పుణ్యం ఫర్ సేల్ - రాచమడుగు కృష్ణచైతన్య

bless for sale

ఆదిత్య హైదరాబాదుకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు, నెలకు వేలల్లో జీతం, ఆ వచ్చే వేల జీతంలో కొంత ఇంటి అద్దెకు, కొంత ఖర్చులకు, మిగిలింది సేవింగ్సుకు అని జీతం వచ్చిన రోజే గంటకు పైగా లెక్కలు వేసి డబ్బుని వేరు చేస్తాడు. ఆదిత్య సొంత ఊరు సీమప్రాంతంలోని ఓ పల్లెటూరు, అక్కడ ఆదిత్య తల్లిదండ్రులు ఓ చిన్న కిరాణా షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కంపెనీలో ఆదిత్యకు చాలా మంచి పేరు ఉంది, అతను తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ విజయవంతంగా పూర్తి చేసేవాడు. ఇప్పుడు అతను టీంలీడర్ పొజిషనులో ఉన్నాడు, అంటే తను పనిచేయడమే కాకుండా, తన టీంలో ఉండేవారితో కూడా పనిచేయించాలి. ఆదిత్య నేర్పరి, సౌమ్యుడు కావడంతో, తన టీములో ఉన్న వారిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాడు. రెండు నెలల క్రితం తీసుకున్న కొత్త ప్రాజెక్టు సబ్మిట్ చేయడానికి ఇంకా రెండు రోజులు సమయం మాత్రమే ఉంది. తన టీం మెంబర్స్ అందరితో కలిసి క్లైంటుకు ఇవ్వవలసిన ప్రెజెంటేషన్ గురించి చర్చిస్తూ, ఆ క్లైంట్సుకు ఏమేం సందేహాలు రావచ్చు, వాటికి ఎలా సమాధానం చెప్పాలి అనే విషయం కూడా మెంబర్స్ తో డిస్కస్ చేస్తున్నాడు. ఆ డిస్కషన్ పూర్తవడంతో, తను చేసిన ప్రాజెక్టు రిపోర్టు, ప్రెజెంటేషన్లు తీసుకెళ్ళి, ప్రాజెక్ట్ మేనేజరుకు సబ్మిట్ చేసాడు. అప్పటికే సమయం సాయంకాలం ఐదు దాటిపోయింది, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్యతో ఒకసారి ప్రెజెంటేషన్ తీసుకుని, తన సందేహాలన్నీ అడిగి నివృత్తి చేసుకునేపాటికి సమయం రాత్రి తొమ్మిది గంటలు. ఒకరోజు ముందుగానే ప్రాజెక్ట్ పూర్తి చేసాను అనే సంతోషంతో ఆదిత్య ఇంటికి బయలుదేరాడు, అయితే ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక లేక, బయటే ఎక్కడైనా తినాలని అనుకున్నాడు.

తన మిత్రుడు రమేష్ ఎప్పుడూ తన ఆఫీసుకు దగ్గరలో ఉండే టిఫిన్ బండి గురించి చెప్తూ ఉండడం గుర్తొచ్చి, అక్కడికి వెళ్ళాడు. రాత్రి తొమ్మిదైనా ఆ బండి దగ్గర ఇంకా రద్దీ తగ్గలేదు, ఎలాగోలా ప్లేటు ఇడ్లీ సంపాదించాడు, బండికి కొంచెం దూరంలో ఖాళీ ప్రదేశంలో వచ్చి తింటున్నాడు, ఇంతలో ఓ వీధి కుక్కపిల్ల వచ్చి ఆదిత్య ముందర నిలబడింది, ఆదిత్యకు కుక్కలంటే చచ్చేంత భయం, అదిలించాడు, ఆ కుక్కపిల్ల పోయినట్లే పోయి, మళ్ళీ ఆదిత్య పక్కకు వచ్చి నిలబడింది. ఈసారి తన బ్యాగుతో కొట్టబోయాడు, మళ్ళీ అదే తంతు, వెళ్ళినట్టే వెళ్ళి వచ్చి పక్కకు నిలబడింది, ఎంతసేపటికీ ఆదిత్య వేయకపోవటంతో, పక్కన ఇంకో అతను తింటూంటే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడింది ఆ కుక్కపిల్ల, అతను పెద్ద రాయి తీసుకుని దీని మీదకు వేసాడు, కుయ్ కుయ్ అనుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది. అయితే బాధతో కూడిన దాని అరుపు విన్న ఆదిత్యకు చిన్న