడలిపోయిన సత్తయ్య "బాబుగారు ఏందిది ఏం చేత్తన్నారు. లేవండి.నాలాంటోడి కాళ్ళమీద మీలాంటి గొప్పోలు పడుడేంది.లెయ్యుర్రి "అంటున్న సత్తయ్య కాళ్ళను పశ్చాత్తాపం అనే కన్నీళ్ళతో కడుగుతున్నాడు సుందరం. బలవంతంగా లేపిన సత్తయ్యను చూస్తుంటే ఒంటికి పట్టిన మురికికాదు మనసుకి పట్టిన మకిలి వదిలించుకోని తనే గబ్బుమనిషినని అర్థమయ్యి సిగ్గు పడ్డాడు సుందరం.