నవతరం - లత పాలగుమ్మి

new generation
తెల్లవారుతుందంటేనే రమణికి భయంగా ఉంది. వాచిన ముఖం, ఎర్ర బారిన కళ్ళు అద్దంలో తనముఖం తననే భయ పెడుతోంది. ఈ వారం రోజులలో ఇంక కళ్ళల్లో కన్నీళ్ళే ఇంకిపోయాయేమోఅన్నంతగా ఏడ్చింది రమణి. నాన్న మీద బెంగ, రేపెలా గడుస్తుంది అనే దిగులు. బయట తమ్ముడు, చెల్లెలు మిగతా పిల్లలుతో ఆడుకుంటూ కనబడ్డారు రమణికి. ఎంత పెద్ద కష్టం వచ్చిందో కూడా తెలియని పసి పిల్లలు పాపం వాళ్ళు అనుకుంది.

అమ్మ సంగతి సరే సరి, ఆ గది లోంచి బయటికి రాకుండా బంది అయి పోయినట్లుంది. చుట్టు పక్కల అమ్మలక్కలు, చుట్టాలు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఓదారుస్తున్నారో, అమ్మని ఇంకా బాధ పెడుతున్నారో తెలియని పరిస్థితి. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు నాన్న గురించి మాట్లాడటం, అమ్మ బావురుమనటం ఇదే తంతు వారం రోజులుగా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఊరుకోకుండా రామారావు (మా నాన్న పేరు) పెద్దగా ఆస్తులేమీ సంపాయించినట్లు లేడు, ఈ ముగ్గురు పిల్లలని ఆ రెండు ఎకరాల పొలంతో ఎలా పోషిస్తావో ఏంటో అని ఒకరంటే, మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా? అని అడిగి అయినా వాళ్ళకే జరుగు బాటు కష్టం అనుకుంటా!! అని ఆ ప్రశ్న అడిగినామే సమాధానం కూడా చెప్తుంది. అమ్మ అసలే అమాయకురాలు కావటంతోఅన్నింటికీ దుఃఖమే ఆవిడ సమాధానం. వాళ్ళందరిని బయటకి తోసేయ్యాలన్నంత కచ్చిగా ఉంది రమణికి.

అవ్వవలసిన కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత ఎవరి దోవన వారు తప్పుకున్నారు బాగా దగ్గరి వాళ్ళు కూడా. ఉంటే బాధ్యతలు ఎక్కడ మీద పడతాయోనని భయంతో.

నాన్న లేని జీవితం ఊహించుకో లేక తల్లడిల్లి పోతోంది రమణి. ఒక బలహీన క్షణంలో చనిపోవాలనిపించినా అమాయకురాలైన తల్లి, ప్రపంచ జ్ఞానం తెలియని తమ్ముడు, చెల్లెలు గుర్తుకు వచ్చి పరిస్థితిని ఎలా చక్క పెట్టాలి అనే ఆలోచనలో పడింది రమణి. సరిగ్గా రెండు వారాల క్రితం ఇదే రోజున నాన్న నేను ఎంత సంతోషంగా ఉన్నామో కదా!! అని గుర్తుకు వచ్చి దుఃఖం ఆగలేదు రమణికి. నా జీవితంలో మర్చి పోలేని రోజది. ప్రతి క్షణం సంతోషంగా ఉన్న రోజు. నాన్న నేను పండుగ చేసుకున్న రోజు.

జే. ఈ.ఈ. అడ్వాన్స్డ్ లో ఫిఫ్త్ ర్యాంకు వచ్చినట్లు పేపర్ లో ఫోటో తో సహా రావడంతో నాన్న చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. ఆ రోజే న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఊరంతా నా గురించి గొప్పగా చెప్పుకున్న రోజు. నాన్న అయితే పేరు పేరునా అందరికీ పేపర్లో ఫోటో వచ్చిందని చూపించాడు. సాయంత్రం రచ్చబండ దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టాడు. మా అమ్మాయి పగలనక, రాత్రనక కష్టపడి మంచి ర్యాంకు తెచ్చుకుందని గర్వంగా చెప్పుకున్నాడు. ఇదంతా రంగనాథం మాస్టారు చలవే అని పొగిడాడు. ఆడపిల్లని పదవ తరగతి వరకు చదివించి పెళ్లి చేసి పంపితే బాధ్యత వదిలి పోతుంది అని భావించే మా ఊరి వాళ్ళకి ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి లోకి వస్తున్నారని తెలియ జేసి, చదువు ప్రాధాన్యతను తెలియ చెప్పిన ఘనత రంగనాథం మాస్టారి

గారిదే అని చెప్పొచ్చు. "రమణి చాలా తెలివైన పిల్ల, సిటీ కి పంపించి చదివించు రామారావు" అని మాస్టార్ గారి ప్రోత్సాహం వల్లనే నాన్న నన్నుసిటీకి పంపాడు. ఆ రోజు రాత్రి "అమ్మా, రమణీ!! పొద్దున్నే రంగనాథం మాస్టారు మనల్ని ఓ పాల రమ్మన్నారు ఏడ సదవాలి?? ఏంటి ? అన్నిమాట్లాడతారంట నీతో " అని చెప్పి నాన్న నా దగ్గరకు వచ్చి "ఎంత తెలివైన దో నా బంగారు తల్లి" అని నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని,

"ఓ పాల దిష్టి తీయవే నా తల్లికి, ఊరందరి కళ్ళు నా బిడ్డ మీదే ఈయాల" అన్నాడు నాన్న అమ్మతో. . అదే ఆఖరు నాన్న నాతో మాట్లాడడం. సరే నాన్న రేపొద్దున వెళదాం అన్నాను. ఆడ పిల్లని ఎందుకు ఆడకి, ఈడకి అంతంత దూరాలు పంపి సదివీయడం, ఒక అయ్య చేతిలో పెడితే సరిపోలే!! పట్నం పంపి సదివించావు కదా సాల్లే. లగ్గం ఎప్పుడు పెట్టుకుందాం అని అడుగుతోంది మీ చెల్లి, వాళ్ళు ఒప్పుకుంటేనే సదివించు అని అంటుంది అమ్మ నాన్నతో. సావిత్రమ్మ రమణికి వరసకి అత్తమ్మ అవుతుంది. చిన్నప్పటి నుండి రమణిని కోడలుగా చేసుకోవాలని ఆవిడ కోరిక. వాళ్ళ అబ్బాయి రమేష్ పదవ తరగతి కూడా పా స్అవక పోవడంతో చదువు మానేసి గాలికి తిరుగుతూ ఉంటాడు. అతనికి లేని వ్యసనం లేదు. రమణి తెలివైన అమ్మాయి కాబట్టి ఎలాగైనా అతన్ని మంచి దోవలో పెడుతుందని, తక్కువ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అయితే తన చెప్పు చేతల్లో పెట్టుకో వచ్చని ఆమె ఆశ. పది ఎకరాల పొలం చూసి అయినా పిల్లని ఇస్తారనే ధీమా ఆమెకి. ఆ పోరంబోతు కుర్ర గాని కి బంగారం లాంటి నా బిడ్డని ఇస్తానని ఎలా అనుకున్నావ్!! అయినా నా పిల్లని సదివియడానికి వాళ్లని అడిగేది ఏంటే, ఇంకోసారి ఎప్పుడు వాళ్ళ ఊసు నా దగ్గర ఎత్తమోకు అని కసురుకున్నాడు నాన్న. అమ్మ మాటలకి భయ పడినా నాన్న మాటలతో కొండంత ధైర్యం వచ్చింది రమణికి. తన ఆశా సౌధం కుప్పలా కూలిపోతుందని తెలియని రమణి భవిష్యత్తు మీద బోలెడంత ఆశతో పడుకుంది.

తెల్లవారుఝామున రమణి తండ్రి గుండె పోటుతో మరణిస్తాడు. ఇప్పటికి రమణి ఆ విషయం జీర్ణించుకో లేక పోతోంది.

ఇది నిజమేనా!! అని వేల సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

కానీ కాలం ఎవరి కోసం ఆగదు. మూడు నెలలు గిర్రున తిరిగి పోయాయి. అంతో ఇంతో బ్యాంకులోఉన్న డబ్బు కూడా కరిగి పోయింది. అమ్మకి ధైర్యం చెప్పడం, తమ్ముడు, చెల్లెలి బాగోగులు చూసుకోవడంతో సమయం గడిచి పోయింది.

ఐ. ఐ.టి. లో జాయిన్ అవలేదన్న బాధ లోలోన తినేస్తోంది రమణిని. తనలో తాను కుమిలి పోవడం తప్పించి తన బాధని పంచుకోవడానికి కూడా ఎవరూ లేరు. నాన్న లేక పోవడంతో తను పూర్తిగా ఒంటరిదై పోయింది. కుటుంబ పోషణ బాధ్యత పూర్తిగా తనదే కావడంతో ఇల్లు ఎలా గడపాలి అనే ఆలోచనలో పడింది రమణి. అమ్మ కూడా చదువుకుని సమర్ధవంతురాలై ఉంటె ఎంత బాగుండేది అనిపించింది మొదటి సారిగా రమణికి.

ఈ అవకాశాన్ని ఎలా అయినా వినియోగించుకొని

మా ఇంటి పెత్తనం తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించింది సావిత్రమ్మ. వాళ్ళ అబ్బాయికి రమణిని ఇచ్చి చేస్తే మా ఇంటి బాధ్యత తనదేనని చెప్పడంతో మొదటి నుండి ఈ సంబంధానికి సుముఖంగా ఉన్న రమణి తల్లి సరేనంటుంది. పక్కనే ఇల్లు, పది ఎకరాల పొలం, కూతురు సుఖ పడుతుంది అని ఆవిడ ఉద్ధేశ్యం. అంతకు మించి ఆలోచించే తెలివి తేటలు ఆమెకి లేవు. అమ్మ అమాయకత్వం కూడా ఒక సమస్యగా తయారైంది రమణికి. మైనారిటీ తీరకుండా పెళ్లి చేస్తే చేసిన వాళ్ళకి, చేయించుకున్న వాళ్ళకి ఇద్దరికీ జైలు శిక్ష తప్పదని రమణి బెదిరించడంతో సావిత్రమ్మ, రమణి తల్లి కిమ్మనకుండా ఉండి పోతారు. మాస్టారి గారి ఐడియా ఫలించినందుకు సంతోషప డుతుంది రమణి.

ఏం చెయ్యాలో పాలుపోని రమణి రంగనాధం మాస్టారు గారి ఇంటికి వెళుతుంది. మాస్టారి గారి భార్య ఏంతో ఆప్యాయంగా రామ్మా, రమణి!! కూర్చో అంటారు. దూరదర్శన్ లో వార్తలు వింటున్న మాస్టారు గారు ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నానమ్మా, "న్యూస్ లో సేంద్రియ వ్యవసాయం గురించి విన్నాను, నువ్వు చేస్తే బాగుంటుందని నాకనిపిస్తోందమ్మా" అంటారు.

నేనా!! వ్యవసాయమా.....అని బిత్తర పోయి, నాకు అందులో ఓనమాలు కూడా రావు మాస్టారు అంటుంది రమణి.

తెలియ డానికి ఏముంది తల్లీ!! ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్ లో అవైలబుల్ గాఉంటుంది. నువ్వు తెలివైన దానివి, తప్పకుండా చెయ్య గలవని నమ్మకం నాకుంది,. మా అందరి సహకారం నీకు ఉండనే ఉంటుంది అని ప్రోత్సాహకరంగా చెప్తారు.

రమణి ఆలోచనలో పడింది, తనకున్న క్వాలిఫికేషన్ తో ఏ జాబ్ రాదు, ఒకవేళ వచ్చినా ఆ శాలరీ సిటీలో ఉండే ఖర్చులకి నాకే బొటా బొటి సరి పోతాయి ఇంకా ఇంటికి ఏం పంపిస్తుంది!! అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళలేను. ఇష్టం ఉన్నా లేక పోయినా ఏదో ఒకటి ఇక్కడుండే చెయ్యాలి, తప్పదు అనుకుంటుంది రమణి.

ఆడపిల్లవి, పెళ్ళి చేసుకోకుండా వ్యవసాయం చేయడమేంటి?? ఎంతో అనుభవం ఉన్న మీ నాన్నే చేయ లేక పోయాడు, నువ్వు ఏం చేయగలవు?? సావిత్రమ్మ గారి అబ్బాయిని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండక అంటుంది రమణి తల్లి కోపంగా.

మాస్టారి గారితో చెప్పించి ఎలాగోలా అమ్మని ఒప్పిస్తుంది రమణి. ఆడపిల్ల కష్ట పడాల్సి వస్తోందని బాధ పడుతుంది రమణి తల్లి.

ఒక వారం రోజుల పాటు అధ్యయనం చేసి పూర్తిగా ఒక అవగాహనకు వస్తుంది. మాస్టారి గారి సహాయంతో బ్యాంకు లోన్ తీసుకొని సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుడుతుంది రమణి. పొలంలో ఉంటె రమణికి తండ్రి తనతోనే ఉన్నట్లనిపిస్తుంది. తండ్రి తిరుగాడిన స్థలం కాబట్టి మనసుకి స్వాంతన లభిస్తుంది.

పెళ్ళి కావలసిన ఆడపిల్ల వ్యవసాయం చేయడమేంటి ?? అని ఊరు ఊరంతా ముక్కు మీద వేలేసుకున్నారు. రమణి అవన్నీ లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళే సైనికుడిలా తన పని ప్లానింగ్ ప్రకారం చేసుకుపోతోంది.

రమణి మాస్టారి గారి సహాయంతో ఊరిలో రైతులందరిని సమావేశ పరిచి వరి, గోధుమ లాంటి ధాన్యాలే కాకుండా మిశ్రమ పంటలు వేయడం వలన ఎంత లాభమో వివరిస్తుంది. ప్రతి మూడు లేదా నాలుగు నెలలకి దిగుబడి వచ్చేలా ప్లాన్ చేసుకుని దళారులు లేకుండా డైరెక్ట్ గా సూపర్మార్కెట్ వాళ్ళతో టై అప్ చేసుకుని వాళ్లకి ఏ కూరగాయలు కావాలో తెలుసుకొని అవే పండిస్తే అమ్మకం కూడా సులువు అవుతుందని

తెలియ చేస్తుంది.

ఎవరూ ఆమె మాట ఖాతరు చెయ్యరు. ముందు నీకు లాభాలు వచ్చాక చెప్పమ్మా!! అప్పుడు చూసుకుందాం అని కొందరు, "గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుగా" ఇన్నేళ్ల అనుభవం ఉన్న మనకి ఈ పిల్ల చెప్పడం ఏంటని మరి కొందరు హేళనగా మాట్లాడి వెళ్ళి పోతారు. నీ వెనకే మేము ఉన్నామని ధైర్యం చెప్తారు రంగనాధం మాస్టారి దంపతులు. నాన్న కూడా నన్ను ఆశీర్వదించినట్లు అనిపించింది.

సంవత్సరం తిరిగే లోగా ఊరి వారందరిని ఆశ్చర్య పరిచే లాగా మిశ్రమ పంటలు పండించి వ్యవసాయం చేయడంలో దిట్ట అనిపించుకుంటుంది రమణి. తల్లిని కూడా పొలానికి తీసుకు వెళ్ళి అన్ని వివరిస్తుంది ఓర్పుగా ఆమెకి అర్ధమయ్యేంత వరకు. మొదట్లో పొలానికి రావడానికి కూడా ఇష్టపడని ఆమె అన్ని రకాల కూరగాయలు పండించిన కూతురి సమర్ధత చూసి మెల మెల్లగా ఆమెకి కూడా ఆసక్తి కలుగుతుంది. రమణి ప్రతి పనిలో తమ్ముడు, చెల్లెలిని కూడా పాల్గొనేలా చేస్తుంది.

సంవత్సరంలో రకరకాల కూరగాయలు

నాలుగు సార్లు దిగుబడి చేసి డైరెక్టు గా సూపర్ మార్కెట్లకి పంపడం చూసి మెల్లగా చిన్న రైతులు ఆమెతో సలహా సంప్రదింపులు చేయడం ప్రారంభిస్తారు. డ్రిప్ ద్వారా అతి తక్కువ నీటితో వ్యవసాయం చేయడం, సోలార్ పవర్ వాడటం ఇవన్నీ రైతులను ఆశ్చర్య పరుస్తాయి. అందరూ ఒకటే రకమైన పంట వేయకుండా జాగ్రత్త పడాలని చెప్తుంది రమణి.

ఆ ఊరి రైతులే కాకుండా చుట్టు పక్కల ఊరి వాళ్లు కూడా రమణిని అనుసరించి వ్యవసాయయంలోఆధునిక పద్ధతులను ఉపయోగించటం ప్రారంభిస్తారు. ఒక నాటి సాయంత్రం రమణి వాళ్ళఇంటికి వచ్చిన రంగనాధం మాస్టారు ఆశ్చర్య పోతారు. రమణి రైతులకి బ్లాక్ బోర్డు మీద ప్లానింగ్ తో సహా వివరించడం చూసి. నేను పిల్లలకి తరగతి పాఠాలు మాత్రమే చెప్తున్నాను, రమణి వాళ్ళకి జీవనోపాధి కలిగించే పాఠాలు చెప్తోందని మిక్కిలి ఆనంద పడతారు.

చదువు మీద రమణి కి ఉన్న మక్కువ మాత్రం పోలేదు. కాల చక్రం గిర్రున తిరిగి ఐదు ఏళ్ళు ఎలా గడిచి పోయాయో తెలీలేదు. రమణి ప్రైవేట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని సివిల్ సర్వీసెస్ లోఉత్తీర్ణత పొంది ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతుంది.

ట్రైనింగ్ లో శిరీష్ తో పరిచయమవుతుంది రమణికి.

అతని పేరెంట్స్ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్స్ అవడంతో అతను కూడా అదే ప్రొఫెషన్ ఎంచుకుంటాడు. మొదటి పరిచయంలోనే రమణి ని ఇష్ట పడతాడు శిరీష్. ఆమెలో ఉన్న విషయ పరిజ్ఞానం, మిత భాషిత్వం, వయసుకి మించిన పెద్దరికం అన్ని అతనికి బాగా నచ్చుతాయి. ప్రాజెక్ట్ వర్క్ మీద అతని ఇంటికి వెళ్లిన రమణి అతని పేరెంట్స్ ని చూసి ముచ్చట పడుతుంది. శిరీష్ ఇంకా వాళ్ళ దగ్గర చిన్న పిల్లాడిలా అలగటం, వాళ్ళు కూడా అతనితో సమంగా తనని కూడా చిన్న పిల్లలా చూడటం ఆమెకి బాగా నచ్చుతాయి. తండ్రి ఉండి ఉంటె తను కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది. అకస్మాత్తుగా తండ్రి చని పోవడంతో వయసుకి మించి పెద్దరికాన్ని ఆపాదించుకున్నరమణి అన్ని మరిచి పోయి ఆ రోజు తను కూడా చిన్నపిల్లలా అయి పోయింది.

శిరీష్ తల్లి రమణి కి మంచి చీర, ముత్యాల సెట్ బహుమతిగా ఇస్తుంది. రమణి మొహమాట పడుతుంటే "వద్దనకుండా తీసుకోమ్మా!! నువ్వు ఎప్పటి నుండో పరిచయం ఉన్న ఆత్మీయురాలిలా అనిపిస్తున్నావు మాకు, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా" అని అంటారు శిరీష్ వాళ్ళ ఫాదర్. రమణి కూడా తరచూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేది. మాస్టారి గారి కుటుంబం తర్వాత తనకు ఇంతటి ఆత్మీయతని పంచి పెట్టింది వీళ్ళే అనుకుంటుంది రమణి.

అందరూ ఒకటే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక విషయానికి చర్చకి దిగితే గంటలు నిమిషాల్లా దొర్లి పోయేవి.

రమణిని తమ కోడలిగా చేసుకోవాలని ఉందని, ఆమెకి ఇష్టమైతే వాళ్ళ పెద్ద వాళ్ళతో వచ్చిమాట్లాడతామని అడుగుతారు శిరీష్ పేరెంట్స్. రమణి ఎప్పుడో ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించింది కానీ ఇంత త్వరగా అనుకోలేదు. కొంచెం మొహమాటంగా, కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది. వారిని తన ఊరికి వచ్చి రెండు రోజులు గడప వలసిందిగా కోరుతుంది. ఎంత చదువుకున్నా ఆడపిల్ల కదా!! పెళ్ళి విషయం మాట్లాడటానికి సిగ్గు పడుతోందేమోనని, వీలు చూసుకుని వస్తామని తమ అంగీకారం తెలుపుతారు.

ఒక మంచి రోజు చూసుకుని శిరీష్, అతని పేరెంట్స్ రమణి వాళ్ళ ఊరికి వస్తారు. సిటీలో బిజీ లైఫ్ కి అలవాటు పడి పోయిన వాళ్లకి ఈ పల్లెటూరు, పచ్చని పొలాలు, చక్కటి గాలి ఎంతగానో నచ్చుతాయి. పాత కాలం నాటి విశాలమైన ఇల్లు, పెద్ద లోగిలి, ఇంటి ముందు పేడతో కళ్ళాపి చల్లి రంగవల్లులు దిద్ది ఉన్నాయి. రంగనాధం మాస్టారు ఎదురెళ్ళి వారిని సాదర పూర్వకంగా ఆహ్వానించి, పరిచయ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రమణి తల్లి కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చిందని, ఆమె చిరకాల వాంఛ నెరవేరుతుందని అమితానంద పడుతుంది. రమణి ఎంతో తెలివైన పిల్లని, తండ్రి పోయిన దగ్గర నుండి కుటుంబ బాధ్యత ఒక్కర్తే ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణత సంపాదించుకుందని చెప్తారు రంగనాధం మాస్టారు.

అల్పాహార కార్యక్రమాలు ఐన తర్వాత రమణి వాళ్ళని పొలం దగ్గరకు తీసుకు వెళుతుంది. దోవంతా రైతులు ఎవరో ఒకరు ఆమెని ఆత్మీయంగా పలకరించడం, "లోన్ శాంక్షన్అయ్యిందమ్మా!! అంతా నీ చలవే తల్లీ!! అని ఒకరంటే, ఈసారి మంచి సాగుబడి వచ్చింది, అంతా నీ సలహా వల్లే అమ్మా!! అని ఇంకొకరు" ఇలా పొగుడుతూనే ఉన్నారు. రమణి వారితో మాట్లాడే తీరు, పెద్దరికంతో సలహాలు ఇవ్వటం, ఆ హుందాతనం, పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికి ఆమె పై ఉన్న ప్రేమ గౌరవం చూసి శిరీష్, అతని పేరెంట్స్ అబ్బుర పడతారు. ఆమె మీదున్న అభిమానం, గౌరవం రెట్టింపు అవుతాయి.

రమణి కోరిక మేరకు ఆమె ఊరి లోనే నిరాడంబరంగా వారి వివాహం జరుగుతుంది. సిటీలో రిసెప్షన్ ఘనంగా చేస్తారు శిరీష్ పేరెంట్స్.

రమణి తల్లి ఇది వరకటిలా కాక ఇల్లు, పొలం వ్యవహారాలు చక్కగా సమర్ధవంతంగా నిర్వర్తిస్తోంది మిగతా పిల్లల సహాయంతో. రమణి నాకు కూతురే అయినా తల్లిలా తనకి వ్యవసాయం గురించి అవగాహన, ప్రపంచ జ్ఞానం తెలియచేసింది అని ఎంతో గొప్పగా చెప్తుంది రమణి తల్లి.

రమణి రైతుల స్వయం ప్రతిపత్తి పెంపొందించడం కోసం సహకార సంఘం ఏర్పాటు చేయించింది.

రైతులందరికీ కలెక్టరుగా కాక ఒక ఆప్తురాలిలా అందుబాటులో ఉంటుంది.

రమణిని కొత్త కాపురానికి సాగనంపడానికి ఊరు ఊరంతా గుమిగూడతారు.

బ్యాంకు లోన్ తీసుకొని ఐ .ఐ.టి. లో జాయిన్ అయితే నేను లక్షల జీతం సంపాదించుకొని నా కుటుంబాన్ని మాత్రమే నిలబెట్టుకొని ఉండేదాన్నేమో కాని ఇంత మందికి మార్గదర్శకమయ్యాననే సంతృప్తి నాకు దక్కి ఉండేది కాదని అక్కడున్న అందరితో రమణి తన సంతోషాన్నిపంచుకుంటుంది.

నువ్వు "నవతరానికి " నాంది పలికావమ్మా అని రంగనాధం మాస్టార్ రమణిని కొనియాడుతారు.

కొత్త దంపతులు రంగనాధం మాస్టర్ వద్ద, రమణి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తమజీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి పయనమవుతారు.

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు