"అమ్మాయి పుట్టిందా?"
"చామన ఛాయ"
"కాదు నల్లగా...కారు నలుపు"
"అదేంటి?"
"ఇది తెలుపు వాడూ తెలుపు. కొంపదీసి?"
"మేనమామ పోలికట"
"సుందరమ్మ మనవరాలు చూడు"
"ఎలావుందీ?"
"అందమంటే అది"
చంటిపిల్ల బారసాలకు వచ్చిన అమ్మలక్కల మాటలు
"పిల్ల తప్పిపోదు" వెటకారం
"వెదికి మరీ ఇంట్లో దింపేస్తారు"
"కట్నం ఎంతివ్వాలో"
"లవ్ చేసి పెళ్ళాడోచ్చు"
"ఇంత సుందరి మరి దొరకదని"
...ఇలా రకరకాలుగా మనసుకు ముసుగేసుకొని...
బారసాల భోజనాలు చేస్తూనే...అందరూ ఆడవాళ్లే.
పెళ్లి సంబంధం విషయాలూ లెక్కలేస్తూ....
ఆ అమ్మాయి పేరు చంద్రకళ...వయసు రోజుల్లో.
అక్కడికి రెండురోజుల తర్వాత
"ప్రమీల కూతురు పెద్దమనిషై యిందట కదా. ఫంక్షన్ మధ్యాహ్నం."
"అప్పుడేనా. ..మొదటిది ఇంకా చెల్లలేదు. అప్పుడే ఇది కూర్చుందా?"
"తప్పుతుందా మరి.వస్తున్నావా?"
"కార్డిచ్చిందిగా తప్పదు."
"ఎంత ఇద్దామనుకొంటున్నావు?"
"మొన్నే పెద్దదానికి నూటపదార్లు ఇచ్చాను."
"ఇప్పుడు అంతకంటే తక్కువైతే బాగోదు."
"సర్లే. నాకు తెలీదా నీ ఎత్తు. వందలిచ్చి వేలు గుంజాలని"
అని మనసులో అనుకొని
"నేను అర్ధనూట పదార్లు చదివించాలనుకొంటున్నా"
"అవున్లే. నీ పిల్ల చిన్నది. అది ఎదిగే వయసుకు వీళ్ళెక్కడో నువ్వెక్కడో... "అని మనసులో అనుకొని "అలాగేలే. నీ ఇష్టం...." అంది ఆమె బైటకి.
రజస్వల ఫంక్షన్ కు ఈ మధ్య కొందరు నాన్ వెజ్ కూడా పెడుతున్నారు.వీళ్ళు ముందు వెళ్లి అన్నానికి సమానంగా కూర మెక్కేయడం అలవాటై పోవడంతో బంతి భోజనాలు బఫే భోజనాలయ్యాయి.
అది చాలక రెండు మూడు కూరలతో..సర్దుబాటు మొదలైంది.
అప్పటికీ కుర్చీలు వేస్తే కూర్చొని తిని గంటలు సుత్తేయకుండా మనుషుల సంఖ్యలో సగానికే కుర్చీలు..
మరీ ఉండకపోతే బాగోదన్నట్టు.
మళ్ళీ కావాలని ఎవరైనా లేస్తే ..సీటు గోవిందా..
ఆ ఫంక్షన్ చేయించుకుంటున్న అమ్మాయి పేరు పవిత్ర.
అందరూ తినేసి ఒకొక్కరూ ఒక్కో ఫోటో దిగి మేం వచ్చాం అని డబ్బిచ్చో, ఇవ్వకుండానో హాజరీలు.
ఆడ కొందరు, మగ కొందరు, కుటుంబం కొందరు.
ఇక్కడ ఎదిగిన అమ్మాయిల ప్రదర్శన...అనుకోని స్వయంవరంలా.
"రూపకు ఎల్లుండి పెళ్లి."
ఇద్దరు ఆడవాళ్ళ సంభాషణ మొదలైంది.
"పెళ్లి తిరుపతిలో అటకదా"
"ఎవరెళ్తారు అంత దూరం?"
"కార్డు ఇచ్చారు కదా?"
"చూడలేదా నువ్వు. రిసెప్షన్ ఇక్కడే"
"అవునా...నాకు గుర్తులేదు. కార్డు ఎక్కడో పడేశాను." "రోజుకు ఇన్నేసి కార్డులొస్తే ఎన్ని గుర్తుంచుకొంటాం?" "ఎన్నిటికి వెళ్తాను?"
"అంతదూరం ఎందుకులే..?"
"రైల్లో రెండు బోగీలు, ఒక బస్సు ఇక్కడినుండే"
"పన్లేకపోతే సరి.. గొప్పలు పోవడం."
"నువ్వు వెళ్తావా... ?"ఉద్దేశ్యం తెలుసుకోవడానికన్నట్టు అడిగింది.
"నువ్వొస్తానంటే ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం"
"నాకు ఆవేళ చుట్టాలు..అత్తా మామా దిగుతున్నారు"
"నాకూ కుదర్థులే. మా ఆయన చిన్నప్పటి ఫ్రెండ్ ఎవడో వస్తున్నాడట."
"సరే ఇక్కడ రిసెప్షన్ కు ఎలాగోలా వెళ్దాం."
"ఎంత ఇద్దామనుకొంటున్నావు?"
"ఐదొందల పదర్లాయినా కనీసం."
"అవును. ...మీ అమ్మాయి రడీగా ఉంది వడ్డీ తో వసూలు చేసుకోవచ్చు.నా కంతా లాసే."అనుకొంది ఆమె.
"ఏం. కంచండు తింటావ్. ఆ మాత్రం డబ్బుల కేడుస్తావేం?"
అని మనసులో అనుకొని "వాళ్లు కొట్టించిన కార్డు, శుభలేఖతో ఇచ్చిన చిన్న గిఫ్ట్,రెండొందలు పైనే ఉండొచ్చు. "అంది ఈమె.
"మనమేమన్నా ఇమ్మన్నామా...ఇచ్చిందంతా ఇలా వసూలు చేసుకొంటున్నారన్న మాట."
"రిసెప్షన్ కు ముందే చేరుకొందాం. లేకపోతే ఆ తిండి కొంచెం ఇబ్బందే..."
"సరేలే. వెళ్లే అరగంట ముందు మిస్స్డ్ కాల్ చెయ్యి. నేనూ రడీ అవ్వాలిగా..."
"ఇచ్చేదెంతయితేనేం...అందరం వెళ్తే సరి. ఈసారి చెప్పేవాళ్ళు ఆలోచించుకోవాలి..." అని మనసులో అనుకొంటూ..".కుటుంబంతో రమ్మన్నారుగా వెళ్లక తప్పుతుందా? "అంది ఆమె బైటికి.
"వీడియో ఉంటుందిగా?"
"ఉంటుంది. లేకపోతే ఊరుకొంగా?"
"మన పెళ్లీడు కొచ్చిన పిల్లలు వీడియో లో కనబడకపోతే, సంబంధాలు వెదకడం కష్టం ఐపోదూ మనకి."
"అవునవును."
"సరే. పడుకో..రాత్రి పదయ్యింది."
"గుడ్ నైట్."
అప్పుడు కొందరు మగవాళ్ళు లెక్కలు వేసుకొంటున్నారు. ఖర్చులన్ని తిరిగొస్తాయో లేదని.
నలుగురికి శుభంగా చెప్పుకొనే వేడుక కానుక బారిన పడి రంగు మార్చుకొంటోంది.
తరతరాల ముసుగులేం మారలేదు...కొంచెం సర్దుకున్నాయంతే...
ఇందులో కర్తా, కర్మా, క్రియా మనమేగా...
పేర్లేందుకు మరి.