మరక మంచిదే - శింగరాజు శ్రీనివాసరావు

speck is good

తెలతెలవారుతుండగా నా పక్కన పడుకున్న అనూహ్య కాలు పైన వేయడంతో మెలకువ వచ్చింది. తిన్నగా దాని కాలు తీసి జరిపి పక్కకు పొర్లాను. లోకంతో నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా హాయిగా నిదురబోతున్నది నా భార్య వసంత. ఎందుకో ప్రశాంతమైన ఆ ముఖాన్ని కొద్దిసేపు చూడాలనిపించింది. ఇదేం విడ్డూరం అనుకోకండి. పెళ్ళయిన కొత్తల్లో తప్ప మగాడికి భార్యను కన్నార్పకుండా చూసే అవకాశం పదవీ విరమణ చేసిన తరువాతగానీ రాదు. అప్పుడు వచ్చినా ఆరోగ్యమిచ్చే ప్రకంపనలతో హాయిగా ఆస్వాదించే వీలు కుదరదు. చూసేకొద్దీ ఇంకొంచెంసేపు చూడాలనిపించి అలాగే చూస్తున్నాను. అదే అందం. కాకపోతే ఒకచుట్టు మందమయింది దేహం. ఆరోజు యవ్వనపు అందమైతే. ఈ రోజు ప్రౌఢ సౌందర్యం. పెళ్ళయి పదేళ్ళయి, ఒక బిడ్డకు తల్లి అయినా లేతదనం ఏమాత్రం తగ్గలేదు. తనకెందుకో అందరిలాగ నైటీ వేసుకోవాలంటే ఇష్టం ఉండదు. ఎప్పుడూ చీరలోనే. పెద్దవాళ్ళు అనే మాట గుర్తొచ్చింది. " కండే కాంతి. చీరే సింగారం" అని. మెత్తని ఆ బుగ్గలు నిమరాలనిపించింది. పాపం నిద్రాభంగమవుతుందని ఊరుకున్నాను. నాకు తెలిసి కడుపుతో ఉండి వాళ్ళ అమ్మగారింటిలో ఉన్నన్ని రోజులు తప్ప ఎప్పుడూ హడావుడే తనకు. మరీ ఉదయం పూట నన్ను ఆఫీసుకు, పాపను స్కూలుకు పంపేవరకు ఆసులో దారంలాగ తిరుగుతూనే ఉంటుంది. తరువాతయినా ఖాళీగా ఉంటుందా అంటే అదీ లేదు. ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటుంది. ఈ మధ్యనే రచనా వ్యాసంగంలోకి కాలుపెట్టింది. నేను కూడ అడ్డు చెప్పలేదు, తన ముచ్చట ఎందుకు కాదనాలి అని. ఇదుగో ఇప్పుడు కరోనా పుణ్యమా అని నాకు ఇంటినుంచి పనిచేసే వీలు, పాపకు సెలవులు దొరికి, పాపం ఉదయం ఏడుగంటల వరకు నిద్రపోతున్నది.
అలా తదేకంగా చూస్తున్న నన్ను ఉలిక్కిపడి లేచి

"ఏమిటప్పుడే లేచారు. ఏమయింది" అని అడిగింది

" అరే అంతభయమేమిటి. ఊరికే చూస్తున్నా పడుకో. పాప కదిలేసరికి మెళకువ వచ్చింది. కనులు మూసి పడుకుంటే చాలా అందంగా కనిపించావు. అందుకే చూస్తున్నా"

"ఏడ్చినట్టే ఉంది. పదేళ్ళనుంచి చూస్తున్నారుగా. ఇప్పుడు కొత్తగా ఏముందిగానీ. సరే ఎలాగూ లేచాంకదా వెళ్ళి పాలు పట్టుకురండి. కాఫీ తాగి కూర్చుందాం, ఒకరి ముఖాలు ఒకరం చూసుకుంటూ" వెటకారం కాస్త జోడించింది.

నవ్వుకుంటూ లేచాను.

గత పది రోజులుగా ఇంటికి అతుక్కుపోవడం వల్ల మా ముగ్గురి మధ్య ఏదో తెలియని కొత్త చనువు ఏర్పడింది. మొదటి నాలుగు రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. కానీ రాను రాను మా మధ్య అనుబంధం ఎక్కువయి, అంతకుముందులా ప్రతి చిన్న విషయానికీ చిందులు వేయడం, వితండవాదం చేయడం తగ్గింది. అన్నిటికంటే ముఖ్యంగా మాకు సంబంధించిన పనులే కాకుండా, ఇంటి పనులలో కూడ పాలు పంచుకోవడం మొదలయింది నాకు, నా కూతురికి. అంతకుముందయితే సెలవు వస్తే చాలు కంప్యూటర్ ముందు కూలబడి ఆటలే ఆటలు. బహుశా మొహంమొత్తిందేమో మొన్న వాళ్ళమ్మ పూరీలు చేస్తుంటే పోరి మరీ ఉండలు చేసి వత్తి ఇచ్చింది. అమ్మ పోలికేమో గుండ్రంగా చేసింది. వాళ్ళమ్మ ' సూపర్ బంగారుతల్లీ' అని మెచ్చుకునేసరికి అది ఉబ్బితబ్బిబ్బయి పోయి, వసంతతో పాటే తిరుగుతూ చిన్న చిన్న సహాయాలు చేయటం మొదలుపెట్టింది. అలా అలా తనకు కంప్యూటర్ ఆటల మీద ద్యాస తగ్గిపోయింది.

*******

సంచి తీసుకుని దగ్గరలో వున్న పాలబూతుకు వెళ్ళి పాలపాకెట్లు తీసుకుని వస్తుండగా ఫోను మ్రోగింది. వాసుగాడు. నా జిగ్నీ దోస్త్. ఆఫీసులోనుంచి ఆదివారం చతుర్ముఖ పారాయణ వరకు నన్నంటుకు తిరిగే చెలికాడు.

" హలో బావా. ఎక్కడ"

" ఇప్పుడే పాలు తీసుకుని ఇంటికెళుతున్నాను"

" కూరలు తెచ్చుకున్నావా. మార్కెటుకొస్తావా. మరల తొమ్మిదికల్లా మూస్తారటగా. సెలవులిచ్చికూడ నిద్రపోనీకుండా చావదొబ్బుతున్నార్రా వీళ్ళు"

" ఈరోజు దాకా ఉన్నాయట. రేపు వెళదాం.
మీకయిపోయాయా"

" అయిపోలేదురా. ఇంట్లో ఉండి ఉండి బోరుకొడుతున్నదిరా. ఒక గంటయినా బయట గాలిపోసుకుందామని"

" రేపు వెళదాములే. మరల పది గంటలకల్లా లాగిన్ అవ్వాలిగా"

" ఏమోరా బాబు. రోజు రోజుకు ఈ నరకంలో ఉండలేక పిచ్చెక్కుతుంది. ఆఫీసులో వుంటే గంటకొకసారి టీ, సాయంత్రం కాగానే ఆనంద్ భవన్ లో టిఫిను, బాతాఖాని జాలీగా ఉండేది. ఆదివారం వస్తే పబ్బు, పేక. ఇప్పుడు దాని ఎదురుగా నేను, నా ఎదురుగా అది, మధ్యలో సతాయిస్తూ నా కొడుకు. ఆఫీసులో బాస్ టార్చర్ కంటే వీళ్ళ టార్చర్ ఎక్కువగా ఉంది. నువ్వెలా నెట్టుకొస్తున్నావురా"

" నాకు హ్యాపీగా ఉంది. నిజంగా కుటుంబంతో మనసువిప్పి కలిసివుంటే ఇంత ఆనందంగా ఉంటుందా అనిపిస్తున్నది" మనసులో మాట చెప్పాను.

" మొన్నటిదాక నాకు దరువేశావు. ఇప్పుడేంది బావా ప్లేటు ఫిరాయించావు. ఏం మాయ చేసింది బావా నా చెల్లెలు"

" తనేమీ మాయచేయలేదు. బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయమయినట్లు, ఈ కరోనా సమయంలో నాకు మన కర్తవ్యం బోధపడింది"

" ఏంది బావా పల్లవి మారింది. నాలుగు గోడల మధ్య ఉండేసరికి మతి చలించలేదు కదా"

" ఇక చాలు గానీ. రేపు ఏడు గంటలకల్లా మార్కెటు దగ్గర ఉండు. అక్కడ టీ తాగుతూ మాట్లాడుకుందాం" అని ఫోను కట్ చేసి అపార్టుమెంటులోకి అడుగుపెట్టాను.

******

" ఏంది బావా నువ్వు చెప్పేది. ఇంట్లో కూరలు తరిగి, సోఫాలు దులిపి, బట్టలు మడతబెట్టి..... ఎంత చెడిపోయావు బావా. అమ్మ లాక్ డౌనా.. కొంపముంచావు గదే. ఇదుగో నువ్వు చేస్తే చేశావు. ఆ పనికిమాలిన పనులు నన్ను చెయ్యమనవాకు. ఇప్పుడు బాగనే ఉంటుంది. రేపు మరల ఆఫీసులు మొదలయ్యాక చెయ్యాలంటే కుదరదు. అలవాటు పడితే వీళ్ళు వదలరు. సో నో ఛాన్స్" కుండ బద్దలు కొట్టాడు.

" ఒరే వాసు. నేను మొదట్లో నీలాగే అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పనిపించింది. ఈ లాక్ డౌన్ పుణ్యమా అని పనిపిల్లలు కూడ రావటం లేదు. మనకు పని తగ్గింది, వాళ్ళకు పెరిగింది. తనలా మమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ అందిస్తుంటే, మొదటిసారిగా అది పడే కష్టం తెలిసివచ్చిందిరా. మనం తొమ్మిది వరకు ఆగమాగం చేసి బాక్స్ తీసుకుని దులుపుకుని వెళ్ళిపోతాము. పాపం వాళ్ళు సాయంత్రం దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళ మనసులో ఏదో ఒక వ్యాపకం సృష్టించుకోవాలన్నా సమయం ఉండదు"

" ఏందిరా వాళ్ళ మీద అంత సానుభూతి. మనం సంపాదిస్తున్నాం, వాళ్ళు వండిపెడుతున్నారు. శ్రమ విభజన. అంతే. అంత జాలిపడక్కరలేదు."

" పడాలి. వాళ్ళూ మనుషులేరా. వారికీ కొన్ని ఆశయాలుంటాయి. వసంత విషయం తీసుకో. అది కవితలు చాలా బాగా వ్రాస్తుంది. ఇంతకుముందు అసలు పట్టించుకునేవాడిని కాదు. మొన్న అది పనిగా కూర్చొని చదివాను. ఆశ్చర్యమేసింది. ఇంత టాలెంట్ ఉందా తనలో అని. ప్రోత్సహించాలనుకున్నాను. అందుకే ఇప్పుడు ఏదయితే చేస్తున్నానో, అవే పనులు కంటిన్యూ చేస్తాను. తన పనిభారం తగ్గించి తన మార్గానికి సమయం వచ్చేలా చేస్తాను"

" ఏడ్చినట్టే ఉంది. కవితలు. ఎవరురా వాటిని చదివేది, డబ్బులిచ్చేది. మెదడు పోవటం తప్ప. మీ చెల్లెలు కూడా కళాకారిణే, కార్టూన్లు వేస్తుంది. పాపం ఇంటికి రాగానే తెచ్చి చూపిస్తుంది. వేసింది చాలు. ఉన్న ఆ ఆవగింజంత మెదడు కాజేసుకోవద్దని చెబుతాను. మా అమ్మాయికి కూడ చెప్పు ఉప్పుకూ, ఉపాయానికి పనికిరాని ఈ విద్యలకోసం సమయం వృధా చేసుకోవద్దని. ఇకనైనా కొత్త ఆలోచనలు మానుకుని పాత గోపాలంలా ఉండు" అంటూ గీతోపదేశం చేసిన కృష్ణుడిలా ఫోజు పెట్టాడు.

" ఉండను. వాళ్ళ మనసులకు కొరతవేసి నా ఇష్టానికి వాళ్ళను బానిసలుగా మలచుకోను. కళ దైవమిచ్చిన వరం. అది మనసుకు ఇచ్చే సంతృప్తి ఏ డబ్బూ ఇవ్వలేదు. దాన్ని ఈ నాలుగురోజులలో నా భార్య కళ్ళలో చూశాను. ఈ పది రోజులలో కుటుంబంలో ఒకరిని మరొకరు అనుసరించుకుపోతే ఉండే ఆనందమెంత గొప్పదో తెలుసుకున్నాను. నేను మారను. నువ్వు కూడ మారితే మంచిది. జానకి వేసిన కార్టూన్లు నేను కూడ చూశాను. కానీ ఆ రోజు వాటి మీద స్పందించలేకపోయాను. కారణం నీ సహచర్యమే. నా చూపు కూడా నీలాగే వాటిపట్ల నిర్లక్యంగా ఉండేది. అప్పుడు కళ్ళతో చూశాం మనం
ఇప్పుడు మనసుతో చూద్దాం. మన కోరిక వాళ్ళు తీరుస్తున్నప్పుడు, వాళ్ళ మనసు తెలుసుకుని మసలడం మన బాధ్యత. ఈ పదిరోజుల దగ్గరతనం నాకు నేర్పిన గుణపాఠం ఇది. తరువాత నీ ఇష్టం" మాటలలో నిబద్ధత కనిపించిందేమో, వాడు మాట్లాడకుండా ముందుకు కదిలాడు.

" నువ్వింతగా చెబుతున్నావు కనుక ఆలోచిస్తాను" బండి స్టార్ట్ చేస్తూ అన్నాడు వాసు. నవ్వుకున్నాను.

*******

వారం రోజులు మా ఇద్దరి మధ్య ఈ విషయ ప్రస్తావనే రాలేదు. ఇంకో రెండు రోజులలో లాక్ డౌన్ ఎత్తివేస్తారని తెలిసింది. నా మాటలకు వాడెంత నొచ్చుకుని ఉంటాడోనని వాడిని చల్లబరచడానికి ఒక పథకం వేసి ఫోను చేశాను

" వాసూ. మనం ఆఫీసులో చేరిన తరువాత వచ్చే ఆదివారం పబ్ కు వెళ్ళి గ్రాండుగా సెలెబ్రేట్ చేసుకుందాం. ఏమంటావ్" అడిగాను.

" బావా ఇక పబ్బులు, పేకలు జాన్ తా నై. ఆదివారాలు ఇంట్లోనే కుటుంబంతో గడపడమే. కావాలంటే అమ్మాయిని తీసుకుని ఇక్కడికి రా. సాహిత్యం మీద, కార్టూన్ల మీద చర్చించుకుందాం". వాడి మాటలకు షాక్ అయ్యాను. అదే అడిగాను.

" నువ్వు చెప్పిన తరువాత ఆలోచించాను. నువ్వు చెప్పినట్లు చేస్తుంటే, జానకిలో కనిపించే కొత్త ఉత్సాహాన్ని చూశాను. నన్ను చూసి నా కొడుకు వాళ్ళ అమ్మను విసిగించడం మాని, సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఈ లాక్ డౌన్ పుణ్యమాయని కుటుంబంలో అవగాహనలు పెరిగాయి. చెడు అలవాట్లు దూరమయ్యాయి. ఇది మంచికే అనిపిస్తున్నదిరా. అటు వ్యాధిని, ఇటు దురలవాట్లను రెండింటినీ దూరం చేసింది". వాడి మాటలలో ఆనందం తొంగిచూసింది.

అప్పుడే టెలివిజన్ లో యాడ్ వస్తున్నది. " మరక మంచిదే". అవును మరక మంచిదే. హాయిగా నవ్వుకున్నాను.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు