పొలాన్ని తిన్న గట్టు - కృష్ణ చైతన్య ధర్మాన

fencing ate field

మడపామ్ అనే ఊరిలో రంగారావు, విజయ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి నాన్న చనిపోయే ముందు, అతని రెండెకరాల పొలాన్ని వారిద్దరికీ సమానంగా పంచాడు. ఆ రెండు పొలాలు పక్క పక్కనే ఉండి ఒక సన్నని గట్టు చేత విడదీయబడ్డాయి.
రంగారావు మంచివాడే కానీ చాలా అమాయకుడు. ఎవరు ఏమి చెప్పినా నమ్మేసి తరచుగా మోసపోయేవాడు. విజయ్ మాత్రం చాలా తెలివైనవాడు, కానీ మోస పూరితమైన ఆలోచనలు కలిగినవాడు.
వారిద్దరి పెళ్లిళ్లు వారి మేనత్త కూతుళ్ళతో అయ్యాయి. విజయ్ కి ఒక కొడుకు పుట్టాడు. తన పేరు రాహుల్. రంగారావుకి ఒక అమ్మాయి పుట్టింది. తన పేరు సృజన.
ఆ ఊరికి చిన్ను అనే ఒక తెలివైన అబ్బాయి ప్రతి సంవత్సరం సెలవులకు తన తాత గారింటికి వస్తూ ఉండేవాడు. ఈ యేడు కూడా వేసవి సెలవులు అవ్వటంతో చిన్ను మడపామ్ వచ్చాడు.
చిన్ను, సృజన మంచి స్నేహితులు. సెలవులకు వచ్చిన ప్రతిసారి వారిద్దరూ ఎప్పుడూ కలిసి ఆడుకునేవాడు.
రంగారావు అమాయకుడని తెలిసిన విజయ్, ప్రతి సంవత్సరం దమ్ముల సమయంలో, "అన్నయ్యా నీకెందుకు శ్రమ, ఈ గుట్టుని ఇరువైపులా నేను వేస్తాను!" అని చెప్తూ ప్రతి సంవత్సరం, వారి పొలాలకు కామన్గా ఉన్న గుట్టుని కొంచం కొంచంగా, రంగారావు పొలంవైపు నడిపేవాడు. ఆ తేడా కొంచం కొంచెంగా ఉండటం వలన రంగారావు ఆ విషయాన్ని పసిగట్టలేక పోయేవాడు. మన పిల్లలు రోజూ కొంచం కొంచెంగా పెరిగిన విషయం మనం పసిగట్టలేం. కానీ ఏదో ఒకసారి బాగా పొడవైనట్టు తెలుస్తుంది. అదే విధంగా ప్రతి యేడు కొంచం కొంచెంగా తన పొలం వైశాల్యం, దాని వలన వస్తున్న దిగుబడి తగ్గుతున్న విషయాన్ని రంగారావు, తనకి తన నాన్నగారు పొలం ఇచ్చిన పదిహేను సంవత్సరాలకు గానీ తెలియలేదు.
తన తమ్ముడి పొలంతో పోల్చుకుంటే తన పొలం సగం కూడా కనిపించడం లేదు. పక్కనే గట్టులేస్తున్న విజయ్ ని పిలిచి, "తమ్ముడు! నా పొలం ఏంటి చాలా చిన్నదయి పోయింది?" అన్నాడు.
"అవునా! ఏది నన్ను చూడనీ?" అంటూ వెటకారంగా అన్నయ్య పొలంవైపు చూసి అన్నాడు విజయ్. "నిజమే అన్నయ్య! ఎందుకంటావ్?"
"అదే అర్థం కావటం లేదురా! చాలా వింతగా ఉంది!" అంటూ బాధ పడ్డాడు రంగారావు.
"ఆహ్! ఇప్పుడర్థమయ్యింది అన్నయ్య! నీ పొలాన్ని గట్టు తినేసింది!"
"పొలాన్ని గట్టు తినేయడమేంటి?" ఆశ్చర్య పోతూ అడిగాడు రంగారావు.
"ఔను అన్నయ్య! కొన్నిసార్లు అలా జరుగుతుంది. మొన్న పేపర్లో కూడా వేసాడు ఏదో ఊరిలో ఇలానే పొలం మొత్తాన్ని గట్టు తినేసిందంట! నీకు కనీసం కొంతైనా మిగిలింది సంతోషించు!" అన్నాడు విజయ్.
ఇక చేసేది ఏమి లేక దిగాలుగా ఇంటికి చేరుకున్నాడు రంగారావు. దిగులుగా కనిపించిన తండ్రిని చూసి, "ఏమైంది నాన్న అలా ఉన్నావ్?" అని అడిగింది సృజన తండ్రి చేతిని కౌగిలించుకుని.
"ఏమీ చెప్పమంటావ్ తల్లి! మన పొలాన్ని గట్టు తినేసింది!" అని అతను రోదిస్తూ సమాదానమిచ్చాడు.
"పొలాన్ని గట్టు తినేయడమేంటి నాన్న?" ఆశ్చర్యపోతూ అడిగింది సృజన.
"ఔనమ్మ! నిజంగానే తినేసింది!" అంటూ అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.
సృజన తల్లి తన చిన్న వయసులోనే చనిపోతే రెండో పెళ్లి చేసుకోకుండా ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు రంగారావు. ఎన్నడూ ఆమెకు తల్లిలేని లోటుని తెలియనియ్యలేదు. సృజనకి కూడా తండ్రంటే ప్రాణం. అలాంటిది ఆ రోజు తన తండ్రి పడుతున్న వేదనను చూసి తట్టుకో లేక పోయింది. తన తండ్రి వేదనకు గల కారణం, వారికి ఉన్న ఏకైక ఆధారం ఆ పొలమే, అదే పోతే ఎలా, అన్న విషయం ఆమెకు బాగా తెలుసు.
కాసేపయ్యాక చిన్నుని కలిసినప్పుడు దిగులుగా కనిపించిన ఆమెను చూసి, "ఏమైంది అలా ఉన్నావ్?" అడిగాడు చిన్ను. అప్పుడు తన తండ్రితో జరిగిన సంభాషణ గురించి చెప్పింది సృజన.
"గట్టు పొలాన్ని తినేయడమేంటి? ఏమైనా పిచ్చా?" అంటూ అరిచాడు చిన్ను. "పద ఇప్పుడే మీ పొలం దగ్గరకు వెళ్లి అసలు కదేంటో తెలుసుకుందాం!"
అది మిట్ట మధ్యాహ్న సమయం కావటంతో వీరు అక్కడికి చేరుకునే సమయానికి విజయ్ భోజనానికి ఇంటికి పోయాడు.
"మా తాత గారు నాన్నకు ఒక ఎకరం, చిన్నాన్నకు ఒక ఎకరం పొలం ఇచ్చారంట!" అని వెళ్లే దారిలో చెప్పింది సృజన. "కానీ ఆ వెధవ గట్టు మా పొలాన్నే ఎందుకు తినాలి?"
అది విని ఆమెను కోపంగా చూస్తూ, "ఎందుకంటే మీవి మట్టి బుర్రలు కాబట్టి!" అన్నాడు చిన్ను.
పొలాల దగ్గరకు చేరుకుని చూసే సరికి చిన్నుకి మొత్తం కధ అర్ధమైంది.
"ఆహ్! చూడు పాపా! మీ పొలం ఇప్పుడు ముప్ఫై సెంట్లు కంటే ఎక్కువ లేదు. మీ చిన్నాన్న పొలం సుమారు ఎకరా డబ్భై సెంట్లు కనిపిస్తుంది. మీ చిన్నాన్న ప్రతి సంవత్సరం ఆ గట్టుని మీ పొలం లోనికి కొంచం కొంచంగా వేస్తే ఈ సంవత్సరానికి మీకు ఇంత మిగిలింది. అది కొంచం కొంచంగా వెయ్యటం వలన మీ నాన్న గారికి తెలియ లేదు," అంటూ వివరణ ఇచ్చాడు చిన్ను. వెంటనే సృజన వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.
"ఏడిస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వదు! ఏడవకు. యు ఆర్ ఇన్ నీడ్ అండ్ ఐ ఆమ్ యూర్ ఫ్రెండ్ ఇండీడ్! సాయంత్రం మనం కలిసినప్పుడు ఏమి చెయ్యాలో నేను చెప్తాను!" అన్నాడు చిన్ను.
ఇంటికి వెళ్ళాక చిన్ను చాలా సేపు ఆలోచించాడు.
ఆ సాయంత్రం వాళ్ళు ఎప్పుడూ ఆడుకునే చోట మిగతవాళ్లతో కలవకుండా ఒక పక్కకు పోయి వారి ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు.
"నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా అమలు చెయ్యాలి!" అన్నాడు చిన్ను.
"ఎమ్ చెయ్యాలో త్వరగా చెప్పు!" ఆతృతగా అడిగింది సృజన.
"నేను నీకు కొన్ని చెవిపోగులు, గాజులు, నెక్లెస్ మొదలైనవి ఇస్తాను. అందులో రోజుకో అలంకార వస్తువు చొప్పున వేసుకుని, మీ చిన్నానుకు మాత్రమే కనిపించాలి. అప్పుడు ఆయనకు నీకు అంత ఖరీదైన బంగారం ఎక్కడ నుంచి వచ్చిందా అని కన్ఫ్యూజ్ అవుతాడు. నిన్ను పిలిచి నీకు అవి ఎక్కడివి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏమీ చెప్పకుండా వచ్చేస్తావు. తరువాత, అతను ఒంటరిగా ఉన్న సమయంలో, అతడికి వినిపించినట్టుగా నేను నీకు ఇప్పుడు చెప్పే విషయం అప్పుడు నాకు చెప్తావు. అది వినిన వెంటనే కధ ఎలా మలుపు తిరుగుతుందో నువ్వే చూద్దువుగాని!" అని చెప్తూ సృజన చేతిలో ఒక సంచి పెట్టాడు చిన్ను. అందులో ఉన్న బంగారపు గాజులు, వడ్డానం, నెక్లెస్, చెవి పోగులు చూసి సృజన చాలా ఆశ్చర్యపోతూ, "ఇవన్నీ నీకెక్కడివి? నాకు భయమేస్తోంది!" అని చెప్పింది.
"ఏమీ ఫర్వాలేదులే! అవి మా అమ్మమ్మవి," అని నవ్వుతూ చెప్పాడు. తరువాత సృజనని మోటివేట్ చేసి ఒప్పించాడు. మరుసటి రోజు ఉదయం సృజన తమ పెరట్లోకి బంగారపు నెక్లెస్ వేసుకుని ఆ వెనక ఇంట్లో ఉండే చిన్నాన్న చూసేదాక ఆగి, ఆయనకు గుడ్ మార్కింగ్ చెప్పి, అతని ముఖంలో ఆశ్చర్యాన్ని చూసి మరలా ఇంట్లోకి వెళ్లి తన తండ్రి చూడక ముందే ఆ నెక్లెస్ ని దాచేసింది. అదే సాయంత్రం, ఆమె చేతికి బంగారపు గాజులు వేసుకుని పెరట్లోకి వెళ్ళి, చిన్నాన్న చూసేవరకు ఆగి, గుడ్ ఈవెనింగ్ చెప్పి, ఆయన ముఖంలో ఆశ్చర్యం చూసి, మరలా ఇంటిలోపలికి జారుకుంది. ఆమె ఒంటెపైనున్న బంగారం ఎక్కడిదన్న సందేహం విజయ్ కు నిద్రలేకుండా చేసింది. అదే విధంగా సృజన రోజుకొక ఆభరణాన్ని వేసుకుని అతడి సందేహాలని రెట్టింపు చేసింది. అలా ఒక వారం గడిచిన తరువాత, ఒక సాయంత్రం ఆమెను పిలిచి ఆ బంగారు ఆభరణాలు ఎక్కడివని అడిగాడు విజయ్. సృజన ఏమీ చెప్పకుండా వెనకకు వచ్చేసింది. ఒక గంట తరువాత చిన్నాన్నకి వినిపించేటట్టుగా, "చిన్ను, మా పొలంలో తవ్వుతున్న కొలిది బంగారం దొరుకుతుంది. నాన్నగారు నాకు రోజుకొక కొత్త ఆభరణం తెస్తున్నారు. కానీ నాన్నగారు బంగారం కంటే ఆ పొలాన్నే ఎక్కువ ఇష్టబడుతున్నారు. కాబట్టి చిన్నన్నాకు అడిగి ఆ బంగారం పడ్డ మా కొంచం పొలాన్ని అతనికి ఇచ్చేసి, దానికి బదులుగా అతని పొలాన్ని అడుగుతానన్నారు. కానీ నేనే వద్దన్నాను. మా నాన్నగారిని ఆపుతున్నాను. మా పొలాన్ని గట్టు తినేసింది కదా! అందుకే నాన్నగారు బాధపడుతున్నారు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నన్నాకు మా పొలాన్ని ఇవ్వనివ్వను," అని చిన్నుతో చెప్పింది.
"కానీ మీ చిన్నాన్న మంచోళ్ళు కదా! ఆయనకు ఆయనగా వచ్చి అడిగినా ఇవ్వనివ్వవా?" అడిగాడు చిన్ను.
"నాకు మా నాన్న ఇష్టం. మా నాన్నకి ఆ పొలం ఇష్టం. కాబట్టి మా చిన్నాన్న ఆయనకు ఆయనగా వచ్చి, ఆయన పొలం మాకు, మా పొలం ఆయనకు పక్కాగా రాయిస్తే, అప్పుడు ఒప్పుకుంటా! కానీ ఆయనెందుకు అలా చేస్తాడు? మా పొలంలో బంగారం పడ్డట్టు ఆయనకు తెలీదు కదా?" గట్టిగా చెప్పింది సృజన.
"ఏమో? పొలాన్ని గట్టు తినేసిందన్న మీ నాన్నగారి బాధచూసి ఆయన మనసు కరిగి, వచ్చి అలా అడగొచ్చేమో?" అన్నాడు చిన్ను.
"నీ ముఖం. అలా ఎందుకడుగుతారు?" చెప్పింది సృజన.
"ఒకవేళ అడిగితే?"
"అలా అడిగితే మా చిన్నాన్న మంచోళ్లవుతారు కాబట్టి, మా బంగారం పడ్డ పొలం ఆయనకు ఇవ్వడానికి నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు!" గట్టిగా చెప్పింది సృజన. ఇదంతా చాటుగా విన్న విజయ్ ఎంతో సంబరపడ్డాడు. మరుసటి రోజే పొలం కాగితాలన్ని తెచ్చి తన అన్నగారైన రంగారావుతో సంతకాలు పెట్టించి తన ఎకరా డబ్భై సెంట్ల పొలాన్ని అన్నగారి పేరుమీద రాసి, అన్నగారి ముప్ఫై సెంట్ల పొలాన్ని అతని పేరుమీద రాయించుకున్నాడు. ఇదంతా తన మీద ప్రేమతోనే అనుకున్నాడు రంగారావు.
చిన్ను దీనంతటినీ తాతయ్య మరియు తాతయ్య స్నేహితుడైన మాజీ హైకోర్టు జడ్జి సమక్షంలో జరిగేటట్టు చూసాడు. కాబట్టి విజయ్ కు మళ్ళీ ఏదైనా మతలబు చేసే అవకాశం లేకపోయింది.
పొలాలు చేతులు మారిన వెంటనే, ప్రతి రాత్రి విజయ్ తన ముప్ఫై సెంట్ల పొలాన్ని తవ్వుతూ, తవ్వుతూ ఉండేవాడు. కానీ ఎంత తవ్వినా ఒక్క బంగారపు తీగ కూడా దొరకలేదు.
"దీనంతటికీ కారణం నువ్వే! నేను నీకు ఎంతో రుణపడి ఉంటాను!" అని చెప్పింది సృజన, చిన్ను చెయ్యి పట్టుకుని ఏడుస్తూ.
"నాకు కాదు, మనిద్దరం వెళ్లి అడగ్గానే బంగారం ఇచ్చిన అమ్మమ్మకు, ఈ ఐడియా ఇచ్చిన తాతయ్యను థాంక్స్ చెప్పాలి," అన్నాడు చిన్ను.
ఇద్దరు వెళ్లి అమ్మమ్మతాతయ్యలను కౌగిలించుకుని 'ధన్యవాదాలు' చెప్పారు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు