ఉగాది రోజు ఏమేమి చేయాలని ఆలోచించసాగింది సరస్వతి. కోడలు నివేదితకు రేపు ఉగాది రోజు ఎలాగూ సెలవు ఉంటుంది. సెలవు రోజు ఎప్పటిలా పదిగంటల వరకూ నిదరపోనీకుండా ఉదయాన్నే కనీసం ఆరుగంటలకైనా లేచి స్నానం చేసి మార్కెట్ కు వెళ్లి ఉగాది పచ్చడికి కావలసినది తీసుకొని రమ్మని చెప్పాలి . రేపైనా నివేదితతో పట్టుచీర కట్టుకోమని చెప్పాలి. ఉగాది రోజు చేయవలసిన వంటలు గురించి ఆలోచిస్తున్న సమయంలో కొడుకు కోడలు చిరునవ్వుతో లోనికి ప్రవేశించారు .
"నివేదితా ,ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలు ,సాంబారు ,చారు తీసి వంటగదిలో పెట్టినతరువాత నీవు స్నానానికి వెళ్ళమ్మా .నీవు వచ్చేలోగా వాటిని వేడి చేసి ఉంచుతాను " అంది సరస్వతి.
వంటగది చిన్నదిగా వుండటంవల్ల ఫ్రిడ్జ్ హాలులో ఉంచారు .హాలునుండి వంటగదికి తీసుకెళ్లడానికి ఎవరోఒకరి సహాయం తీసుకొంటుంది సరస్వతి .
హాలునుండి ఒక్కొక్క గిన్నెను ఫ్రిడ్జ్ నుండి తీసుకొని వంటగదిలో ఉంచసాగింది నివేదిత .
"నివేదితా ఉగాది పచ్చడి ఎలా చెయ్యడం తెలుసా" ప్రశ్నించింది సరస్వతి
ఎదురుచూడని ప్రశ్నకు ఒక్క క్షణం బిత్తరపోయింది "వేపపువ్వు, బెల్లం....." ఆ క్షణాన తోచిన రెండు పేర్లు చెప్పి ఆలోచించసాగింది
"ఈ కాలం పిల్లలకు చదువు, ఉద్యోగం తప్ప జీవితంలో ముఖ్యమైన వాటిని మరచిపోతున్నారు” అంటూ ఉగాది పచ్చడిలో వాడవలసిన వస్తువుల పేర్లు చెప్పిన తరువాత షడ్రుచులు గురించి చిన్న పాటి ఉపన్యాసం ఇవ్వసాగింది సరస్వతి.
‘పని నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి బడలిక పోగొడుతాం అనుకుంటే ...ఈవిడగారి ఉపన్యాసం ఒకటి’ అని మనసులో అనుకొంటూ వినసాగింది నివేదిత. భర్త పవన్ స్నానం చేసివచ్చి నివేదిత పక్కన కూర్చొన్నాడు.
"నివేదితా రేపు ఉగాది పండుగరోజు కాస్త తొందరగా నిదుర లేయాలి " అంది సరస్వతి.
" రేపు మాకు డ్యూటీ ఉంది అత్తయ్యా ,"
కోడలి మాటలకు సరస్వతి ఉలిక్కిపడింది
"అదేమిటి నివేదితా పండగపూట ఇంటిలో ఉండకుండా ఉద్యోగమా. ఉగాది రోజు సెలవు ఇవ్వచ్చుగా " అంది ఈసడింపుగా
" అమ్మా ఇదేమాట అందరిముందు మేనేజర్ తో మీ కోడలు అడిగింది "అన్నాడు కొడుకు
“ ఏం చెప్పాడు “
"వేరేవారు అడిగినా సెలవు ఇచ్చేవాడిని ....నీవు అడగడం న్యాయం కాదు నివేదితా , నీ భర్త పవన్ రేపు ఆఫీస్ కు వస్తున్నాడు. మీ వారితోపాటు ఆఫీస్ కు వచ్చి ఇద్దరూ ఇక్కడే సరదాగా ఉగాది పండుగ జరుపుకోవచ్చుగా ,ఆ తన్మయి లాంటి పెండ్లికాని అమ్మాయిలూ అటు సొంత ఊరికి వెళ్లలేక ఇక్కడే ఉంటున్నారు .మనమంతా ఒక కుటుంబంలా కలసి పనిచేస్తున్నాము .కాస్సేపు ఉగాది వేడుకలు జరుపుకున్న తరువాత మన పనులను ప్రారంభిస్తాము. సొంత ఊర్లకు వెళ్లలేని వారికి కాస్తా మానసికానందం కలిగించండి. మన ఆఫీస్ వారందరికీ ఉగాది పచ్చడి ఏర్పాటు చేస్తున్నాను. ఉగాది రోజు పనిచేస్తున్నందుకు ఒక రోజు జీతం అదనంగా ఇస్తాముగా ‘ అని చెప్పగనే పాపం నివేదిత సమాధానము ఏమీ చెప్పలేక పోయింది " అన్నాడు పవన్
" ఇంటిలో వుంటుందనుకొన్నాను . రేపు ఉదయాన్నే నివేదిత స్నానం చేసుకొన్న తరువాత ఉగాది పచ్చడికి కావలసిన వాటితో పాటు తోరణాలు కట్టడానికి మామిడాకులు తీసుకొని రమ్మని చెబుతామనుకొన్నాను .ప్చ్ మన ఇంటికి వచ్చే పనిమనిషితో తెప్పించాలని నా తలా రాత రాసింది . స్నానం చేసుకోకుండా పనికి వచ్చే ఆ పిల్ల చేతిలో తెప్పించుకొనవలసివస్తుంది .” గొణుక్కుంటున్నట్టుగానే పైకి అంది.
*** *** ***
ఉదయాన్నే తలుపులు తడితేగాని లేవని కొడుకు కోడలు ఆరుగంటలకంతా నిదుర లేచి తలుపులు తీయడం చూసి ఆశ్చర్యపడింది సరస్వతి
ఏడుగంటలకు ఇద్దరూ నూతన దంపతుల్లా పెళ్లి దుస్తులు ధరించి వెళ్ళొస్తామని చెబుతుంటే చిన్నబోయిన ముఖంతో లేని నవ్వును తెచ్చుకొంటూ సరే నంటూ తలాడించడం గమనించింది నివేదిత .
ఆఫీస్ వెళ్ళగానే ఆ దంపతులిద్దరూ అక్కడి అలంకరణను చూసి ఆశ్చర్యపోయారు .మామిడాకుల తోరణాలతో చక్కగా అలంకరించి ,నేలపైన రంగోలి ముగ్గులు చూసి "మన మేనేజర్ గారు మన స్టాఫ్ వారికి పని ఇవ్వకుండా చక్కగా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ముగ్గు అయినా సరే దానిని చక్కగా వేసి తీర్చిదిద్ది న ఆ ముగ్గులు చూడటానికే చాలా అందంగా ఉంది ". అంది నివేదిత
మేనేజర్ కృష్ణ స్వామి వారి వైపు చూస్తూ ఉగాది శుభాకాంక్షలు చెప్పిన తరువాత " మీరిద్దరూ సరిఅయిన సమయానికి వచ్చినా మిగిలిన వారందరూ ఎప్పుడో వచ్చేసారు. ఇక ఉగాది వేడుక ప్రారంభించాలి రండి లోపలికి " అన్నారు.
హాలు లోపలున్న వారందరి వైపు చూస్తూ"మన ఆఫీస్ నందు పనిచేస్తున్న మహిళలలందరూ ఈ ఉగాది రోజు రావడం సంతోషంగా ఉంది. ఈ రోజు ఉగాదికి మీకు కొన్ని పోటీలు పెడుతున్నాను .మొదట ఆడవారితో ప్రారంబిద్దాము “అన్నారు కృష్ణ స్వామి .
పోటీలు అంటూ చెప్పగానే అందరూ ఉత్సాహంతో ఎటువంటి పోటీ అని ఎదురుచూడసాగారు
“ ఇక్కడున్న ముపైమంది మహిళలు అక్కడున్న పేపర్ పేనా తీసుకొని సిద్ధంగా ఉండండి. ఒకరి నొకరు చూసుకోకుండా దూరంగా వుండాలి . నేను సులభమైన ప్రశ్న అడిగి విజిల్ ఊదుతాను. ముపై క్షణాలలో సమాధానం వ్రాసివ్వాలి .ముపై క్షణాల తరువాత విజిల్ శబ్దం వినగానే పేనా పేపర్ పైన ఉంచి చేయి పైకి ఎత్తాలి. పేనా మీ చేతిలో ఉన్నా మీరు ఓడిపోయినట్లే .” అన్నారు కృష్ణ స్వామి .
అందరూ చెప్పినట్లు చేయగానే "ప్రశ్న ఏమిటంటే ...ఉగాది పచ్చడి తయారుచేయడానికి ఏమి కావాలి" అంటూ విజిల్ ఊదాడు .
ముపై సెకండ్లు కాగానే మరలా విజిల్ ఊదగానే అందరూ పెనా వదలి చేతులు పైకి ఎత్తారు.
మరో ఐదునిముషాలలో ఫలితాలు ప్రకటించారు .నివేదిత మొదటి బహుమతి గెలుచుకొంది.
” ఉగాది గురించి మీకు తెలిసినది రెండు నిమిషాలలో వ్రాయండి” అన్న ప్రశ్న మగవారికి చెప్పగానే చాలామంది తడబడ్డారు .కొంతమంది మాత్రమే తమకు తెలిసింది వ్రాసారు.
ఫలితాల కోసం ఎందరో ఆసక్తితో ఎదురుచూడసాగారు
ఫలితాలు ప్రకటించడానికి ముందు తన ప్రసంగంలో " ఉగాది అన్న పదం కూడా చాలామంది వ వా వి వీ వు వచ్చే అక్షరంతో ఉగాది అని వ్రాసారు . అ,ఆ లలో వచ్చే ఉ అన్న అక్షరాన్ని మరిచారు. మీరందరూ హైస్కూల్ నందు తెలుగు చదువుకున్నా తెలుగుకు దూరమవుతున్నారు. మీ పిల్లలు ఎల్ కె జీ నుంచి ఆంగ్ల భాషలో మాత్రమే చదివిస్తూ పెద్ద పొరపాటు చేస్తున్నారు . మీ పిల్లలనూ తెలుగు మీడియం లో చదివించండి. తెలుగు భాషను తల్లి భాష అంటారు. ఆ తల్లి భాషను గౌరవించండి. ఇప్పుడు మగవారికి జరిగిన పోటీలో నాగేశ్వరరావు , చెన్నయ్య ,యుగంధర్ లు బహుమతికి ఎన్నికయ్యారు . ఉగాదిపచ్చడి అందరూ తీసుకొన్న తరువాత బహుమతులు అందజేస్తాము .బహుమతులు గెలుచుకొన్నవారికే కాకుండా ఈరోజు పోటీలో పాల్గొన్నవారికందరికీ కన్సోలేషన్ బహుమతులు ఇస్తున్నాము "అంటూ కృష్ణస్వామి చెప్పగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.
"నివేదితా మనకు పెట్టిన పోటీలో నేను వేపపువ్వు, బెల్లం అని మాత్రం వ్రాసాను. చదువుకున్నంతవరకు వంటగదివైపు చూడలేదు. చదువు పూర్తయినవెంటనే ఉద్యోగం ....పెళ్లి ... ఇంట్లో ఎవరో ఒకరు ఉగాది పచ్చడి తయారు చెయ్యడం…… తినడం "
"నేనూ నీ లాంటి దాన్నే ,నాకూ ఆరెండు పేర్లు మాత్రమే తెల్సు ...నిన్నటిరోజున మా అత్తయ్య ఉగాది గురించి ఒక ఉపన్యాసం ఇవ్వడం వల్ల తెలుసుకున్నాను "
"నివేదితా, ఈ ఉగాదిరోజు మన లేడీస్ స్టాఫ్ అందరూ రావడం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అందరూ అంటే మన లాగా వివాహం అయినవారు పదిహేనుమంది ఉన్నాము .వారందరూ రావడం ...."
"ఇక్కడే మనం ఉగాది పండుగా సరదాగా జరుపుకొంటున్నాము .నేను ఇంట్లో ఉంది ఉంటె మా అత్తయ్య నన్ను పిండేస్తుంది "
“ నివేదితా మీ అత్తయ్య గయ్యాళిగా ప్రవర్తిస్తుందా....."
"గొడవపెట్టుకోవడం ,కోప్పడటం లాంటి పనులు చేయకపోయినా, ఆవిడ మనసులో ఇంకా అత్తయ్యగా అధికారం చలాయించాలన్న భావనతో ఏదో ఒక పని చెబుతూ ఉంటుంది. ఆ పని కష్టం అనుకొంటే విసుగుతో చేయవలసి వస్తుంది .చిన్న పనేకదా పెద్దావిడ చెప్పింది చేస్తే పోతుంది అనుకోని సంతోషంతో చేయడంవల్ల మనసులో ఎటువంటి వత్తిడి కలగదు. "
“చూస్తుంటే మీ అత్తయ్య ఎంతో మంచిఆవిడలాగా అనిపిస్తోంది .మా అత్తయ్య అయితేనా ....ప్చ్ ఈ ఉగాదిరోజు ఎందుకులే .ఇక్కడున్న వారందరూ ఈ రోజు ఆఫీస్ కు రావడానికి ముఖ్య కారణం వారే . కష్టపడి పనిచేసి జీతం తీసుకొనివస్తున్నా ....ఇంటికొచ్చాక చాకిరీ చెయ్యాలని ఈ కాలం అత్తయ్యలు ఎదురు చూస్తున్నారు. మా కాలంలో మేము మా అత్తయ్యలు చెప్పిన మాట జవదాటలేదు మీరూ అలాగే ఉండాలి అన్న ధోరణిలో ఉన్నారు. మనం తెలుగుభాషపై ఎలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నామో ఈ కాలం అత్తయ్యలు కోడళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు . మరో తరానికి కోడళ్లతో పాటు అత్తయ్యలు ఒకే ఇంటిలో ఉండరు. .... అలాగే తెలుగు భాష అసలు ఉండదనిపిస్తోంది "అంది
“కృష్ణస్వామి లాంటి వారు మరో తరం ఉద్యోగులకు మేనేజర్ గా ఉన్నారంటే కనీసం ఆఫీస్ లో నైనా ఉగాది పచ్చడి తినవచ్చు.” అంది నివేదిత