బ్రహ్మపురిలో ఉండే తన స్నేహితుడు మాధవయ్యను చూడడానికి చాలా రోజుల తర్వాత పట్నంలో ఉండే రామయ్య వారింటికి వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితుణ్ణి చూసి మాధవయ్య చాలా సంతోషించాడు. తగిన అతిథి మర్యాదలు చేసాడు.
అయితే మాధవయ్య ఇంటి పరిస్థితిని చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మాధవయ్య ఒకప్పుడు బాగా ఆస్థిపాస్తులు కలవాడు. తన తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయంలోనే కాకుండా వ్యాపారంలోనూ బాగా రాణించి ఆ ఊళ్ళోనే ధనవంతులలో ఒకడయ్యాడు. అలాంటిది ఇప్పుడు ఓ చిన్న ఇంటిలో ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఇంతకు మునుపు గల వైభవం కానరాలేదు రామయ్యకి. తన స్నేహితుడి కళ్ళలో నైరాశ్యం కూడా గమనించాడు రామయ్య.
ఆ విషయమే మాధవయ్యను రామయ్య అడగ్గా తన సమస్య వివరించాడు మాధవయ్య. మాధవయ్యకి ఆ ఊళ్ళో వ్యవసాయ భూములేకాక ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. మాధవయ్యకి ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురూ బుద్ధిమంతులే. అతను చెప్పిన పనల్లా వాళ్ళు చేస్తారు తప్పితే బాధ్యత వహించి ఏ పనీ చేయరు. తను ఒక్కడే అన్నిపనులు చూసుకోలేకపోవడంతో వ్యాపారం మందగించి నష్టాలు చవిచూడవలసి వచ్చింది. తనకా వయసు పైబడుతోంది. వాళ్ళకి వ్యవసాయమో, లేక ఏదైనా ఒక వ్యాపారమో అప్పచెప్తే సరిగ్గా బాధ్యత తీసుకొని చేస్తారన్న నమ్మకం కూడా లేదు మాధవయ్యకి. తన తదనంతరం వాళ్ళు ఎలా బతుకుతారోనని ఒకటే దిగులు మాధవయ్యకి. తన మనసులోని వేదనని స్నేహితుడితో పంచుకున్నాడు మాధవయ్య. అంతా చెప్పి, "నువ్వే నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పు, ఏం చేస్తే మా అబ్బాయిలికి బాధ్యత తెలిసివస్తుందో?" అని అడిగాడు మాధవయ్య. రామయ్య నిదానంగా ఆలోచించి, "నేను ముందు ఇవ్వాళే తిరిగి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ, ఇప్పుడు నీ పరిస్థితి తెలిసిన తర్వాత మీ ఇంట్లో ఇంకో రెండురోజులుండి అంతా గమనించి నీకు చెప్తాను, సరేనా!" అన్నాడు. ఆ మాటలు విన్న మాధవయ్య చాలా సంతోషించాడు.
అన్నవిధంగానే రామయ్య మరో రెండురోజులు మాధవయ్య ఇంట్లో గడిపి అక్కడి పరిస్థితి సునిశితంగా గమనించిన తరవాత ఒక విషయం కనుగొన్నాడు. మాధవయ్య కొడుకులు ముగ్గురూ బుద్ధిమంతులే అయినా వారికి స్వతంత్రంగా ఏ పని చేయడం మాత్రం అబ్బలేదు. తండ్రి వారికి ఏం చెప్తే అది తు.చ.తప్పకుండా ఆచరించడం తెలుసు తప్పితే వారికి వ్యాపారానికి గానీ వ్యవసాయానికి గాని సంబంధించి ఏ పని సమగ్రంగా రాలేదు. ఫలితంగా, వాళ్ళు తమ తండ్రికి పనుల్లో ఏ విధంగానూ పూర్తిగా సహాయపడలేకపోతున్నారు. అందువలన మాధవయ్య ఒక్కడూ మొత్తం వ్యవహారం చూసుకోవలసి వస్తోంది. పనిభారం తన ఒక్కడి మీద పడడంతో దేన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు మాధవయ్య. ఫలితంగా కొన్ని వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. వ్యవసాయరంగంలో కూడా అదే పరిస్థితి నెలకొంది.
ఆ విషయమే మాధవయ్యకి వివరించాడు రామయ్య. "అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీ సలహా ఏమిటి? అని అడిగాడు మాధవయ్య.
"ఇప్పటిలా ఇకముందు ఏదో ఒక పని మాత్రం వాళ్ళకి అప్పచెప్పకు. ఒకొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించు. ఒకరికి వ్యవసాయ బాధ్యతలు పూర్తిగా అప్పగించు. అలాగే వ్యాపార బాధ్యతలు కూడా మిగతా ఇద్దరికి చెరిసగం అప్పగించు. వాళ్ళకి పూర్తిగా బాధత అప్పగిస్తేనే మెలుకువలు వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు. అయితే వాళ్ళు మీద పూర్తి అజమాయిషీ చేస్తూ కావల్సినప్పుడు తగిన సలహాలు ఇస్తూండు. ఇలా చేస్తే వాళ్ళకి పూర్తి బాధ్యత ఒంటబడుతుంది." అన్నాడు రామయ్య.
రామయ్య మాటల్లో నిజం గ్రహించిన మాధవయ్య తన తప్పు తెలుసుకున్నాడు. రామయ్య సలహా ఆచరణలో పెట్టిన అనతి కాలంలోనే అన్ని వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎడాది తిరిగేసరికల్లా వ్యాపారం, వ్యవసాయం రెండూ పూర్వ వైభవాన్ని సంతరించుకొన్నాయి. మాధవయ్య కొడుకులు ముగ్గురూ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు పూర్తిగా ఎరిగారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ రామయ్య మాధవయ్యని చూడడానికి వచ్చి అతని పరిస్థితి మెరుగుపడడం చూసి చాలా సంతోషం వెలిబుచ్చాడు. అలాగే మాధవయ్య కూడా తన స్నేహితుడికి తన కృతఙత తెలియబర్చాడు.