చేయూత - బొందల నాగేశ్వరరావు

cheyoota

ఇంటర్మీడియెట్లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సంపాదించుకున్న తరణ్ చక్రవర్తి ఇంటి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమై టౌనులో వున్న ఓ సూపర్ మార్కెట్టులో సేల్సుమేన్ వుద్యోగం చేస్తున్నాడు.జీతం పదివేలు.ఆ జీతంతో తల్లిని,తొమ్మిదవ తరగతి చదువుతున్న చెల్లిని కాపాడవలసిన బాధ్యత తనమీద పడింది.అందుకే తను కాలేజీ చదువులకు దూరమైయ్యాడు. రోజూ పని ముగించుకొని రాత్రి పది గంటల సమయాన ఇంటికి వెళ్ళే తను అన్నం తిని పడుకొని మళ్ళీ మామూలుగా వుదయాన పనులన్నీ ముగించుకొని తొమ్మిది గంటలకు పనికి వెళ్ళడం అలవాటు చేసుకొన్నాడు.తనకు ఎలాంటి ఇతరత్రయమైన ఆలోచనలులేవు.తనకున్న సమస్యల్లా ఒక్కటే.తల్లిని,చెల్లిని బాగా చూసుకోవాలి.అందువల్ల తనతో ఇంటరు వరకు చదువుకున్న మిత్రులను సైతం మరచిపోయాడు.మరీ ముఖ్యంగా తనకు ప్రాణమిత్రుడైన సందీపును కూడా మరచిపోయాడనటంలో అతిశయోక్తి కాదు.

తరణ్ స్నేహితుడు సందీప్ తండ్రి ఓ బ్యాంకులో మేనేజరు.తల్లి హౌస్ వైఫ్ .ఉదార స్వభావంతో మంచి మనసులున్న వాళ్ళు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ వెనుకాడరు. ఓ రోజు సందీపుకు స్నేహితుడు తరణ్ గుర్తుకు రాగా ఇంకో స్నేహితుడి ద్వారా వివరాలను తెలుసుకున్నాడు. పాపం!ఇంటరులో జిల్లా ఫస్టు వచ్చిన తరణ్ ఆర్థిక ఇబ్బందులవల్ల పై చదువులు చదవలేక కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఓ సూపర్ మార్కెట్టులో సేల్సుమేన్ వుద్యోగంలో చేరాడని విని బాధపడ్డాడు . విషయాన్ని తన తండ్రితో చెప్పి స్నేహితుడికి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా తనతోపాటు ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పించాలని కోరాడు.తండ్రి హామీ ఇస్తూనే టౌనుకు పదికిలోమీటర్ల దూరంలో వున్న స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు సందీప్ . స్నేహితుడి తల్లితో అన్నీ విషయాలు మాట్లాడి మంచి నిర్ణయం తీసుకొని తరణ్ పని చేస్తున్న సూపర్ మార్కెట్టుకు బయలుదేరాడు.బైకును స్టాండులో పెట్టి లోపలికి నడిచాడు.వున్నట్టుండి సందీప్ను చూసిన తరణ్ షాక్కు గురైయ్యాడు.
"ఏంట్రా ఆల్ ఆఫ్ షడ్డన్గా వచ్చావు.ఏంటీ సంగతి?"ఆశ్చర్యంతో అడిగాడు.

"మరేంచేయనూ!మా వద్దకు తమరు రారుగా!అయినా రెండు నెల్లనుంచి కనీసం ఫోనైనా చేయలేదేమిట్రా?"స్నేహితుణ్ణి ప్రశ్నించాడు సందీప్ .
"నువ్వు కాలేజీ అడ్మిషననీ,క్లాసులని అదో క్రొత్త ప్రపంచంలో రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరిస్తుంటావుకదా!నిన్ను డిస్ట్రబ్ చేయటం ఎందుకానీ...""నిజమే! అయినా మంచి స్నేహమంటే స్కూలు వరకే కాదురా!అది జీవితాంతం కొనసాగాలి.ఇంటికి వెళ్ళాను. అమ్మ నువ్వు ఇక్కడ పని చేస్తున్నట్టు చెప్పింది.ఒరేయ్ తరణ్ !నువ్వు ఇంటర్లో మన జిల్లా ఫస్టు.ఇంతటితో చదువును ఆపుకొంటావా!డిగ్రీలో చేరవా?"
"ఎలా కుదురుతుందిరా?మా ఇంటి పరిస్థితిని చూశావుగా!అమ్మకు కూడా ఆరోగ్యం బాగోలేక పని మానేసింది.ఇక నేను తప్పనిసరిగా చదువును ప్రక్కనబెట్టి ఈ పనిలో చేరాను"బాధతో అన్నాడు.

"నో...నీ నిర్ణయం తప్పు.నువ్వు వెంటనే కాలేజీలో చేరాలి.నాతో ఇంజినీరింగ్ చదవాలి.నేను నాన్నతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశానురా!"
"ఎలారా?మాకు ఇల్లు గడవాలి.అందుకు నేను వుద్యోగం చెయ్యాలి.నేను కాలేజీకొస్తే నా సంపాదన పోతుందే!""పోదురా!అందుకు అన్ని ఏర్పాట్లు చేశాను.చక్కగా సంపాదించుకుంటూ,అమ్మా చెల్లిని కాపాడుకుంటూ నువ్వు చదవొచ్చు.నాన్నగారు తన ఫ్రెండు కంపెనిలో నీకు బి.పి.వో.లాంటి అంటే రాత్రివేళల్లో ఎనిమిది నుంచి రెండు గంటల వరకు చేసుకునే వెసులుబాటుతో పని ఏర్పాట్లు చేశాడు.జీతం పన్నెండు వేలు.రేపు ఉదయం ఇంటికి రా!నాన్నే నిన్ను మా కాలేజీలో చేర్పిస్తాడు. ఉద్యోగానికి ఆర్డర్లు కూడా ఇప్పిస్తాడు.ఓకే!"

"అమ్మతో ఓ మాట చెప్పాలిగా?" "అవసరంలేదు.ఆమెతో నేను మాట్లాడాను,నిన్ను చదివించటానికి ఆమెకు డబ్బే ఇబ్బందని చెప్పింది.అందుకే చదువుకూ,బట్టలకు కావలసిన డబ్బు నాన్నగారు భరించేలా చేశాను.నీకొచ్చె సంపాదనతో అమ్మా చెల్లెలిని పోషించుకో.ఒరేయ్ తరణ్ !నువ్వు చదవాలిరా!మంచి స్టేటస్ తో గొప్పగా బ్రతకాలిరా!నీ తెలివి,జ్ఞానం ఇలా సేల్సుమేనుతో వృధా కాకూడదు.నీ జీవితం ఇంకొకరికి ఆదర్శంగా,స్ఫూర్తిదాయకంగా వుండాలి.ప్లీజ్ !"చేతులు పట్టుకున్నాడు సందీప్ .

స్నేహితుని మాటలకు అదోలా అయిన తరణ్ 'అలాగే'నన్నట్టు తలూపాడు.

©©©©©

సందీప్ నాన్నగారి ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ కాలేజీలో కాలు మోపాడు తరణ్ . స్నేహితులిద్దరూ ఒకే క్లాసు కావటంతో హాయిగా రోజులు గడిచిపోతున్నాయ్ .రాత్రిపూట వుద్యోగం కనుక అది చేసుకొంటూ వచ్చే జీతంతో ఇంటిని నడుపుతూ చెల్లెలికీ ఏ కొరత రాకుండ చదివిస్తున్నాడు తరణ్ .తల్లికూడా పిల్లలకు వంట చేసి పెట్టుకొంటూ తన ఆరోగ్యాన్ని చూసుకొంటూ చింతలేని సంసారాన్ని సాగిస్తోంది.
అనుకొంటుండగానే నాలుగేళ్ళు చకచక దొర్లిపోయాయి. స్నేహితులిద్దరూ ఇంజినీర్లయ్యారు.అదృష్టం కొద్ది ఓ సాప్టువేర్ కంపెనీలో తరణ్కు యాభై వేల రూపాయల జీతంతో వుద్యోగం రాగా వెళ్ళి జాయినయ్యాడు. సందీప్ వాళ్ళ నాన్నగారి ప్రోద్బలంతో ఎం.ఎస్ .చదివే నిమిత్తం అమెరికా వెళ్ళిపోయాడు. ఆరునెల్ల వ్యవధిలో ఆర్థికంగా పుంజుకున్న తరణ్ తను వుంటున్న ఇల్లు ఖాళీ చేసి టౌనులో అన్ని వసతులతో వుండే ఓ గేటెడ్ అపార్టుమెంటుకు వెళ్ళిపోయాడు.వాయిదాల పధ్ధతిలో ఓ బైకును కొనుక్కున్నాడు. ప్రాంతాన్నిబట్టి స్థాయికి తగ్గట్టు లైఫ్ స్టయిల్ కూడా మార్చుకున్నాడు.అలాగే తను అంతగా ఎదిగినందుకు కారకుడు స్నేహితుడు సందీపని నిత్యం మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొంటూ వుంటాడు.వారంలో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు.ఆలాంటి సమయాల్లో స్నేహితుల మధ్య భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి.

తరణ్ బి.ఎస్ .సి.,పూర్తి చేసిన చెల్లెలికి మంచి సంబంధాన్ని చూశాడు.ఆ సంగతి సందీప్ తో చెప్పుకొన్నాడు. ముహూర్తాలు పెట్టుకున్నాడు.పెళ్ళికి పది రోజులకు ముందు రమ్మని సందీపుకు ఫోన్ చేసి చెప్పాడు.కాని సందీప్ పెళ్ళికి రాలేడని చెప్పి ఆమె తనకూ చెల్లెలులాంటిది కనుక ఎవరూ వూహించనంతగా గిప్టు పంపుతూ ఆశీర్వచనాలు పలికాడు అమెరికానుంచే! పెళ్ళయిన వారానికి చెల్లెలిని అత్తారింటికి పంపాడు తరణ్ .ఇప్పుడు ఇంట్లో అమ్మ,తనే వుంటున్నారు.రోజులు తనవేనన్నట్టు ఎలాంటి వడిదుడుకులు లేకుండా సాఫిగా గడిచిపోతున్నాయి. ఓ రోజు మధ్యాహ్నాం తరణ్ పనిమీద బయటికెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నాడు.దారిలో గోనెసంచి భుజానుంచుకొని చెత్త కాగితాలను ఏరుకొంటూ దాదాపు పదిహేనేళ్ళ వయస్సుగల ఓ కుర్రాడు తన కంటబడ్డాడు.బైకునాపి దగ్గరగా వెళ్ళి కుర్రాడి వాలకాన్ని గమనించాడు.వాడు చూడ్డానికి బాగున్నా మాసిన బట్టలతో,తైల సంస్కారం లేని జుట్టుతో వాడిపై జాలిని తెప్పించే విధంగా వున్నాడు.
"ఏంటీ!చదువుకునే వయస్సులో చెత్త కాగితాలను ఏరుకొంటున్నావ్ !చదువుకో లేదా?"ప్రశ్నించాడు తరణ్ .

"మొన్నే టెన్తు అయిపోయిందండి.ఆర్థిక ఇబ్బందులవల్ల ఫర్దర్గా చదివించలేనని,ఏదేని పని చూసుకోమని మా నాన్నగారు చెప్పారు.పని దొరకలేదు.ఈ పని చేస్తున్నాను"తరణ్ కు భయపడుతూ చెప్పాడు. "ఇంతకు మీ నాన్న ఏం చేస్తుంటాడు?" "కూలి పనులకు వెళతారు.పని లేకుంటే ఇంట్లో వుంటారు" "మీ అమ్మ?" "అమ్మ సంవత్సరం క్రితం చనిపోయిందండి"

"పోనీ....మీ ఇల్లెక్కడ?" "ఈ టౌనుకి పది కిలోమీటర్ల దూరంలో వున్న రామాపురం.అక్కడ చెరువు కట్ట క్రింద గుడిశెలు వున్నై.వాటిలో మాదొకటి"అన్నాడు కుర్రాడు భుజంమ్మీది సంచిని క్రింద పెడుతూ.షాకైయ్యాడు తరణ్ . రామాపురం తన సొంతూరు.తను అక్కడే పుట్టి పెరిగి ఇంటరు వరకూ చదువుకున్నాడు.తరువాత తనకు మంచి నేస్తమైన సందీప్ నాన్నగారి సహాయంతో ఇంజినీరింగ్ చదివి వుద్యోగంలో చేరి ఇవాళ ఇంతటి వాడయ్యాడు.టౌనులో గొప్పగా బ్రతుకుతున్నాడు.ఇప్పుడు తనలాగే తన వూరికి చెందిన ఆ కుర్రాడికి చదువుకునే ఆసక్తి వున్నా చదువుకు పంపించలేని తండ్రి వాడికున్నాడు.అందువల్లే ఆ పిల్లాడు తప్పదన్నట్టు తనలాగే పొట్టకూటికి ఈ చెత్త కాగితాలను ఏరుకొంటున్నాడు.

రెండు నిముషాలు ఆలోచించాడు తరణ్ . తన చదువుకు, ఎదుగుదలకు స్నేహితుడు సందీప్ ,వాళ్ల నాన్న సహాయపడ్డట్టు తను ఆ కుర్రాడికి ఎందుకు సహాయ పడకూడదనుకున్నాడు.అతనికి చేయూతనివ్వగలిగితే తన జీవితానికి వెలుగు ప్రసాదించిన వాడౌతాడనుకున్నాడు.
వెంటనే "చదవాలని ఆసక్తి వున్న నిన్ను చదివిస్తే చదువుకుంటావా?"అని అడిగాడు తరణ్ .అప్పుడు కుర్రాడి ముఖం వెయ్యి దీప కాంతులతో వెలిగిపోయింది.

"తప్పకుండా సార్ ! మరి మా నాన్నను ఎవరు చూసుకొంటారు?"ఆత్రుతతో అడిగాడు.

"మీ నాన్నకేం? కూలి పనికి వెళుతున్నాడుగా!తన బ్రతుకు తను బ్రతగ్గలడు.నీ భవిష్యత్తే నీకు ముఖ్యం.రేపొచ్చి మీ నాన్నతో మాట్లాడుతాను.ఇప్పుడు ఇంటికి వెళ్ళు."అంటూ వంద రూపాయల నోటును కుర్రాడి చేతికిచ్చి విషయాన్ని స్నేహితుడు సందీప్ కు ఫోన్లో చెప్పాడు.

మరుసటి రోజు కుర్రాడి తండ్రితో మాట్లాడి ఆ రోజే వాడ్ని ఇంటర్ ఫస్టీయర్లో చేర్పించాడు తరణ్ .అది పూర్తయ్యేవరకు తనదే బాధ్యతను కున్నాడు.పైగా అమ్మకు కూడా వాడు తోడుంటాడనుకొని అతణ్ణి బట్టలు సర్దుకొని వెంటనే అపార్టుమెంటుకు రమ్మని చెప్పాడు.

©©©©©

నెల తరువాత ...సందీప్ చదువు పూర్తి చేసుకొని మాతృభూమికి తిరిగి వస్తున్నట్టు చెప్పి ఎయిర్ పోర్టుకొచ్చి రిసీవ్ చేసుకోమని తరణ్ కు ఫోన్ చేశాడు.అంతే ఎగిరి గంతేశాడు తరణ్. మరుసటి రోజు తనతో వుంచుకొని చదివిస్తున్న కుర్రాడ్ని వెంటబెట్టుకొని కాల్ టాక్సీలో విమానాశ్రయానికి వెళ్ళాడు.విసిటర్సులాంజ్ లో నిలబడి స్నేహితుడు సందీప్ వస్తున్న ప్లైట్ కోసం ఎదురు చూస్తూ వున్నాడు.అంతలో సందీప్ తల్లిదండ్రులు కూడా వచ్చి అటు నిలబడ్డారు.వాళ్లను గమనించిన తరణ్ పరిగెత్తినట్టు వెళ్ళి సందీప్ తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించాడు.కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాక ప్లైట్ సైట్ అయినట్టు ఎనౌన్సుమెంటు చేశారు.ప్లైట్ లోంచి అందరూ దిగి ఫార్మాలిటీస్ ముగించుకొని బయటికి వస్తున్నారు.వాళ్ళ తోపాటు ముఖంలో చిరునవ్వులు చిందిస్తూటు ట్రాలీని తోసుకుంటూ సందీప్ కూడా దిగి దగ్గరకొచ్చాడు.ట్రాలీని ప్రక్కన పెట్టి తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి హగ్ చేసుకున్నాడు సందీప్ .తరణ్ కూడా తనతో తీసుకువచ్చిన బొకేను సందీప్ చేతికిచ్చి హగ్ చేసుకున్నాడు. అంతకు ముందే తరణ్ పురమాయింపుతో ట్రాలీని పట్టుకొని నెట్టుకు వెళ్ళటానికి తయారుగా వున్న కుర్రాడి వేపు చూసి'ఎవరతను?నువ్వు ఫోన్లో ప్రస్తావిస్తూ వుంటావే అతనేనా?'అని కళ్ళతో అడిగాడు సందీప్ .

"అవునురా!వాడి భవిష్యత్తుకు ఇకపై నీ వంతు సహాయ సహకారాలు నువ్వూ అందించాలి.పద."అన్నాడు.

"స్నెహితుడిగా నీకు భవిష్యత్తు కల్పించి నీ భారాన్ని దించుకున్నాం.మళ్ళీ మరో భారాన్ని మోపుతున్నావన్న మాట.ఓకే!అలాగే కానీయ్!"అంటూ నవ్వాడు సందీప్ .ఆ నవ్వుతో నవ్వు కలిపారు అందరూ కారు వద్దకు నడుస్తూ.

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు