అద్వైతం - అనిల్ ప్రసాద్ లింగం

no second

"ఇగో..టైము పదైతుందే...ఇగ లెగుండ్రీ. పొద్దుగాల సంది చాయ్ గూడా తాపిక పోతివాయే" పరేషాన్ అవ్వ బట్టే నర్సింహా.
" పండ్లుతోముకొని పదుండ్రి... చాయేందీ టిపినీ గూడా పెట్టిస్తా" ఆవలిస్తానే బదులిచ్చే గాయన పెండ్లాం సరోజ.
"అట్నా... ఆదివారమొచ్చిందంటే బయటకి పోయి తినుడేనా? వోద్దే.. మీరైతే లెగుండ్రి నేను పోయి తీస్కొస్తా"

"అట్లెట్లా. మేమూ తయ్యారైనంక అందరం కలిసే పోదాం"
"నే తెస్తానే"
"ఎహే.. హోటల్కి గాదు. మన దీప్తి వాళ్ళ క్వాటర్కి. ఇయాల గా పోరగాడికి అన్న ప్రాసన. మనకి దావాతన్నట్టు"
"అట్నా. ఆళ్లింట్లా దావాతైతే మనింట్ల చాయ్ గూడా పెట్టవానే?"
"ఏంలే. ఇయ్యాల మొత్తం అల్లింట్లనే. గా దీప్తి జెప్ప బట్కె గింత సేపు పండినా, లేకుంటే దినాము సూరిని కంటే ముందే లేసి నీకు ఛాయిస్తలేనా " ఇంతలా ఫోను మొగబట్టే.
"ఆఁ.. దీప్తీ, ఇగో ఇప్పుడే లేస్తుంటిమి. మీ బావగారూ చాయ్ గావాల్నంటుంటే....అట్నా...... ఇగో ఏమయ్యో..... ఆళ్లింట్లా పెట్టిండ్రంట పోయి తాగోస్తవా? లేక ఈడ్కె అంపించమంట్వా?"
మొగోడు తల కొట్టుకొనే. "అరే ఇదేంరంది.... పంపియ్యమంటే పంపిస్తరు అందలేముండే. నువ్వు పంపియ్యి దీప్తీ. దో కప్పులు. నేను తానం చేసి వొస్తా నువ్వేం ఫికర్జెయ్యాక్. ఆఁ.... పిల్లల్ని కూడా తోల్కొస్తలే " అని లేచెళ్ళి మొగునికి ఏదర్గా కూసొని, "గాపిల్ల నిన్నొచ్చి ఇంట్లా పొయ్యంటించొద్దు అక్కా అనబట్టే. చాయ్ దాగనీకేం షరం?" అంటుండగానే ప్రవీణ్ చేత్ల గీలాసులో చాయ్ తీస్కని రాబట్టే. వచ్చుడొచ్చుడే నరసింహ తానికి పోయి "నిన్న మీరు లేరు, అక్కకు చెప్పెల్లినాము. బాబుకి అన్న ప్రాసన మీరు తప్పక రావాలే" అనే "అట్నే. మీ అక్క చెప్తాఉండే. తయారయ్యిఅచేస్తా"మని జెప్పి ఆయన్నిఅంపించే.
************

మహారాష్ట్ర నాసిక్ షెహర్లోని గవర్మెంటు డబ్బులు అచ్చేసేడు మింటులో పన్జేసే నరసింహ పదేళ్ల సంది పెళ్ళాన్ని తీస్కపొయి అక్కడి క్వార్ట్రర్స్ లోనే ఉంటావుండే.
ఇద్దరు పిల్లలు కూడా పుట్టిన్రు. ఆళ్ల పక్కన్నే ఓ ఏడాది ముందట్లా ఆంధ్రానుండి వచ్చి దిగిన్రు దీప్తీ - ప్రవీణ్ లు. ప్రెస్లో హౌదాలో ప్రవీణ్ సీటు పెద్దదే గానీ చాన్నాళ్ళ సంది అక్కడున్నా ఎక్స్పీరియన్స్ తోనీ - వయసులో పెద్దానీ మీదికెళ్లి సాటి తెలుగోళ్ళు అనే దోస్తానాతోని నరసింహా - సరోజ జోడీని అక్కా బావ అంటా చాన ఇజ్జదిచేటోళ్లు. ఈళ్ళూ కాని ప్రదేశంలో ఉన్నారనే ఇబ్బంది లేకుండా అన్నినింటికీ సముదాయించుకుంటా పెద్ద దిక్కోలే ఉంటా ఉండే. ఈ మద్దెన్నే గాపిల్ల కనింది. కడుపుతోఉన్నప్పుడూ, కన్నాక బాలింతగా ఉండెప్పుడూ సరోజ సొంత చెల్లెలెక్క జూసుకోనేది. గా అభిమానంతోటే ఇయ్యాల దావత్తుకు పిలిసిండ్రు.
**********************************************
గంటల అందరూ మస్తుగా రడీఐ పోతే అక్కడెవళ్లూ లేక పోయే. "చుట్టాలేవళ్లూ రాలేరా దీప్తీ?" ఎల్తానే అడిగేసే సరోజ.
"లేదక్కా మీరూ, మేమే.. అంతే"
"గదేంటమ్మాయ్? మీరు పిలవలేదా? మీ ఆళ్ళు రాలేదా " వదలలేదు.
"పిలిచామక్కా. ఇంత దూరం ఎక్కడోస్తారు? ఆరోనెల దాటితే మళ్ళీ కుదరదని" చెప్పుకుంటానే ఇంట్లో పనులు చక్క బెట్ట బట్టే ఇల్లాలు. ప్రవీణ్ పిల్లోల్లకి కొత్త బొమ్మలు తెచ్చిపెట్టే, ఆళ్లూ ఆటిల్తోని ఆడుకుంటుర్రు.
ఇగా తర్వాత బుడ్డోడిని సాప మీదకి దింపి ఎదర్గ పుస్తకం, పెన్ను, కత్తీ, తినినీకి చెక్కరి, బంగారం అన్ని వెట్టి వదిలిండ్రు. పిలగాడు పుస్తకం ముట్టినంతనే గాని అమ్మాఅయ్యా మస్తు ఖుషి అయ్యే. ఇగిప్పుడు దీప్తి, సరోజనీని వాళ్ళాయన్నీ కూర్చొని ముందుగా మెతుకు తినిపించమనే.
"గదేంది, మీ అమ్మా నాయన గానీ, అత్తా మామాలైనా లేకుంటే నీకు తమ్ముళ్ళున్నారాన్నావ్ గదా ఆళ్ళు గదా తిని పియ్యాలె ముందు" అనే సరోజ.
"వాళ్ళెవరూ రాలేదు కదక్కా. మీ మనసు మంచిది, సొంత చెల్లిలాగా చూసుకుంటాన్నావు. కాన్పప్పుడూ హాస్పిటల్కి కూడా తోడుగా నువ్వే వచ్చావు. మీకంటే మాకెవరూ ఇక్కడ పెద్దోళ్ళు లెరక్కా. నువ్వూ, బావగారూ నిండు మనసుతో ఆశీర్వదిస్తే నా కొడుక్కి అంతా మంచే జరుగుతుందనే నమ్మకం నాకుంది. కాదనకండి" అంటా బతిమలాడే. ముందర కాస్త యెన్కాముందాడినా, ఇగాడేవళ్లూ లేరాని ఒళ్ళో కూసో పెట్టుకొని పిల్లోనికి ఆళ్ళు దెచ్చిన ఉంగరంతో పాలబువ్వ మెతుకు తినిపించిరి సరోజ దంపతులు.
టిఫిన్లు తిన్నాక మగాళ్ళు లోపల పేకా, మందు షురుజేసిన్రు. ఆడంగులు హాల్లో టీవీముందు కూసోని గీమద్దెన బాగాడిన సిన్మా వత్తాంటే చూస్తుండ్రు.

"వారానికో సారి ఈ ఛానల్ వాడు ఇదే సినిమా వేస్తున్నాడు" అంది దీప్తి.
"మళ్ళీ మళ్ళీ జుసినా చూడబుద్దై తుంది. మంచిగా తీసిండ్రు, పాటలు మస్తుంటయి" మెచ్చుకొనే సరోజ. తన చెల్లిని ఏడిపించినోడిని ఎదికి పట్టుకొని కొట్టాలనే హీరోయిన్ అన్న, గాపన్జేసిన హీరోని ముందుగాల ఈసడించినా తర్వాత గాని బుద్ధిదెల్సి గాడినే లవ్వాడే హీరోయిను, ఈళ్ళిద్దరూ తమ ప్రేమను ఎట్టా గెల్సా రనేది బాగొప్పగా చూపెట్టే గా డైరెట్రు.
"ముందుగానే వాడే తన చెల్లిల్ని ఏడిపించిన వాడని తెలిస్తే ఆ అన్న ఏమి చేసే వాడక్కా ?" సాలోచనగా అడిగింది దీప్తి.
"గప్పుడాడికొచ్చిన కోపానికి చేమడాల్ దీసెటోడుగాదు?"
"హూ... ! కదా? కోపం అంత పని చేయిస్తదక్కా"
"మరి.... ఊర్కొంటారు?"
"అవును ఊరుకోరు. అలాగని ఆవేశంలో దెబ్బవేస్తే, తన్నులు తిన్నా వాళ్ళమీద జనాలకి జాలి కలుగుద్ది కానీ ముందు బాధను అనుభవించి అందుకు ప్రతీకారంగా చెయ్యెత్తిన వారిపట్ల ఎటువంటి సానుభూతి చూపించరక్కా. అయితేమాత్రం... ఇంతటి దుర్మార్గానికి ఒడిగడతారా? అని అడుగుతారు గానీ ఎంత క్షోభ పడితే అంతకు తెగించారనేది అర్ధం చేసుకోరు. ఇది సినిమా కాబట్టి ఆ హీరోలో ఇంకెన్నో మంచి లక్షణాలు ఉన్నట్టు చూపించి ఆ అమ్మాయిని మెప్పించారు. కానీ నిజ జీవితంలో మనకు ఆ క్షణం కనపడేదే తప్పా, అంతకు ముందూ, ఆ తరవాత
వాళ్ళెల్లాంటివాళ్ళో తెలుసుకొనే వీలుండదక్కా. తన చెల్లిని కష్ట పెట్టిన వాడిని చంపాలనుకున్న అన్నగా ఆ క్షణం వాడు కరెక్టు. మరి అదే జరిగి అతను జైలుకెల్లితే..... ఈ కథ ఇంకోలాగుండేదక్కా. అప్పుడెవరు కథానాయకుడయ్యేవారు?" ఆవేశంగా చెప్పుకుపోయే దీప్తి.
ఏమనాలో తెల్వక అట్నే చూస్తుండిపోయే సరోజ. గామే చెప్పిందేదీ నిజానికి తనకు అర్ధంగాలే, అందుకే "గది సిన్మారా. ఇడిసెయ్యి" అనే.

"అది కాదక్కా. ఇందాక నువ్వడిగావు కదా మీ అమ్మా నాన్నా, అత్తా మామా, నీ తమ్ముళ్లూ లేరా? రారా? అని..."
"హా......! ఏంది నీది లవ్వు లగ్గమా? అయితేమళ్ళా మనమడు పుట్టిండని చెప్పొద్దా.... ఉరకతా వచ్చేటోళ్లు మీ వొళ్ళంతా. ఓ... మళ్ళా ఇంగో కొత్త సిన్మా లెక్క నీ మొగోడిని, పసోడిని ఏమన్నా జేస్తారని భయపడ్డవా? గదేనా నువ్వు జెప్పేది? అవ్వన్ని సిన్మాలలోనే అమ్మా. బయటట్టుంట్రా ఏంది?"
నిర్వికారంగా నవ్వి "కాదక్కా నాదింకో కథ" శున్యం లోకి చూస్తా దీప్తి అనే సరికి "మారదేందో చెప్పు" ఆమెనే చూస్తా అన్నది సరోజ.
***************************
"పదిహేనేళ్ల క్రితం బెజవాడలో ఓ చిన్న పిల్ల హత్య జరిగింది - అప్పట్లో టీవిలో కూడా తెగ చూపించారు. నువ్వూ వినే ఉంటావ్. బ్యాంకు మేనేజర్ కూతురు"
"హా.... నాకూ యాదుంది. చంపినోడు గాయన సాలె గాడే గదా, పాపం పసిదాని గలా కత్తితో కోసి తల యాడో పారేసిండు. గా ముచ్చటేనా నువ్జెప్పెడిది?"
"అవునదే. నీకింకా గుర్తుందా ?"
"లే.... ఈ మధ్యలనే గా సాలె గాడికి యావజ్జీవ శిక్ష పడిందని టీవిలల్లా మళ్ళా గా కేసు మొత్తం చూపెడ్తుండే. అందుకే యాదుంది".
"నువంటున్నా సాలేగాడు మా నాన్నక్కా"
"యే.... నే తిట్లే. బామర్దని అన్నా. అంతే" సర్దుకొని కూర్చొంది సరోజ.
"పర్లేదక్కా. మాకలవాటైపోయింది. ఇందాక చెప్పా కదా, దెబ్బ తిన్నా వాళ్ళ గురించే గానీ - అందుకు కారణాల గురించి జనాలు ఆలోచించరు". సరోజ తలొంచుకొనే, దీప్తి చెప్పబట్టే, "మా ఆయన ఆ బ్యాంకు మేనేజర్ కొడుకు. నాకువరసకు బావ - మేనత్త కొడుకు, అదే ఆ మేనేజరు
మొదటి భార్య బిడ్డ. ఈయన పుట్టిన కొన్నాళ్ళకి మా మామయ్యకి ఇంకో ఆడది కావాల్సొచ్చింది. ముందు టూర్లని, ఆడిట్లని పోయి వారం పదిరోజులకి తిరిగొచ్చేవాడు. తర్వాతర్వాత ఆ పిల్ల పుట్టాక అసలు ఇంటికి రావడమే మానేసాడు. అస్సలేం పట్టించుకోవడం లేదని మా మేనత్త పుట్టింటికొచ్చేసింది. మా తాతయ్య, నాన్నా ఎన్నో సార్లు అయ్యన్ని కలిసి వీళ్ళకి అన్యాయం చెయ్యొద్దని బ్రతిమాలాడారు ఆయన మారకపోయేసరికి సరికి కోర్టుకెక్కారు. అక్కడ లాయర్లు తిమ్మిని బమ్మిని చేసి మా అత్త నడవడిక సరిగా లేదని వేలెత్తి చూపించారు. చివరికి కోర్టు విడాకులిచ్చి భరణం మంజూరు చేసింది. ఇంత జరిగాక వాడి సొమ్ము నాకొద్దని కొడుకుని తీసుకొని వచ్చేసి ప్రైవేటు స్కూల్లో టీచర్గా చేరి వేరే ఇంట్లో ఉండేది మా మేనత్త.
ఆ పిల్ల కార్లలో తిరుగుతూ, పెద్ద ఇంగ్లీషు స్కూలులో చదువుతుంటే మా బావ మున్సిపాలిటీ బడిలో చెదివేవాడు, ఆ అమ్మాయి పుట్టిన రోజుకి పెద్ద పెద్ద వేడుకలు జరిగితే, ఈయన పుట్టిన రోజుకి కొత్త బట్టలు కూడా ఉండేవి కావు. కొన్నాళ్ళకి ఆయనకి ఇంకో కొడుకు పుట్టాడు. ఇక ఆ కుటుంబం సరదాలు, సంబరాలలో మునిగిపోయింది. ఆ నోటా ఈ నోటా ఇవన్నీ మా నాన్నకి తెలిసేవి. తన చెల్లెలు రోజు గడవని దీనావస్థలో ఉంటడం, అదే సమయంలో ఆ రెండో కుటుంబం ఎంతో వైభోగం అనుభవిస్తుంటడం చూసి మా నాన్న తట్టుకోలేకపోయేవాడు. తన బావకి బుద్ది చెప్తానని ఎప్పుడూ అంటుండే వాడు, తన చెల్లి, మేనల్లుడికి చెందాల్సిన సౌకర్యాలని అనుభవిస్తున్నా పిల్లలు సుఖ పడరాని వీళ్ళ ఉసురు వాళ్ళకి తప్పక తగులుతుందని అంటా ఉండేవాడు. ఇందాక సినిమాలో ఆ అన్న అన్నాడు గుర్తుందా, 'నా చెల్లికి కదా జరిగింది నీ చెల్లికి కాదుగా' అనీ, అలాగే తన బాధ ఆ బావకి తెలియాలంటే అపురూపంగా పెంచుకుంటున్నా అమ్మాయిని ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకొని పధకం ప్రకారం స్కూల్ దగ్గర పట్టుకొని గొంతు కోసి - తల ఎత్తుకుపోయి కృష్ణలో పడేసాడు. నిజంగానే ఆడికి షాక్ తగిలింది - విషయం తెలీగానే గుండె పోటొచ్చింది, కానీ పాపీ చిరాయువంటారుగా అలా బ్రతికి బట్ట కట్టాడు. నాన్నే వెళ్లి పోలీసులకి లొంగి పోయాడు. ఆ కేసు ఇన్నేళ్లు నడచి ఈ మధ్యనే తీర్పొచ్చింది" కళ్ళు మిటకరిస్తా చూస్తుండి పోయింది సరోజ.
కాసేపటికి తేరుకొని, "అయితే మాత్రం పిలవాలి కదా, పోనీ మీ అమ్మనైనా..."
"ఆవిడొస్తే నాన్న గురించి అడుగుతారనక్కా ఎక్కడికీ రాదు. అత్తయ్యనీ అప్పట్లో టీవిలో చూపించారు కాబట్టి ఎవరన్నా గుర్తు పడతారని భయం. ఈయన్ని చిన్న పిల్లాడిగా చూపించారు, ఇప్పుడెలా ఉన్నదీ ఎవరికీ తెలియదు. ఈ విషయంలోనే మా తమ్ముళ్ళకి ఈయనంటే కోపం. ఈ గొడవలన్నీ ఎందుకనే ఇంత దూరమొచ్చి బ్రతుకుతున్నాం".
"అట్నా. మరి మీ లగ్గమెట్లాయే?"
"ముందు బయట సంబంధాలే కొన్ని చూసారక్కా. నాన్న విషయం తెల్సి కొందరూ, కట్నం ఇవ్వలేమని కొందరూ వెనక్కి పోయారు. ఓ రోజు ఈయనొచ్చి మా అమ్మతో నన్ను చేసుకుంటానని అడిగారు, ఆమె వెంటనే ఒప్పుకుంది కానీ నేను 'మా నాన్న మీ కోసం చేసిందానికి ప్రత్యుపకారమా బావా?' అనడిగాను. బంధుత్వంలోని బాధ్యతనెరిగి ముందుకొచ్చానన్నారు. ఇప్పటికి అయిదేళ్లక్కా, మేమూ అందర్లానే గొడవలు పడతాం కానీ ఎప్పుడూ 'నిన్ను చేసుకోవాల్సొచ్చింది' అని మాత్రం అనలేదు". కళ్ళు తుడుచుకుంటా చెప్పింది దీప్తి.
"పిచ్చి పిల్లా అట్టా ఏడ్వమాకు, అన్నీ అవ్వే సర్దుకుంటాయి. మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుతది"
"మంచీ, చెడూ అనేవి పరీస్థితుల బట్టి మారుతుంటాయక్కా. రామాయణంలో పితృ వాక్య పరిపాలన చేసిన రాముడు దేవుడు కానీ భారతంలో అదే పని చేసిన శకుని దుర్మార్గుడు. తన చెల్లిని హింసించారని ప్రతీకారానికి పూనుకున్న రావణుడు దైత్యుడు - సమయానికి సోదరికి చీర నందించి, బావలు యుద్ధంలో గెలవడానికి తోడ్పడిన కృష్ణుడు దేవుడు. ప్రారబ్ధం, పూర్వజన్మ ఫలం అని ఏవేవో చెప్తారు గానీ ఎందుకు అలా చెయ్యాల్సొచ్చిందనేది ఎవరూ పట్టించుకోరక్కా". ఆవేశంగా చెప్పుకు పోతుంది దీప్తి.
"మస్తు ఎదాంతం చెప్పినవులే".
"వేదాంతం కాదక్కా... మనోవేదన. టీవిలో నాన్నని అందరూ రాక్షసుడన్నారు, నడి రోడ్డుమీద ఉరి తియ్యాలన్నారు, పెరోల్ మీద నాన్న నా పెళ్ళికొస్తే అయినోళ్ళూ, కానోళ్ళూ చూపులతో, సూటి పోటీ మాటలతో ఎంతో అవమానంచేసారు. ఎంతమందికని విడమర్చి చెప్పుకొనేది - అంతా విన్నాక కూడా 'ఏమైనా అలా చేసుండకూడదు, పసి పిల్ల మీదా నీ ప్రతాపం? మీ బావని ఏమైనా చేసుండాల్సింది' ఇలా రకరకాల వ్యాఖ్యానాలు. భరించలేక పోయాడక్కా. మా నాన్న ఎన్నో హత్యలు చెయ్యలేదక్కా అసలు అది తన మనస్తత్వంకూడా కాదు కానీ అప్పటికి ఆ క్షణాన కల్గిన ఆవేశంతో చేసిన ఒక్క తొందరపాటు పనివల్ల ఓ ముద్ర పడిపోయింది ఇక మేమంతా జీవితాంతం దాన్ని మోయాల్సిందే. ఇందాక చెప్పా కదా, ఆ హీరోయిన్ అన్నకి హీరో దొరికి, జరక్కూడనిదేదైనా జరిగితే.... అప్పుడు అదీ మా కధే అయ్యేది".
"అవ్వ్ గానీ, మరి మీ అమ్మేమంటుండే?"
"అప్పట్లో చిన్న వాళ్ళం మాకు తెలియదుగానీ ఇప్పుడు మాత్రం అంతా తన తలరాతంటుంది. ఆడపడుచుని గానీ ఈయన్ని గానీ ఏమీ అనదు అయినా శకుని పెళ్ళాం గురించి నీకు తెలుసా అక్కా?"
"అదేంది గా బద్మాష్ గానికి లగ్గమయ్యిందా? చిన్నగున్నప్పుడు టీవీల మహాభారతం జూసినప్పుడెప్పుడూ ధుర్యోధనుడి పక్కన్నే ఉంటుడె"
"అదే కదా... పెళ్లయింది, ఆవిడ పేరు ఆర్శి. వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు, వాళ్లలో ఒకడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆమెనడిగితే చెప్పేదేమో, మెతుకూ మెతుకూ కతికి, తొంబై తొమ్మిది మంది సహోదరులని కాటికి సాగనంపి, తండ్రి చేత కాలు విరచబడిన ఆ శకుని, రాజభోగాలనీ, పెళ్ళాం పిల్లలనీ కాదనుకొని తదేక దీక్షతో ప్రతీకారాగ్నిలో రగిలిపోతూ నూర్గురు కౌరవులనెందుకు అంతమొందించాడోనని. కానీ అక్కడామె కథకు అనసరం. ఈ కథలో మా అమ్మా అంతే"
"ప్లేట్లలోపెట్టి ఇచ్చేయి, మేమక్కడే అన్నం తినేస్తాం" అంటా ప్రవీణ్ వచ్చి పిలిచేసరికి దీప్తి లేచి వెళ్ళింది వడ్డించనీకి. సంగతైతే ఎర్కైయింది, ఏమంటే ఏమైతదో అని సోచాయించి, సైలెంటుగా సిన్మా చూడబట్టే సరోజ.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు