అప్పు తీర్చిన అప్పారావు! - పద్మావతి దివాకర్ల

appa rao paid

"అప్పారావ్! అప్పు తీర్చుతానని చెప్పి నాలుగేళ్ళనుండి మమ్మల్నందర్నీ నీ వెంట తిప్పుతున్నావు. ఇంకెన్నాళ్ళు తిప్పుతావయ్యా?" శంకర్రావు గట్టిగా అడిగాడు.

"అలాగే నా నాలుగేళ్ళ ఇంటి అద్దె బాకీ కూడా ఎప్పుడు తీరుస్తావు అప్పారావూ?" అడిగాడు ఇంటి ఓనర్ పురుషోత్తం అప్పారావుని నిలదీస్తూ.

"నా వద్ద తీసుకున్న సరుకల బాకీ సంగతో?" అన్నాడు రామేశం.

"మరి నా హొటల్‌లో పద్దు మాటేమిటి?" కడిగేయసాగాడు కామేశం.

అప్పారావుని ముప్పేట దాడి చేయసాగారు అతనికి అప్పులిచ్చినవాళ్ళు. అప్పారావు ఇంటిముందు గుమిగూడిన అప్పులాళ్ళందరూ అప్పారావుని ఇలా స్త్రోత్ర పాఠాలతో ముంచెత్తసాగారు.

వాతావరణ హెచ్చరిక లేకుండా వచ్చిన సునామిలాగా అప్పులాళ్ళందరూ అప్పారావుని చుట్టుముట్టినా కొంచెంకూడా బెదరకుండా నిమ్మకు నీరెత్తినట్లు నిలబడ్డాడు అప్పారావు. అతని సంగతి అందరికీ తెలిసిందే కదా మరి! ఎప్పుడూ ఏదో సాకు చెప్పి అప్పటికప్పుడు తప్పించుకోవడం అతనికి అప్పుతో పుట్టిన విద్య మరి!

“అసలు అప్పు తీసుకోవడమే కానీ తీర్చడం ఎప్పుడైనా చేసావా ఏమిటి? అసలు అప్పుతీర్చడం నీ చరిత్రలోనే లేదే? ఈ సారి తాడో పేడో తేల్చుకోవాలి. నీతో ఇలా కాదు, ఈసారి కోర్ట్‌కి వెళ్ళాల్సిందే, మరి తప్పేట్టు లేదు." అన్నాడు బాగా మండిన సుందర్రావు.

"ఉరుకోరా నాయనా! అప్పారావుతో తగువు పెట్టుకోకు, అసలుకే మోసం వస్తుంది చూసుకో!" అంటూ వెనక్కు లాగేడు కామేశం.

సుందర్రావు మాటలు చెవికెక్కించుకున్న అప్పారావు, "ఏమిటి తొందర్రావూ! సారీ, సుందర్రావూ, నిజం చెప్పు, గుండెలమీద చెయ్యేసి మరీ చెప్పు? నేనెప్పుడూ అప్పు తీర్చలేదా? నాలుగేళ్ళ కిందటి సంగతి గుర్తు లేదా ఏంటి??" అన్నాడు.

అప్పుడు అందరికీ సినిమా రీళ్లలాగ నాలుగేళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అప్పుడూ ఇలాగే అప్పారావు అందరి అప్పు తీరుస్తానని తన ఇంటికి పిలిపించుకున్నాడు. 'అప్పారావేంటి అప్పుతీర్చడమేమిటి? మన భ్రమ కాకపోతే?' అనుకుంటూనే అప్పారావు ఇంటిముందు గుమిగూడారు. అయితే అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, ఆ రోజు అందరూ తెల్లబోయేలా అప్పారావు తన బ్రీఫ్ కేస్ తెరిచి అందరికి వాళ్ళ వాళ్ళ అప్పులు తీర్చాడు. అది కలో, వైష్ణవ మాయో అర్ధం కాలేదు అప్పులాళ్ళందరికీ.

అయితే, అప్పు తీర్చే ముందు అప్పారావు అందరివద్దనుండి లిఖితమైన హామీ తీసుకున్నాడు. అదేమిటంటే, మళ్ళీ ఎప్పుడైనా తనకి అప్పు కావలసి వస్తే మాత్రం తప్పకుండా అప్పు ఇచ్చేట్లు పత్రం రాయించుకున్నాడు. ఏమైతే అయింది, ముందు పాత బాకీ వసూలైతే చాలని, అందరూ కళ్ళు మూసుకొని హామీ పత్రం మీద సంతకం చేసి వాళ్ళవాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసిందేమిటంటే, అవన్నీ ఆ రోజే ప్రభుత్వం ద్వారా రద్దైన వెయ్యి, అయిదువందల రూపాయల నోట్లు. అప్పారావుకి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక, మరేం చేయలేక, ఆ నోట్లు పట్టుకొని నెలల తరబడి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి మార్చుకున్నారు పాపం. ఆ దృశ్యాలన్నీ కళ్ళముందు మెదిలి అందరికీ ఆ నవంబర్ నెల చలిలో కూడా చెమట్లు పట్టాయి.

అందరికన్న ముకుందరావే ముందుగా తేరుకున్నాడు.

"గుర్తులేకపోవడమేమిటి? భేషుగ్గా గుర్తుంది! తీర్చకతీర్చక అప్పు పెద్ద నోట్ల రద్దు సమయంలో తీర్చావు. అన్నీ రద్దైన ఐదువందలు, వెయ్యరూపాయల నోట్లు ఇచ్చావు మరి. పోనీ అప్పు వసులైందే చాలని అవి పుచ్చుకొని చచ్చేము. ఆ నోట్లు మార్చుకోవడానికి బ్యాంక్‌క్యూలో ఇంటిల్లపాదీ నెలలతరబడి నిలబడ్డాము. బ్యాంక్‌ఖాతాలో జమ చేసినందుకు ఆదాయపు పన్ను శాఖ అధికార్లనుండి శ్రీముఖాలు కూడా అందాయి. వాళ్ళబారినుండి తప్పించుకొనేసరికి మా తలప్రాణం తోకకొచ్చింది. మా బుద్ధి గడ్డితిని మళ్ళీ నీకు అప్పు ఇచ్చేం!" అన్నాడు అప్పటివరకు నోరు విప్పని ముకుందరావు ఆ పాత దృశ్యాలు గుర్తుకుతెచ్చుకొని బెంబేలెత్తిపోతూ.

"మరి గుర్తుందికదా! ఏమైతేనేమి అప్పు తీర్చానా లేదా అన్నదే పాయింట్! మరి నాకు మాటిచ్చినట్లు మళ్ళీ అప్పు ఇస్తిరే! ఈ సారి కూడా నేను కచ్చితంగా అప్పు తీర్చబోతున్నాను. సరిగ్గా వినండి. వచ్చే నెల ఎనిమిదో తారీఖున మీ అందరి అప్పు తీర్చడానికి మంచి ముహూర్తం నిశ్చయించాను. ఆ రోజు అందరూ కట్ట కట్టుకొని రండి. మీ అందరి బాకీ అణాపైసలతో సహా చెల్లించకపోతే అప్పుడు నన్నడగండి." అన్నాడు అప్పారావు జంకు గొంకు లేకుండా.

అంత నిబ్బరంగా అప్పారావు మాట ఇచ్చేసరికి అక్కడ గుమిగూడిన అప్పులాళ్ళందరూ ఖంగు తిన్నారు. కొందరికి నిజంగానే మతులు పోయినై!

'కొంపతీసి మళ్ళీ పెద్దనోట్లు రద్దుగానీ ప్రభుత్వం ప్రకటించలేదు కదా. అసలే ఇంట్లో వాళ్ళు ఎడతెరిపిలేకుండా సీరియల్సు చూడటంవల్ల మనకి వార్తలు కూడా వినడానికి వీలు కావడం లేదుకదా!' స్వగతంగా కామేశం అనుకున్నా పైకి వినబడనే వినబడింది.

అయితే అందరికీ ఈ అనుమానమే కలిగింది కూడా. అయితే ఇవాళ అలాంటి వార్తేమీ లేదే! ఏమో ఈ ఎనిమిదో తారీఖన మళ్ళీ పెద్ద నోట్లు రద్దవుతాయేమో? అప్పుడప్పుడు పనీపాటా లేనివాళ్ళు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు లేవదీస్తున్నారు కదామరి అవి నిజమవుతాయేమో? కొంపదీసి మన అప్పారావుకి దివ్యదృష్టి గానీ ఉందేమో? ఇలా పరిపరి విధాల పోయాయి వారివారి ఆలోచనలు.

అయితే నోరు మెదపడానికి జంకారందరూ. 'ఏమో ఎవరు చెప్పొచ్చారు, తము నిత్యం మొక్కే ముక్కొటి దేవతల్లో ఏ దేముడో మన అప్పారావుకి సద్బుద్ధి గానీ ప్రసాదించారేమో?' అనుకున్నాడు రామేశం. అక్కడున్న వాళ్ళందరూ ఇంచుమించు అలాగే అనుకున్నారు మనసులో.

అందరూ నిశ్శబ్దంగా ఉండటం చూసి, "మౌనం పూర్ణ అంగీకారమంటారు కదా! అందరూ క్షేమంగా వెళ్ళి వచ్చే నెల ఎనిమిదో తారీఖకల్లా వచ్చేయండి. మీమీ బాకీలు ఆ రోజు వసూలు చేద్దురుగాని." అన్నాడు అప్పారావు.

"మౌనం పూర్ణాంగీకారం కాదహే! మౌనం అర్ధాంగీకారం అంటారు." అన్నాడు సామెతల్రావు అనబడే సన్యాసిరావు. సామెత తప్పు పలికేసరికి అతనికి అప్పారావుమీద పీకమొయ్యా కోపం వచ్చింది మరి.

"ఉండహే! అసలే టెన్షన్‌తో, సస్పెన్స్‌తో చస్తుంటే మధ్యలో నీ సామెతల గోలేంటి? ఇక్కడేం సామెతలమీద చర్చా వేదిక పెట్టలేదు." సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు కామేశం.

"కిందటి సారిలాగే ఈ సారికూడా నా మాటలమీద నమ్మకముంచి ఆ రోజున ఇదే సమయానికి రండి. మీ బాకీ అణాపైసలతో వసూలు చేసుకోండి." అన్నాడు అప్పారావు ఇంట్లోకి వెళ్తూ మరో మాటకి తావియ్యకుండా.

ఎనిమిదో తారీఖంటే సరిగ్గా పదిహేనురోజులుంది. అసలు ఆ రోజు ఎలా అప్పు తీర్చబోతాడో, అసలు అప్పు తీర్చకుండా ఇంకా ఎవైనా కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటాడో ఊహించలేకున్నారెవరూ. ఎందుకైనా మంచిదని అప్పులాళ్ళందరూ కలసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని, అప్పారావు అన్నదాంట్లో లొసుగులేవైనా ఉన్నాయేమోనని క్షుణ్ణంగా చర్చించసాగారు.

ఎంత చర్చించినా ఏ మాత్రం లాభం లేకపోయింది. కొందరేమో బహుశా అప్పారావు ఏ బ్యాంక్‌నుండో అప్పు తీసుకొని అందరి బాకీలు తీర్చుతాడని ఊహిస్తే, మరికొందరు ఏ పెద్ద చేపకో గేలం వేసి అందరి అప్పులు తీరుస్తాడేమోనని ఊహించారు. అతనికేమైనా దూరపు బంధువుల ఆస్థి కలిసొచ్చిందో లేక లంకెబిందెలేమైనా దొరికాయేమోనని అభిప్రాయపడ్డారు మరికొందరు. కొందరు నిరాశావాదులు మాత్రం మళ్ళీ ఈ సారి కూడా ఏదో మాయ చేసి అప్పు ఎగ్గొడుతాడేమోనని అనుకున్నారు. మొత్తానికి ఎంత అలోచించినా ఇంతకుమించి ఏవిధమైన క్లూ కూడా దొరకలేదెవరికీ. ఆ రోజు నుండి వాళ్ళందరికీ ఒకటే ఆలోచన అప్పారావు తమ అప్పు ఎలా తీరుస్తాడోనని. అసలింతకీ తీరుస్తాడా, లేదా అన్నది కూడా ఓ మిలియన్ డాలర్ ప్రశ్నై కూర్చుంది.

రోజులు గడిచేకొద్దీ అందరి నరాలు టెన్షన్‌తో చిట్లిపోతున్నాయి. అందరిలోనూ ఒకటే ఆతృత. రక్తపోటు పెరిగిందేమోనని మాటిమాటికీ డాక్టర్‌వద్దకి వెళుతున్నారు అప్పటికే బిపి ఉన్నవాళ్ళు. అదిలేనివాళ్ళు కొత్తగా ఏమైనా రక్తపోటు వచ్చిందేమోనని భయపడుతూ ఆస్పత్రికి వెళుతున్నారు. అయితే ఇందరి రక్తపోటుకి కారకుడైన అప్పారావు మాత్రం చిద్విలాసంగా రోజులు గడుపుతున్నాడు.

చివరాఖరికి ఆ రోజు, అదే ఆ నెల ఎనిమిదో తారీఖు, అప్పులాళ్ళందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆ ముందు రోజు రాత్రి పన్నెండు గంటలవరకూ వచ్చే అన్ని ఛానెళ్ళ వార్తలు, ఆ రోజు ఉదయంవరకు అన్ని వార్తలు చూసి ఊపిరి పీల్చుకున్నారు కామేశం తదితరులు. 'అమ్మయ్య! పెద్దనోట్లు రద్దు లేదు!' అని సంతోషించి అప్పారావు ఇంటి వైపు పరిగెట్టారందరూ. పదిగంటలకల్లా అందరూ అప్పారావు ఇంటిముందు గుమిగూడారు. అందరి ముఖాలు అంతులేని ఆతృత, ఆందోళనతో నిండి ఉన్నాయి.

అప్పారావు చిరునవ్వు ముఖంతో ఇంటి వరండాలోనే వీరందరికోసం వేచి ఉన్నాడు. అందర్నీ చూస్తూనే, "రండి! రండి!! మీ అందరి అప్పు తీర్చడంకోసమే ఎదురు చూస్తున్నాను. దయచేసి అందరూ క్యూలో రండి. మీ వంతు వచ్చేవరకు క్యూలోనే ఉండండి." అన్నాడు అప్పారావు.

చేసేదిలేక అందరూ క్యూ కట్టారు. అప్పుడు అప్పారావు, "వినండి. లోపల గదిలో నా మిత్రుడు పాపారావు ఉన్నాడు. నా అప్త మిత్రుడైన పాపారావే నా అప్పు మిత్రులైన మీ అందరి అప్పు పూర్తిగా అణాపైసలతో సహా చెల్లిస్తాడు. అతను అప్పు తీర్చిన వెంటనే అతనికి చెల్లుచీటి ఇచ్చి పెరటి గుమ్మం నుండి మీ దారిన పొండి. మళ్ళీ మీకు అప్పు ఇవ్వాలనిపిస్తే మాత్రం ఈ అప్పారావుని మరువకండేం! సదా మీ అప్పు సేవలో ఈ అప్పారావెప్పుడూ తయారుగానే ఉంటాడు. అప్పుదేవో భవ!" అన్నాడు.

ఆ క్యూలైను మెల్లమెల్లగా కదులుతోంది. బయట ఉండి అప్పారావు ఒకొక్కళ్ళనే లోపలికి పంపిస్తున్నాడు. అందరికన్న ముందు కామేశం ఉన్నాడు. చివర సుందర్రావు ఉన్నాడు. సుందర్రావుకి తొందరెక్కువైనా, ఈ రోజు కొద్దిగా లేటైన పాపానికో లేక పుణ్యానికో క్యూలో చివరన ఉన్నాడు. ఒక్క కామేశం పని పూర్తవడానికి అరగంట సమయం పట్టింది.

"ఒక్కకరికి ఇంత సమయం ఎందుకు పడుతోందో?" సుందర్రావు సందేహం బయటపెట్టాడు, ఎందుకంటే తనవంతు వచ్చేసరికి డబ్బు మిగులుతుందో లేదోనని అతని గుబులు అతనిది.

"మరి లెక్క సరిగ్గా చూడొద్దేమిటి?" రామేశం సమాధానం.

"కొంపతీసి కిందటి సారి పెద్దనోట్లకి రివెర్స్‌గా ఈ సారి చెల్లని చిల్లర నాణాలు ఇవ్వటం లేదుకదా! అసలే మన అప్పు అణాపైసలతో తీరుస్తానన్నాడు కదా!" శంకర్రావు సందేహం.

"నిశ్శబ్డం." అని హెచ్చరించాడు అప్పారావు. ఆ తర్వాత ఎవరికి వారు ఊహాగానాలు చేస్తూ మెల్లగా తమలోతాము గుసగుస లాడుకోసాగారు.

ఈ లోపున క్యూలైన్ మెల్లమెల్లగా కదులుతోంది. సమయం పెరిగేకొద్దీ అందరిలోను అసహనం చోటు చేసుకుంది. అయితే అప్పారావు నుండి అప్పు వసూలవుతుందన్న ఆనందంలో ఆ అసహనాన్ని లోలోపలే దాచుకున్నారు, ఒక్క సుందర్రావు తప్ప. క్యూలో చివరనున్న కారణంగా ఎక్కువ అసహనానికి గురవసాగాడు అతను.

క్యూలైన్ మెల్లగా తరగసాగింది. అప్పు ఏవిధంగా తీరుస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆతృత సుందర్రావుని నిలబడనియ్యలేదు. అతని ముందు మరో ఇద్దరు ఉండగా మెల్లగా అక్కడ్నుంచి బయటపడి అప్పారావు ఇంటి వెనకవైపు వెళ్ళాడు. అక్కడ కిటికీలోంచి లోపలి దృశ్యం చూసి నిశ్చేష్టుడైయ్యాడు. లోపల ఉన్న ముకుందరావు అతని ఎదురుగా ఉన్న అప్పారావు మిత్రుడైన పాపారావుతో తీరుబాటుగా పేకాడుతున్నాడు. 'ముకుందరావు తన అప్పు వసూలు చేసుకొని తన దారిన పోకుండా, ఈ పేకాటేమిటి మధ్యలో?' అని మనసులో అనుకొని చూడసాగాడు. ఓ పదినిమిషాల తర్వాత పాపారావు, "ఈ సారి కూడా నువ్వే ఓడిపోయావు. ఈ ఆటతో నా మిత్రుడైన అప్పారావు అప్పు పూర్తిగా తీరిపోవడమేకాక నువ్వే అతనికి ఓ అయిదువేలు బాకీ పడ్డావు. ఆ అయిదువేలకి నాకు నోటురాసి నీ చెల్లుచీటీ నువ్వు తీసుకుపో! ఈ ఐదువేలు అప్పారావుకి నెమ్మదిమీద తీర్చుదుగానిలే!" అని ఏడుపు మొహం పెట్టుకు కూర్చున్న ముకుందరావు వైపుకి తత్సంబంధమైన కాగితాలు తోసాడు పాపారావు.

విధిలేక ఆ ఏడుపుమొహంతోనే ఆ కాగితాలు తీసుకొని సంతకం పెట్టాడు ముకుందరావు. అదంతా చూసాక అసలు సంగతి అప్పుడు అర్ధమైంది సుందర్రావుకి. 'ఇదా అప్పారావు ఎత్తు!' అనుకున్నాడు. అప్పారావు తన అప్పు తీర్చడానికి తన మిత్రుడైన పేకాట పాపారావు సహాయం తీసుకున్నాడు. పేకాట పాపారావు పేకాటలో ఉద్దండుడు. అప్పులాళ్ళందరితో పేకాట ఆడి వాళ్ళందర్ని ఓడించి అప్పారావు అప్పు ఆ విధంగా తీర్చడమే కాకుండా తిరిగి వాళ్ళని అప్పారావుకి బాకీ పడేటట్లు చేస్తున్నాడు. ఈ విషయం గ్రహించి పరుగుపరుగున తిరిగివచ్చాడు క్యూలో ఉన్నవాళ్ళని హెచ్చరించడానికి. అయితే అప్పటికే తన ముందు ఉన్న ఒక్కడు కూడా ఆ ఇంట్లోకి దూరాడు పాపారావు బారిన పడటానికి.

"మోసం! కుట్ర! దగా!" అన్నాడు అప్పారావుని చూసి రొప్పుతూ.

"ఏమిటి మోసం అంటున్నావు?! నేను అప్పు తీర్చడం కుట్ర, దగానా? నీ గురించే నేను కాచుకున్నాను ఎక్కడికి వెళ్ళావోనని. ఇక నీ ఒక్కడి అప్పే మిగిలిపోయింది. పద లోపలికి, నీ బాకీ నా మిత్రుడు పాపారావు తీరుస్తాడు” అని సుందర్రావు గింజుకుంటున్నా వినక ఇంట్లోకి లాక్కెళ్ళి బయట గడియవేసాడు అప్పారావు.

ఈ విధంగా అప్పారావు తన అప్పులోళ్ళందరి బాకీ తన మిత్రుడైన పేకాట పాపారావు ద్వారా చెల్లు వేయడమే కాక వాళ్ళందరూ కూడా తిరిగి తనకి బాకీ పడేటట్లు చేసాడు. అయితే ఆ తరవాత మన సుందర్రావుకో సందేహం వచ్చింది, 'మరి మొదట పాపారావు పేకాట ద్వారా మోసపోయినవాళ్ళు తిరిగివచ్చి క్యూలో తమవంతు మోసపోవడానికి కోసం ఓపిగ్గా నిలబడ్డవాళ్ళకి హెచ్చరించలేదెందుకు?' అని. అయితే, తను మోసపోయిన తర్వాత మిగతా వాళ్ళెందుకు మోసపోకూడదూ, పక్కవాడెందుకు బాగుపడాలి అన్న సగటు మనిషి బలహీనత మనసుకి తట్టి ఆ చిన్నపాటి సందేహం కూడా ఎవర్నీ అడగకుండానే తీరిపోయింది సుందర్రావుకి. మరి అప్పులాళ్ళ అనైక్యతే కదా అప్పారావు బలం.

మరిన్ని కథలు

Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి