డిగ్రీ కాలేజీ - నాగేష్ చిన్న చెన్నుగ

degree college

ఒకే కాలేజీలో చదివాం
ఒకే క్లాస్ రూం లో చదువుకున్నాం కానీ
ఎందుకో
మేము అమ్మాయిలం కావడం వల్ల లెఫ్ట్ సైడ్ బెంచీల వైపు తలెత్తి చూడాలంటే ఒక రకమైన ఫీలింగ్.
అవతలి వైపు నుంచి మా వైపు చూపుల బాణాలు తగలడం షరా మామూలే. కాని ఎప్పుడూ మా క్లాస్ అబ్బాయిలు మా పట్ల మిస్ బిహేవ్ చేయలేదు. అందరూ అందరికీ కొత్త కావడం వల్ల డిగ్రీ మొదటి సంవత్సరం చివరి వరకూ వాళ్ళ పేర్లుకూడా సరిగా తెలియకుండానే అయిపోయింది. మా క్లాస్ లో సురేష్ చాలా చురుకైనోడు, అందరి ఫోన్ నంబర్లు తీసుకొని వాట్సప్ గ్రూపొకటి క్రియేట్ చేశాడు. హాలిడేస్ అంతా ఆ వాట్సప్ గ్రూపుతోనే గడిచింది. ఆ గ్రూపులో మొదలైన పలకరింపులు నిజంగా చాలా మందిలో ఉండే ట్యాలెంట్స్ బయట బడ్డాయి. అప్పటివరకు ఉన్న భయం, సిగ్గు తొలగిపోయి చాలా మంది కలిసి పోయారు. రెండవ సంవత్సరం మొదలైన వెంటనే ఏదో తెలియని సంతోషం అన్ని గువ్వలూ ఒకచోట చేరుతున్నాయనే ఆరాటంలో మనస్సు సంతోషంగా ఉంది. ఆ రోజు పలకరింపులు రియ్యల్లీ గుడ్
ఇటువంటి పలకరింపులు ఫ్రెండ్స్ తమాషాలు మొదటి సంవత్సరం అంతా మిస్ అయ్యాం.
మా క్లాస్ లో 26 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలు. అందులో ఆరుగురం ముస్లిం అమ్మాయిలం ఒక గ్రూపులా ఉండేవాళ్ళం. కాని రానురాను గ్రూపు చాటింగ్ నుండి పర్సనల్ చాటింగ్ మొదలైంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సురేష్ చాలా చురుకైనోడు, 5.9" అడుగుల ఎత్తు, స్పురద్రూపి, మంచి అందం, అతనితో మాట్లాడటానికి అందరికీ ఇష్టమే, అతనూ అందరితో చాలా స్నేహంగా ఉండేవాడు.
ఒకరోజు రాత్రి ఎందుకో ఉండలేక హాయ్ అని పర్సనల్ చాటింగ్ పెట్టాను.
అటు నుండి నో రిప్లై. ఎందుకో మనస్సు బాదేసింది. సరేలే అనుకొని మర్నాడు క్లాస్ కి బయలుదేరాము. రాత్రి సురేష్ కి మెసేజ్ చేసిన విషయం “జరీనా”తో పంచుకుందామా అనుకొని, వద్దులే అసలు అక్కడ ఏం జరిగిందని అని సముదాయించుకొని ఎవ్వరితో పంచుకోలేక మౌనంగానే క్లాస్ కు చేరాం. క్లాస్ లోకి ఎంటర్ అవంగానే సురేష్ నావంకే చూస్తూ కనిపించాడు. ఒక్కసారిగా హృదయంలో కలవరం మొదలైంది, ఏంటి రిప్లై ఇవ్వకపోగా ఇలా చూస్తున్నాడు అనుకొని ఏమీ తెలియనట్టు చూశా. నిరంతరం నన్నే చూస్తున్నాడు, ఆ కళ్ళు, ఆ చూపులు నాకు కొద్దిగా అర్థమైనట్టుంది కాని ఏమో తెలీదు. ఆ రోజు అన్ని క్లాసుల్లో ఏం జరిగిందో ఎలా గడిచాయో తెలీదు. సాయంత్రం ఇంటికెళ్తూ జరీనాకు ఒక మాట చెబుదామని ఈ రోజు ఆ సురేష్ ని చూశావా ఎలా చూస్తున్నాడో అన్నా... అంతే జరీనా మొత్తం క్లాసుల్లో మీరిద్దరూ చూపల్లో మునిగిపోవడం మనోళ్ళంతా గమనించారు పదా అంటూ బాంబ్ పేల్చింది. ఏమీ మాట్లాడకుండా ఇళ్ళు చేరుకున్న.
మనస్సంతా ఏదో తెలియని ఆలోచనలు. రాత్రి వాట్సప్ తెరిచి సురేష్ కి మళ్ళీ ఒక హాయ్ పెట్టా. రిప్లై వచ్చింది హాయ్ అని
నేను “పర్విన్”
తెలుసు
తిన్నావా
S u
అంతే అలా అలా రాత్రి 12 గడిచింది
మర్నాడు చాలా కొత్తగా అనిపించింది.
ముందే అందగాడు ఈ రోజు ఇంకా స్పెషల్ గా అనిపించాడు.
తనకి ఏమేమి ఇష్టమో తెలుసుకోవాలని, తనకి ఇష్టమైనట్టు ఉండాలని మనస్సు తపించడం మొదలైంది. ఆ క్షణాలు, రోజులు గడిచాయి సంవత్సరం ముగింపు.
మాక్లాస్ లో ప్రతి ఒక్కరికీ తెలుసు సురేష్-పర్విన్ చూడ ముచ్చటైన జంట అని. హాలిడేస్ లో ఇద్దరం కలిసి మొదటిసారి సినిమాకి అటునుంచి హోటల్ కి వెళ్ళి బోజనం చేసి ఇళ్ళకు చేరాం.
ఇక సురేష్ నా వాడే అనేంతగా సాగింది జీవితం. ఇద్దరివీ మద్య తరగతి కుటుంబాలే కాని వాళ్ళింట్లో పరిస్థితి అంత సులభంగా లేదు. మా ఇంట్లో నేనొక్కతే కూతురు. మా బాబకి నేనంటే ప్రాణం. నేనేదడిగినా కాదనడు. ఖచ్చితంగా సురేష్ ని డాడీకి పరిచయం చేయాలనుకున్నా. ఒకరోజు కాలేజీ తరువాత సురేష్ ని మా ఇంటికి రమ్మని చెప్పాను. కాలేజీ అనంతరం సురేష్ వాళ్ళింటికి వెళ్లి ఫ్రెషప్ అయి మా ఇంటికి వచ్చాడు. చూడ్డానికి అచ్చు టీనేజీలో ఉన్న జెన్సన్ అక్లస్ (అమెరికా నటుడు) లా ఉన్నాడు. ఇంట్లో నాన్న లేడు అమ్మ నేను మాత్రమే ఉన్నాం. అతనొస్తూనే గోడకు ఉన్న ఫొటో చూశాడు, అమ్మి, డాడి మద్యలో నేను (ఇద్దరూ కలిసి నాకు ముద్దు పెడుతున్న ఫోటో) చాలా చాలా అందమైన ఫోటో. తనని అమ్మికి పరిచయం చేశా, ఇతను సురేష్ మా క్లాస్మేట్ మన ఇళ్ళు చూస్తానంటే రమ్మని చెప్పా అనే సరికి సురేష్ కళ్ళు పెద్దవి చేసి నావైపు చూసి వెంటనే అమ్మి కి నమస్తే చెప్పి మొహమాటపడుతూ ఉండిపోయాడు. కూర్చో బాబు కాఫీ, పాలు ఏం తీసుకుంటావు అని అడిగింది అమ్మీ. అతను మొహమాటంతో ఏమొద్దు ఆంటీ అని చిన్నగా నసిగాడు. కాఫీ తెస్తా అంటూ నేనే లోపలికెళ్ళా. అమ్మీ బట్టలకోసమని టెర్రాస్ పైకెళ్ళింది. లోపలి నుండి కాఫీ తెచ్చి సురేష్ కి ఇచ్చేప్పుడు తను కావాలనే తన వేళ్ళను నా చేతికి తాకిస్తూ కాఫీ తీసుకున్నాడు. ఒక్కసారిగా సిగ్గుతో కూడిన భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కాఫీ ఇచ్చి లోపలికి వెళ్తుండగా డాడీ వచ్చాడు, అమ్మీ టెర్రాస్ నుండి కిందకు వచ్చింది. నాన్న ఎంటరైతేనే కాఫీ కప్పు కిందపెట్టి టక్కున లేచాడు సురేష్. కూర్చో బాబు అంటూ డాడీ తన రూంలోకి వెళ్ళాడు. అప్పుడు చూడాలి సురేష్ మొహం మొహమాటంతో కూడిన భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాన్న వచ్చి సురేష్ ఎదురుగా ఉన్న నిల్కమల్ కుర్చిలో కూచున్నాడు. డాడీకి నేను చేసే కాఫీ అంటే భలే ఇష్టం. డాడీకి కాఫీ తెచ్చి ఇచ్చి, ఇతను సురేష్ మా క్లాస్మేట్ అని చెప్పా. ఎందుకొచ్చాడు అని అడుగుతూ అతని వైపు చూశాడు. ఇళ్ళు చూద్దామని వచ్చాను అంకుల్ అంటూ అన్నాడు.
ఏంటి?
ఏదో మెటీరియల్ కావాలంటా అందుకే వచ్చాడు అని నేను చెప్పేసరికి, తన మొఖం మరోసారి తెల్లబోయింది.
సరే. ఎక్కడ మీ ఇళ్ళు?
మెయిన్ బజార్ 3 వీధిలో
ఆ వీధిలో గోపాల్ రెడ్డి గారు తెలుసా
తెలుసంకుల్ కాకపోతే పరిచయం లేదు
మా డాడీ అక్కడ కాఫీ కప్ ఉంచి వెళ్ళాడు.
ఎప్పుడెప్పుడు పారిపోదామా అని ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నాడతను.
లోపలికెళ్ళి ఒక నోటు పుస్తకం తెచ్చి అతని చేతిలో పెట్టి, ఇందులో ఉన్నవి నోట్ చేసుకో అని చెప్పి వెళ్ళమన్నట్టు హింట్ ఇచ్చాను.
తటాలున లేచి వెళ్ళొస్తా ఆంటి, వెళ్ళొస్తా అంకల్ అంటూ అడుగు బయటకేశాడు.
బోనులో నుండి బయటపడ్డట్టు క్షణాల్లో మాయమయ్యాడు.
రోజులు గడిచాయి.
డిగ్రీ ఫైనల్ ఇయర్, ఒకరోజు రాత్రి 10 గం టైమ్ లో సడన్ గా బాబకి చెమటలు పట్టి, వాంటింగ్ వచ్చినట్టు ఎడమ చేయి నొప్పిగా ఉందని హాస్పిటల్ వెళ్దామని చెప్పాడు, అమ్మికి నాకు ఏం చేయాలి ఎవరికి చెప్పాలో తెలియలేదు, మా బాబాయ్ పక్కింటి ఇబ్రహీం అంకుల్ ని పిలుచుకొని హాస్పిటల్ కి వెళ్ళాం. డాక్టర్ బాబకి హార్ట్ స్ట్రోక్ అని అబ్జర్వేషన్లో ఉంచాలని మళ్ళీ ఏ క్షణంలోనైనా స్ట్రోక్ వస్తే ఇబ్బందని చెప్పి కొన్ని బయటనుండి మందులు తెప్పించాలని చెప్పాడు. అప్పుడు రాత్రి 11:30 ఇబ్రహీం అంకుల్ ఉదయం వస్తానని చెప్పి అంతకుముందే వెళ్ళాడు. ఎవరూ లేరు, ఇద్దరం ఆడవాళ్ళమే ఏం చేయాలి, సురేష్ కి ఫోన్ చేద్దామంటే ఈ టైమ్ లో బాగోదు. అమ్మికి బాబకి తెలిస్తే ఏమంటారోనని భయం. దగ్గర బంధువులు లేరు. ఈ రాత్రి గట్టెంక్కించమని అమ్మి కళ్ళల్లో కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి. దయనీయస్థితిలో బాబ. అటునుండి వచ్చిన నర్స్ ఒక కాగితం తెచ్చి చేతిలో పెట్టి ఈ మందులు తెప్పించండి అంటూ వెళ్ళింది. కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తున్నాయి. జరగకూడనిది జరిగితే ఎలా? ఆలోచనలంతా సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని సురేష్ నంబర్ పైన డైల్ చేశా... హలో
ఏడుపు ఆగలేదు.. డాడి డాడీ అన్నానంతే.
ఏ హస్పిటల్?
జి. వి ఆర్
నేనిప్పుడే వస్తా భయపడకు అన్నాడు.
కొండంత ధైర్యం వచ్చింది
ఇరవై నిమిషాల్లో వచ్చాడు. చీటీ ఇచ్చి మందులు చెప్పా.
రాత్రి 12. ఐదు కిలోమీటర్ల దూరంలో అపోలో ఫార్మ. అర్థ గంటలో తెచ్చాడు.
రాత్రి రెండు గంటలకు మళ్ళీ స్ట్రోక్ వచ్చింది ఆ టైంలో నర్స్ డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పింది...
సరే డాక్టర్
సరే డాక్టర్ అంటూ ఫోన్ కట్ చేసి సురేష్ తెచ్చిన మందుల్లోంచి రెండు ఇంజెక్షన్లు తీసి బాటిల్లోకి ఎక్కించింది. మాకైతే ప్రాణాలు అరచేతిలో ఉన్నట్టుంది. నర్స్ చాలా మంచామె బయపడకండి ఏమీ కాదని మీరు కరెక్ట్ సమయానికి హాస్పిటల్ కి వచ్చారని ఎంతో ధైర్యం చెప్పింది ఉదయం చిన్న ఆపరేషన్ ఉండొచ్చని చూచాయగా చెప్పి పక్కరూంలో కూచుంది. మా డాడీ పక్కనే కుర్చీలో కూర్చొని మెల్కొనే ఉంది అమ్మ, ఆరూంలో మూడు మంచాల్లో ముగ్గురు పేషెంట్లు వాళ్ళకి ఒక్కొక్కరి చొప్పున ముగ్గురు అంతే. నేను గది బయట కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్నా, నాకు ఆ చివర సురేష్. ఉదయం ఆరైంది మెల్లగా అమ్మి వచ్చి పర్విన్ ఇంటికెళ్లిరా అని తట్టింది. గభాళున మెలుకొచ్చి చూస్తే అమ్మ.... నాన్న బెడ్ పైన కొద్దిగా కొలుకున్నట్టుగానే చూస్తున్నాడు, అమ్మి నన్ను లేపడం చూసి సురేష్ దగ్గరకొచ్చాడు.... మా అమ్మి అతని వైపు చూసి ఇంటికెళ్లి ఫ్రెషప్ అయిరండి అంది. సరే అన్నట్టు తలూపాడు. మా బాబ లోపల్నుండి ఎక్కడ అతన్ని చూస్తాడోనని భయమేసింది అయినా ఆ పరిస్థితుల్లో అడిగినా తప్పలేదని చెప్పొచ్చనుకున్నా. కానీ బాబ అతని చూసికూడా ఏమనలేదు. ఇద్దరం కలిసి హాస్పిటల్ కిందికొచ్చాం. తను బైక్ తీసాడు కానీ తనకు సొంత బైక్ లేదనే విషయం నాకు తెలుసు. ఎందుకో ఇప్పుడావిషయం అడగదల్చుకోలేదు. ఇంట్లో డ్రాప్ చేసి ఒక గంటలో వస్తానని రెడీగా ఉండమని చెప్పి వెళ్ళాడు. అతని మంచితనం నన్ను బాగా ఇంప్రెస్ అయ్యేలా చేసింది. అలా ఆలోచిస్తూ మంచంపైన ఒరిగిపోయా... రాత్రంతా నిద్ర లేకపోవడంతో నకళ్ళు మూతలు పడ్డాయి.
సురేష్ ఇంటికి ఆ రోజే వాళ్ళ మామ పనుండి బైక్ తీసుకుని వచ్చాడు. బైక్ ఇక్కడే ఉంచి మళ్ళీ రేపొస్తానని చెప్పి వెళ్ళాడు. రాత్రంతా ఇంట్లో లేని సురేష్ ని ఎక్కడికి పోయావ్రా రాత్రంతా. కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి ఏం చేసొచ్చావ్, పైగా బైక్ తీసుకు పోయావని వాళ్ళ నాన్న శంకరన్న ఉదయాన్నే తిట్ల దండకం అందుకున్నాడు. సురేష్ వాట్సప్ గ్రూపులో హాస్పిటల్ విషయం మెసేజ్ చేసి... శంకరన్న మాటలు పట్టించుకోకుండా గబగబా స్నానం చేసి బైక్ తో మళ్ళీ పర్విన్ ఇంటికెళ్ళాడు. పర్విన్ పర్విన్ అంటూ తలుపు తట్టాడు. నిద్రనుండి మేల్కొని వచ్చి తలుపుతీసింది.
ఇంకా రెడీ కాలేదా?
సరే రెడీ అవ్వు బయట వెయిట్ చేస్తా అన్నాడు
బయటొద్దు లోపలికి రా అంది
సరేనని లోపలికెళ్ళి కూచ్చున్నాడు
ఆమె స్నానం చేసొచ్చి, కాఫీ ఇద్దామని కాఫీ కలిపి తెచ్చి తనకందించి చేయి తాకడంతో సిగ్గు పొంగింది.
సురేష్ వేళ్ళు పర్విన్ చేతులదాకా చేరి వణుకుతున్న కాఫీ కప్పు కిందపెట్టి ఆమె వంక చూశాడు. ఎవరూ లేని సమయం సహకరించింది. తేరుకొని చూస్తే ఉదయం తొమ్మిదైంది. గబగబా ఇద్దరం రెడీ అయి అమ్మికి ఫోన్ చేసా. బీరువాలో ఉన్ననాన్న ఆధార్ కార్డు, డబ్బులు తెమ్మన్ని చెప్పింది. తీసుకుని బయలుదేరాం.... బయటికి రాగానే ఇబ్రహీం అంకల్ ఎలా ఉందమ్మా నాన్నకి అని అడిగాడు.
చిన్న ఆపరేషన్ అన్నారు అంకల్.
మేబీ ఇప్పుడే ఉండొచ్చు.
సర్లేమ్మా నేను కొద్దిగుండి వస్తా
సరే అంకుల్
ఈ సారి తన బైక్ పైన కూర్చోడానికి స్వతంత్రం వచ్చినట్టుగా అనిపించింది. రాత్రి ఉన్నంత భయం లేదు. ఎక్కడలేని ధైర్యం నాతో ఉందనిపిస్తుంది.
హాస్పిటల్ లో నాన్న దగ్గరికి తనని నేనే బలవంతంగా తీసుకెళ్లి, రాత్రి ఇతను మనకు మందులు తెచ్చి హెల్ప్ చేశాడని, రాత్రంతా ఇక్కడే ఉన్నాడని చెప్పాను.
సరేనన్నట్టుగా బాబ తలూపాడు.
అమ్మి వచ్చి సురేష్ ఇంటిదాకా వెళ్ళొద్దాం పదా అనింది. పర్విన్ నేనొచ్చేంతవరకు నువ్విక్కడే బాబ దగ్గరుండు అని చెప్పి వెళ్ళింది. సురేష్ అమ్మిని డ్రాప్ చేసి పెట్రోల్ కోసమని వెళ్ళి మళ్ళీ అమ్మిని తీసుకొనొచ్చాడు. డాడీని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళే సమయానికి మా క్లాస్మేట్స్ అందరొచ్చారు. వాళ్ళిచ్చిన సపోర్ట్ నిజంగా మాటల్లో చెప్పలేను.
అంతా మంచిగ జరిగి నెల రోజుల్లో నాన్న మామూలుగా తిరగ్గలిగాడు..
మా డిగ్రీ ఫైనలియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి జరీనా ఆ రోజు చాలా నీరసంగా అనిపించి టిఫిన్ చేశావాని అడిగాను. తను లేదనట్లుగా తలూపి వస్తున్న దుఖాన్ని ఆపుకొంది...
ఏమైంది జరీనా?
ఏమీలేదు
మరెందుకు కన్నీళ్లు
ఏమీ చెప్పకుండానే ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళాం.
అది కెమిస్ట్రీ ప్రాక్టికల్... ఆ రోజు ల్యాబ్ లో వచ్చిన ఘాటుకు తను కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది... నేను మా క్లాస్ మేట్స్ పక్కకి కూర్చోబెట్టాం. నీళ్ళు తెచ్చి తన మొఖం తుడిచి ఎలాగోలా ఆ మూడు గంటలు గట్టెక్కించాం. బయటకొస్తూనే సురేష్ వెళ్ళి టిఫిన్ తెచ్చాడు. వద్దని ఏడుస్తూనే బలవంతం చేస్తే తన చేతికున్న గ్లౌ తీసింది. ఒక్కసారిగా మా మొహాలు మారి పోయాయి. జరీనా అరచేయి కాలిపోయింది. ఏమైంది అంటూ తనని గుండెకు హత్తుకున్నా.
నిన్న సాయంత్రం నాకు పెళ్ళిసంబంధం మాట్లాడటానికి మా మామా వాళ్ళు వచ్చారు.
మా ఇంట్లో మా అన్న సుభాన్ మామకి మాటిచ్చాడంట. మా బావంటే నాకు ఇష్టంలేదని నేను చెప్పాను. వాడికి అన్ని అలవాట్లున్నాయి. వద్దని చెప్పాను. వాడు కాకుండా వేరెవరైనా నువ్వు తెచ్చే మంచి వ్యక్తిని చేసుకుంటానని మా అన్నని కాళ్ళుపట్టుకొని వేడుకున్నా. వినలేదు. అడ్డొచ్చిన అమ్మని కొట్టాడు. అమ్మని కొట్టాడని కోపంతో చెయ్యెత్తాను... క్రోదంతో ఊగిపోతూ నామాటకే ఎదురిస్తారా, నాపైకే చెయ్యెత్తుతావా అంటూ కాలెకాలె పెన్నం పైన నా చేతులు అదిమి పట్టాడు. యా అల్లాహ్.. ప్రాణం పోయినా బాగుండేది.
తండ్రిలేని పిల్ల అని అమ్మ అరుస్తూ నిస్సహాయురాలిలా విలపించింది. రాత్రంతా అమ్మా నా చేతులకి నూనె రాస్తూనే ఉంది అని చెప్పింది జరీనా.
ఏం చేయగలం మేము.
జరీనాతో కలిసి ఓ నలుగురం వాళ్ళింటికి వెళ్ళాం. అప్పుడే ఇంట్లోంచి బయటకొస్తున్న సుభాన్ని చూడగానే ఒంటిమీది చొక్కాపట్టుకొని ఈడ్చి కొట్టాలనిపించింది కాని జరీనాకు మావల్ల ఇబ్బంది రాకూడదని అనుకొని సముదాయించుకొని వదిలేశాము. మమ్మల్ని చూసి వాడు తన పొడవాటి అంగీ చేతులు మడతెడుతూ నిన్న తాగిన మత్తు వదలని ఎర్రటి కళ్ళతో గుమ్మం దాటాడు. వాళ్ళమ్మని కలిసి జరిగిన దానిగురించి విచారించాము. తన కొడుకు వ్యసనపరుడని దాన్ని వాళ్ళ మామ, బావ ఆసరగా తీసుకోవడంవల్ల ఇదంతా జరిగిందని రోదిస్తూ చెప్పింది. తండ్రిలేని పిల్ల జరీనాకి ఇష్టంలేని పెళ్ళి ఎట్టిపరిస్థితుల్లోనూ తన కంఠంలో ప్రాణముంనంత వరకు జరగనీయనని ఆమె ఖరాఖండిగా మాతో హామీ ఇచ్చింది.
సరేనని తనకి ధైర్యం చెప్పి, పరీక్షల మీద దృష్టి పెట్టమని చెప్పి వెనక్కు మళ్ళాము. వస్తున్న దారిలో అదే వీధిలో మా సీనియర్ రషీద్ కనిపించి...
ఏంటి ఇలా వచ్చార్రా సురేష్?
ఏం లేదు ప్రాక్టికల్ ఫైనల్ ఎగ్జామ్స్ కదా జరీనాని కలుద్దామని.
అవునా.. సరేరా ఆల్ ద బెస్ట్ అని రెండగులు ముందుకేసి, వెనక్కి తిరిగి
రేయ్ సురేష్..
ఆ ఏంటి భాయ్
వీలైతే సాయంత్రం కలువండ్రా
సరే భాయ్... గ్రౌండ్లో ఓకేనా
ఓకే.
ఎవరింటికి వాళ్ళెళ్ళాం..
సురేష్ ఇంట్లోకి అడుగుపెట్టాడోలేదో,
టైం ఎంతైంది.. మీ పరీక్ష ఎంతకైపోయింది
ఎక్కన్నుంచొస్తున్నావ్ అని శంకరన్న ప్రశ్నల వర్షం.
నాన్న నీకన్నీ తెలుసని నాకు తెలుసు,
నా ప్రతీ విషయం అమ్మ నీకు చెపుతూనే ఉంది కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతావ్?
నిన్ను నేను కాకుంటే ఎవడడగాలిర్రా.
అయినా ఆ సాయిబులతో మనకెందుకురా.. ఇదింత సదువైపోతే నువ్వు హైదర్బాద్ పోయి ఏదోక పని చేసి మాకింత అండగా ఉంటవనుకుంటే, బుద్దిగా సదువుకోకుండా ఈ తిరుగుళ్ళేంట్రా. అయినా మా అందరికీ నీ మీద మాగొప్ప నమ్మకంరా, ఏం తప్పూ సెయ్యొద్దు.
సర్లే నాన్న అని బువ్వ తిని సదువుకోడానికి కూసున్నాడు (శంకరన్న పైకి కోపంగా కనిపించినా లోపల కొడుకంటే ప్రేమే).
సాయంత్రం రషీద్ ని కలవాలని తన మిత్రులకి ఫోన్ చేసి గ్రౌండికి వెళ్ళాడు.
రషీద్ చాలా మంచి అబ్బాయి, సొంతం ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే షాపు నడుపుతూ హుందాగా ఉంటాడు, ఉన్నతమైన కుటుంబం అయినా మాతో పనేంటి అనుకుంటూ గ్రౌండుకెళ్ళాడు
అక్కడ ఫ్రెండ్స్ ఐదుమంది రషీద్ తో మాట్లాడుతూ కనిపించారు, హాయ్ రషీద్ భాయ్
హాయ్ రా
నీ గురించే వెయిటింగ్ రా
అవునా ఏంటి భాయ్ విషయం.
ఏం లేదురా మీరంతా మంచి ఫ్రెండ్స్ కదా
మీతో ఒక విషయం చెప్పాలి... అదీ..
ఏంటది..
అదీ...
ఊ చెప్పు భాయ్ నువ్వు మా సీనియర్, నీకేం మొహమాటం.
అదీ జరీనా విషయం..
జరీనా విషయమా? ఏంటి భాయ్ ఏం చెప్పాలనుకున్నావ్.
అవును రా నిన్న జరీనా వాళ్ళింట్లో జరిగిన విషయం వీధిలో అందరికీ తెలిసింది. అట్లే మా ఇంట్లో కూడా తెలిసి సుభాన్ గురించే అంతా అనుకుంటున్నారు. వాడు నా క్లాస్మేట్, వ్యసనపరుడు ఏదోటి చేయాలి.
ఓ.. అదా అవును భాయ్ మేముకూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. మా ఫ్రెండ్ బాధలో ఉంది ఎలాగైనా గట్టెక్కాంచాలి, ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఐపోతే తరువాత అదే ఇష్యూ ఆలోచించాలి. దాని గురించే పిలిచావా భాయ్.
ఆ... అవును... కానీ....
ఇంకేంటి....
ఏంలేదురా నేను... నేను..
నువ్వు... నసుగుడేంటి
అరేయ్ అదేరా..... జరీనాని.. నేను..
ప్రేమించావా..
అవున్రా..
ఇప్పుడు తనుండే పరిస్థితుల్లో ఈ ప్రేమలూ అవీ కుదరదులే రషీద్ భాయ్. వదిలెయ్. మేముకూడా ఈ విషయంలో సపోర్ట్ చేయలేం. సారీ భాయ్.
అరేయ్.. వినండ్రా.... ప్రేమించడం నిజమే కానీ ఇప్పుడు పెళ్ళి చేసుకుందామనుకుంటున్నా.
ఏంటీ.. నిజమా...
అవున్రా.. ఈ విషయంలో వాళ్ళన్నతో నేను మాట్లాడుతా, కాని జరీనాతో మీరే ఒప్పించాలి. ఇదే విషయం చానా రోజుల్నుండి తనకి చెప్పాలనుకున్నా తీరా సమయం మించిపోయింది. మీరే ఎలాగైనా ఒప్పించాలి.
జరీనాకి ఇష్టం లేకపోతే వదిలేయాలి భాయ్ సరేనా.
ఓకే రా.
రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం పదండ్రా.
ఈ విషయం జరీనాకి ఎలా చెప్పాలి.
ఉండే ఏకైక మార్గం నేనే (పర్విన్).
ఉదయం చివరి ప్రాక్టికల్ తర్వాత సురేష్ నాతో చెప్పి పంపాడు.
నేను జరీనాని ఇంటికెళ్ళే దారిలో అడిగితే, జరీనాకి సిగ్గు బుగ్గల్ని చేరి బుసకొట్టింది. కానీ మా భయ్య ఒప్పుకోడేమో అని జరీనా అనుమానం చెప్పింది.
మీ భయ్య గురించి వదిలెయ్ నువ్వు చెప్పు అనడిగా.
మా అమ్మ ఓకే అంటే సరే అని సిగ్గుతో ఇంట్లోకెళ్ళింది.
అంతే సుభాన్ తో రషీద్ ఏం మాట్లాడాడో ఏమో చెల్లెలి పెళ్లికి ఒప్పుకున్నాడు, రషీదు షాపులోనే పనికి కుదిరాడు. పరీక్షలు పూర్తైన ఇరవై రోజుల్లో పెళ్ళి ఈ విషయంలో మా ఫ్రెండ్స్, సురేష్ , నేను చాలా హ్యాపీ. ఆ షాదీలో అంతా సురేష్ తో నా షాదీ గురించే టాపిక్. మా బాబ, శంకరన్న అంకల్ అక్కడ కలిసి మాట్లాడుకున్నారు. మా ఇళ్ళలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. సమస్యంతా బందువులు మసీదు పెద్దలతోనే, కాని మా డాడీకి నేన్నొక్కతినే కావడంతో అందరిని ఒప్పించడానికి ఆర్నెళ్ళు పట్టింది. ఈ లోగా సురేష్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో సెలక్ట్ కావడం అన్ని ఇబ్బందులు తొలగిపోయేలా చేసింది. తను జాయినింగ్ ఆర్డర్ కోసం వెయిటింగ్. పెళ్ళైన ఏడోరోజున పత్తికొండ పి. ఎస్ లో పోస్టింగ్.
మంచి చెడు కలిసిన ఆ రోజులు ఇప్పటికీ కన్నీళ్ళతో పాటు మధురానుభూతిని మిగిల్చాయి.
అల్హందుల్లాహ్... మాషా అల్లాహ్..
All Happy.

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్