""ఏందో ఈ కాలం ఇలా పాడయ్యింది, పని కూడా దొరకక పాయే ఇంటికి ఎట్లా పోవాలనో ఏమో" అంటూ గుణుక్కుoటూ" ఇంటి వైపు గా నడుస్తున్నాడు రాములు. "ఏంది రాములు మల్ల ఎన్కకే రావడితివి ఏమైంది పని కి పోలేవా అని అడిగాడు అక్కడే కూర్చున్న నర్సింహులు" , "ఏ ఎం పనో ఎమోనే నాయిన అడా పోలీసులు కొడుతుండ్రు పోనికే వస్తలేదు. ఇగ పనేం దొరకూతది "అంటూ అతనికి చెప్తూనే ఇంటి దిక్కుగా వెళ్ళిపోయాడు రాములు. నర్సింహులు గట్టిగా నిట్టూర్చి, తాను లోపలికి వెళ్లి పోయాడు.
లాక్ డౌన్ పెట్టి ఆ రోజుకి అయిదు రోజులు అవుతుంది. రాములు భవన నిర్మాణ కార్మికుడి గా పని చేసేవాడు. వచ్చిన కూలి తో భార్య బిడ్డలని సాకుతూ ఉండే వాడు. గత ఐదు రోజులుగా పని లేక ఇంట్లోనే ఉంటున్నారు అందరూ.
ఉన్న సరుకులు అన్ని నిన్నటిదాకా వచ్చాయి. ఇక ఈ రోజు ఎలాగైనా పనికి పోవాలని అనుకుని బయటకు వచ్చాడు. కానీ పోలీసులు మధ్యలో ఆపేసి ,పనులు లేవు అని ,ఇంట్లోనే ఉండాలని చెప్పి,పంపించడం తో ఉసూరు మంటూ ఇంటికి తిరిగి వచ్చాడు.అలా వెళ్లి గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చిన భర్త ని చూసి రాములమ్మ ఏందయ్య ఆస్తివి అప్పుడే , పనేం దొరక లేదా అని అడిగింది. ఆమె వంక ఒక్క చూపు చూసి మౌనంగా అక్కడే కూర్చున్నాడు రాములు. ఆది చూడగానే రాములమ్మ అయ్యో గట్ల కూసుంటే ఎట్లా తిండి గడిచేది, ఇంట్ల ఉన్నయి అన్ని అయిపాయే, పోరాళ్లకు రాత్రికి గూడ పెట్టనికి ఏమి లేవు , అంటూ స్వరం పెంచింది.
గట్ల కూసోక అసంట పోయి ఎవలనన్న పని అడుగుపొ అయ్యా అంది రాములమ్మ , ఆమె చెప్పింది కూడా మంచికే అని గ్రహించిన రాములు బయటకు వెళ్ళాడు. ఆ కాలనీ లో ఉన్న ప్రెసిడెంట్ ఇంటి వరకు వెళ్ళాడు.
ఆ కాలనీ ఎప్పుడూ బైక్ ల సౌండ్ తో కోలాహలంగా ఉండేది, అలాంటిది ఇప్పుడు పిట్ట పురుగు కూడా లేకుండా అయ్యింది. అది చూస్తున్న రాములుకు భయం వేసింది. అంత నిర్మానుష్యంగా ఉందా కాలనీ , అలాగే ముందుకి వెళ్ళాడు ధైర్యం చేసి, వెళ్లి ప్రెసిడెంట్ ఇంటి కాలింగ్ బెల్లును కొట్టాడు. కాసేపటికి కిటికీ తలుపు కొంచెంగా తీసి, ఎవరూ అంటూ అడిగాడు ప్రెసిడెంట్ గారు ఆయన్ని అలాగే పిలుస్తారు అందరూ ఆయన పేరుఎవరికి తెలియదు, అయ్యా నేను రాములు ను అయ్యా అన్నాడు రాములు.
ఆ రాముల ఏ రాములు అని అడిగాడు అదేనయ్య మేస్ట్రీ పని చేసే రాములును అయ్యా అన్నాడు రాములు ,ఓ రాములు ఏంది గిట్ల వచ్చినవు అని అడిగాడు. అయ్యా ఏమి లేద్దోర ,పని దొరకలేదు దొర నికడా ఏమైనా పని ఉందేమో అని అచ్చిన అన్నాడు రాములు , ఆయన బయటకి రాకుండా అలా అడగడం రాములుకు నచ్చలేదు.
దానికి ఆయన అరెయి రాములు పని దోర్కలేదని నువ్వు నా ఇంటికి అచ్చుడు ఏంది రా , ఈయల కాకుంటే రేపు దొరకూతది పని, కానీ నువ్వు ఏ రోగం మోసుకొచ్చినవో ఏందో, పో పోయి ఇంటి కడ గమ్మున పండుకో పో అంటూ తలుపులు మూయబోయాడు అయ్యా అది కాదు తిననికి తిండి గింజలు కూడా అయిపోయినాయి దొర మీ కాల్మొక్త జర కొన్ని తిండి గింజలు ఉంటే ఇయ్యండి అన్నాడు దీనంగా...
అరెయి నీకు ఇచ్చుకుంటా కూసుంటే మరి మేమేం తినలరా అని పో,పో, అయినా గా గోవర్నమెంట్ అల్లు మీకు అన్ని పంచుతారoట, మన కాలనీ కి కూడా ఇయ్యలో రేపో అస్తరు. నువ్వు నిమ్మలంగా ఉండు అని అంటూ కిటికీ తలుపులు ముసుకున్నాడు ప్రెసిడెంట్. అవి ఎప్పుడొస్తాయో అడగాలని ఉన్నా అతను కిటికీ ముయ్యడం తో అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు అయ్యి , వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రాములు.
ఆరోజు ఎలాగో గడిచిపోయింది. తెల్లారి కూడా పని దొరకలేదు, కానీ లాక్ డౌన్ పొడిగించారు అని తెలిసి రాములు కు ఏమి చేయాలో పాలు పోలేదు. కూలీలకు రేషన్ సరుకులు ఇస్తారు అని తెలిసింది.కానీ అవి ఎప్పుడు వస్తాయో తెలియక , పక్కనే ఉన్న మిగతా కూలీల దగ్గర అప్పు ఎలాగో తెచ్చి పిల్లలకు వండి పెట్టింది రాములమ్మ . భర్త కి కూడా ఎలాగో ఓ పక్కకి కూడా రాకపోయేసరికి ఏమి చేయాలో పాలు పోలేదు.
అప్పటికే రాములమ్మ బాలింత ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు,ఇంకో పిల్లాడు పొత్తిళ్లలో ఉన్నాడు. బాలింత కాబట్టి పాలు రావాలి అంటే ఆమె అయినా మంచిగా తినాలి కానీ తిండికి కష్టoగా ఉండి, అప్పు తెచ్చిన బియ్యం కూడా సరిపోవడం లేదు. బాలింత అయిన వెళ్లి అప్పు తేవడం రాములుకు ఇంకా తల కొట్టేసినట్టు అయ్యింది. ఇంకా పని దొరకలేదు. సరుకులు కూడా ఎవరూ తెచ్చి ఇవ్వలేదు.
ఇలా కాదని బయటకి వెళ్లి పని చూసుకుందాం అని అనుకుని వెళ్ళాడు రాములు. రాములు వెళ్లడం చూసిన పోలీసులు బయటకు రావద్దని తెలియదా అంటూ, అతను చెప్పింది ఏదీ వినిపించుకోకుండా కొట్టారు. తిరిగి దెబ్బలతో వచ్చిన భర్తని చూసి, నివ్వెరపోయింది రాములమ్మ.పని దోర్కలేదని అర్థం అయ్యి, దగ్గరకు వచ్చి అయ్యా పని దొరకక పోయినా గాని మంచిదే ,ఆకలితో సద్దాం, కానీ నువ్వు పోయి దెబ్బలు తింటివి,ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అయితది నువ్వేం గవర పడకు అని ధైర్యం చెప్పింది రాములమ్మ, కానీ ఆ రాత్రి పిల్లకు పాలు రాక ఏడవడం తో ఇక భరించలేక రాములు మళ్ళీ బయటకు వెళ్ళాడు.
చవురాస్తా దాకా పోయిన రాములుని ఆపేసారు పోలీసులు. , "ఎందయ్యా ఇట్లా వస్తున్నావ్,పానాలు ఉండాలంటే ఇంట్లో ఉండు పో అని" అన్నారు అక్కడ ఉన్న పోలీసులు. "అయ్యా జర కనికరం సుపండి, నాలుగు రోజులుగా పని లేక మా ఇంట్లో తిండి కి కష్టం అయితుంది.మా ఇంటిది బాలింత పాలు రాక పిల్లకు అవస్త అయితుంది.ఏదన్నా పని చేసుకుంటా అయ్యా పని జెప్పున్ద్రి అన్నాడు దీనంగా", అతన్ని చూస్తున్న పోలీసులకు జాలి కలిగి, "అదేందిరా మీ కాడికి బియ్యం గిట్ల రాలేదా , మన ముఖ్యమంత్రి గారు అందరికి సరుకులు పంపిండ్రు గదా" అని అడిగారు. దానికి రాములు "అయ్యా మాకవ్వి ఎయి రాలేవయ్య, మీ కాల్మొక్త దొర పని లేక,పైసలు లేక ,పాలు లేక మా
సo టిది ఏడుతుంది" అన్నాడు. వాళ్లంతా "అదేంది మీకు సరుకులు ఎందుకు రాలేదో అడుగుదాం పా" అంటూ ఆ కాలనీ ప్రెసిడెంట్ వద్దకు వెళ్లారు.
ఆయన్ని బయటకు పిలిచి అడిగారు అక్కడి డీలర్ "ఎవరని ఆయన చెప్పాడు. అతన్ని వెంట బట్టుకుని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లారు ఆ రాత్రి. డీలర్ నిద్రమత్తు లో ఎదో చెప్పబోయాడు. కానీ పోలీసులు కౌంటింగ్ మొదలు పెట్టె సరికి , తాను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. సరుకులు అందరికి ఇవ్వకుండా షాప్స్ కి అమ్ముకుంటున్నాడని తెలిసి పోలీసులు బిత్తరపోయారు. కూలీలకు అందాల్సిన రేషన్ బియ్యం, సరుకులు అతను బ్లాక్ లో అమ్ముకోవడం చూసి, కరోన ఇలాంటి వారిని ఏమి చేయక పోవడం చూసి, అవినీతిని నరనరనా జీర్ణం చేసుకున్న అతన్ని అరెస్ట్ చేశారు.
అతని వద్దనున్న సరుకులు అన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయ్యేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటింది.ఇక అప్పుడు సరుకులు కొన్ని రాములుకు ఇచ్చి, వారికి వచ్చిన భోజనాన్ని కూడా అతనికే ఇచ్చి, అతన్ని ఇంటి వరకు దింపడనికి వెళ్లారు పోలీసులు. అక్కడికి వెళ్లిన వారికి ఒక దృశ్యం కన్నీళ్లు తెప్పించింది. అక్కడ రాములమ్మ ఒళ్ళో బిడ్డ నిర్జీవంగా వెళ్లాడుతుంది. ఆ బాబుని అలా చూసిన రాములమ్మ పిచ్చిగా తనలో తానే మాట్లాడుకుంటుంది. పాలు లేక ఆకలి తో చనిపోయిన తన బిడ్డ ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు రాములు, తెచ్చిన భోజనాన్ని గబగబా భార్య నోట్లో పెడుతూ,"తినే తిను పిల్లగానికి పాలు ఆస్తాయి తినే "అంటున్న రాములుని జాలీ గా చూడడం తప్పితే వాళ్ళు మాత్రం ఏమి చేయగలరు.
""**అవినీతి కరోన కన్నా పెద్ద రోగం "**అని అనుకోవడం తప్పా"" ...