“ ఏంటీ?? మీ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరిందటగా” పక్కింటి ఆమె అడుగుతుంటే " అవునొదినా " అని అమ్మ చాటంత మొహం చేసుకొని చెప్తోంది. మా ఊరిలో ఏ నోట విన్నా ఇదే “నాకు అమెరికా సంబంధం ఖాయమైయిందన్న వార్తే ”
“ఎక్కడో సప్త సముద్రాలూ దాటి చాలా దూరం ఎల్లాలంటగా” అని సుబ్బయ్య మామ నాన్నని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. నాన్న మీసం మెలేసుకుంటూ “ఆయ్” అన్నాడు ఎంతో గర్వంగా. పిల్ల అదృష్టవంతురాలు బాబాయ్ అని నా నెత్తి మీద ఓ మొట్టికాయ మొట్టి వెళ్ళిపోయాడు.
పట్టు లంగా, ఓణీ, జాకెట్ వేసుకొని పెద్ద వాలు జడని అటు ఇటు తిప్పి కొట్టుకుంటూ అద్దంలో చూసుకుంటూ " నిజంగా నేను అదృష్టవంతురాల్నే” అని మురిసిపోయింది శ్రావణి.
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శ్రావణి తల్లితండ్రులు ఊరిలోపెద్దలందరి ఆశీర్వాదంతో
శ్రావణి, శేఖరుల పెళ్లి అంగ రంగ వైభవంగా జరిపించారు.
పదహారు రోజుల పండుగ అయిన వెంటనే మావారు సెలవు లేదని చెప్పడంతో నన్ను పంపడానికి అట్టహాసంగా తయారీలు మొదలయ్యాయి. కొత్త అల్లుడు రెండు సూటుకేసుల లగేజ్ తో మాత్రమే అమెరికా వెళ్ళాలని అల్టిమేటం ఇవ్వడంతో మా వాళ్ళు డీలా పడిపోయారు. నా బట్టలకే రెండు సూటుకేసులు సరిపోలేదు. ఏం చేయాలో తెలీక, అమెరికా అల్లుడికి కోపం తెప్పించడం ఎందుకు అని అలాగే సాగనంపారు మా వాళ్ళు నన్ను.
ఎయిర్ పోర్టుకి వెళ్ళిన దగ్గర నుండి నా తిప్పలు మొదలయ్యాయి. మెట్లు ఎక్కకుండా పైకి వెళ్తాము, దాన్నే ఎస్కలేటర్ అంటారట. భయంతో ముచ్చెమటలు పట్టేశాయి నాకు. అందరు నన్ను దాటివెళ్ళి పోతున్నారు. ఈయన కూడా ఎక్కి వెళ్లిపోయారు నేను ఎక్కానో లేదో కూడా చూడకుండానే. మళ్ళీ కిందకు వచ్చి “ నేను వెళుతుంటే కూడా రావాలని తెలీదా?? అలా వెర్రి మొఖం వేసుకొని చూడకపోతే” అని విసుక్కున్నారు. నాకు కళ్ళ వెంట నుండి బొట బొటా నీళ్ళు వచ్చేసాయి. “నీకు అసలు సెన్స్ లేదా? అందరూ మనల్నే చూస్తున్నారు, కళ్ళు తుడుచుకో “ అని గదమాయింపు.
మా ఊరి నుండి బయలు దేరిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనే మారిపోయింది. ఎవరో తెలియని వ్యక్తితో ప్రయాణం చేస్తున్నట్లు చాలా భయంగా అనిపించింది. అమ్మ, నాన్న, మా ఊరు అన్ని గుర్తొచ్చి పెద్దపెట్టున ఏడవాలనిపించింది.
ఎట్టకేలకి విమానం ఎక్కాము. విండో సీట్ ప్రక్కన కూర్చున్నాను. అతని విసుగులు అన్నీ మరచిపోయి. విమానం బయలు దేరింది మెల్లగా. మొదటి సారిగా మేఘాలు అంత దగ్గరగా చూసానేమో, చిన్నపిల్లలా సంబరపడిపోయాను. ఎంత సంతోషంగా ఉన్నా మనసులోని భావాలు పంచుకుందామంటే పక్కన కూర్చున్నది దూర్వాస మహాముని ఆయే. ఎంతో సీరియస్ గా లాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు.
కొత్తగా పెళ్లి అయిన వాళ్ళందరూ చెట్టా పట్టా లేసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు వదలకుండా ఉంటారని విన్నాను. ఈయనేంటో, ఎప్పుడు సీరియస్ గా ఉంటారు.
రెండు ఫ్లైట్స్ మారి మొత్తానికి అమెరికా చేరుకున్నాము. ఇల్లు చాల బాగుంది నీటుగా. ఇంటినిండా ఖరీదైన వస్తువులే. సోఫాలు, డైనింగ్ టేబుల్, ఎన్నో గ్లాస్ ఐటమ్స్. ఏది ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం. గెస్ట్ లా ఫీల్ అవుతున్నాను. ఒక్క రోజు గడవకముందే కింద ఫ్లోర్ వాళ్ళ నుండి కంప్లైంట్ గట్టిగ నడుస్తున్నానని. ఈ అమెరికాలో మా ఊరిలోలా పరుగులు పెడుతూగెంతుతూ నడవడానికి కూడా లేదు అనుకున్నాను.
ఒక నెల రోజులలో ఏవి ఎలా వాడాలో నేర్చేసుకున్నాను త్వర త్వరగా. ఆయనకి రెండోసారి చెప్పాలంటే విసుగు అని.
మా వారిని భర్త అనే కన్నా “కడూస్ మాస్టర్” అంటే బాగుంటుందేమో. అతని మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువై పోతోంది రోజురోజుకి.
సమయం తెలీకుండా రెండు నెలలు గడిచిపోయాయి. మావారు ఆఫీసుకి వెళ్ళగానే అమ్మ వాళ్ళతో, నా చిన్ననాటి స్నేహితులతో కబుర్లలో పడేదాన్ని. వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించటం, వాళ్ళు ఆశ్చర్యంగా వినే వారు నేను చెప్పేవన్నీ. మైక్రోవేవ్, డిష్ వాషర్, వాషింగ్మెషిన్ అన్నీ వాడటం వచ్చేశాయని చెప్పటంలో ఎంతో సంతోషం ప్రపంచాన్నే జయించినంత.
మావారి కలీగ్ వాళ్ళ ఇంట్లో పాట్ లాక్ అట. అందరు తలా ఒక ఐటమ్ చేసుకొని వెళ్ళి ఓక చోట తినడాన్నే పాట్ లాక్ అంటారని అప్పుడే తెలిసింది నాకు.
నీకు తినడమేనా? ఏదైనా వెరైటీ ఐటమ్ చేయడం వచ్చా? అని వెటకారంగా అడిగారు. అతనికేదో తెలీనట్లు.
ఈ రోజు సాయంత్రమే పార్టీ. బిర్యాని తయారు చేశాను.
బెనారస్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని, రెండు పేట్ల ముత్యాల గొలుసు వేసుకొని సింపుల్ గా తయారయ్యాను. నన్ను చూస్తూనే రుస రుసలాడుతూ మనం వెళ్ళేది పార్టీకి, పెళ్ళికి కాదు, అయినా నీకు అస్సలు డ్రెస్ సెన్స్ లేదు. పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడం నాదే తప్పు అని విసుక్కోవడంతో నా కళ్ళ నుండి టప టపా కన్నీరు వరదలై పోగుతుంటే, “ఎప్పుడూ ఈ ఏడుపొకటా ప్రాణానికి” అని తలుపు భళ్ళున వేసి వెళ్ళిపోయారు.
వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం వల్లనేమో నన్ను తీసుకు వెళ్ళక తప్ప లేదు.
నేను చేసిన బిర్యానీ చూసి మెచ్చుకోక పోగా, ఇంత ఎందుకు చేసావు? ఇక్కడెవరూ ఊరి వాళ్లలాగా కుంభాలు, కుంభాలు తినరు. సింపుల్గా తింటారు అని దోవంతా సాధింపే. కిమ్మనకుండా కూర్చున్నాను. ఎక్కువగా మౌనమే నా సమాధానం.
అక్కడికి వెళ్ళిన నాకు పచ్చి వెలగకాయ గొంతులో పడ్డట్టు అయింది. అందరికి నన్ను పరిచయంచేసారు.
లివింగ్ రూంలో జెంట్స్, కిచెన్ లో లేడీస్ కూర్చున్నారు. పార్టీ హోస్ట్ చేసినామె పేరు కృష్ణ వేణి ఐతేఅందరు విచిత్రంగా కృష్ణ అని పిలుస్తున్నారు అబ్బాయిని పిలిచినట్లు.
అందరు తెలుగువాళ్లే అయినా ఇంగ్లీష్ లోనే వాళ్ళ సంభాషణ సాగుతోంది. ఎప్పుడువెళ్ళిపోదామా అని మూళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాను.
శేఖర్! “నీ వైఫ్ మరీ ట్రెడిషనల్ అనుకుంటా” అని కొంచెం వెటకారంగా అంది కృష్ణ.
మీరే తనకి ట్రైనింగ్ ఇవ్వాలి. తను పూర్తిగా విలేజ్ గర్ల్” అని చెప్తున్నారు. విలేజ్ నుంచి రావడం తప్పన్నట్లు.
అందరూ ఫోర్క్, నైఫ్ యూస్ చేస్తున్నారు. ఈయన వార్నింగ్ కి భయపడి నేను కూడా వాళ్ళలాతిందామని ట్రై చేస్తుంటే పొరపాటున ప్లేట్ కిందపడి భళ్ళున పగిలింది.
ఈయన కళ్ళకే శక్తి ఉంటే నేను అక్కడే భస్మమైపోయుండేదాన్ని ఆ చూపులకి.
అందరికి బిర్యానీ ఎంతో నచ్చడంతో “బాగా చేసారు అని” మెచ్చుకుంటూ తిన్నారు. బిర్యానీ హాట్కేస్ ఖాళీ అవ్వడంతో నేను చాల హ్యాపీ అయ్యాను. ఈయన మొహం కూడా వెలిగి పోయిందిఅందరూ నన్ను పొగడటంతో.
కృష్ణ వేణి గారి కాలి మీద వేడి వేడి కాఫీ ఒలికి పోవడంతో పెద్ద పెద్ద బొబ్బలు ఎక్కి పోయినాయి. అందరూ టెన్షన్ పడుతూ ఎమెర్జెన్సీకి కాల్ చేస్తున్నారు. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తోంది. ఎవరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయడం లేదు. భయంతో దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు.
ఆమె హస్బెండ్ ని అడిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నాను. అందరు ఆశ్చర్యం గా చూస్తున్నారు నేను ఎక్స్ పర్ట్ ల ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసి. నిజంగా ఈ పల్లెటూరి అమ్మాయికి వచ్చా అని.
వేసవి సెలవల్లో మాఊరిలో ఇంకేమి వ్యాపకాలు లేకపోవడంతో సహజంగా వైద్య వృత్తి అంటేమక్కువ ఉన్న నేను మా ఊరిలో డాక్టర్ దగ్గర చిన్న చిన్న చికిత్సలు నేర్చుకున్నాను.
కృష్ణ వేణి గారికి ఒక వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు. వాళ్ళ మదర్ఇండియా నుండి వచ్చేలోగా ఎవరైనా డే టైములో హెల్ప్ చేయడానికి తనతో ఉండాలి. వాళ్ళఫ్రెండ్స్ అందరు ఎవరికివాళ్లు మాకు కుదరదంటే మాకు కుదరదు అని గుసగుసలాడుతుంటే వినిఆశ్చర్యపోయి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను.
మా ఊరిలో అయితే ఇదొక సమస్య కానే కాదు. అందరూ హెల్ప్ చేస్తారు. నిజం చెప్పాలంటే హెల్ప్అని కూడా ఎవరు అనుకోరు. కాజువల్ గా చేసేస్తారు.
వారం రోజుల పాటు రోజూ ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు కృష్ణ వేణి గారి ఇంట్లో నన్ను డ్రాప్చెయ్యడం, సాయంత్రం పిక్ అప్ చెయ్యడం చేసేవారు. మాతో పాటు తనకి కూడా లంచ్ ప్రిపేర్చేసి తీసుకు వెళ్ళేదాన్ని. ఈ వారం రోజులలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము.
తనకి బోర్ కొట్టకుండా లేసులతో టేబుల్ మాట్స్, రక రకాల క్రాఫ్ట్స్ తయారు చేయడం, కలర్స్ తోరంగోలి వేయడం నేర్పించాను.
ఆమెకి కాలు పూర్తిగా తగ్గి నడవడం ప్రారంభించింది. మావారు సాయంత్రం పిక్ అప్ కివచ్చినప్పుడు కృష్ణ మా ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెప్పింది.
శ్రావణి పల్లెటూరి అమ్మాయని, కల్చర్ తెలీదని, మోడరన్ గా లేదని మేమంతా చాల ఎగతాళి చేసాము.
“మా అందరి కన్నా గొప్ప మనసు” మీ అవిడది శేఖర్. తను మా దగ్గర నుండి కాదు, మేమే తనదగ్గర నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది.
నా కెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ సమయానికి ఎవరూహెల్ప్ కి రాలేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారు.
మేమందరం ఫాషన్ అనే ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయాము. ఈ బిజీ లైఫ్ లో ఎంతసేపు నేను, నా ఫామిలీ అని గిరి గీసుకొని బతికేస్తున్నాము, పక్కవాడికి ఏమైందో కూడాపట్టించుకోకుండా. “నువ్వు మారకుండా కడిగిన ముత్యంలా ఉండి , మా అందరికి మార్గదర్శకంఅవు శ్రావణి “ అని కోరింది..
కృష్ణ వేణి మాటలు ఈయనలో కూడా మార్పు తెచ్చాయి. ఆ రోజు రాత్రి
సారీ శ్రావణి, భార్య అంటే నేను చెప్పిన ప్రతి మాటకి జవదాటకూడదు అని, పల్లెటూరి అమ్మాయి ఐతే నా మాటే నెగ్గుతుందని నిన్ను చేసుకున్నాను.
నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తం చేయకుండా భార్య మీద అజమాయిషీ చేస్తేనే నా మాటవింటుందనే మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టాను. బయట వాళ్ళు చెపితే కానీ నీ విలువతెలుసుకోలేక పోయాను.
“నన్ను క్షమించు శ్రావణి” అని నన్ను ఎంతో ఆర్తిగా దగ్గరకు తీసుకున్నారు. ఈ మార్పు నా మనసుకిఎంతో ఊరట నిచ్చింది.
లత పాలగుమ్మి