తెనాలి రామకృష్ణ కవి వీధి వసారాలో నిలబడి పరధ్యానంతో ఆంధోళనగా కనిపిస్తున్నారు. గాయత్రి జపించేటప్పుడు రోజూ మాదిరి కాక ఏకాగ్రత లోపించింది.ఇదంతా గమనిస్తున్న కాత్యాయనికి భర్త ఆంధోళనకి కారణం తెలియడం లేదు.
మధ్యాహ్నం భోజనం అయాక తమలపాకుల తొడిమలు చిదిమి ఈనెలు తీసి సున్నం రాసి వక్కముక్కలు పెట్టి ఆప్యాయంగా ఇస్తుంటే రామకృష్ణ కవి అవి నోట్లో పెట్టుకున్నా మనసు మాత్రం దీర్ఘాలోచనలో ఉంది. భర్తని నిశితంగా గమనిస్తున్న కాత్యాయని ఉండబట్టలేక "మీ ఆందోళనకి కారణమేంట"ని అడిగింది.
"మా రాజ దర్భారులో జరిగే సమస్యలకూ సమాసాలకు ఇంటి వద్దుండే మీ ఆడవాళ్లేం పరిష్కరించ గలరు?"అని తేలిగ్గా మాట్లాడాడు. " అలాగే అనుకోండి. మీ మగవారి కున్నంత తెలివితేటలు మా ఆడవారికి లేకపోవచ్చు.కనీసం సమస్య ఏంటో తెలిస్తే మా పరిదిలో సహాయం చెయ్యగలమో లేదో తెలుస్తుంది.కనక మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు గల కారణం చెప్ప" మని భార్య వత్తిడి చేస్తుంటే రామకృష్ణ కవికి చెప్పక తప్పలేదు. " నిన్నటి రోజున రాయలవారి భువన విజయం సభలో కవితాగోష్టి , సంగీత లహరి పూర్తయిన తర్వాత రాయలవారు ఒక జటిల సమస్యను సంధించారు. ఎవరైన వ్యక్తి నూరు వరహాల్ని ఒకరోజులోనే కడుపుకి ఖర్చు చెయ్యాలి. మరొక రీతిన వాటిని ఖర్చు చెయ్య కూడదట. ఇంకొకరి భాగస్వామ్యం ఉండకూడదు, అని షరతులు పెట్టి అలా సమస్యను పరిష్కరించిన వారిని సభలో ఘనంగా సన్మానిస్తామన్నారు.నూరు వరహాలు చాలా పెద్ద రాశి. అంత డబ్బును ఒక్క రోజులో కడుపుకి తినడమంటే కష్ట సాధ్యమే కదా!" అని వివరిస్తు నిండు సభలో రాయల వారు అకస్మాత్తుగా ఇటువంటి జటిల సమస్య చెప్పగానే అందరూ ఆశ్ఛర్య చకితులయారు.ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
వెనకటికి ఎన్నో కఠినమైన సమస్యల్ని పరిష్కరించిన నావైపు అందరి చూపులు మళ్లాయి. నేను మాత్రం మౌనంగా ఉండిపోయాను. కృష్ణ దేవరాయలవారు సభ ముగిస్తు , ఎవరైన ఈ సమస్య పరిష్కరించ దలిస్తే ఎప్పుడైనా సభా ముఖంగా తెలియచేయాలన్నారు. నాకు పరిష్కార మార్గం తోచక ఆలోచనలో పడ్డాను " అని తన ఆంధోళనకి కారణం భార్యకు వివరించి తెలియచేసాడు రామకృష్ణ కవి. భర్త చెప్పిన నూరు వరహాలు ఒకే వ్యక్తి ఒకేరోజున కడుపుకి ఖర్చు చెయ్యలనగానే కాత్యాయని కొంచంసేపు ఆలోచించి ఏదో స్ఫురించి భర్త చెవిలో పరిష్కార మార్గం చెప్పింది. భార్య చెప్పిన ఆలోచన విని రామకృష్ణ కవి కళ్ళు ప్రకాశించాయి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.భర్త లో వచ్చిన మార్పుకి కాత్యాయని సంతోషించింది.
మర్నాడు కృష్ణదేవరాయల వారి భువన విజయం సభ యధావిధిగా మొదలైంది.మహామంత్రి తిమ్మరుసు, అష్టదిగ్గజ పండితులందరు వారి వారి స్థానాలలో ఆశీనులయారు.
రామకృష్ణ కవి రోజు మాదిరి గాయత్రి జపించి దేవి విభూతిని లలాటం భుజ స్కందాలు ఛాతిపై పూసుకుని ఎర్రని శాలువ భుజ స్కందాలపై కప్పుకుని ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. రాయలవారు యధావిధిగా సభాకార్యక్రమాలు వీక్షిస్తు,
గతంలోని తన సమస్యని పునరుధ్గాటించారు.ఎవరి నుంచైన సమాధానం వస్తుందేమోనని సభవైపు ధృష్టి సారించారు. రామకృష్ణ కవి తన ఆసనం నుంచి లేచి నిలబడి రాయల వారికి నమస్కరించి తన అంగీకారం తెలిపి, తమరు సభలో
కోరిన విధంగా నూరు వరహాల్ని కొన్ని ఘడియల్లో సభలో భుజిస్తాను.నూరు వరహాల్ని ఇప్పించండనగానే రాయల వారు, సభలో ఉన్న పండిత గణం ఆశ్ఛర్యంగా రామకృష్ణ వైపు చూడసాగారు.
రాయలవారి ఆజ్ఞ ప్రకారం తిమ్మరుసు గారు వంద వరహాల్ని చిన్న సంచిలో ఉంచి రామకృష్ణ కవికి అప్పగించారు. సభానంతరం రామకృష్ణ కవి వరహాల మూట తీసుకుని రాయల వారి ఆభరణాలు తయారుచేసే వజ్రాల వ్యాపారి
దగ్గరికెళ్ళి రాయలవారు పంపినట్లుగా చెప్పి వంద వరహాలతో అత్యంత ఖరీదైన రెండు వజ్రాలు కొనుగోలు చేసాడు. వజ్రాలను భద్రంగా, రాణివాసానికి బంగారు నగలు తయారు చేసే మాధవాచారి దగ్గరికెళ్లి రెండు వజ్రాలను నిప్పుల కొలిమిలో
ఉంచి ఎర్రగా కాల్చి భస్మం చెయ్యమన్నాడు.
రాయలవారి ఆస్థాన కవి రామకృష్ణే స్వయంగా వచ్చి ఇచ్చినందున మాధవాచారి మరొకమాట అడగకుండా అత్యంత ఖరీదైన వజ్రాల్ని పాత్రలో ఉంచి కొలిమిలో ఎర్రని నిప్పుల్లో కాల్చి భస్మం చేసి చిన్న వెండి భరిణెలో ఉంచి ఇచ్చాడు.
మరుచటి రోజు రాయలవారి భువనవిజయం సభ ప్రారంభం కాగానే అందరు రామకృష్ణ కవి రాక కోసం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలో రామకృష్ణ చిన్న వెండిభరిణెతో సభా ప్రవేశం చేసి రాయలవారికి సభకు ప్రణామం చేసాడు.
నిన్నటి రోజున రాయలవారి నుంచి నూరు వరహాల రొక్కం మూటతో వెళ్లిన రామకృష్ణ కవి ఉత్త చేతులతో రావడం చూసి అందరు మరింత ఉత్కంఠతకు గురయారు.
రామకృష్ణ కవి రాయల వారి నుద్దేసించి సభా మంటపం మద్య ఒక ఆసనం ఏర్పాటు చేయించి ఒక మోద (యాబది) లేత తమలపాకులు, గుల్ల సున్నం , కాచు , వక్క పలుకులు చిన్న పాత్రతో జలం తెప్పించ వల్సిందిగా కోరాడు.
రామకృష్ణ కవి కోరినట్లుగా అన్ని వస్తువులు హాజరు పరిచారు.సభ మద్య ఆసీనుడై తన వెంట తెచ్చిన వెండిభరిణెలో కొద్దిగా జలం పోసి అందులో ఉన్న భస్మాన్నిచిన్న ముద్దగా చేసి గుల్ల సున్నంతో కలిపాడు.
రెండేసి లేత తమలపాకులు తీసుకుని కొంచం కాచు పట్టించి వజ్రాల భస్మం కలిపిన సున్నం రాసి వక్కపొడి ఉంచి నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. లేత తమలపాకులు కాచు సున్నంతో కలిపి భుజించి రాయలవారి నుద్దేసించి
" తమరి కోరిక ప్రకారం క్షణాల్లో నూరు వరహాలు నా కడుపులో చేరాయి." అన్నాడు.
రాయలవారితో పాటు సభలో ఉన్న వారంతా అదెలా సాధ్యం అని ఆశ్ఛర్యపోతుండగా తను నూరు వరహాలతో వజ్రాల వ్యాపారి వద్ద వజ్రాలు కొనడం , వాటిని నగలు చేసే మాధవాచారి ద్వారా భస్మం కావించడం , ఆ భస్మాన్ని వెండి
భరిణెలో ఉంచి సభ సమక్షంలో తమలపాకులతో భుజించడం వరకు వివరంగా తెలియచేసాడు. రామకృష్ణ తెలివితేటలు , సమయస్ఫూర్తికి రాయలవారు ఆనందించి సభ అందరి సమక్షంలో తన మెడలోని ముత్యాల హారాన్ని రామకృష్ణ కవి మెడలో అలంకరించారు.సభలోని వారందరు కరతాళ ధ్వనులతో అలంకరించారు. స్వాగత సత్కారాలతో వచ్చిన రామకృష్ణ కవికి ఇంటి వద్ద చిరునవ్వుతో ఎదురు వచ్చిన భార్య కాత్యాయనిని అభినందిస్తు ఈ సన్మానానికి నువ్వే అర్హురాలివంటు తన మెడ లోని ముత్యాల హారాన్ని ఆమె మెడలో వేసాడు. మగవాని విజయానికి వెనక ఒక స్త్రీ ఉంటుందని కాత్యాయని నిరూపించింది.