అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేల'ని పనిలో చేరిన రోజే చెప్పేశాను వనమ్మకి,"నేను కాఫీ టీల్లాంటివి ఇవ్వలేనమ్మా రోజూ టిఫిన్ మాత్రం పెడతాను' అని.
" అయితే మరో రెండొందలు ఎక్కువియ్యాలమ్మా" అంది.సరేనన్నాను.నాలుగు రోజులు బానే చేసింది.
మనిషికొక తెగులు మహిలో వేమా' అన్నట్లు ఎదురింటి మీనాక్షమ్మ గారికి ఎవరింట్లో పనివారొచ్చినా తొంగి చూడడం పనయ్యాక పిలిచి ఊర్లో విషయాలు పిచ్చాపాటి వేసుకోవడం అలవాటు.'కందకు లేని దురద కత్తిపీట కెందుకని',"మా పనమ్మాయికి రోజూ కాఫీ ఇస్తాను,మొన్నొక చీర కూడా ఇచ్చాను" అందిట వనమ్మతో.మా పనికి రెట్టింపు పని చేయించుకుని, రెండొందలు తక్కువే ఇస్తుంది జీతం.
చేరి నాలుగు రోజులే కదా,రెండు నెలలు చూసి చీర ఇద్దామనుకుని ఊరుకున్నాను. మన 'మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?'ఆరోజు నుంచీ గిన్నెలు ఢమఢమ శబ్దాలు చేస్తూ కాఫీ సంగతి తేల్చేవరకూ కుదరదన్నట్లు ప్రవర్తించేది.'కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందని',మర్నాడే ఒక చీర ఇచ్చాను.ఇంతలో మీనాక్షమ్మ గారి పనిమనిషి రావటం లేదని ఈమెను పంపమంది.అక్కడి నుంచి'పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు' ఊర్లో రామాయణమంతా వనమ్మతో పిచ్చాపాటీ పెట్టేది.అది వనమ్మకి భలే కాలక్షేపం.ఇక ఆవిడ చెప్పిందే వేదమైపోయింది వనమ్మకి.
రాజుగారి దివాణంలో చాకలోడి పెత్తనమన్నట్లు' మా యింటి పనిలో కూడా వనమ్మకి ఆమె సలహాలే.ఇక నాలుగు రోజులకోసారి పని ఎగరగొట్టడం మొదలెట్టింది.అడిగినా,'నిమ్మకు నీరెత్తినట్లుం'డేది.'కందకు కత్తిపీట లోకువ'ని,ఎప్పుడూ ఏవో కుంటి సాకులు చెప్పేది."నేతి బీరకాయలో నెయ్యెంత నిజమో,దాని మాటలో కూడా అంతే నిజమని'తెలుసు నాకు."'అడ్డాలనాడు బిడ్డలు గానీ, గడ్డాలనాడు బిడ్డలా'మ్మా?నా కొడుకు,కోడలు ముద్ద కూడా పెట్టరు'అంటే రెండు పూటలకీ అన్నం,కూర ఇచ్చి పంపేదాన్ని. ఆర్నెల్లకే తన మనవలకి మా పిల్లల బట్టలు, ఓ అరడజను చీరలు ముట్టజెప్పాను.కొడుక్కి పాము కరిచిందంటే ఐదొందలిచ్చాను ఖర్చులకి.
ఓపక్క 'నడమంత్రపుసిరి నరాల మీద పుండు'కదా,ఆ అహంతో వనమ్మ నన్ను మెచ్చుకోవడం మీనాక్షి గారికి 'పుండు మీద కారం చల్లినట్లయి,అవీఇవీ చెప్పి, మొత్తానికి మాయింట్లో పని మానేసేలా చేసింది.
'పాపమని పాతచీర ఇస్తే గోడచాటుకు వెళ్లి మూర వేసిందట'.
పరమ పిసినారి అయిన మీనాక్షి గారు ఇచ్చే జీతానికి అంత పని చేయలేక,'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది'వనమ్మ పని.లేనిపోని ఆడంబరాలకు పోయి,ఇంట్లో ఉన్నవన్నీ వనమ్మతో చెప్తుండడంతో ఓరోజు సందు చూసుకుని,వనమ్మ మీనాక్షి గారి చెవి కమ్మలు ఎత్తేసింది.'ఊరంతా చుట్టాలు,ఉత్తి కట్టకు తావులేద'న్నట్లు ఆవిడ సంగతి తెల్సినవాళ్ళెవరూ జాలిపడలేదు.
తాను తీసిన గోతిలో తానే పడ్డట్ల'యింది మీనాక్షి గారి పరిస్థితి. వనమ్మ దారిలో కనపడితే ఈ విషయమై మందలించబోయాను.'కూటికి పేదవాళ్ళమైనా గుణానికి కాదమ్మా' అంది.'ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు' అనుకుంటూ ఇల్లు చేరాను. మీనాక్షి గారు మొహం చాటేస్తుంటే నేనే పలకరించాను.పాపం మీనాక్షి గారిని చూసి నాకైతే జాలనిపించింది.అందుకేగా అంటారు,'చెరపకురా చెడేవు' అని.