బావా,
ఎన్నో వసంతాల నిరీక్షణకి తెరపడుతున్న ఈ నిండు పున్నమి వేళ అరవిరసిన నా హృదయ కుసుమాన్ని నీ మనో నేత్రాల ముంగిట పొందుపరచి నా ఆనందాన్ని, సంతోషాన్ని నీతో పాలుపంచుకోవాలనే అభిలాషతో ఈ లేఖ వ్రాస్తున్నాను. దాదాపు దశాబ్ద కాలం పాటు నా మనసులోనే దాచుకున్న అంతరంగ తరంగాలను నాకత్యంత ప్రీతి పాత్రుడైన వ్యక్తితో పంచుకుని నన్ను నేను నివేదించు కోవాలన్న విచిత్రమైన ఆకాంక్ష ఫలితమే ఈ లేఖ.
బావా! పదేళ్ల క్రిందట జరిగిన సంఘటనలైనా అవన్నీ ఈ నాటికీ నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. నీకూ, శారదక్కకీ మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, ఇష్టం, అనురాగాలు పన్నెండేళ్ల ప్రాయంలో తెలిసీ, తెలియని వయసైనా నా కెంతగానో అవగతమయ్యేది. నాకే ఏమిటి ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరిద్దరూ చెట్టా పట్టా లేసుకుని స్కూల్ కెళ్ళుతున్నా, ఆటపాటలాడుకుంటున్నా ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ప్రస్ఫుటంగా తెలుస్తుండేది. వయసులో ఇద్దరూ దాదాపు సమానమవడంతో అభిరుచులు, అలవాట్లు అన్నీ కలిసిపోయేవి. ఈ లోకంలో కేవలం మీరిద్దరే ఉన్నట్టు మసలుకునేవారు. తను తప్ప నీకు మరో స్నేహితుడుండేవాడు కాదు. అలాగే నువ్వు తప్ప తనకు మరో నేస్తం ఉండేది కాదు.
మీరిద్దరూ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆనంద పరవశులై ఉన్న ఆ రోజు ఉరుమురమని పిడుగులా నాన్న ఆ వార్త తెచ్చారు, మర్నాడు అక్కను చూడడానికి పెళ్లి వారెవరో వస్తున్నారని. ఆ సమయంలో నీ మొహంలో కదలాడిన హావ భావాలను నేనెన్నటికీ మరచిపోలేను. కోపం, నిస్సహాయత, బాధ, నిరాశ, నిస్పృహలు అన్నీ అలుముకుని సర్వస్వమూ పోగొట్టుకున్నట్టున్న నీ వదనం ఆ రోజునుంచీ అనుక్షణం నా కళ్ళముందు కదలాడుతూనే ఉంది.
అత్తయ్య కన్నీళ్ళు పెట్టుకుని నాన్నతో మీ ఇద్దరి అనుబంధం గురించి ప్రస్తావిస్తే నాన్న “అదికాదక్కా! మాధవ్ పై చదువులు చదివి, ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడడానికి కనీసం ఏడెనిమిది సంవత్సరాలైనా పడుతుంది. అంతవరకు శారదకు పెళ్లి చేయకుండా ఎలా ఉండగలం చెప్పు. అందులో ఈ సంబంధం వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే అమ్మాయిని చేసుకుంటామని వచ్చారు. అబ్బాయి మన అమ్మాయినేదో పెళ్ళిలో చూశాడట. బాగా నచ్చిందని, చేసుకుంటే మన అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టాడట. అన్ని విధాల లక్షణమైన సంబంధం. అబ్బాయి ఎండి చేసి ఢిల్లీ ఎయిమ్స్ లో పని చేస్తున్నాడట. ఇంతకంటే మంచి సంబంధం నేనెక్కడినించి తేగలను చెప్పు “ అని అత్తయ్యని నోరెత్తకుండా చేసేశాడు.
అక్కయ్య పెళ్లిరోజు కూడా నాకు బాగా గుర్తు. నాన్నకి ఎదురు చెప్పలేక అక్కయ్య విషణ్ణ వదనంతో పెళ్లి పీటల మీద కూర్చొంటే, నువ్వేమో దూరంగా రామాలయంలో గన్నేరు చెట్టు క్రింద కూర్చుని ఉన్నావు గుండెల్లో గంపెడు బాధతో. అన్యమనస్కంగా కొలనులోకి రాళ్లు విసురుతూ కూర్చునున్న నిన్ను చూస్తుంటే నా మనసు తరుక్కు పోయింది. అప్పటికప్పుడు నీ దరికి చేరి నీ తలను నా ఒడిలో పెట్టుకుని “బాధపడకు బావా! నీకు నేనున్నా” నని చెప్పాలనిపించింది. ఆ సానుభూతే క్రమంగా ప్రేమగా, ఆరాధనగా మారి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనేంతగా ఎదిగిపోయింది. ఇవేవీ పట్టని నువ్వు విఫల ప్రేమ మీద కక్షతోనో ఏమో కసిగా పై చదువులు పూర్తి చేశావు ఇక్కడ, అమెరికాలోను కూడా. అక్కేమో ఈ పదేళ్ళల్లో ముగ్గురు పిల్లలకి తల్లై కూర్చొంది.
ఐతే నా మటుకు నేను నీ మీద ప్రేమను నా హృదయాంతరంగంలో పెంచుకుంటూ, నాన్న నాకు కూడా అక్కయ్యలాగే ఇంటరై పోగానే ఎక్కడ పెళ్లి చేసేస్తా డేమోనన్న భయంతో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఒక దాని వెంట ఒకటిగా ఇంజనీరింగ్, ఎమ్బీఏలు పూర్తి చేసి నువ్వెప్పుడెప్పుడు ఇండియాకి తిరిగి వస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ కూర్చొన్నాను, నాన్న తెచ్చిన పెళ్లి సంబందాలన్నీ ఏదో వంక చూపి త్రోసి పుచ్చుతూ.
నాకొచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తున్నా మనసులో ఏదో ఒక మూల తెలియరాని భయం నువెక్కడ ఎవరినో కట్టుకుని అమెరికానుంచి దిగుతావో అని. ఎన్నోసార్లు నా మనసు విప్పి నీకు లేఖ వ్రాద్దామనుకున్నా ఎంత మాత్రం ధైర్యం చాల లేదు నువెక్కడ తిరస్కరిస్తావేమోనని.
నా అదృష్టవశాత్తూ నువ్వు అత్తయ్య ఆరోగ్యం బాగా లేదని తెలిసి చూడ్డానికి ఒక నెల రోజులు సెలవు పెట్టి వచ్చావు, అత్తయ్య అనారోగ్యానికి అసలు కారణం నువ్వు పెళ్లి చేసుకోక పోవడమేనని తెలీక. అత్తయ్య ఆరోగ్యం కొంత కుదుట పడగానే నాన్నని చూడ్డానికి నువ్వు మా ఊరు వస్తున్నావని తెలిసి నా మనసు పరవశించి పోయింది. చంద్రుడి కోసం ఎదురు చూస్తున్న చకోరిలా నాట్యమాడింది. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని పరితపించి పోయాను.
నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టగానే నీ ముందుకి రావడానికి నా కాళ్ళు తడబడ్డాయి. మెదడు ఒక విధమైన అచేతనావస్థలోకి వెళ్ళిపోయింది. నన్ను చూడగానే నువ్వు “శారదా” అని పిలవగానే పారవశ్యంతో శరీరం పులకరించి పోయింది. ఆ పిలుపే నువ్వు అక్కయ్యని ఇంకా మరచిపోలేదని, నాలో నువ్వు అక్కయ్యను చూసుకోగలవనే ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్యమే నీతో నా మనసు విప్పి మాట్లాడ గలిగేలా చేసింది. చిన్న పిల్లవని నువ్వు మొదట తిరస్కరించినా నా పట్టుదల, ప్రేమ చివరకు నన్ను గెలిపించగలిగాయి.
నాతో పెళ్ళికి నువ్వు ఒప్పుకున్న రోజు నా జీవితంలో ఒక మరపురాని రోజు. జీవితాంతం నీ సాహచర్యంలో గడుపుతూ, నిన్నానందింపజేస్తూ నేను సుఖ పడతాననే ఆలోచనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రేపు వేకువనే మనమిద్దరం ఏకమయే శుభ గడియ. ఆ శుభ సమయానికి ముందే నీతో నా అంతరంగాన్నీ, ఆలోచనల్నీ, ఆనందాన్నీ పంచుకోవాలనే ఆకాంక్షతో ఈ లేఖ నీకు వ్రాస్తున్నాను. ఈ లేఖని స్వీకరించి ఆనందంగా ఆస్వాదిస్తావని ఆశిస్తూ,
నీ కాబోయే సహధర్మచారిణి
నీరజ”
********