బాధ కలిగింది, తను తినడం పూర్తి అయ్యాక పక్కనే ఉన్న బడ్డీ కొట్టులో ఓ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని, ఓ బిస్కెట్ వేసాడు. ఎన్నిరోజుల నుండి ఆకలితో ఉందో పాపం, ఆబగా తినేసి, ఇంకో బిస్కెట్ కోసం ఎదురుచూస్తోంది. తన చేతిలో ఉన్న బిస్కెట్లు అన్నీ వేసి, టిఫిన్ బండిలో రెండు ఇడ్లీ తీసుకుని వేసాడు, కడుపు నిండిందేమో కాబోలు, అది ఆదిత్య వైపు ప్రేమగా చూసి, తోక ఊపింది. ఆ ప్రేమకు ఆదిత్య మనసు లొంగిపోయింది, ఆ కుక్కపిల్లను కొట్టడం వలన వచ్చిన బాధ నుంచి ఇప్పుడు కొంచం విముక్తుడు అయ్యాడు ఆదిత్య. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీసుకు చేరుకున్న ఆదిత్య మనసు మొత్తం ఆ వీధి కుక్కపిల్ల ఆక్రమించేసింది, ఎప్పుడు సాయంకాలం అవుతుందో అని ఎదురుచూస్తూ సాయంకాలం తన పని అయిపోగానే టిఫిన్ బండి దగ్గరకు పరిగెత్తాడు, అక్కడ చుట్టుపక్కల ఆ కుక్కపిల్ల కోసం వెతికాడు, ఎక్కడా కనపడలేదు, నోటితో చిన్న శబ్దం చేస్తూ పిలిచాడు, ఆ శబ్దం వచ్చిన వైపు చూసిన కుక్కపిల్లకు ఆదిత్య కనపడగానే పరిగెత్తుకుంటూ, తోక ఊపుతూ ఆదిత్య పక్కకు వచ్చి నిలబడి అతని చేతుల వైపు చూస్తోంది. ఆదిత్య బిస్కెట్లు వేయగానే తినేసి, అతని కాళ్ళ దగ్గరే తిరుగుతూ, అతన్ని ముందుకు కదలనివ్వకుండా తిరుగుతోంది, ఎలాగోలా దాన్ని తప్పించి, ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీసుకు చేరుకున్నాక, తన ల్యాప్ టాప్ తీసి చేసిన ప్రాజెక్ట్ అంతా ఒకసారి చూసుకుని, మీటింగ్ హాల్లో తన క్లయింట్ కంపెనీ వారికి ప్రజంటేషన్ ఇచ్చాడు. ఆ ప్రజంటేషన్ అయిపోయిన తరువాత ఆ హాల్ మొత్తం చప్పట్లతో నిండిపోయింది, ఎంతో ఓర్పుతో, సహనంతో, క్లయింటు కంపెనీ వారు అడిగిన సందేహాలకు జవాబు ఇచ్చాడు. ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసిన ఆదిత్యను, మరియు అతని టీమును కంపెనీ వారు అభినందనలతో ముంచెత్తారు. సాయంకాలం ఆఫీసు అవ్వగానే ఆరోజు కూడా ముందురోజులానే బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని అప్పటికే అక్కడ ఆదిత్య వస్తాడేమో అని ఎదురుచూస్తున్న కుక్కపిల్లకు బిస్కెట్లు వేసి ఇంటికెళ్ళాడు. ఆరోజు నుంచి ఇక రోజూ అదే తంతు, సాయంకాలం లేదా రాత్రి ఆదిత్య ఇంటికెళ్ళే సమయానికి, టిఫిన్ బండి పక్కనో, లేదా బడ్డీ కొట్టు పక్కనో కూర్చుని ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళు అదిలించినా ఎక్కడికీ వెళ్ళదు, ఆదిత్య రోజూ ఇంటికి వెళ్ళే ముందు దానికి బిస్కెట్లు వేసి వెళ్ళేవాడు, అలా వాళ్ళ బంధం ఇంకా బలపడింది. ఆదివారాలు లేదా సెలవు దినాలు వచ్చినప్పుడు సాయంకాలం నాలుగు గంటలకు వెళ్ళి ఆడుకుని, బిస్కెట్లు వేసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. తనకు ఆఫీసులో పని ఒత్తిడి వలన వచ్చే టెన్షన్స్ అన్నీ ఆ కుక్కపిల్లకు బిస్కెట్లు వేయగానే మాయమయిపోయేవి, అంతే కాదు, తను ఏదైనా స్పెషల్ వంటకం చేసినప్పుడు దానికి కూడా తీసుకెళ్ళి వేసేవాడు.

ఒకరోజు ఆదిత్య ఎప్పటిలానే ఆఫీసు ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో వర్షం మొదలయింది, తగ్గిపోతుంది అని అనుకున్న సమయానికి ఇంకా జోరుగా పడటం మొదలయింది, ఇలాగైతే ఆఫీసులోనే ఉండిపోవలసి వస్తుంది అని ఆ వర్షంలోనే ఇంటికి బయలుదేరాడు ఆదిత్య. తడుస్తూనే బడ్డీ కొట్టులో బిస్కెట్లు తీసుకుని, కుక్కపిల్ల కోసం చూసాడు, ఎక్కడా కనపడలేదు, ఎదురుచూసి చూసి ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంటికైతే వెళ్ళాడు కానీ మనసంతా ఆ కుక్కపిల్ల మీదనే ఉంది ఆదిత్యకు, ఆరోజు దాన్ని ఎట్టి పరిస్థితులలో చూడాలని పట్టుబట్టి ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు, వర్షం కూడా కొంచం తగ్గింది, ఆ చీకటిలో మొబైల్ టార్చిలైటు వేసుకుని వెతుకుతున్న ఆదిత్యకు పక్కనుంచి చిన్నగా మూలుగులు వినబడడంతో అటుగా వెళ్ళాడు. పాపం ఆ కుక్కపిల్ల చలికి వణుకుతూ అలాగే ముదురుకుని పడుకుంది, ఆదిత్య పిలవడంతో కళ్ళు తెరిచి పైకి లేవడానికి ప్రయత్నిస్తోంది, దాని పరిస్థితిని చూసిన ఆదిత్య కళ్ళు నెమ్మదిగా చెమర్చాయి, తను తడవకుండా వేసుకున్న టవల్ తీసుకుని, ఆ కుక్కపిల్ల పిల్లకు చలి వేయకుండా చుట్టి, ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తున్నంత సేపు ఆ కుక్కపిల్ల చలి గాలికి వణుకుతూనే ఉంది, ఇంటి కాంపౌండులో బండి పార్క్ చేసి, ఇంటి లోపలికి వెళ్ళి, హెయిర్ డ్రయర్ తీసుకుని, కొద్దిగా దూరంలో ఫ్యాన్ లాగా పెట్టాడు వేడి గాలి కోసం. దాని శరీరం మీద తడి పోవడానికి టవల్ తీసుకుని నీటిగా తుడిచి, బిస్కెట్లు తీసుకొచ్చాడు తింటుందేమోనని, పాపం అది ఇంకా అలాగే పడుకుని ఉంది, ఆ డ్రయర్ ఇంకొంచెం దగ్గరగా పెట్టాడు, కొంతసేపటికి తనను పూర్తిగా కప్పేసిన టవల్ లోపలి నుంచి తల బయటకు పెట్టి చిన్నగా అరిచింది, దాని అరుపుకు ఆదిత్య మనసు కాస్త కుదుటపడింది, దానికి బిస్కెట్లు వేసి, స్నానం చేసి అన్నం తిని, దాని పక్కనే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య నిద్రలేచేపాటికి, ఆ కుక్కపిల్ల వాసన చూసుకుంటూ ఇల్లంతా తిరుగుతోంది, నిద్ర లేచిన ఆదిత్యను చూడగానే వచ్చి తన పక్కన కూర్చుంది. "ఈరోజు నుంచి నీ పేరు బుల్లెట్, ఇదే నీ ఇల్లు" అని ఆదిత్య చెపుతోంటే చెవులు నిక్కపొడిచి వింటోంది. టైం అవడంతో ఆఫీసుకు బయలుదేరుతూ, బుల్లెట్ మెడ చుట్టూ టవల్ కట్టి, దాని పైన తాడుతో చైను లాగా కట్టాడు, తన పక్కింటి కావేరి అక్కకు రాత్రి జరిగిన విషయం చెప్పి, బుల్లెట్ ను కావేరికి అప్పచెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆదిత్యకు ఇదో దినచర్య అయింది, రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళే ముందు కావేరికి అప్పచెప్పి వెళ్ళడం, ఇంటికి వచ్చాక బుల్లెట్ ను వాకింగుకు తీసుకువెళ్ళి, తినడానికి పెట్టి నిద్రపోవడం, ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఏ వీధి కుక్కపిల్లను చూసినా ఆదిత్యకు బుల్లెట్ గుర్తొచ్చేది, అలా బుల్లెట్ గుర్తుకువచ్చిన ప్రతిసారి, తన ఫోనులో తీసుకున్న ఫోటోస్ చూసుకునేవాడు. ఎప్పటిలానే ఆరోజు ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ పక్కన ఓ కుక్కను చూసాడు, అది రక్తపు మడుగులో పడుకుని ఉండడంతో, ఏం అయిందో అని దగ్గరికి వెళ్ళి చూడగా, దాని కాలు నుంచి రక్తం వస్తోంది, ఏదో వాహనం గుద్దేసి వెళ్ళిపోయుంటుందని గ్రహించి, వెంటనే పైకి లేపి దగ్గరలో ఉన్న డాగ్ క్లీనిక్ కు తీసుకెళ్ళాడు. అక్కడి డాక్టర్లు ఆ కుక్కకు దెబ్బ తగిలిన చోట నీటిగా కడిగి, కట్టు కట్టి ఆదిత్యకు అప్పచెప్పారు, అయితే ఆదిత్యకు దాన్ని వదిలివేయబుద్ది రాక ఇంటికి తీసుకొచ్చి, జిమ్మీ అని పేరు పెట్టాడు. జిమ్మీ వచ్చిన మొదట్లో బుల్లెట్ ఆదిత్య మీద అలిగి కొంచం దూరంగా ఉండేది, రాను రాను జిమ్మీతో కలిసిపోయి రెండూ ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకైనా మంచిదని ఆదిత్య వెట్ డాక్టరును పిలిపించి రేబీస్, టిక్స్ రాకుండా ఇంజెక్షన్ వేయించాడు. తన ఉద్యోగం, తన ఆఫీసు మాత్రమే లోకం అనుకుంటున్న ఆదిత్య మనసును జిమ్మీ, బుల్లెట్ లు పూర్తిగా ఆక్రమించేసాయి, తన దగ్గర ఉన్నది ఇతరులకు పంచడం లేదా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడిప్పుడే ఆదిత్య తెలుసుకుంటున్నాడు.

ఈ ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని ఇంకా ఆస్వాదించాలని ఆదిత్య నిర్ణయించుకున్నాడు, అనుకున్నట్టుగానే ఓ పెద్ద క్యారియర్లో అన్నం, చికెన్, బిస్కెట్లు తీసుకుని బయలుదేరాడు, ఆరోజు ఆదివారం కావడంతో బజారులో కూడా పెద్దగా జనం లేరు, ముందు తన ఇంటి పక్కనే ఉన్న గల్లీలోకి వెళ్ళాడు, అక్కడ ఎముకుల గూడులా ఉన్న కుక్కను చూసి దగ్గరికి వెళ్ళి, పేపర్ వేసి దాని మీద చికెన్ పెట్టాడు, ఆ కుక్క ఆదిత్యను ముందు అనుమానంగా చూసినా, ఆకలిగా ఉండడంతో తినేసింది, ఆ తింటున్న కుక్క దగ్గరకు ఇంకొన్ని కుక్కలు రావడం గమనించిన ఆదిత్య వాటికి కూడా చికెన్, బిస్కెట్లు వేసాడు. అన్నీ తిని కళ్ళతోనే ఆదిత్యకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. తనకు వచ్చే సంపాదన ఆ కుక్కలకు రోజూ కడుపు నింపకపోయినా, కనీసం వారానికి ఒకసారైనా ఇలా ఇవ్వాలి అని ఆదిత్య నిర్ణయించుకున్నాడు. ఆ శునకాల దగ్గర నుంచి ఇంకొంత సంతోషం తెచ్చుకున్న ఆదిత్య ఆ రాత్రికి హాయిగా నిద్రపోతుండగా బుల్లెట్, జిమ్మీల అరుపులు వినిపించాయి, కళ్ళు నులుముకుని కిటికీలో నుంచి బయటకు చూసిన ఆదిత్యకు ఎవరో ముగ్గురు వ్యక్తులు ఎదురింటి గేటు దూకి లోపలికి వెళ్ళడం గమనించాడు, వెంటనే తన ఇంటి తలుపు తీసి బుల్లెట్ జిమ్మీలను కట్టేసి ఉన్న తాడును విప్పేసాడు, ఇక అవి జెట్ స్పీడులో వెళ్ళి చెరొకరిని దొరకబుచ్చుకుని, కొరికేసాయి, ఆ నొప్పికి ఇద్దరు ఆగంతుకులు అక్కడే కూలబడిపోగా, మూడోవాడు కుంటుతూ పారిపోయాడు. సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చిన పొలీసులు అక్కడే కట్టేసి ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకునిపోయారు. ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటి అంటే ఆ ముగ్గురు దొంగలు అని, దొంగతనం చేసిన వెంటనే అత్యంత కిరాతకంగా చంపేస్తారని తెలిసింది. అలా ఆ ఇద్దరినీ పట్టించిన బుల్లెట్, జిమ్మీలు ఆ చుట్టుపక్కల హీరోలయ్యాయి.

ఇలా తన జీవితం సాగిపోతున్న ఆదిత్యకు రోజూ ఎన్నో కుక్కలు ఆకలితో, ఒంటి నిండా దెబ్బలతో కనిపించేవి, అన్నింటి కడుపు నింపడానికి తన దగ్గర సరిపడా డబ్బు ఉంటే ఎంతో బాగుండేది అని అనుకునేవాడు. ఎప్పటిలాగే ఆదిత్య ఆరోజు ఆఫీసుకు బయలుదేరిన ఆదిత్య, బుల్లెట్, జిమ్మీలను ఇంటి కాంపౌండులో కట్టేసి, వాటికి దగ్గరలో, నీరు ఆహారం పెట్టి, బైకు స్టార్టు చేసి బయలుదేరాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన ఆదిత్యకు ఓ కుక్క అచేతనంగా పడి ఉండడం గమనించాడు, దగ్గరకు వెళ్ళి ముట్టుకోబోయిన ఆదిత్యను పక్కనే ఉన్న మునిసిపల్ సిబ్బంది ఆపి, రోగాలు రావచ్చునని, ఆ కుక్కను ఓ సంచి మీద వేసుకుని లారీలోకి విసిరేయడం చూసిన ఆదిత్య కళ్ళ వెంబడి నీరు కారడం ప్రారంభించాయి. ఆదిత్య ఆ బాధ నుంచి త్వరగా తేరుకోలేకపోయాడు, ఆ బాధను మర్చిపోవడానికి ఆఫీసుకు ఆరోజు సెలవు పెట్టేసి, ఇంటికెళ్ళి ఆరోజు సమయం మొత్తం బుల్లెట్, జిమ్మీలతో ఆడుకుని, పార్కుకు తీసుకువెళ్ళి తన బాధను కొంచెం తగ్గించుకోగలిగాడు. అలా రోజూ ఆఫీసుకు వెళ్ళే సమయంలోనో, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయంలోనో ఎన్నో వీధి కుక్కలు తన కంటబడేవి, కొన్ని రోగాలతో, ఇంకొన్ని నడవలేని స్థితిలో, మరికొన్ని ఒంటి నిండా దెబ్బలతో తిరుగుతూ కనిపించేవి. ఈ బాధ ఒకరోజులో తీరేది కాదు అనుకున్నాడు ఆదిత్య, ఏదైనా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలని అనుకున్నాడు. ఆ శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తూండగా అద్బుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే అదే కంపెనీలో పనిచేస్తున్న బాల్యమిత్రుడైన బాలాజికు ఫోన్ చేసి తన ఆలోచన చెప్పగా, బాలాజి అభినందించి, "నీ ఆలోచన చాలా బాగుంది, నువ్వు దీన్ని మన కంపెనీలో ఉండే "ఐడియాస్ క్లబ్"లో వివరించి, సహాయం చేయమని అడుగు" అని సలహా ఇవ్వడంతో, తనకు వచ్చిన ఆలోచన, దానికయ్యే ఖర్చు వివరాలు అన్నీ సుమారుగా అంచనా వేసి రాసి పెట్టుకున్నాడు. ఆదిత్య పనిచేసే కంపెనీని స్థాపించిన వ్యక్తి కంపెనీ లాభాల్లోకి రావటంతో ఐడియాస్ క్లబ్ మొదలుపెట్టి, ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనికి నెల నెలా కొంత డబ్బు కంపెనీ అకౌంటు నుండి ఇవ్వాలి అనేది నియమంగా పెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే మొదట తను చేసిన పని "ఐడియాస్ క్లబ్" మెంబెర్స్ అందరినీ సమావేశపరిచి తనకు నిన్న రాత్రి వచ్చిన ఆలోచన గురించి వివరించాడు. ఆ ఆలోచన ఏంటి అంటే వీధి కుక్కల కోసం ఓ షెల్టర్ కట్టి, వాటి బాగోగులు చూడాలి అనేది తన ఆలోచన.

తనకు వచ్చిన ఆలోచన చెప్పగానే అందరూ సంతోషపడతారనుకున్న ఆదిత్యకు నిరాశే ఎదురయింది. మనుషులే బ్రతకడం కష్టంగా ఉంటే, కుక్కల బాగోగులు చూడడం ఎవరి వల్ల అవుతుంది అని కొంత మంది విమర్శిస్తే, మరికొందరు ఆలోచన చాలా బాగుంది కానీ దానికి డబ్బులు ఎలా వస్తాయి అంటూ తమ సందేహాన్ని వెలిబుచ్చారు. ఎందుకంటే అన్ని సౌకర్యాలతో యానిమల్ షెల్టర్ కట్టడానికి ఎంతలేదన్నా అరకోటి అవుతుంది, పోనీ ఎవరైనా స్థలం ఇస్తే, టెంపరరి షెడ్ వేయడానికి అయినా ఓ ఇరవై లక్షలు, మరి అందులోకి వచ్చిన ప్రతీ కుక్క బాగోగులు చూడాలంటే మరికొంత సొమ్ము కావాల్సిందే. అంత సొమ్ము కంపెనీ భరించలేదు, అసలు ఈ ఐడియా వర్కవుట్ అవ్వాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలి అనే విషయం ఆదిత్యకు అర్థమయింది. ఎప్పుడూ తను దాచుకున్న సేవింగ్సు డబ్బును ఒకటో తారీఖు మాత్రమే లెక్కపెట్టే ఆదిత్య, ఆరోజు ఒకటి కాకపోయినా లెక్కలు కట్టడం మొదలుపెట్టాడు. తను ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు నాలుగు లక్షలు దాచినట్టు లెక్కతేలింది. తన యానిమల్ షెల్టర్ కోసం ఈ నాలుగు లక్షలు కూడా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు, తన మిత్రులను, బంధువులను, సహచర ఉద్యోగులను ఇలా తనకు తెలిసిన అందరినీ అడిగాడు, కొంతమంది లేదన్నారు, సమయం వృధా అన్నారు, కొంతమంది ఇవ్వడానికి ముందువచ్చారు, పది రూపాయలు ఇచ్చినా చేతులెత్తి నమస్కరించేవాడు, మరికొంతమంది ప్రతీ నెలా కొంత తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. అలా పోగయిన డబ్బుతో ఊరిబయట ఇంటితో కూడిన చిన్న స్థలం అద్దెకు తీసుకొని నిర్మాణ రంగంలో "ప్రీ ఫాబ్రికేటెడ్" అనే నూతన టెక్నాలజిని ఉపయోగించి, రెండు రోజుల్లో చిన్న షెడ్డు లాంటిది నిర్మించాడు. ఆ షెడ్డులో కుక్కల కోసం ఆట వస్తువులు, వాటిని కట్టి ఉంచడానికి చిన్న పాటి చైన్లు, ఇత్యాది సరంజామా మొత్తం ఇప్పటి వరకు పోగయిన డబ్బుతో తీసుకుని వచ్చాడు. వారం తిరిగే లోపే ఆ ఖాళీ స్థలం కాస్తా "ది వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్" బోర్డు తగిలించుకుని అందంగా ముస్తాబయింది. ఆ దారిన పోయే వారు అది కుక్కల నివాసం అంటే ఎవరూ నమ్మరు, నమ్మలేరు. మిగిలిన కొద్దిపాటి డబ్బుతో వారానికి సరిపడా ఆహారం సమకూరుతుంది, వారం తర్వాత సంగతి ఆదిత్యకే అర్థం కావడం లేదు, ఏదైతే అది అయింది, అడుగు ముందుకు వేసాక వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదు అని తనకు తానే సర్దిచెప్పుకుని. తను అందుబాటులో లేనప్పుడు ఆ షెడ్డు తాలూకా నిర్వహణ బాధ్యతల కోసం తన సొంత ఊరు నుంచి శివయ్య అనే వ్యక్తిని పిలిపించాడు ఆదిత్య. తనకు తీరిక దొరికినప్పుడు ఆ షెడ్డు మరియు కుక్కలకు చేస్తున్న సేవల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, విరాళాలు అభ్యర్థించేవాడు. అలా కొంత డబ్బు పోగయిన ఓ రెండు రోజుల ఆహారానికి సరిపోయేది, తరువాత డబ్బు లేకపోతే తన జీతం నుంచి ఖర్చు చేసేవాడు.

ఆదిత్య ఆలోచనలు మొత్తం షెడ్డు మరియు దానికి కావలసిన డబ్బు చుట్టూరా తిరిగేవి, అలా ఆలోచిస్తూండగా ఊరిలో జరిగే సంతలు గుర్తొచ్చాయి, ప్రజలందరూ సంతకు రావడం తమకు కావలసిన సరుకుల కన్నా కొద్దిగా ఎక్కువే తీసుకెళ్ళడం, వ్యాపారులకు కూడా లాభం రావడం ఈ విషయాలన్నీ తను చిన్నప్పుడు నాన్న చెప్పేవాడు. అంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళినా వచ్చేది కొద్ది డబ్బే, అది కూడా వస్తుందో రాదో తెలియదు, అదే ప్రజలనే ఇక్కడికి రప్పిస్తే??? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆరోజు ఆఫీసు నుండి పర్మిషన్ తీసుకుని సరాసరి ప్రింటింగ్ ప్రెస్స్ దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య. ఓ తెల్ల కాగితం మీద "పుణ్యం ఫర్ సేల్ (పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయాలి) మీరు పుణ్యం సంపాదించే గొప్ప అవకాశం, రండి కేవలం గంట సమయం మా "ది వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్" లో గడపండి, కావలసినంత పుణ్యం సంపాదించుకోండి" అంటూ ప్రింట్ చేయించి, మరుసటి రోజే న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలోనూ, ప్రజలందరికీ కనపడేలా చేసాడు. మూగ జీవాల కడుపు నింపితే ఆ దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు అని హాల్ రూములో పెద్దగా స్టిక్కర్ అంటించాడు. ఇక తను చేయాల్సింది ఎదురుచూడడం మాత్రమే, పైగా ఆరోజు ఆదివారం, ఆ హౌస్ మొత్తం నీటిగా పూలతో ముస్తాబు చేయించాడు, ఓ ఫ్రెండ్ స్పాన్సర్ చేసిన సబ్బులు, షాంపూలతో కుక్కలన్నింటికీ స్నానం చేయించారు శివయ్య, ఆదిత్య. ఆ ఆడ్రస్ వెతుక్కుంటూ, చేతిలో పాంపెట్లతో ఓ కుటుంబం వచ్చింది, వారికి హాల్ రూములో కూర్చోమని తినడానికి స్నాక్స్ ఇచ్చారు. అలా వచ్చిన వారందరికీ హాల్ రూములో కూర్చోవడానికి ఏర్పాట్లు చేసి, స్నాక్స్ ఇచ్చారు. అలా కొంత మంది జనం పోగవగానే ఇంతకు మునుపే అరేంజ్ చేసిన మైక్ సెట్లో, తనను పరిచయం చేసుకుని, తన వెల్ఫేర్ సొసైటి గురించి వివరించి, “మన దేశంలో దాదాపు కొన్ని వేల కుక్కలు కేవలం ఆకలితోనే చనిపోతున్నాయి, మనందరం అనుకుంటే ఆ సంఖ్యను కొంచం తగ్గించవచ్చు, మీరు చేసే సహాయం వలన ఓ వీధి కుక్క ప్రాణాలను నిలబెట్టవచ్చు” అంటూ విరాళాల కోసం అభ్యర్థించాడు. అక్కడ ఆదిత్య ప్రసంగం వింటున్న అందరికీ మనసులు భారంగా మారి, కళ్ళు చెమర్చాయి. ఆదిత్య ప్రసంగం కొనసాగుతోంది, "ఈ హౌస్ నడపడానికి నెలకు దాదాపు ముప్పైవేల వరకు అవుతుంది, ఒక్కరికి ముప్పైవేలు అంటే మోయలేని భారం కానీ మనమందరం పంచుకుంటే ఆ భారం కూడా గడ్డిపరక అంత తేలికగా మారుతుంది, విరాళాల విషయంలో ఎవరి బలవంతమూ లేదు, మీకిష్టమైతెనే ఇవ్వండి, మీరు మనఃస్పూర్తిగా ఎంత ఇచ్చినా మేము స్వీకరిస్తాం" అంటూ ఆ సొసైటీకి సంబంధించిన బ్యాంకు అకౌంటు వివరాలు తెలియజేసి తన ప్రసంగం ముగించాడు. అలా ప్రసంగం ముగిసిన వెంటనే ఆ సొసైటిలో ఉన్న కుక్కలను పరిచయం చేయడానికి తీసుకెళ్ళాడు. రకరకాల కుక్కలు ఉన్నాయి అక్కడ, కాకపోతే అవి వీధి కుక్కలంటే ఎవరూ నమ్మరు, అంత నీటిగా మరియు క్రమశిక్షణ కలిగి ఉన్నాయి. అలా ఆ కుక్కలను పరిచయం చేస్తుండగా ఓ పెద్దావిడ ముందుకు వచ్చి బ్యాగులో తను తినడానికి తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి అన్నింటికీ కొన్ని కొన్ని వేసింది. ఆ పెద్దావిడ చర్యను చూసిన మిగతవారు చుట్టు పక్కల షాపు కోసం వెతకసాగారు. ఆ విషయం కనిపెట్టిన ఆదిత్య “మా అభ్యర్తనను మన్నించి, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మా చిన్న కానుక, మీకు సమ్మతం అయితే మా కుక్కలకు ఆహరం ఇవ్వండి” అంటూ అందరికీ తలో బిస్కెట్ పాకెట్ ఇచ్చాడు, ఆ వచ్చినవారందరూ సంతోషంగా తీసుకుని ఆ డాగ్ బౌల్స్ లో వేసారు. అన్ని కుక్కలు జనం మధ్యలోకి రావడానికి బెదిరిపోగా, బుల్లెట్, జిమీలు మాత్రం జనంలో కలిసిపోయి, వారిని ఆనుకుని తిరుగుతూ, చిన్న పిల్లలు తమను పట్టుకోడానికి వస్తే పారిపోతూ ఆడుకుంటున్నాయి. అలా కొంతమంది వాటికి బిస్కెట్లు వేసిన వెంటనే ఆదిత్యను చేస్తున్న పనికి తనను అభినందించి, తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి సెలవు తీసుకోగా, మరికొంతమంది బుల్లెట్ జిమ్మీలతో ఆడుకుంటూ ఆదిత్యతో పాటే బోజనాలు చేసి, అప్పటికప్పుడే నెలకు సరిపడా డబ్బు అందించి సెలవు తీసుకుని పోతుండగా, బుల్లెట్, జిమ్మీలు వారిని గేటు వరకు అనుసరించి సాగనంపాయి.

అందరూ వెళ్ళిపోయాక విరాళంగా వచ్చిన డబ్బును ఆదిత్య, శివయ్య లెక్కవేయగా మూడు నెలలకు సరిపడా డబ్బు పోగయింది. తన "పుణ్యం ఫర్ సేల్" అనే ఆలోచన సఫలం అయినందుకు సంతోషిస్తూ, చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఆదిత్య ఇంటికి బయలుదేరాడు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు