అనగనగా దేవాది అనే గ్రామంలో శ్రీ కోదండరామలింగేశ్వర ఆలయం ఉండేది. ఆ ఆలయ ప్రాంగణంలో నాని అనే ఏనుగు ఉండేది. దాని బాధ్యతలన్నీ మోహన్ అనే ఒక మంచి వ్యక్తి చూసుకునేవాడు. అతడు నానిని ఎంతో ప్రేమతో పెంచడం వలన అది ఎప్పుడూ ఆరోగ్యంగా మరియు బలంగా ఉండేది.
ఒక ఉదయం ఆలయ హుండీలో డబ్బులు పోయాయని ఆలయ పూజారి ఫిర్యాదు చేసాడు. ఆ ముందు రోజు రాత్రి ఆలయంలో ఉన్నది రాము ఒక్కడే కాబట్టి ఖచ్చితంగా ఆ దొంగతనం అతడే చేసాడని నిర్దారించి అతడిని పూజారి గుడి నుంచి శాశ్వతంగా బహిష్కరించడం జరిగింది.
మరుసటి రోజు పూజారి తన స్నేహితుడొకడిని తెచ్చి రాము స్థానంలో అతడికి ఆలయ ఏనుగు సంరక్షణా బాధ్యతలను అప్పజెప్పాడు. అతడి పేరు శ్రీను. అతడు ఒక దొంగ. అంతకు మునుపు ఆ ఉద్యోగం కోసం అతడు ప్రేయత్నించినా, ఊరి ప్రజల సహకారంతో రాముకి అది దక్కింది.
శ్రీను చెడు ఆలోచనలు కలిగినవాడు. ఆలయానికి వచ్చిన భక్తులు ఒక్కొక్కరి నుంచి పది రూపాయలు తీసుకుని ఏనుగు తొండంతో దీవెనలు ఇప్పించేవాడు. ఒకవేళ ఏనుగు మొండి చేస్తే దాన్ని చితక బాదేవాడు. అలా అతను సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని ఆలయ పూజారికి ఇస్తుండేవాడు. ఇద్దరూ తోడుదొంగలుగా ఉండేవారు. ఏనుగు కోసం దేవాదాయ శాఖ వారు వెచ్చించిన సొమ్మును కూడా వారిరువురూ పంచుకుని ఆ మూగ జీవికి కొంచం కొంచం దాణా మాత్రమే పెట్టడం వలన అది బాగా బక్కచిక్కి పోయింది.
తాను ఎంతగానో అభిమానించే నానిని చూసి చాలా రోజులు అవ్వటంతో ఎలాగైనా దానిని చూడ దలచాడు రాము. ఒక రాత్రి అతడు ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అక్కడ బక్క చిక్కిన నానిని చూసి నిర్ఘాంత పోయాడు. నిద్ర పోతున్న నానిని లేపి కౌగిలించుకున్నాడు. ఆ ఏనుగు కూడా తన తొండంతో అతడిని ప్రేమగా పట్టుకుని ఏడ్చింది. శ్రీను చేస్తున్న చేష్టల గురించి సైగలు చేసి చెప్పింది. అది అర్థం చేసుకున్న రాము చాలా బాధ పడ్డాడు.
ఆ ఆలయం పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఎవరైతే ఆ ఆలయ ఏనుగు సంరక్షకులుగా ఉంటారో వారికి ఆ ఇల్లు వసతి గృహంగా ఇవ్వ బడుతుంది. అందు వలన ఆ సమయంలో అందులో శ్రీను నిద్ర పోతున్నాడు.
తాను హుండి లోంచి డబ్బులు దొంగిలించకుండానే తన పైన నిందలు మోపి, ఆలయ పూజారి ఆతనికి అనుకూలంగా ఉండే శ్రీనుని ఆలయ ఏనుగు సంరక్షకుడిగా బాధ్యతలను అప్పజెప్పాడన్న విషయం రాముకి అర్థమైంది. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన తట్టింది. నానికి సైగ చేసి ఆలయ హుండీని పెకిలించమన్నాడు. వెంటనే ఏమీ ఆలోచించకుండా నాని ఆ హుండీని పీకి రాము చేతికి అందించాడు. రాము మళ్ళీ గోడ దూకి నెమ్మదిగా శ్రీను ఉంటున్న ఇంటి పెరట్లోనికి చేరాడు. రాము ఇంతకు మునుపు అదే ఇంట్లో ఉండటం వలన ఆ ఇంట్లోకి రహస్య మార్గం అతడికి తెలుసు. ఆ దారి గుండా లోపలికి చేరాడు. ఆ సమయానికి శ్రీను గాఢ నిద్రలో ఉన్నాడు. రాము తన చేతి లోని హుండీని మెల్లగా శ్రీను మంచం కింద తోసి పెట్టి మరల బయటకి జారుకున్నాడు.
మరుసటి రోజు ఆలయ హుండీ పోయిన విషయం ఊరంతా తెలిసి జనమంతా ఆలయానికి చేరుకున్నారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. వారిని చూస్తూ నాని తన తొండంతో పూజారి వైపు ఒకసారి శ్రీను వైపు ఒకేసారి చూపించ సాగింది. తరువాత తనని అనుసరించమన్నట్టుగా సైగ చేసింది. అందరూ నానిని అనుసరించారు. అది శ్రీను ఉంటున్న ఇంటి వద్దకు చేరింది. వెంటనే అనుమానం వేసి అధికారులు అతడి ఇంటిని తనిఖీ చేసే సరికి వారికి అతని మంచం కింద హుండీ దొరికింది. వెంటనే అధికారులు, పూజారిని మరియు శ్రీనుని గుడి అధికారాల నుంచి శాశ్వతంగా తొలిగించారు. అంతే కాకుండా గుడికి నష్ట పరిహారంగా చెరో పది వేలు జరిమానా వేశారు.
గుడికి ఈసారి మంచి పూజారి వచ్చాడు. రాము మళ్ళీ తన విధుల్లో చేరాడు. రాము సంరక్షణలో నాని మళ్ళీ బలంగా, ఆరోగ్యంగా మారాడు. భక్తులకు రాము కూడా తన ఏనుగుతో దీవెనలు ఇప్పించేవాడు, కానీ ఉచితంగా!