నన్ను క్షమించవూ - అయ్యగారి శ్రీనివాస్

nannu kshaminchavoo

"ప్రాణంలో ప్రాణమైన వారి జ్ఞాపకాలు ఏనాటికీ చెదిరిపోవు. అవి ఎప్పుడూ మనసుని తాకుతూనే ఉంటాయి.., స్పృశిస్తూనే ఉంటాయి..కదిలిస్తూనే ఉంటాయి..పిల్లతెమ్మెరలు తెచ్చే పరిమళాల గుబాళింపు లాగా.."

ప్రియమైన రాధా,

ఎంతో కాలం నుంచి నీతో మనసారా నీ ముఖం లొకి చూస్తూ మాట్లాడాలని నాలొ బయటకి రావాలి రావాలి అని దూసుకొస్తున్న భావాల్ని నీతో పంచుకోవాలని అనుకుంటూ వచ్చాను. మన పెళ్ళై దాదాపు 35 వసంతాలు పూర్తి అవుతున్నాయి. నాకు తెలిసి మన పెళ్లి అయిన మొదటి మూడు నాలుగు సంవత్సరాలు ఒకరి భావాలు ఒకళ్ళు పంచుకుంటూ ఆనందం జీవితం అంటే ఇదే అని బ్రతికాము. మన ఆనందానికి సాక్షిగా నేనున్నాను అంటూ మన పాప పుట్టాక తనని చూసుకుంటూ నువ్వు, జీవితం లో ఎదగాలంటే ఉద్యోగం లో పై మెట్లు ఎక్కాలనే ఆశ తో నేను, ఎవరికి వాళ్ళం జీవితం లో బిజీ అయిపోయాము. ఎన్నోసార్లు, నువ్వు చెప్తూవుండేదానివి "ఏమండి మనకోసం బతుకుదామండీ, మన మధ్య ఎదో తెలియని అగాధం ఏర్పడుతోంది, మనసు పంచుకుందామంటే ఒక్క రోజు మీరు అందుబాటులో లొ ఉండడం లేదు అని". ఆలా చెప్పి చెప్పి నువ్వే సైలెంట్ అయిపోయావు.

మనం ఏంచేస్తున్నాం, ఎక్క్కడికి వెడుతున్నాం అనే ఆలోచన కూడా లేకుండా ఒకటే పరుగు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మూడున్నర దశాబ్దాల్లో ఒకరికి గురించి ఇంకొకళ్ళు ఆలోచించే టైం, ఓపిక రెండూ లేక ఎవరి దారి లో వారి పయనం. చూస్తూ చూస్తూ మన పాప పెద్దదవడం దానికి పెళ్ళై దాని ఇంటికి అది వెళ్లిపోవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు అది ప్రపంచంలో ఇంకో మూల తన కొడుకు తో అవస్థలు పడుతోంది. దాని చిన్నతనంలో దానితో అన్ని మర్చిపోయి ఆడుకున్న సందర్భాలు, మనం ముగ్గురం కలసి సరదాగా ఎక్కడికైనా వెళ్లడం కాని జరగలేదు. ఎప్పుడు ఎం చేద్దామన్నా, ఎక్కకి అయినా వెడదామన్నా, అస్తమాను నాకు ఆఫీస్, ఆఫీస్. నేను ఉద్యోగం లో వున్నన్ని రోజులు ఈ ఆఫీస్ అంతా నా మూలం గానే పనిచేస్తోంది, నేను లేకపోతే ఆఫీస్ లేదన్న భ్రమ లోనే గడిపేశాను. ఈ రోజు రిటైర్ అయ్యాక తెలుస్తోంది నిజం గా నేను ఎంత పెద్ద మూర్ఖుడ్నో అని.

అప్పటికి ఆ చిన్ని కోరికలు ఇప్పుడు తీర్చుకుందాం అనుకుని, "అమ్మలూ నిన్ను చూసి చాలా రోజులైంది ఒక సారి రారా అని మా అమ్మాయి తో అంటే, పో డాడీ, నేను మీ దగ్గర ఉండేటప్పుడు ఒక్క రోజు సరదాగా గడుపుదాం డాడీ, ఆఫీస్ కి సెలవు పెట్టు అని అంటే పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు నా చంటాడి తో ఎలా కుదురుతుంది చెప్పు కావాలంటే మీరే నా దగ్గరికి రండి" అంటుంది. నాకు అలవాటైపోయిన పరిసరాలో ఏంటో ఈమధ్య వున్న ఇంటి నుంచీ బయటకు వెళ్ళబుద్ధి వెయ్యడం లేదు నాకు. పిల్లకి పెళ్ళై దాని ఫామిలీ దానికి వచ్చాక కూడా నీ ఆలోచనలు 24 గంటలూ దాని సంసారం చుట్టూనే. ఎంతో అన్యోన్యం, అనురాగం, ఆప్యాయత వుండే మన ఇద్దరి మధ్య ఎదో తెలియని అగాధం. వెతికి చూస్తే ఏమి కనపడని మనస్పర్థలు. దైనందిక జీవితం లోని ఆటుపోట్లతో, అలసిపోయి నిద్రిస్తున్న అమాయకమైన నీ ముఖం లొకి చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, ఇంకెన్నో అనుభూతులు. జీవితం మరీ ఇంత చిన్నదని, ఇన్నేళ్లు గా నటిస్తూ నిద్రపోతున్న నాకు మెలకువ తెచ్చుకుని మూసుకున్న కళ్ళు తెరిచి చూస్తె గాని తెలియలేదు. కాని ఏంటి ఉపయోగం. అప్పటికే అనుభవించాల్సిన జీవితం నాకు తెలియకుండానే కనుమరుగైపోయింది. రేపు ఎలా అనే ఆలోచన కూడా రానీకుండా ఉంటున్న సింగల్ రూమ్ పెద్ద పాలస్ లాగా ఫీల్ అయ్యి, ఇంట్లో వున్న డొక్కు మంచమే ఒక కింగ్ సైజు బెడ్ లా భావించి, నేను రోజు ఆఫీస్ కి వెళ్లే సైకిల్ ఒక కార్ లాగా హ్యాపీగా ఫీల్ అవుతూ సంతృప్తి గా ఉండే ఆ రోజులతో చూస్తె, ఇప్పుడు లంకంత ఇల్లు గేటెడ్ కమ్యూనిటీ లొ, ఇద్దరికీ చెరో కార్, ఇంట్లో అన్ని కంఫర్ట్స్ వున్నా ఎదో తెలియని వెలితి మనస్సులో. ఎదో అలిసిపోయిన శరీరానికి కొంచెం రెస్ట్ ఉంటే చాలని, కనీసం బెడ్ రూమ్ లొకి వెళ్లే ఓపిక కూడా లేక, ఆలా సోఫా లొ వాలిపోయిన నిన్ను చూస్తుంటే గుండెల్లో ఎదో తెలియని ఆవేదన. ఎంతో అందం గా వుండే నీ ముఖం లొ ఇప్పుడిప్పుడే వస్తున్న వార్ధక్యపు నీడలు. నల్లగా, ఒత్తుగా వుండే, నీ జుట్టు లొ, నన్ను కూడా చూడండి అంటూ వెక్కిరిస్తూ అడుగుతున్నట్లున్న అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు నిజాన్ని గుర్తుకు తెస్తూ. దీనికి తోడు ఒక జీవితానికి సరిపడా సంసార బరువు బాధ్యతలు మోసిన, నీ మోకాళ్లు, ఇంక ఈ బరువు నేను మోయలేనంటూ జాయింట్ పెయిన్స్ రూపంలో వార్నింగ్ లు ఇస్తున్నాయి. ఈ వయసు లో ఇవి కామన్ అయినా, నేను అమితం గా ప్రేమించే వ్యక్తి కి ముసలితనం రాకూడదనే స్వార్ధపు ఆలోచనో, నిజాన్ని ఒప్పుకోలేని ఒక విధమైన పిరికి తనమో, నా మనస్సు ఈ మార్పులకి అంగీకరించడం లేదు రాధా.

అలసిపోయిన నీకు నిజమైన స్వాంతన కావాలి . జీవితం లోని ఈ ఆఖరి ఘట్టం లోనైనా నువ్వు ఆనందం గా గడపాలి. మన పెళ్ళైన కొత్తలో మనం గడిపినట్లు, చక్కగా ఏ యండమూరి నవలో, మల్లాది రాసిన అందమైన జీవితం పుస్తకమో, చదివి, దాని గురించి చక్కగా ఇద్దరి అభిప్రాయాలూ తెలుసుకుంటూ మన గార్డెన్స్ లొ నడుద్దామని వుంది. నిజానికి అందమైన జీవితం పుస్తకం ఎంత చక్కగా రాశాడో మల్లాది.ఆ పుస్తకం లోని ప్రతి పేజీ జీవితాన్ని ఎంత ఆనందం గా గడపచ్చొ, మనం అలా అలా బతికేస్తున్న బతుకులోనే ఎలా జీవించొచ్చు అనే కాన్సెప్ట్ మీద ఎంత అద్భుతం గా రాశాడో. ఇప్పుడు నువ్వు నాకు నిజం గా కావాలనిపిస్తోంది రాధా. జీవితం లొ ఇంక నాకు వేరే కోరికలు లేవు. ఈ మధ్య ఆ భగవంతుడ్ని కూడా ఒక్కటే కోరుకుంటున్నాను. నువ్వు బాగా ఆరోగ్యం గా ఉండాలని. అంతే. అసలు జీవితం లొ రిటైర్మెంట్ కావలసింది మీ లాంటి వాళ్ళకే. ఇల్లు, మొగుడు, సంసారం అంటూ ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచన రానీకుండా జీవితం మొత్తం గడిపేసావు. అందుకే రాధా, ఈరోజు నుంచి వంటింటి బాధ్యతలు దగ్గరినించి నువ్వు చేసే ప్రతి పని నేను హ్యాండోవర్ చేసుకుంటా. నీకు ఏమి కావాలో దగ్గరుండి నేను చూస్కుంటా.

అమాయకం గా నిద్ర పోతున్న నీ మొఖం చూస్తుంటే గుళ్లోని దేవతే నా ఎదురుగా కూర్చున్నట్టు వుంది నాకు. నువ్వు నా ఎదురుగుండా కూర్చో అది చాలు. మన సంసారం కోసం, నా కోసం అన్ని వదులుకుని నువ్వు చేసిన ఈ వెట్టిచాకిరి కి ఈ విధంగా గా అయినా బదులు తీర్చుకోవాలనుకుంటున్నా. నాకు నువ్వు కావాలి రాధా, నువ్వు కావాలి, ఇంక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వేళ్ళను. ఇన్నాళ్లు నా మనస్సు లోని భావాలు నీతో పంచుకుందామని చాలా సార్లు ప్రయత్నించాను. కాని, ఈ సుదీర్ఘ జీవనయానం లొ నా నుంచీ మానసికంగా గా ఏంతో దూరం అయిపోయిన నీతో మాట్లాడడానికి ధైర్యం కుదరలేదు. అందుకే ఈ ఉత్తరం ద్వారా నా మనసులో భావాలు పంచుకుం టున్నాను. గడిచి,గతమయి పోయిన జీవితం లోకి ఒక్కసారి తొంగిచూస్తే అసలు తప్పు, మన మనస్సు కన్నా వేగం గా పరిగెత్తిన కాలానిదో, లేక ఆఫీస్ నా జీవితం అనుకుని, అందమైన ఈ జీవితాన్ని వేస్ట్ చేసుకున్న నా మూర్ఖత్వానిదో తెలియదు. తెలుసుకుని సరిదిద్దుకునే సమయమూ అయిపొయింది. అందుకే మిగిలివున్న ఈ కొద్దిపాటి జీవితాన్ని నీతోనే గడువుతాను. మనం మనం గా బతుకుదాం.

నువ్వు ఏమండీ ఏమండీ అంటూ నా వెనకాల తిరిగినప్పుడు నీ వాల్యూ నాకు తెలియలేదు. కనీసం నువ్వు ఎలా వున్నావు నువ్వు కోరుకుంటున్నది ఏమిటి అనే కనీస ప్రయత్నం కూడా ఈ రోజు దాకా చేయలేకపోయాను. ఇప్పుడు నేను నీ వెనకాల తిరుగుతుంటే అలవాటు పడిన నీ లోకం లోంచి నువ్వు బయటకు రాలేక పోతున్నావు.

రాధా..కావాలి నాకు నువ్వు. ప్రతి క్షణం, నాలోని ప్రతి అణువు, నీకు కృతజ్ఞతలుగా సమర్పించాలని, నీ దగ్గరే ఉండాలని వుంది.. తెలిసో, తెలియకో, నేను చేసిన తప్పు విలువ ఒక జీవితం అని జీవితం అయిపోయాక తెలిసింది రాధా..

నన్ను క్షమించు అని అడిగే అర్హత నాకు ఉందొ లేదో తెలియదు... అయినా ఆర్తి గా అడుగుతున్నా, నన్ను క్షమించవూ. కళ్ల లోంచి వుబికి వస్తున్న కన్నీళ్ల మధ్య నేను రాసే అక్షరాలు కూడా సరిగా కనపడ్డం లేదు.

మరి వుంటాను
ప్రేమతో
నీ
మధు

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు