మనిషి మంచోడు - గుడాల శ్రీనివాస్

good person

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో ప్రకాష్ రాజ్ కేరెక్టర్ లాంటిది మా నాన్న కేరెక్టర్. ఎప్పుడు నవ్వుతూ, ప్రేమ గా అందరితో మాట్లాడుతుంటారు. మనిషి మంచోడు, మనిషి అంటేనే మంచోడు లాంటి మాటలు చాలా చెబుతుంటారు. మాది గోదావరి జిల్లాలో ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో గర్నమెంట్ పాఠశాలలో టీచర్ గా పని చేసేవారు. ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరినీ పేరుతో సహ పలకరించేవారు. వారి మంచి చెడ్డలు తెలుసుకునేవారు. వాళ్ళు అడగక పోయినా తనవంతు సాయం చేసేవారు. చదువులో డల్ గా ఉండే వాళ్ళకు మా ఇంటి దగ్గరే ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. ఆ ఊళ్ళో వాళ్ళకు కూడా ఆయనంటే చాలా మర్యాదా, గౌరవం. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా ఈయన చేతులమీదే జరాగాల్సిందే.

నా బాల్యం అంతా ఆ ఊళ్లోనే గడిచింది, రాఘవులు మాస్టారి కొడుకుగా అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. పై చదువులు నిమిత్తం ఊరు వదిలి వచ్చాను. చదువు తర్వాత ఉద్యోగం అలా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాను. నాకు పెళ్ళయి మూడేళ్లు అవుతుంది.

మా నాన్న రిటైరై రెండు సంవత్సరాలు అవుతుంది.ఈ రెండేళ్లలో ఆ ఊరి వాళ్ళతో మరింత మమేకమై పోయారు. ఈ మద్యనే మా అమ్మగారు చనిపోయారు.

“ ఈ జన్మలో ఆమె చెయ్యాల్సిన పనులు అయిపోయాయి,బాధ్యతలు తీరిపోయాయి అందుకే దేవుడు తెసుకెళ్లిపోయాడు.“ అంటూ తన ధోరిణి లో నవ్వుతూ నలుగురితో చెప్పారు కానీ బాధ పడినట్ట్లు కనబడలేదు.

అన్నీ కార్యక్రమాలు అయిపోయాక

“ఒంటరిగా మీరిక్కడేందుకు మాతోపాటే హైదరాబాద్ వచ్చేయండి” అని అడిగితే.

“నేను ఒంటరేమిట్రా, ఈ ఊరి వారందరూ నావాళ్ళు కాదా? నేను రానురా” అన్నారు మాటకు ముందు వెనకాల నవ్వు జతచేస్తు.

కానీ నేను బలవంతం చేయటం తో ఆయన మాతో హైదరాబాద్ బయలుదేరారు.

అప్పటినుండి మొదలయ్యాయి నాకు కష్టాలు

డ్రైవర్ని మాట్లాడుకుని మా కార్లో బయలుదేరాం

మా నాన్న డ్రైవర్ ప్రక్క సీట్లో కూర్చుని ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు.

ఎంతమది పిల్లలు? ఏం చదువుతున్నారు ? ఎంత సంపాదిస్తావ్? సంపాదన సరిపోతుందా? దారి పొడవునా డ్రైవర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

విచిత్రమేమిటంటే డ్రైవర్ ఏమాత్రం విసుక్కోకుండా ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు ఉత్సాహం గా సమధానం చెప్పాడు.

హైదరాబాద్ చేరుకున్నాక డ్రైవర్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు “పాపం ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాడు, ఇంకా అతని మీద ఆధారపడినవాళ్లు ఉన్నారు, ఈ డ్రైవర్ పనిచేసి సంపాదించినది ఏం సరిపోతుంది? మనలాంటి వాళ్ళు ఏంతోకంత సహాయం చెయ్యాలిరా “ అంటూ నాతో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇప్పించారు.

“బాబాయ్ గారు మీరు ఊరు వచ్చిన తర్వాత ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి” అని మా నాన్నకు నమస్కారం చేసి ఫోన్ నెంబర్ ఇచ్చిపోయాడు డ్రైవరు.

“చూశావ్ రా డ్రైవరు ఎంతమంచోడో, అతనే కాదు అందరిలోనూ మంచి అనేదిఉంటుంది, మనమే వాళ్లలోని మంచిని బయటికి తీయాలి, కొన్ని గంటలు ప్రయాణం తో ముడిపడ్డ ఈ బంధాన్ని కంటిన్యూ చేయటానికి ఫోన్ నెంబర్ అనే లింక్ ఇచ్చి పోయాడు” అన్నారు ఫోన్ నెంబర్ చూపిస్తూ.

“ఏం లింకో ఏంటో ఫోన్ నెంబర్ ఖరీదు వెయ్యి రూపాయలు” అనుకున్నాను మనసులో

మా అపార్ట్ మెంట్ చిన్నది ఐదు ప్లోర్లు ప్రతి ఫ్లోర్ కి రెండు ఫ్లేట్స్ మొత్తం పది కుటుంబాలు.మేం దిగిన రెండో రోజే మిగిలిన తొమ్మిది కుటుంబాల ఇన్ఫర్మేషన్ సేకరించారు మా నాన్న

మూడు కుటుంబాలవాళ్లు వాళ్ళ పెద్దవాళ్లతో ఉంటున్నారు. మొదట వాళ్ళని పరిచయం చేసుకున్నారు. మరో వారం రోజుల్లో మిగిలిన కుటుంబాల వారితో కలిసిపోయారు. రోజూ వాళ్ళ ఫ్లేట్స్ కి వెళ్ళటం వాళ్ళ యోగా క్షేమాలు మంచి చెడ్డలు గురుంచి మాట్లాడటం మొదలు పెట్టారు.

“నాన్న ఇది మన ఊరు కాదు, హైదరాబాద్. రోజూ వాళ్ళ ఫ్లేట్స్ కి వెళ్ళి వాళ్ళ టైమ్ వేస్ట్ చేయ్యకండి. ఎవరి పనులు వాళ్లకుంటాయి, ఆఫీస్ లోనో, మరో పనిలోనో అలసిపోయి ఇంటికి రిప్రెష్ అవుదామని వస్తే ఇంతలో మీరెళ్లి వాళ్ళ పెర్శనల్ టైంని ఎందుకు డిస్ట్రబ్ చేస్తారు?”

“వాళ్ళ టైమ్ ని నేనేమీ డిస్ట్రబ్ చేయటం లేదు, అయినా రీఫ్రెష్ అవ్వటమంటే అంటే టి‌వి కొ మొబైల్ కొ అతుక్కుపోవటం కాదురా, మన తోటి వారితో నాలుగు నిమిషాలు మాట్లాడితే చాలురా, ఆ విషయం ఈ తరం వాళ్ళకు అర్థం కావటంలేదు ఎందుకోమరి”

“తోటి వాళ్ళతో గడపాలని వాళ్ళకి ఉండాలి కానీ, మీరేందుకు వెళతారు?”

“చాలా మందికి మొహమాటం ఎక్కువ, మాట్లాడితే ఎదుటి వాళ్ళు సరిగ్గా మాట్లాడతారో లేక ఏమైనా అనుకుంటారేమోనని ముడుచుకుపోతారు. మనం వాళ్ళతో మాటలు కలిపితే చాలు ఓపెన్ అయిపోతారు. ఒక విధంగా వాళ్ళు ఇటువంటి సందర్భం కోసమే ఎదురుచూస్తుంటారు.”

“మనమే వెళ్ళి వాళ్ళను కదిలించి మాట్లాడవలసిన అవసరం ఏముంది? మరీ చాదస్తం కాకపోతేను. మీరు రిటైరై ఇంట్లో ఖాళీగా ఉండి ఏమి తోచక వెళ్తున్నారని అనుకుంటారు అంతకుమించి ఏమి ఉండదు, ఇక్కడి వాళ్ళ సంగతి మీకు తెలియదు”

నాకు లోపల భయంగా ఉంది ఏదో ఒకరోజు ఎవరో ఒకరు వచ్చి మీ నాన్న గారు మమ్మలి బాగా డిస్ట్రబ్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తారేమోనని.

“ఎక్కడి వాళ్ళైన చాలా విషయాలలో ఒకే రకంగా ఉంటారురా, మనిషి కొత్త ప్రాంతానికి వెళ్ళినపుడు, అక్కడ వాళ్ళు భిన్నంగా ఉంటారు అనుకుని ఎవరికి వాళ్ళు గిరి గీసికుని బ్రతుకుతారు అంతే, ఎక్కడైనా మనిషి మనస్తత్వం ఒకేరకం గా ఉంటుంది.”

“మీరెన్నయినా చెప్పండి నాన్న, అందరూ మన ఊరి వాళ్ళ లా ఉంటారని అనుకోకండి” అన్నాను ఇక ఆయనతో ఎక్కువ వాదించకూడదని నిర్ణయించుకుని.

“సరి లేరా నువ్వలాగే అనుకో” అన్నారు ఆయన స్టైల్ లో నవ్వుతూ.

అలా రోజులు గడుస్తున్నాయ్, ఆయన మాత్రం అందరి ఇళ్లకు వెళుతున్నారు, అందరినీ పలకరిస్తున్నారు, వస్తున్నారు. అదృష్టమేమిటంటే ఇంతవరకూ ఎవరూ ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. పైపెచ్చు అప్పుడప్పుడు పెద్దలో, పిల్లలో వచ్చి ఆయన్ని విష్ చేసిపోతున్నారు.

ఎవరింట్లో ఏ చిన్నపాటి సెలెబ్రేషన్ జరిగినా ఆయన్ని తప్పనిసరిగా పిలుస్తున్నారు. అంతేకాదు ఎవరింట్లో స్పెషల్ వంటకాలు చేసుకున్నా ఒక బాక్స్ ఆయనకు వస్తుంది.

లిఫ్ట్ దగ్గర కానీ కారిడార్ లో కానీ అందరూ ఆయన్ని విష్ చేస్తుంటారు, ఇన్ని సంవత్సారాల నుండి ఉంటున్న నన్ను మాత్రం పట్టించుకోరు. మా నాన్న గారు కూడా అందర్నీ పేరుతో సహా పలకరిస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో ఆయన సహజ ధోరిణి లో ఆయన నవ్వుతున్నా, ఎందుకోనన్ను చూసే నవ్వుతున్నట్లు అనిపిస్తుంది.

ఒకరోజు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చిన అబ్బాయి కి నాచేత ఇరవై రూపాయలు ఎక్కువ ఇప్పించారు అతను అడక్కపోయినా సరే. డెలివరీ చేసిన ప్రతీ సిలిండర్ కి గ్యాస్ డీలర్ పే చేస్తాడన్నా వినిపించుకోలేదు.

మరోరోజు కొరియర్ తెచ్చిన అబ్బాయికి, ఎండన పడి వచ్చాడు కాస్త మజ్జిగ కలిపి ఇవ్వమని నా భార్యకు ఆర్డర్ వేశారు.

ఎందుకు నాన్న ముక్కుమొహం తెలియని వాళ్ళకు ఇటువంటి మర్యాదలు అవసరమా అంటే తన శైలిలో మనిషి మంచోడు లాంటి ఉపన్యాసాలు మొదలుపెడతారు నవ్వుతూ.

మా ఇంట్లో సర్వెంట్ రోజూ ఉదయం ఆరు గంటలకు వచ్చి పని చేసుకుని పోతుంది. ఒకరోజు లేట్ గా వచ్చింది ఆ టైమ్ కి మేము టిఫిన్ చేస్తున్నాము. తినే టైమ్ కి వచ్చింది అని ఆమెకు టిఫిన్ పెట్టించారు. ఆ రోజు మొదలు ఆమె మా ఇంటికి వచ్చే టైమ్ మారిపోయింది టిఫిన్ తినే టైమ్ కె వస్తుంది.

మా అపార్ట్ మెంట్ వాచ్ మేన్ రమణ తన కూతురికి పెళ్లి కుదిందనే వార్త మా నాన్న కి చెప్పటానికి వచ్చి డబ్బు సర్దమని అడిగాడు.

ఎంత కావాలి అని ఈయన అడగగా యాబై వేలు కావాలి రెండు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పాడు.

ఒక నెల అటుఇటు అయినా పర్వాలేదు అమ్మాయి పెళ్లి మాత్రం చక్కగా చెయ్యాలి అని అభయం ఇచ్చేశారు.

నన్ను పిలిచి “ఒరేయ్ మన రమణ, కూతురు మేరేజ్ చేస్తున్నాడు డబ్బు అవసరం ఉందట ఒక యాబై వేలు ఉంటే సర్దు రెండు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాడు” వాచ్ మేన్ తరుపున ఈయనే హామీ ఇస్తూ

నాకు అరికాలు మంట నెత్తికెక్కింది. ఆకరికి వాచ్ మేన్ కూడా మా నాన్న మంచితనాన్ని వాడుకోటానికి సిద్దపడిపోయాడని. ఆయనకేమో ఎంత చెప్పినా అర్థం కాదు. ప్రతిమనిషి లోనూ మంచి తనాన్ని చూడటం పిచ్చితనమే అవుతుంది. వీళ్ళు మనం అనుకునేంత మంచివాళ్లు కాదనే విషయం ఆయనకు ఎప్పటికీ అర్థం అవుతుంది భగవంతుడా? మనం ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మనకి తెలియకుండా మనల్ని వాడేసుకునే ఈ రోజుల్లో ఈయన ఇలా బంపర్ ఆఫర్లు ఇస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఉరుకుంటారు. ఎవరో ఒకరి విషయం లో ఎదురుదెబ్బ తగిలితేగాని ఈయన మారడు. నేను ఈ ఆలోచనల్లో ఉండి ఏమి మాట్లాడక పోవటం తో

ఆయన స్టైల్ లో నవ్వుతూ “మనం కాక పోతే ఎవరు సర్దుతారురా, మనిషి కి మనిషి సహాయం చేయకపోతే దేవుడు దిగి వచ్చి చేస్తాడా? సహాయం చేసే మనిషే దేవుడురా” అంటూ ఉపన్యాసం మొదలు పెట్టారు.

“నా దగ్గర అంత అమౌంట్ లేదు ఈనెల కారు ఇన్సూరెన్స్ లాంటి వేరే ఖర్చులు చెయ్యాల్సివచ్చింది, తర్వాత చూద్దాం” అన్నాను.

“తర్వాత అంటే అవసరాలు ఆగుతాయా? ఏదొరకంగా చూడరా” అన్నారు నవ్వుతూ

ఇవ్వటం తప్పదని నాకర్థమైంది “నా దగ్గర అంత అమౌంట్ లేదు పాతిక వేలు ఇస్తాను సాయంత్రం వచ్చి తీసుకెళ్లు, ఒక నెలలో తిరిగి ఇచ్చేయాలి” అన్నాను రమణ తొ

“ఇస్తాడు లేరా, ఇవ్వకుండా ఎక్కడికి పోతాడు” నవ్వుతూ మానాన్న.

ఆ రోజు సాయంత్రం వాడు వచ్చి డబ్బు తీసుకుని, పెళ్లి వాళ్ళ ఊర్లో చేస్తున్నానని, అన్నీ కార్యక్రమాలు చేసుకుని రావటానికి రెండు వారాలు పడుతుందని వాళ్ళకు తెలిసిన వ్యక్తిని వాచ్ మేన్ గా పెట్టి ఊరు వెళ్ళి పోయాడు కుటుంబ సమేతంగా.

వాడు తిరిగి రాడని నా మనసులో ఏదో అనుమానం, కానీ వాడు అన్నట్టు గానే రెండు వారాలకు తిరిగివచ్చాడు. రోజులు గిర్రున తిరిగాయి డబ్బు తీసుకుని రెండు నెలలు అయ్యింది. మానాన్నకు తెలియకుండా రోజు రమణ ను డబ్బులు తిరిగివ్వమని అడగటం మొదలు పెట్టాను, వాడు వాయిదాలు వేస్తువస్తున్నాడు.

ఒకరోజు మా నాన్న ముందేపిలిచి అడిగాను. మా నాన్న ఏ మూడ్ లో ఉన్నారో కాని “రమణ నీవు అడిగిన గడువు అయిపోయింది. మాట నిలబెట్టుకోవటం మంచి మనిషి లక్షణం” అన్నారు.

ఆయన నుండి ఈ మాటలు ఊహించని రమణ ముఖం రంగులు మారింది.

“సరేనండి ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాను” చెప్పి వెళ్ళాడు రమణ.

ఇది జరిగిన రెండు రోజులకు మా ఫ్యామిలీ మొత్తం ఒక ఫంక్షన్ నిమిత్తం మా ఊరు వెళ్ళాం. మేము తిరిగి వచ్చేటప్పటికి రమణ ప్లేస్ లో కొత్త వాచ్ మేన్ ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఎవరికి చెప్పకుండా రమణ జెండా ఏత్తేసాడట, అతని ప్లేస్ లో కొత్త వాచ్ మేన్ ని పెట్టారు.

“మీకు ఇప్పటికైనా అర్థమైందా, అందరూ మంచివాళ్ళు కారని, ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకోండి, మీ పాత కాలపు ఆలోచనలనుండి బయటకురండి.” అని కాస్త గట్టిగానే అన్నాను.

రమణ జెండా ఎత్తేయటం మా నాన్నకు పెద్ద షాక్ ఇచ్చిందిమ, ఎందుకంటే ఆయన కు ఎప్పుడు ఇటువంటి ఎదురుదెబ్బ తగల్లేదు. కాని పైకి మాత్రం “ఏదో కారణం వలన వెళ్లిపోయాడు, మన డబ్బు తిరిగి ఇవ్వటానికి మాత్రం తప్పనిసరిగా వస్తాడు చూస్తూ ఉండు” అన్నారు.

నేను “సరే చూద్దాం” అన్నాను. డబ్బు పోతేపోయింది కాని ఈయనకు ఇది మంచి గుణపాఠం. లోపల నాకు చాలా సంతోషమనిపించింది.

రోజులు గడుస్తున్నాయి మా నాన్న చాలా నమ్మకం గా రమణ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన లో కొంచెం కొంచెం మార్పు కనపడుతుంది. ఇదివరకటిలా అందరి ఫ్లేట్స్ కి వెళ్ళటం లేదు. ఎప్పుడు ఎంతో ఉత్సాహం గా ఉండే ఆయన లో దిగులు కనపడుతుంది. రాను రాను భోజనం కూడా సరిగ్గా తినటం లేదు. బయటకు వెళ్ళటం తగ్గిపోయింది ఆయన రూమ్ కె పరిమితమయ్యారు. మనిషి నమ్మకం వమ్మైతే ఇంత ప్రభావం ఉంటుందా అనిపించింది.

బాబాయ్ గారు మా ఇంటికి వచ్చి చాలా రోజులైందని కొందరు, తాతయ్య గారు కనబడటం లేదని మరికొందరు ఇలా రక రకాల వరసలు కలుపుతూ మా అపార్ట్ మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన కోసం వస్తున్నారు. ఆయన తో వాళ్ళు ఎంతో ప్రేమ గా మాట్లాడుతూ సొంత మనుషులకంటే ఎక్కువ ఆప్యాయత చూపిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది.

ఆయన మీద కంప్లైంట్ చేస్తరేమోనని భయపడిన నాకు, వాళ్ళ ప్రేమను చూస్తుంటే నాకళ్ళను కన్నీటి తెర కమ్మెసింది. కడివెడు పాలను ఒక చిన్న విషపు చుక్క పాడుచేసినట్లు. ఇంతమంది మనసులను గెలుచుకున్న ఆయన మంచితనం,వ్యక్తిత్వం ఒక చెడ్డ మనిషి కారణంగా డీలా పడటం నాకు బాధనిపించింది.

ఒక రోజు నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పటికి మా నాన్న హుషారుగా కనబడ్డారు. “నేను చెప్పానుగా మనిషి మంచోడని, నా నమ్మకం వమ్ము కాలేదురా, రమణ ఈ రోజు వచ్చి పాతిక వేలు ఇచ్చి వెళ్ళాడు రా” అన్నారు సంతోషం గా.

ఆయన ముఖం లో దిగులు పోయి సంతోషం కనపడుతుంది. ఆయన లో ఉత్సాహం తిరిగి వచ్చింది. ఆయనలోని మునుపటి రాఘవులు మాస్టారు మేల్కొన్నారు.

“నిజమే నాన్న మీరు చెప్పింది అక్షరాల నిజం” అని ఎందుకో ఆయన్ని కౌగలించుకోవాలనిపించి. కౌగలించుకున్నాను.

అప్పటివరకూ ఆయన మనసులో గూడుకట్టుకున్న బాధ ఒక్కసారిగా ద్రవించి కన్నీరుగా నా భుజాన్ని తడిపేసింది.

మనిషి మీద ఆయనకు ఉన్న నమ్మకం తిరిగి బలపడింది.

కానీ, ఆ వాచ్ మేన్ రమణ ను వెదికిపట్టుకోవటం ఎంత కష్టమైందో, వాడికి మరో పాతికవేలు ఇచ్చి ఇంటికి వచ్చి బాకీ తీర్చమని ఎంత బ్రతిమాలవలసి వచ్చిందో ఆయనకు తెలియదు, ఎప్పటికీ తెలియకూడదు కూడా.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు