మా ఇంటి పండగ - బొందల నాగేశ్వరరావు

maa inti panduga
"ఏంటండీ!దిక్కులు చూస్తూ నిలబడ్డారు.ఈ బస్సే మా వూరికి చివరి బస్సు.ఎక్కండి" భర్త భరత్‌ని తొందర చేసింది భూమిక.
దిక్కులు చూస్తున్న వాడల్లా అయిష్టతతో బస్సెక్కాడు.భూమిక కూడా ఎక్కి కిటికీ వేపు భర్తను కూర్చోమని తను ప్రక్కన కూర్చొంది.
"ఏంటి భూమీ!వూరికెళ్ళడం తప్పదంటావా? మీ వూరికి వెళ్ళాలంటే నాకదోలా వుంటుంది. ఇంకోసారి వెళదాం" దిగాలన్న ప్రయత్నంతో లేచి నిలబడ్డాడు భరత్ .
"కూర్చొండి.ఈ ఉగాది మనకు తొలి పండగ.అందుకే వెళుతున్నాం. అవునండీ! మనకు పెళ్ళయి సంవత్సరం కావొస్తోంది.మీ సొంత కారణాలవల్ల దీపావలికి వెళ్ళలేదు. తరువాతొచ్చిన సంక్రాంతికి వెళ్ళలేదు. ఈ ఉగాదికి తప్పకుండా రావాలన్నారు అమ్మా నాన్న. అయినా మా వూరంటే అలా భయపడి పోతారెందుకూ?కూర్చొండి" చెయ్యి పట్టుకులాగింది .
"కాదు...మీ వూరు పల్లెటూరు.బస్సు పూర్తిగా అడవి మార్గాన వెళుతూ వుంటుంది" అన్నాడు.
"ఇది టౌనే!ఏం ప్రయోజనం?మనం వుంటున్న అపార్టుమెంటులో అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వుంటారు.మాటా మంచికి ఇరుగూ పొరుగంటూ ఎవరున్నారు?ఏ పోర్షన్ను చూసినా ఎప్పుడూ తలుపులు మూసే వుంటాయి.ఇక తటస్థంగా ఎప్పుడైనా ఒకరికొకరు ఎదురు పడితే కనీసం 'హాయ్'కూడా చెప్పుకోరు.మా వూరు మండలమండీ! ఎంచక్కా ఉన్నతపాఠశాల,ఆసుపత్రి, బస్ టెర్మినస్,సినిమాహాలు, కొట్ల బజారని అక్కడ అన్నీ వున్నై.చుట్టు వున్న పది గ్రామాలకు మా వూరు సెంటరు.ఎప్పుడూ జనసందోహంతో,జనాల పలకరింపులతో అడావుడితో సందడిగా వుంటుంది. అయినా రేపు ఒక్కరోజే కదండీ! పండగ అయిపోతూనే వచ్చేద్దాం"బ్రతిమాలింది భర్తను.
"నువ్వెన్నన్నా చెప్పు భూమీ!నాకు మనముంటున్న ఈ టౌనే బాగుంటుంది.ఆఁ"
"మరెందుకండీ వెతుక్కొంటూ వచ్చి నన్ను కట్టుకున్నారు.చూడండీ?ఒకటి కావాలనుకుంటే మరొకటి పోగొట్టుకోవాలి.నేను మిమ్మల్ని కట్టుకొని మావూరిని, అమ్మా నాన్నలను వదులుకొని మీతో వచ్చాను.ఇప్పుడు అలా అనుకొని నాతో రండి. పండగవుతూనే వచ్చేద్దాం"
"ఓకే! మళ్ళీ నన్ను రెండు మూడు రోజులు వుండమని నిర్భందించ కూడదు "అంటూ కూర్చొన్నాడు భరత్. బస్సు వెళుతూ వుంది.
కండక్టరు టిక్కట్లు కొడుతూ భరత్ భూమిక సీటు వద్దకొచ్చి "నువ్వంటమ్మా భూమీ! వూరికేనా!"అంటూ రెండు టిక్కట్లు కొట్టి చేతికిచ్చాడు .
"బాబాయ్ డబ్బులివిగో!"పర్సులోనుంచి తీసి ఇవ్వబోయింది.
"నీ వద్ద డబ్బు తీసుకోవడమే!ఏం బాబూ బాగున్నావా ?"అడిగాడు భరత్ ని.
"ఆఁ" అని తలూపాడు భరత్ .కండక్టరు పైకెళ్ళి పోయాడు.
"ఎవరతను మీ బాబాయా?" ప్రశ్నించాడు భరత్ .
"కాదు!ఫ్యామిలీతో మా పొరుగింట్లో వుంటాడు.చాలా మంచివాడు.మా నాన్నంటే గౌరవం" అంటూ కీటికీనుంచి వస్తున్న ఆ చల్లటి గాలికి కళ్ళు మూసుకుపోతుంటే భరత్ భుజం మ్మీద తల వాల్చింది భూమిక.కిటికీలోంచి ప్రకృతిని చూస్తూ వుండిపోయాడు భరత్ .
భరత్ భూమికలకు పెళ్ళయి పదకొండు నెల్లు.భరత్ కు ఓ కార్పోరేటు కంపెనీలో వుద్యోగం కావటంతో కంపెనీకి ప్రక్కనే వున్న ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగాడు.
భరత్ భార్య భూమిక అపార్టుమెంటుకొచ్చిన కొత్తల్లో ఇరుగు పొరుగు,మాటా మంచికంటూ మనుష్యులు లేక కాస్త ఇబ్బంది పడింది.కొన్ని రోజుల తరువాత ఆమెకది అలవాటై పోయింది. తప్పదన్నట్టు తన లైఫ్ స్టయిలును అక్కడికి అనుగుణంగా మార్చుకుంది.
ఉదయం లేస్తూనే కాఫీ టిఫన్లు అయిన తరువాత వంటచేసి భర్తకు క్యారియర్ కట్టి సాగనంపి తలుపులు వేసుకొందంటే సాయంత్రం భర్త వచ్చిన తరువాత తెరుస్తుంది.ఈ లోపు టి.వి చూస్తోంది.కథల పుస్తకాలు చదువుతుంది.భోజనమైన తరువాత కాస్సేపు నిద్రపోతోంది. ఆది శనివారాలంటూ వస్తే భర్తతో బైకులో సినిమాలకు, షికార్లకు వెళుతుంది.అలా వెళ్ళినప్పుడు వంటచేయటం మాని హోటల్లో భోంచేసి వస్తారిద్దరూ.అలా సాగి పోతోంది వాళ్ళ సంసారం.
పాపం!మండల స్థాయిలో వున్న వూరిలో పుట్టి బోలెడు స్నేహితుల మధ్య వుండి ఇంటర్ మ్మీడియెట్ వరకూ చదువుకొని చక్కటి పల్లెటూరి వాతావరణంలో అమ్మా నాన్నలతో, బంధువర్గం మధ్యలో కేరింతలు కొడుతూ పెరిగిన భూమిక ఇవాళ అద్దె ఇంట్లో ఒంటరిగా వుండడం కాస్త బాధాకరం.అందుకే చాన్నాళ్ళ తరువాత పుట్టింటికి వెళుతున్న ఆమె ఆనందానికి అవధుల్లేవు.
రెండు గంటల ప్రయాణం తరువాత ఆ వూరి టెర్మినస్ లో ఆగింది బస్సు.భరత్ భూమికలు దిగారు.అర్థ కిలో మీటరు కావల వున్న వాళ్ళింటికి కొట్ల బజారు దారిన నడక సాగించారు.
"అమ్మా!భూమికా...భూమికా"ఎవరో పిలిచారు.తిరిగి చూసింది భూమిక.పిలిచింది మామిడి పళ్ళబ్బాయి.
"పిలిచావా అన్నయ్యా!"ముఖం నిండా సంతోషాన్ని పులుముకొని అడిగింది భూమిక.
"అవునమ్మా!నీ పెళ్ళి తరువాత ఇవాళే చూస్తున్నాను.బాగున్నావుగా! సార్ చెల్లిని బాగా చూసుకొండి"అంటూ సంచిలో అరడజను మామిడి పళ్ళను పెట్టి భూమిక చేతికిచ్చాడు పళ్ళబ్బాయి. అతనికి రెండు వంద రూపాయల నోటును ఇవ్వబోయాడు భరత్ .
"వద్దు సార్ !ఆ పళ్ళను నా చెల్లికి ప్రేమతో ఇచ్చుకున్నవి.వాటికి వెల కట్టకండి"అన్నాడు .
'సరే'ననుకొంటూ నడుస్తున్నారు భార్యా భర్తలు.
"ఏమిటీ !అతను మీ అన్నా?"భూమికను అడిగాడు భరత్ .
"ఆఁ.అన్నయ్యేలే!పదండి"అంది.మళ్ళీ నడుస్తున్నారు.
కాస్త దూరం వెళ్ళాక "అమ్మాయ్ భూమికా!"అని వెనుకనుంచి పిలిచింది ఒకావిడ.
తిరిగి చూసిన భూమిక. "అరె!పూవ్వులాంటి. ఆంటీ!బాగున్నావా?"అడిగింది.
"మాకేమమ్మా !లక్షణంగా వున్నాం.నిన్ను చూసి చాన్నాళ్ళయ్యింది.ఎలా వున్నావమ్మా!సారు బాగా చూసుకుంటున్నాడా?వెనక్కు తిరుగు"అంటూ మూడు మూరల మల్లె పూలను తల్లో తురిమింది పూలమ్మి .డబ్బు ఇవ్వబోయాడు భరత్ .
"వద్దు బాబూ!ఆళ్ళకు మేమెంతో ఋణ పడి వున్నాం.ఎల్లండి"అంటూ వుండగా మళ్ళీ నడక సాగించారు భార్యాభర్తలు.
"ఏంటీ!మీకిక్కడ అన్నీ ఫ్రీయా!బస్సులో కండక్టరు టిక్కట్టుకు డబ్బు తీసుకోలేదు. పళ్ళతను పళ్ళకు, పూలమ్మి పూలకూ డబ్బువద్దంటున్నారు.పైగా ఋణ పడ్డామంటారు.ఏంటి భూమీ?"
"ఇందుక్కారణం మా నాన్నండి!అవును.ఒకప్పుడు ఆ ముగ్గురి కుటుంబాలు గాడి తప్పి నడుస్తుండేవి.ఆ కండక్టరు బాబాయ్ అప్పుల వాళ్ళ భయంతో పనికెళ్ళేవాడు కాదు. ఓ రోజు ఆంటి మా ఇంటికొచ్చి విషయాన్ని నాన్నకు చెప్పి ఏడిస్తే నాన్నే ఆయనకున్న అప్పులను తీర్చి మళ్ళీ పనికి వెళ్ళేలా చేశాడు.ఇప్పుడు చక్కగా సంపాయించుకొని లక్షణంగా బ్రతుకు తున్నారు. నాన్న వద్ద తీసుకున్న అప్పును కొద్దికొద్దిగా తీరుస్తున్నారు.ఆ పళ్ళు అమ్ముకునే అన్నయ్య బాగా తాగేవాడు,అందువల్ల ఇంటిల్లపాది పస్తులుండే వారు.అప్పుడు అన్నయ్యను కూడా డి-అడిక్షన్ క్యాంపులో వుంచి బాగు చేయించాడు నాన్న. ఇప్పుడు చెడు వ్యసనాలు మానుకొని సంపాయించుకున్న డబ్బుతో చక్కగా సంసారాన్ని సాగిస్తున్నాడు. ఇక పూలు అమ్ముకునే ఆంటి సంగతేంటంటే... ఆమె కూతుర్ని ఒకడు పెళ్ళి చేసుకొని ఓ పాపకు కన్న తరువాత ఎటో వెళ్ళి పోయాడు.అతన్ని వెతికి తీసుకొచ్చి నయాన భయాన మందలించి ఆమె కాపురాన్ని నిలబెట్టాడు నాన్న! అందుకే...."
"అంటే అవకతవకలుగా నడిచే వాళ్ళ వక్ర జీవితాలను సక్రమ మార్గానికి తీసుకువచ్చి నడిపిస్తున్నాడు మీ నాన్న. అందుకు వాళ్ళు ఇలా కృతజ్ఞతలు చూపుతున్నారు. అంతేగా!"
"అంతే కాదండి.ఉన్నత పాఠశాల విద్యలను చదువుతున్న కండక్టరంకుల్ కొడుక్కి, పూలాంటి కొడుక్కి ఫీజులు కట్టి పుస్తకాలను కొనివ్వడమే కాక ట్యూషను కూడా చెపుతుంటాడండీ మా నాన్న!" అంటూ చిన్నగా నవ్వింది భూమిక.ఆమె నవ్వుతో నవ్వు కలుపుతూ ఇంటి ముందు వేసి వుంచిన షామియానా దాటుకొని ఇంట్లోకి అడుగు పెట్టాడు భరత్ తన మామగారు ఓ గొప్ప మనసున్న మనిషే ననుకొంటూ.
"రండి అల్లుడుగారూ!ప్రయాణం బాగా సాగిందా?"అంటూ మంచి నీళ్ళను అందించింది భూమిక తల్లి.
"ఆఁ" అంటూ నీళ్ళు తాగి వరాండాలో వున్న కుర్చీలో కూర్చొన్నాడు భరత్ .
"బాగున్నారా అల్లుడు గారూ!"అంటూ వచ్చి వాలు కుర్చీలో కూర్చొన్నాడు భూమిక తండ్రి .
"బాగానే వున్నాం మామగారూ!"అంటుండగా భరత్ను ఆమె గదికి రమ్మన్నట్టు సైగ చేసి లోనికి వెళ్ళిపోయింది భూమిక.అది గమనించాడు భూమిక తండ్రి.
"సరే!రేపు మాట్లాడుకుందాం!మీరెళ్ళి స్నానంచేసి భోంచేయండి అల్లుడుగారూ!నేనటు వూళ్ళో కెళ్ళి పండగ సందర్భంగా మనింట జరిగే పంచాంగ శ్రవణానికి, పూజకు ఏర్పాట్లు చేసుకు వస్తాను"అంటూ కండువాను భుజాన వేసుకొని లేచాడు భూమిక తండ్రి.
©©©©© ©©©©© ©©©©©
ఉదయాన అయిదు గంటలకే నిద్ర లేచారు తల్లీకూతుళ్ళు.తలంటు స్నానం చేశారు.ఇల్లు కడిగి తుడిచారు. రంగులతో ముంగిట ముగ్గులు వేశారు.గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ద్వార బంధానికి మామిడి ఆకుల తోరణాలు కట్టారు.
పొయ్యి రగిలించారు. .ఈలోపు వంట సహాయానికి పూలమ్మీ,,చిన్న చితక ఇంటి పనులు చేయటానికి మామిడి పళ్ళబ్బాయి వచ్చారు.ఎనిమిది గంటలకల్లా చెక్కర పొంగలి, పులిహోరా,బొబ్బట్లు తయారు చేశారు.అన్నిటిని దేవుని గదిలో వుంచారు.భూమిక తండ్రి ఆదేశాల మేర ఇంటి ముందున్న షామియానాలో మామిడి పళ్ళబ్బాయి చేత టార్పాలిన్ పరచి వరుసగా కుర్చీలను వేయించారు.
భూమిక తల్లి ఉగాది పచ్చడిని తయారు చేసే పని కూతురికి అప్పజెప్పింది. ఆ పనిని బాధ్యతగా స్వీకరించిన భూమిక ముందే తీసి వుంచిన కొత్త బెల్లం,కొత్త చింతపండు, ఉప్పు , పచ్చి మిర్చి,మామిడి కాయలు తీసుకొని వాళ్ళ కాంపౌండులోనే వున్న వేపచెట్టు నుంచి వేప పువ్వును పళ్ళబ్బాయి చేత కోయించి పావు గంటలో తీపి,వగరు, పులుపు,చేదు, కారం, ఉప్పు అన్న షడ్ రుచుల సమ్మేళనంతో దాదాపు అరవై మందికి సరిపడే ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు వుంచింది.
భూమిక తండ్రి ఆహ్వానం మేరా బంధువులు,ఇరుగుపొరుగు వచ్చి కుర్చీలలో కూర్చొన్నారు. వాళ్ళతో పాటు ముందు వరుసలో అల్లుడు కూడా కూర్చొన్నాడు.
రామశాస్త్రి పంచాంగ శ్రవణం పఠించను ప్రారంభించాడు.ఆహుతులందరూ కొత్త సంవత్సరం లో వాళ్ళ వాళ్ళ రాశి ఫలాల ప్రకారం భవిష్యత్తు ఎలా వుంటుందోనన్న ఆసక్తితో వినసాగారు.
ఒక గంటసేపు సాగిన పంచాంగ శ్రవణం దాదాపు అన్ని రాశుల వారికి సంతృప్తికరంగా వుండడంతో అందరూ సంతోషపడి పంచాంగ శ్రవణం అయిపోగానే దేవుడి గదికెళ్ళి దణ్ణం పెట్టుకున్నారు.
భూమిక అందరికీ ఉగాది పచ్చడిని పంచింది.ఆ వెంటనే రెడీమేడ్ ప్లేట్లలో చక్కర పొంగలి , పులిహోరా,బొబ్బట్టు పెట్టి అందరికీ ఇచ్చారు భూమిక తల్లి,పూలమ్మి .అందరూ భోంచేస్తుం డగా నీళ్ళ గ్లాసుల్ని వాళ్ళ ముందుంచాడు పళ్ళబ్బాయి.అర్థ గంటలో భోంచేయడం పూర్తయి ప్రాంగణం సద్దుమణిగింది.
గంట సాయంత్రం నాలుగు----
హాల్లో సోఫాలో కూర్చొని వున్న భూమిక తండ్రి "భూమీ!అల్లుడుగారిని తీసుకొని రమ్మా" అని కాస్త పెద్దగా పిలిచారు.ఇద్దరూ పడక గదిలోనుంచి హాల్లోకి వచ్చారు.అంతలో అల్లుడికి, కూతురికి తీసి వుంచిన బట్టలతో పాటు,పసుపు కుంకుమ ,పూలు, పళ్ళు ,స్వీటును పళ్ళెంలో పెట్టుకొని వచ్చి భర్త ప్రక్కన నిలబడింది భూమిక తల్లి.
భూమిక తండ్రి తన జేబులో నుంచి బంగారు గొలుసును తీసి పళ్ళెంలో వుంచాడు.భరత్ , భూమికలు వొంగి వాళ్ళ కాళ్ళకు నమస్కరించారు. పళ్ళేన్ని ఇద్దరి చేతిలో వుంచింది భూమిక తల్లి.పళ్ళెంలో వున్న గొలుసు తీసి అల్లుడి మెళ్ళో వేసి" మీతో జరుపు కున్న ఈ ఉగాది మాకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చింది అల్లుడుగారూ!గంట అయిదు కావస్తుంది. బయలు దేరండి" అన్నాడు భూమిక తండ్రి.
"లేదు మామగారు!మీరన్నట్టు ఇవాళే వెళ్ళి పోవాలనుకున్నాను.కాని ఈ వూరు, వూరిజనం ఆత్మీయతతో కూడికొన్న మన బంధువర్గ యొక్క పలకరింపులు నన్ను కట్టి పడేశాయి.రేపు ఈ వూరి రామాలయం, ప్రక్కనే వున్న చెరువు, పంట పొలాలు,పళ్ళ తోటలను చూడాలని, అహ్లాదకరమైన, స్వచ్చమైనా ఈ గాలిని ఆస్వాదిస్తూ సంతోషంగా నాలుగు రోజులు మీతో గడపాలని నిర్ణయించుకున్నాను.అవును మామగారూ!ఎప్పుడూ పనుల వొత్తిడితో క్షణం తీరిక లేకుండా ఒకరికొకరు పోటీపడుతూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు యాంత్రికంగా సాగే ఆ సిటీ జీవితానికి ఓ నాలుగు రోజులు దూరంగా వుండాలనుకొంటున్నాను"అన్నాడు అల్లుడు భరత్ .
"అంతకన్నా భాగ్యమా!ఎన్నిరోజులైనా వుండండి అల్లుడుగారూ!"అంటుండగా...
"మా నాన్న మంచి నాన్న"అంటూ కౌగలించుకొని బుగ్గన ముద్దు పెట్టుకొంది కూతురు భూమిక.

మరిన్ని కథలు

Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి