నాకూ పిల్ల కుదిరింది - బొందల నాగేశ్వరరావు

naku pilla kudirindi

అప్పారావు స్నానమైన తరువాత తన గదికొచ్చి నిలువుటద్దం ముందు నిలబడి యాడ్సులో వచ్చే రకరకాల పోజులు తనకు తానే యిచ్చుకొంటూ,తనివితీరా చూసుకొంటూ ఆనందించాడు. అప్పుడు మొలకు టవల్ను చుట్టుకొని వున్నాడులెండి. పోజులివ్వడం ఆపి తల దువ్వుకోవటం చూసుకోవటం,చేత్తో చెరిపేసుకోవటం, మళ్ళీ తల దువ్వుకోవటం,చూసుకోవటమంటూ పది నిముషాల పాటు పదిసార్లు చేసింతరువాత తన అందానికి తనే మురిసిపోయి బట్టలేసుకొని 'టక్' చేసుకొని హాల్లోకొచ్చాడు. ఇక్కడ అందమంటే చెప్పుకోవాలి.మనిషి చాలా పోడవు. అంటే ...అయిదడుగులు.ఇక రంగు పాత చింత పండులా,పళ్ళు ముత్యాల్లా కాకుండ జొన్నదంటు బెండుల్లా వుంటాయి.అదే అందర్ని ఆకట్టుకునే అందమని తనకు తానే అనుకొంటాడు. ఇక్కడ మరో ముఖ్యమైన సంగతి ప్రస్తావించాలి,అప్పారావు రెండు చేతుల్లో ఎడమమచేయి కుడి చేయి కన్నాఒకటిన్నర అంగులం చిన్నది. పాపం...భగవంతుని సృష్టే అంత.అదో పెద్ద హునంలా భావించుకునే అప్పారావు దాన్ని భాహ్య ప్రపంచానికి తెలియకూడదన్నంతగా చక్కగా ఎప్పుడూ ఫుల్ హేండు షర్టుతో వుంటాడు.అయితే తనకు రాబోయే భార్యమాత్రం ఎలాంటి హునం లేకుండ ఎంచక్కా ఐశ్వర్యారాయ్ కన్నాఅందంగా వుండాలనుకొంటాడు.

ట్రిమ్ముగా తయారైన అప్పారావు అందరి చూపులు, ముఖ్యంగా ఆడవాళ్ళ చూపులు తనపైనే పడాలన్నంతగా నాజుగ్గా,హుందాగా కనబడుతూ బయటికొచ్చి నిలబడ్డాడు తన ఫ్రెండూ, ఆఫీసుమేటయిన కనకారావుకోసం.ఎందుకంటే అతనే అప్పారావుని రోజూ బైకులో ఆఫీసుకు తీసుకువెళ్ళే డ్రయివర్ .అయితే టిక్కెట్టుకయ్యేడబ్బు'ఎందుకులేరా'అనిఅంటూనే ఖచ్చితంగా తీసుకొంటాడు కనకారావు.కనుకనే ఆ స్నేహం బైకువరకే నన్నట్టువుంటాడు అప్పారావు.

కనకారావు బైకు రాగానే అప్పారావు ఎక్కి కూర్చొన్నాడు.బైకు వెళుతోంది.అప్పారావు రోడ్డున వెళుతున్న ఆడవాళ్ళు తన్ను చూస్తున్నారో లేదోనన్నట్టు అటూ ఇటూ చూస్తూ అసహనంతో "ఏమిట్రా!కాస్త త్వరగా రాకూడదూ...శివాలయానికెళ్ళే వాళ్ళం!"అన్నాడు.

"అబ్బా!నీకు భక్తి మరీ ముదిరిపోయినట్టుందే!త్వరగా వచ్చుంటే గుడికెళ్ళేవాడివా?" ఎగతాళిగా అన్నాడు కనకారావు.
"అంటే ఇవాళ శుక్రవారం కదా!కాలేజీకెళ్ళే అమ్మాయిలు,ఆఫీసులకెళ్ళే ఆడాళ్ళతోగుడి అందంగా వుంటుంది.అలాంటప్పుడు అక్కడ కాస్సేపు బీటేసి నిలబడితే ఏదేని...."సాగదీస్తూ ఇంకా ఏదో చెప్పబోయాడు అప్పారావు.

"ఓమ్మో!నీకు అలాంటి ఆశకూడా వుందా?నిన్ను నువ్వు ఏప్పుడైనా అద్దంలో చూసు కున్నావా? నీ హైటు అయిదడుగులు.ఓ చేయి పొట్టి.రంగు చెప్పలేను.నీకెంతుందిరా! ఇక వయస్సంటావా ముఫ్ఫైఅయిదుకు పైనే!ఈ పరిస్థితుల్లో నీకు ఐశ్వర్యారాయ్ కన్నాఅందగత్తె కావాలంటావ్ ! ఇది జరిగే పనేనా?"అంటూ ఆఫీసు ముందాపాడు బైకును.

"చూస్తూ వుండరా!నేను కోరుకున్నట్టు అలాంటి అమ్మాయినే చేసుకొంటాను"ధీమాగా అన్నాడు అప్పారావు,

©©©©©©

నెల తరువాత ఓ రోజు ఆఫీసులో అందరూ ఫైళ్ళతో కుస్తీ పడుతున్నప్పుడు ఫోన్ రింగైయ్యింది."హల్లో"అన్నాడు మేనేజరు సుందర్రావు రిసీవర్నందుకొని.
"అప్పారావుగారున్నారాండీ?"ఓ తియ్యటి కంఠం అటునుంచి అడిగింది.
"వున్నారమ్మా!పిలుస్తాను"అంటూ అటు తిరిగి"ఓయ్ అప్పారావ్ !ఫోన్లో నిన్నో తియ్యటి కంఠం పిలుస్తోందయ్యా.ఇదిగో...రా!"అన్నాడు కాస్త పెద్దగా. అలా పెద్దగా పిలవటంతో ఆఫీసులో పని చేస్తున్నవాళ్ళంతా లేచి నిలబడి సుందర్రావుని,అప్పారావుని మార్చి మార్చి చూశారు.
'ఆడ కంఠమా'అనివొత్తి పలుకుతూ క్రాపు సర్దుకొని కాస్త సిగ్గుతో గబగబ వెళ్ళి మేనేజరు టేబుల్ మీదున్నఫోన్ రిసీవర్నందుకొని మోచేతితో టేబుల్ను ఆనుకొని జారిపడబోయి తమాయించుకొని"ఎస్ ధిస్ ఈజ్ అప్పారావ్ !మీరెవరండీ?"అని అడిగాడు అప్పారావు.
"నేనేనండీ!"సున్నితంగా పలికింది అవతలి కంఠం.
"నేనేనంటే ఎవరూ?మీకు పేరూ వూరూ లేదా ఏంటి?"
"నా పేరు శ్రావణి.ఉద్యోగం టెలిఫోన్ ఆపరేటరు.వుంటుంది సనత్ నగరు"వివరాలు మెల్లగా చెప్పిందామె,
'ఏంటబ్బా!ఎంచక్కి వివరాలన్నీ చెప్పేస్తోంది'అని మనసులో అనుకొని"ఓకే!మరి నాతో మీకేం పని?మీకేం కావాలి?"పోజిచ్చి అడిగాడు అప్పారావు.
"నాకూ....నాకూ .... మీరే కావాలండి"టపీమని చెప్పేసింది శ్రావణి.
"నేనా..."దిమ్మితిరిగిపోయింది అప్పారావుకు.షాక్ తిన్నవాడై కళ్ళు బయర్లు కమ్మగా తను ఏం చేస్తున్నాడో కూడా తెలికుండా షర్టు గుండీలను పట్ పట్ మని కొరికి అది ఆఫీసన్నది కూడా మరచిపోయి మేనేజరుమీద పడబోయి అక్కడే వున్న గ్లాసులోని మంచినీళ్ళను గటగట తాగేసి కాస్సేపటికి తేరుకొని"వినండి!మీరెవరో నాకు తెలియదు.బహుశా నన్ను శేఖరనుకున్నారేమో!వాణ్ణి పిలుస్తానుండండి"అని అంటుండగా"శేఖరన్నయ్యగారొద్దండి.నాకు మీరే కావాలి!"అందామె మళ్ళి.
"వరుసలు కలుపుతున్నవ్ !అసలెవరమ్మా నువ్వూ?"మళ్ళీ అడిగాడామెను.
"రేపు చెపుతా!ఇప్పటికి బై"అంటూ కిసుక్కున ఫోన్లోనే ఓ ముద్దు పెట్టి ఫోన్ కట్ చెసింది.
"మైగాడ్ !"అని పెదాలు కొరుక్కొని తడుముకొంటూ"ఒరేయ్ శేఖర్ !"అని పిలిచాడు.
అప్పారావుకి ప్రక్కసీటు వ్యక్తి శేఖర్.తనకు క్లోజ్ ఫ్రెండు.లేచి చాలా కూల్గా దగ్గరకొచ్చి "చెప్పుమామా!మొత్తం గ్రహించానులే! మా చెల్లి మరిన్ని ముద్దులతోమళ్ళీ రేపోస్తా నన్నట్టుంది....ఎంజాయ్ మామా"అన్నాడు.
"ఒరేయ్ !ఆ పిల్ల ఫోన్లో ముద్దు పెట్టింది నీకెలా తెలుసు?"సందేహిస్తూ అడిగాడు.
"నీ నోటినుంచి కారుతున్న సొంగ చూస్తే తెలియట్లే!చూడు మామా!అమ్మాయి లడ్డులా వుంటుంది.ఎటూ నీకు పెళ్ళి గీత వెనక్కు వెళుతుంది కనుక ఈ పిల్లకు 'ఓకే' చెప్పేయ్ !" అన్నాడు నవ్వుతూ తడుముకోకుండ.
"ఎలా...ఎలరా!అమ్మాయి లడ్డులా వుంటుంది,ఓకే చెప్పేయ్ అని అంటున్నావ్ ? తను నీకు ముందే తెలుసా?ఇంతకు నిన్ను అన్నయ్యంటుందేమిట్రా?ఆశ్చర్యాన్ని కనుబరుస్తూ సి.ఐ,డి. పోజిచ్చి అడిగాడు అప్పారావు.
"అలా పోజిచ్చి భయపెట్టకు మామా!ఒకవేళ తను మనిద్దర్నిఎక్కడైనా ఒక్కటిగా చూసుంటుందేమో!ఇక నిన్ను అలా అలా అనుకున్నప్పుడు నేను అన్నయ్యనేగా! పద వెళదాం"అంటూ బ్యాగు తీసుకున్నాడు.
"ఆగు.మరీ..మరీ...అమ్మాయి లడ్డులా వుంటుందని యెలా చెప్పగలిగావు?" నిలదీసి, సాగదీసి అడిగాడు.
"అదీ...అదీ...ఆవిడ కంఠం తియ్యటిదన్నారుగా మేనేజరుగారు.దాన్ని బట్టి...!"అంటూ త్వరత్వరగా బయటికి నడిచాడు శేఖర్ . చేసేది లేక అతణ్ణి వెంబడించాడు అప్పారావు.
©©©©©© ©©©©©© ©©©©©©
రాత్రి భోంచేసి మేడమీద పిట్టగోడకు ఆన్చి పరుపేసుకొని పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు అప్పారావు.నిజానికి తనతో ఫోన్లో మాట్లాడిన శ్రావణి తన్ను కావాలని కోరుకొంటుందంటే తన్ను యెక్కడో చూసి తనపై మనసు పారేసుకుందనేగా అర్థం.అంటే అందరూ తన్ను జముడుకాకని,చింతపండని,పొట్టోడని నానారకాలుగా అంటుంటే శ్రావణి కళ్ళకు మాత్రం నవమన్మథుడిలా కనబడుతున్నట్టు ఫీలయ్యాడు అప్పారావు.అందుకే ఆమెను రేపే ముఖాముఖిగా కలుసుకునే ఏర్పాట్లు చేసుకొని సందర్భం కలసివస్తే తనలోని లవ్వును చెప్పాలనుకున్నాడు.
మరుసటి రోజు వుదయం అప్పారావు ఆఫీసుకు యథావిధిగా తయారై కనకారావుకోసం ఎదురు చూడకుండా తనే నడిచి బస్టాండుకు వెళ్ళాడు.నిన్న జరిగిన సంఘటన్ను గుర్తుకు తెచ్చుకొని ఆనందంతో ప్రక్కనే వున్న శివాలయంలోని శివుడికి దణ్ణం పెట్టుకున్నాడు.ఆ సంతోషంలో మెట్లమీద కూర్చొని భిక్షం అడుక్కొంటున్న భిక్షగాళ్ళ బొచ్చల్లో తలా పది రూపాయల్ను వేశాడు.అంతలో గుడికి కనకారావు కూడా బైకులో వచ్చాడు.ముసిముసి నవ్వులతో బైకెక్కాడు అప్పారావు.ఇద్దరూ తుర్రుమన్నారు ఆఫీసుకి.
అప్పారావు ఆఫీసులో ఏదో పని చేస్తున్నాడన్న మాటే కాని మనసంతా ఆ శ్రావణి చుట్టే తిరుగుతోంది.ఎవరికి ఫోనొచ్చనా అది తనకే వచ్చిందన్నట్టు అటు చూడ్డం'ఛ'అని మళ్ళీపని చేసుకోవడమంటూ వుండడంలో అర్థగంట గడిచిపోయింది.
అంతలో......
""ఓయ్ !అప్పారావ్ !నీకు ఫోనొచ్చిందయ్యా!"అన్న పిలుపుతో ఎగిరి గంతేసి ఫోనందుకొని
"ఏస్ !అప్పారావు స్పీకింగ్ !"అన్నాడు క్రాపును సర్దుకొంటూ అప్పారావు.
"నేనేనండీ...టెలిఫోన్ ఆపరేటర్ను"
"ఓ శ్రావణిగారా!మీ ఫోన్ కొరకే ఎదురు చూస్తున్నాను.ఏమిటో చెప్పండి!అన్నాడు అప్పారావు తనలోని భయాన్నికాస్తా ప్రక్కన పెట్టి ముఖాన్ని హాంకీతో తుడుచుకొంటూ.
కొన్ని సెకండ్లయిన తరువాత"ఇవాళ మీరు చాలా అందంగావున్నారండీ"అంది శ్రావణి.
తన్ను తానే చూసుకొంటూ "నేనా!అంత అందంగా వున్నానా?ఇవాళ నన్నెక్కడ చూశారు?"అడిగాడు అప్పారావు.
"బస్టాండు వద్దున్న శివాలయంలో"
"ఉదయం మీరూ గుడికొచ్టారా?"
"ఆఁ...అక్కడే మిమ్మల్ని కాస్త దూరంగా వుండి చూశాను"
నవ్వి"అయితే నన్ను ఫాలో చేస్తున్నారన్న మాట.ఇంతకు నన్నెందుకు ఫాలో చేస్తున్నట్టో..."
"మరీ...మరీ...మీరంటే...నాకిష్టమండీ"
"అంటే దానర్థం"ఆమెనుంచి తనకు అనుకూలమైన జవాబును రాబట్టుకోవాలని అడిగాడు.
"దానర్థం...మిమ్మల్నీ...మిమ్మల్నీ...ప్రేమిస్తున్నానని"మనసులోని మాట బయట పెట్టింది శ్రావణి.
గుండాగినంత పనైంది అప్పారావుకి."ఏంటండీ మీరంటుది?"గద్గద స్వరంతో అన్నాడు.
"మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.అవునండి!మీరూ ఇష్టపడితే పెళ్ళి కూడా చేసుకొంటాను"
అప్పారావు ఎదురు చూసిన జవాబు ఆమె నోటినుంచి వచ్చింది.ఇక మనసులోనే ఆనందపడిపోతూ కాస్త ధైర్యం కూడదీసుకొని"ఓకేనండి.నాకూ ఇష్టమే!కాని మిమ్మల్ని ముఖాముఖిగా ఒక్కసారి చూసిన తరువాతతే అన్నీనూ"అన్నాడు హుందాగా,ఖచ్చితంగా.
"అయితే రేపు శివాలయానికి ఎదరే వున్న బస్టాండులో వుండండి.నేనక్కడికి వస్తాను"అంటూ ఫోన్ కట్ చేసింది శ్రావణి.
శ్రావణి ఫోన్ కట్ చెసినందుకు అప్పారావు బాధపడలేదు.విషయం సులువుగా జరిగి పోయినందుకు ఆనందించాడు.వెంటనే ఫోన్లోవాళ్ళ మధ్య జరిగిన సంభాషణ్ణు పూసగుచ్చినట్లు సుందర్రావుకు,శేఖర్కు విన్నవించాడు. వాళ్ళుకూడా"ఒరేయ్ అప్పారావ్ !ఈ కాలపు అమ్మాయిలు అబ్బాయిల సంపాదన,కుటుంబ నేపథ్యంతోపాటు అందం కూడా కోరు కొంటున్నారు.కానీ నీ శ్రావణి అలాకాదు.నిన్ను చాలనుకొంటోంది.శ్రావణి మంచిపిల్ల, అందగత్తెని నమ్ముతున్నాం.పైగా వుద్యోగస్థురాలు.అలాంటి అమ్మాయి నీకు దొరకటం అదృష్టంగా భావించి ప్రొసీడైపో!రేపు ఇద్దరూ కలుస్తూనే కళ్ళుకళ్ళు కలుపుకొండి.పెళ్ళిఖాయం చేసుకొండి.మీ వెనుక మేమున్నాం.ఎంజాయ్ !"అని షేకండిచ్చారిద్దరూ.సంతోషంతో పొంగి పోయాడు అప్పారావు.
మరుసటి రోజు......
అప్పారావు,సుదర్రావు,శేఖర్ శివాలయం ప్రక్కనున్న 'టీ'కొట్లో టీ తాగి ఆలయానికి ఎదరే వున్న బస్టాపులో సిమెంటు బల్లమీద కూర్చొని రోడ్డువైపు కళ్ళప్పగించి చూస్తున్నారు శ్రావణికోసం.చూస్తుండగానే ఓ అమ్మాయి మూడు చక్రాల స్కూటీలోంచి దిగిపెదాలపైకి నవ్వుతెచ్చుకొని కర్రల సహాయంతోదాపుకొచ్చింది.ఆమె ఎవరోలేనన్న ధోరణితో రోడ్డు వేపు చూస్తున్నారు సుందర్రావు,అప్పారావు.అయితే కథమొత్తం తెరవెనుకనుంచి నడిపిస్తున్న శేఖర్ చిరునవ్వుతో"రామ్మా శ్రావణి!ఇతనే అప్పారావు.నా స్నేహితుడు.ఒరేయ్!ఈవిడ శ్రావణి.మా బాబాయి కూతురు.టెలిఫోన్ ఆపరేటరు."అనిపరిచయం చేశాడు.శ్రావణి నమస్కరించింది. శ్రావణ్ణి చూసిన తక్షణం అప్పారావుకు కోపంవచ్చింది.ముఖం అటు తిప్పుకొని 'రండి సార్! వెళదాం'అంటూ వెళ్ళబోయాడు.
"ఒరేయ్...ఆగరా!ఏంటి వెళ్ళిపోతున్నావ్ ?శ్రావణి ఫిజికల్లీ హేండు కాప్పుడనా?"నిలదీశాడు.
"అవును.పైగా ఆమె మీబాబాయి కూతురన్న సంగతి కూడా దాచావు.అంగవైకల్యంతో వున్న ఈమెను నాకు అంటగట్టాలని చూస్తున్నావా?ఫిజికల్లీహాండికేప్పుడంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా!?"మనసులోని మాటను బయట పెట్టాడు.
"అన్నీ తెలుసురా!నిజానికి శ్రావణి నిన్ను కలవటానికి కూడా ఇష్టపడలేదు.నేనే నిజాయితిగా నీలోవున్నమంచితోపాటు లోపాలనూ చెప్పినువ్వో అనాధవని కూడా వివరించి,నీపై ఆమెకు జాలిని తెప్పించి ఇక్కడికి రప్పించాను.మీ ఇద్దరూ దఃపతులైతే ఒకరికొకరు తోడు నీడగా, అన్యోన్యంగా వుంటారన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకొన్నాను.తప్పా?"అడిగాడు శేఖర్ .
"తప్పే!నా ప్రమేయం లేకుండా నీ చెల్లెలికోసం నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పుకాదా?ఐయామ్ సారీ!రండి సార్ వెళదాం!"అంటూ సుందర్రావుని తీసుకొని చకచక వెళ్ళిపోయాడు అప్పారావు,
చేసేదిలేక శేఖర్ , శ్రావణి వాళ్ళు వెళుతున్నవేపే చూస్తూ వుండిపోయారు.
©©©©©© ©©©©©© ©©©©©©
ఆ రాత్రి అప్పారావుకు నిద్ర పట్టలేదు.ఎన్నో ఆలోచనలు తన మనసును తొలిచేస్తున్నాయ్! అసలు శ్రావణి,శేఖర్ పట్ల తను అలా నడుచుకొంది తప్పనుకొన్నాడు.శ్రావణితో తనకు పెళ్ళి జరిపించి ఓ ఇంటివాణ్ణి చేయాలనుకొన్న శేఖర్ని, ఫిజికల్లీ హేండికేప్పుడైన శ్రావణ్ణి అవమాన పరచి వచ్చినందుకు బాధపడ్డాడు.నిజానికి అలా అనుకుంటే తనూ ఓ రకంగా ఫిజికల్లీ హేండికేప్పుడేగా!అంతేకాదు.తను నల్లగా,పొట్టిగా అస్సలు చూడలేనంతగా వుంటాడు.అలాంటి తనకు శ్రావణ్ణి పెళ్ళికొప్పించి తీసుకు వచ్చాడంటే స్నేహానికి విలువనిచ్చేగా!అలాంటి వాడిని అవమానపరచటం ఏ మాత్రం న్యాయం కాదనుకొన్నాడు.తను చేసిందంతా తప్పనుకొన్నాడు. భవిష్యత్తులో తన ఒంటరి జీవితాన్నివూహించుకొని భయపడ్డాడు.తనకు శ్రావణే కరక్టనుకొన్నాడు.రేపేవెళ్ళి శేఖర్ను క్షమించమనడిగి ఎలాగైనా శ్రావణితో తన పెళ్ళి జరిపించమని కోరాలనుకొన్నాడు.మొత్తంలో ఎన్నో తర్జన భర్జనల మధ్య తను తీసుకున్న ఆ నిర్ణయంతో మనసును తేలిక చేసుకొని రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు అప్పారావు.
ఉదయం ఏడు గంటలకల్లా శేఖర్ ఇంటి తలుపు తట్టాడు అప్పారావు.తలుపు తెరచి చూశాడు శేఖర్.ఎదరే అప్పారావు.
"రారా...కూర్చో!రాత్రంతా ఆలోచనలతో నిద్రపోలేదు కదూ?మంచి నిర్ణయంతో వచ్చావను కొంటా!"అప్పారావు వాలకాన్ని చూసి అన్నాడు శేఖర్.'అవునన్నట్టు'తలూపాడు అప్పారావు.
"కరక్టురా!గంతకు తగ్గ బొంతన్నట్టు నీకు మా శ్రావణే కరక్టు.మీ ఇద్దరిలో అంగ వైకల్యాలున్నామీ మనసులు మంచివి.మీరు దంపతులైతే చక్కటి జీవనాన్నిగడపగలరన్న నమ్మకం నాకుంది. ఇవాళే బాబాయితో మాట్లాడి మీ పెళ్ళికి ముహుర్తం పెట్టిస్తాను.ఓకేనా!?"
"ఓకేరా!ఇప్పుడే మీ బాబాయి ఇంటికి వెళదాం"అంటూ పెదాలమీదికి నవ్వు తెచ్చుకొన్నాడు అప్పారావు శేఖర్ భుజం మ్మీద చెయ్యి వేస్తూ.

మరిన్ని కథలు

Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి