విశ్వంభరకు నిద్రపట్టడం లేదు. కనులు మూసినా తెరిచినా ఆమె రూపమే కనిపిస్తున్నది. ఆమె అనుభవించిన నరకం తలచుకుంటే ఒళ్ళు జలదరిస్తున్నది. మంచం మీద ఉండలేక పోయాడు. వెంటనే దుస్తులు వేసుకుని స్టేషన్ కు బయలుదేరాడు.
"ఏంచేస్తున్నారురా వాళ్ళు" అడిగాడు కానిస్టేబుల్ పరాంకుశాన్ని.
"ఇప్పుడే మటన్ బిర్యాని తిని నిద్రపోతున్నారు సర్" హుషారుగా చెప్పాడు పరాంకుశం.
అంతే...అతని గూబ పగిలింది.
"కాలే కాలే గంజిని కడుపులో పొయ్యాల్సిన వాళ్ళకు బిర్యాని పెట్టడానికి ఎలా చేతులు వచ్చాయిరా నీకు" ముఖం కందగడ్డలా మారింది విశ్వంభరకు.
"మంత్రిగారి ఆఫీసు నుంచి ఫోను వచ్చింది డి.యస్.పి సర్.! అందుకని..." నీళ్ళు నమిలాడు పరాంకుశం.
మాట్లాడలేక పోయాడు విశ్వంభర. ఇంతలో ఫోను మ్రోగింది.
"హలో"
"విశ్వంభరా.. నేను డి.జి.పి నయనార్ ను మాట్లాడుతున్నాను. కేసులో ఏమైనా బలమైన సాక్ష్యాలు దొరికాయా? ఇది మామూలు కేసు కాదు. మంత్రి గారి కొడుకు ఉన్నాడు ఇందులో. కొంచెం త్వరగా చూడు. నీకు ఎలాటి సపోర్టు కావాలో చెప్పు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఎక్కడో ఒక చోట మనం కఠినమైన నిర్ణయం తీసుకోకుంటే ఈ కిరాతకాలు ఆగవు. కాకపోతే మన చేతికి మట్టి అంటకుండా చేయాలి. నీ నిజాయితీ నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. తొందర పడి ఏమీ చేయకు. నాకు మంత్రి గారి నుంచి ఫోన్లు వస్తున్నాయి. అది మనకు మామూలే అనుకో. ఏదైనా చాకచక్యంగా చెయ్యి. రేపు మధ్యాహ్నానికల్లా ఏదో ఒకటి జరగాలి. అటువైపు ప్రజలలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జాగ్రత్త" అంటూ ఫోను పెట్టేశాడు నయనార్.
అతని మాటలు పూర్తిగా అర్థం కాలేదు. ఒకవైపు న్యాయం జరగాలి అంటున్నాడు. మరొకవైపు మంత్రి కొడుకు అని గుర్తుచేస్తున్నాడు. వద్దు... ఇందులో మరో ఆలోచనకు తావులేదు. చట్టానికి లోబడే ఏదైనా చేయాలి అంతే. మనసులో ఆలోచనలు పక్కన బెట్టి సాక్ష్యాలు రాబట్టే దిశగా మనసును మళ్ళించాడు విశ్వంభర.
'తప్పదు. వారితో మంచిగా మాట్లాడి విషయం రాబట్టాలి. అవసరమైతే మరలా సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి రావాలి' అనుకుంటూ సెల్ వైపు నడిచాడు.
"హలో. ఏంటి ప్రశాంతంగా నిద్ర పోతున్నారు" అంటూ సెల్ లోని ముగ్గురినీ లేపాడు విశ్వంభర.
వళ్ళు విరుచుకుంటూ లేచారు ముగ్గురూ.
" ఏంచేద్దాం సార్. మొన్న పడ్డ కష్టానికి విపరీతంగా నిద్రవస్తున్నది. మాకు బెయిల్ మంజూరయిందా. నాకు తెలుసు. మా నాన్నా మజాకా. ఇదిగో డి.యస్.పి నువ్వు ఎంత గింజుకున్నా మమ్మల్ని ఏమీ చేయలేవు. ఇవి మాకు మామూలే. కాకపోతే ఈ పిరికి వెధవలు తొందరపడి దాన్ని చంపేశారు. అందుకే ఇక్కడి దాకా రావలసి వచ్చింది. అయినా మాకేంటి. మా నాన్న, మా లాయరు చాలు. మేమేం చేసినా బయట పడేయడానికి" పగలబడి నవ్వాడు మంత్రి కొడుకు. అందుకున్నారు మిగిలిన ఇద్దరూ.
"భలే కరెక్టుగా చెప్పావు. నాకు నిద్ర పట్టక అసలేం జరిగిందో. ఎలా తనను ట్రాప్ చేసి అనుభవించారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఇందులో మీకు అనుభవం ఎక్కువ అంటున్నావుగా. కొంచెం షేర్ చేసుకోవచ్చుగా" విశ్వంభర మాటల్లో జోష్.
"ఒరేయ్. గురుడికి మూడ్ వచ్చిందిరో" అంటూ వికటంగా నవ్వుతూ జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పారు ముగ్గురూ. కడుపులో దేవినట్లయింది వింటుంటే. తమాయించుకున్నాడు.
"ఓకె. సూపర్. మీ మాటలు వింటుంటే ఒక్కసారి ఆ ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నాను మరలా. వెళ్దామా. ఇదిగో అవకాశం దొరికిందని పారిపోకూడదు సుమా" హెచ్చరించి వారిని ప్రయాణానికి సిద్ధం చేశాడు.
*********************
తెల్లవారింది. దావానంలా ఊరంతా వ్యాపించింది వార్త.
"ముగ్గురు రేపిస్టుల ఎన్ కౌంటర్. తెల్లవారు జామున సంఘటనా స్థలానికి తీసుకెళ్ళిన సమయంలో ముగ్గురూ పోలీసుల నుంచి తప్పించుకోను ప్రయత్నం చేసి, వారిని రాళ్ళతో కొట్టి తుపాకీని లాక్కుని భీభత్సం సృష్టించారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపితే వారు మరణించారని. బాధితురాలికి దేవుడే న్యాయం చేశాడని. మంత్రి కొడుకని కూడ చూడకుండా విధి నిర్వహించినందుకు ప్రజలంతా పోలీసులను అభినందిస్తున్నారని"
ఎటు చూసినా ఆనందాల వెల్లువలే. ఆ ఒక్క నగరమే కాదు. దేశమంతా ఆనందాల హేల. పోలీసుల ధైర్యాన్ని పొగిడే వారే ఎక్కువ. అక్కడక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని వ్యతిరేకత వచ్చింది.
పేపర్ చూస్తున్న నయనార్ మనసు ఒకింత సేదదీరింది. విశ్వంభర రాత్రే విషయమంతా చెప్పాడు. జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు నేరస్థులు చెప్పినపుడు రికార్డు చేశానని. మిగతా సాక్ష్యాలకు సంఘటనా స్థలానికి వారిని తీసుకు వెళుతున్నానని. కాని తప్పని పరిస్థితిలో ఇలా జరిగి ఉండవచ్చు. ఏదయితేనేం 'కాగల కార్యాన్ని గంధర్వులే చేశారని'. మంచే జరిగింది అనుకుని విశ్వంభరను అభినందిద్దామని ఫోను చేశాడు.
"హలో"
"కంగ్రాట్స్"
"విధిలేని పరిస్థితిలో అలా చెయ్యవలసి వచ్చింది సర్. నా భుజాన్ని రాసుకుంటూ బుల్లెట్ వెళ్ళే సరికి తప్పక పరాంకుశం కాల్పులు జరిపాడు. వెంటనే మిగిలిన వారు కూడ భయపడి కాల్పులు జరిపారు. దానితో ఇలా జరిగింది"
విశ్వంభర మాటలలో నిజాయితీ కనిపించింది నయనార్ కు.
" డోంట్ వర్రీ. మన జీవితాల కంటే ఎక్కువ కాదుగా మంత్రి కొడుకు జీవితం. అదంతా నేను చూసుకుంటాను. కాకపోతే నీకు బదిలీ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడే హోం మంత్రి ఫోన్ చేశారు. నిన్ను సస్పెండ్ చేయమని మంత్రి వత్తిడి తెస్తున్నాడట. కానీ ఆయన అందుకు ఒప్పుకో లేదు. మీ చర్యలో ఏ తప్పూ లేదని చెప్పాడట. ఎంతయినా చెట్టంత కొడుకు పోయాడనే బాధ అతనిది. నిదానంగా అర్థం చేసుకుంటాడులే అని చెప్పాడు. అదంతా నేను చూసుకుంటాలే" అని భరోసా ఇచ్చి ఫోను పెట్టేశాడు నయనార్.
మంత్రి గారి ఆవేశం ఒకవైపు, ప్రజల అభినందనలు ఒకవైపు నయనార్ ను ఉక్కిరిబిక్కిరి చేయ సాగాయి.
*********************************
"ఏమండీ నేనొక మాట అడుగుతాను నిజం చెబుతారా"
"అడుగు"
"మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని, కావాలనే ఎన్ కౌంటర్ చేయించారని, ఇది పోలీసుల పన్నాగమని అంటున్నారు. అంతే కాదు రేపిస్టులను ఉరి తీయడమో, కాల్చి చంపడమో సమస్యకు పరిష్కారం కాదంటున్నారు. నిజమేనా?"
"చూడు శ్రావణి ఎవరి అభిప్రాయాలు వారివి. ఒక్కమాట చెప్పు. బాధితురాలు నీ కూతురో, చెల్లెలో అయివుంటే నువ్వు ఏం కోరుకునే దానివి"
"నడివీధిలో నిలబెట్టి ఒళ్ళంతా తూట్లు పడేలా కాల్చి పారేయమనే దాన్ని కానీ న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూసే దాన్ని కాదు"
"చూశావా. సమస్య నీదయే సరికి నీ స్పందన ఎలా ఉన్నదో. ఎవరైనా అంతే. వారి బాధ కానప్పుడు అంతా నీతులే చెబుతారు. ఆ క్షణంలో నాకు వేరే ఆలోచన రాలేదు. తనలో నా కూతురు కనిపించింది. బహుశా ఇది ఆ దేవుడు చూపిన న్యాయమేనేమో. ఇక ఆలోచించింది చాలు పడుకో. రేపే మనం బయలుదేరాలి. నన్ను ట్రాఫిక్ సెక్షన్ కు బదిలీ చేశారు" అని దుప్పటి ముసుగేశాడు విశ్వంభర.
అతని చెవులలో ఆ ఆడపిల్లను అతి నీచంగా మాట్లాడిన ఆ నేరస్థుల మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఇలాటి వాళ్ళు సమాజంలో తిరగ కూడదు. ఇంకా ఉన్నారు. ఏరుతాను. ట్రాఫిక్ డి.యస్.పి అంటే ఏమిటో చూపుతాను. ఆడ పిల్ల మీద చెయ్యి వేయాలంటే వణికి చచ్చేలా చేస్తాను. పోలీసంటే రక్షణ కవచమని ప్రతి మగువ తలచేలా డిపార్టుమెంటును తీర్చి దిద్దుతాను. అలాగే నిద్రలోకి జారుకున్నాడు డి.యస్.పి. విశ్వంభర.
అతని కనుల ముందు లీలగా ఒక దృశ్యం కదలాడింది.
బాధితురాలు నవ్వుతోంది ఆనందంగా.
"ఇది దేవుడు చేసిన న్యాయం కాదంకుల్. మీరే దేవుడై చేసిన న్యాయం. పోలీసులందరూ మీలా ఆలోచించాలి. అప్పుడు మాకు ఇలాటి నరకాలు తప్పుతాయి. మీరిలాగే ఉండాలి. మిగిలిన నా ఆయువు కూడా మీరే పోసుకుని ఆడపిల్లలను కాపాడండి. ఈ స్థితి వరకు రాకుండానే చూడండి అంకుల్" అని చెప్పినట్లు అనిపించింది విశ్వంభరకు.