గబ గబా పని పూర్తి చేసుకొని కాల్ లోకి వెళ్ళాలని సుధ హైరానా పడిపోతోంది. ఈ వర్క్ ఫ్రమ్హోమ్ ఏమో కానీ ఏ పనీ సరిగా అవటం లేదు. లేట్ నైట్ వరకు మూవీలు చూసి ఈయనేమోతాపీగా లేస్తారు ఏ ఎనిమిదింటికో. లాక్ డౌన్ పుణ్యమా అని ఈయన ప్రాజెక్ట్ కాన్సిల్ అయ్యింది. బెంచ్ మీదుండబట్టి నో వర్క్ ప్రెషర్.
పని అమ్మాయి ఇంకా రాలేదేంటా అని చూస్తుంటే మిన్ను విరిగి మీద పడ్డట్టుగా వాళ్ళని మెయిన్గేట్ దగ్గర ఆపేస్తున్నారని వార్త విని పుట్టెడు నీరసం వచ్చి కుర్చీలో కూలబడ్డా. బుర్ర పనిచేయడంమానేసింది. సడన్ గా చలి జ్వరం వచ్చినట్లు వణికిపోయా. పని అమ్మాయి రాకపోతే ఇంతఎక్సప్రెషన్ ఏంటా!! అనుకుంటున్నారా?? మీకు అతిశయోక్తి గా ఉండచ్చు గాక !! కానీ ఇది సత్యం. లాక్ డౌన్ వలన అందరూ ఇంట్లో ఉండబట్టి నా తిప్పలు తిప్పలు కావనుకోండి.
సుధా!! సుధా!! తల బద్దలైపోతోంది, కొంచెం కాఫీ ఇస్తావటోయ్...... అని ఈయన పిలుపు, కాదు... కాదు..... అరుపు.... దానితో ఈ లోకంలోకి వచ్చా.
ఆ....... వస్తున్నానండీ!! అని ఈయనకి కాఫీ కలిపి ఇచ్చానో లేదో మా మామ గారు మార్నింగ్ వాక్పూర్తి చేసుకుని వచ్చారు. అదే చేత్తో నాకుకూడా ఓ కప్పు కాఫీ అమ్మా!! అన్నారు. సరే అని కిచెన్లోకి వెళుతున్నానో లేదో ఈ లోపే మమ్మీ!! అని ఓ కెవ్వు కేక!! మా చిన్నది మంచం మీద నుండిపడిపోయిందేమోనని బెడ్ రూమ్ కేసి ఓ పరుగు....... మంచం మధ్యలో కూర్చుని కొంపలుమునిగిపోయేలా ఏడుపు. ఇది లేస్తూనే పెడుతుంది దుకాణం. అలా ఏడుస్తూ లేవద్దు అని ఎన్నిసార్లు చెప్తానో...... ఊ...హూ.... రోజూ ఇదే తంతు. కాసేపు అమ్మ ముద్దు చేయాలని దానిఉద్దేశ్యం. పొద్దన్నే దానితో ముద్దు మురిపాలు చేస్తూ కూర్చోడానికి నాకు టైమేదండీ!! అది తెలీదుఆ పసి దానికి.
మాకు పెళ్ళిఅయిన ఐదు ఏళ్ళ వరకు పిల్లలు లేరు. ఈ లోపులోనే ఇరుగు పొరుగు, చుట్టపక్కాలుఅందరూ ఒకటే ఆరాలు, జాలి చూపులు.... పాపం పెళ్ళై ఐదేళ్లయింది, ఇంకా పిల్లల్లేరని. మేముహ్యాపీగానే ఉన్నాం, కానీ ఇరువైపు పేరెంట్స్ పోరు పడలేక ఐ.వీ.ఎఫ్ కెళ్ళాం. దాని ఫలితమే మాకవలలు, ఇద్దరు అబ్బాయిలే, హమ్మయ్య!! ఒకేసారి పెంచేయ్యచ్చు అని సంతోషపడేలోగా మాఅమ్మా, అత్తగారు కూడా ఆడపిల్లల్లేని ఇల్లేం ఇల్లు, నట్టింట్లో ఆడపిల్ల లక్ష్మీ దేవిలాతిరుగాడుతుండాలని ఒకటే నస. వాళ్ళ కోరిక మేరకు లక్కీగా రెండోసారి ఆడపిల్లే పుట్టింది. అదేంటోగాని అది ఎప్పుడూ ఏడుపే.
మా బాస్ ఇది వరకైతే ఎవరిదో కిడ్స్ నోయిస్ వినపడుతోంది కాల్ లో, వాళ్ళు మ్యూట్ లోపెట్టుకోండి అనేవారు. ఇప్పుడైతే డైరెక్టుగా "సుధా, నీ ఫోన్ మ్యూట్ చేసుకో " అని చెప్పేస్తున్నారు. ఎంత ఎంబరాసింగ్ గా ఉంటుందో చెప్పలేననుకోండి. కాల్ లోకి వెళ్ళి మ్యూట్ చేసేలోగానే అది “ఆ ” అని ఆరున్నొక్క రాగం అందుకుంటుంది.
అందుకే దీని ఏడుపు అందరికీ సురపరిచితం అయిపోయిందనుకుంటా.
ఎలాగోలా అష్టావధానం శతావధానం చేసి వంట అయిందనిపించాను. త్వరగా లంచ్ అవ్వగొట్టేస్తేమెయిల్స్ అయినా చెక్ చేసుకుందాం అనుకుంటూండగా మావగారి పిలుపు అమ్మా!! మీఅత్తగారు లేచారు, ఓ సారి చూడమ్మా! అని. ఆవిడకి వారం రోజులుగా జ్వరం. కరోనాఅనుకుంటారేమోనని ఎవరితో చెప్పడం లేదు. జ్వరం తప్పించి వేరే ఏ లక్షణాలు లేవు. మాఫామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేసి కరోనా కాదని తేల్చారు. అయినప్పటికీ పిల్లలని ఆవిడ రూమ్ లోకివెళ్ళకుండా చూడటం ఓ పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఆవిడని చుస్తే ఒడిలిన తోటకూరకాడలా వేళ్ళాడి పోతున్నారు. ఏదో ఒక టిఫిన్ పెట్టేయమ్మా, అన్నం తినను అన్నారు ఆవిడనీరసంగా. అది విని నాకు నీరసం వచ్చింది
మళ్ళీ ఇప్పుడు టిఫిన్ వెయ్యాలా బాబోయ్ అనుకుని ఆవిడకి ఇడ్లీ, మిగతా వాళ్ళకి భోజనాలుపెట్టేసి లంచ్ సెక్షన్ ఈ పూటకి సక్సెస్ఫుల్ గా అయిందని గాలి పీల్చుకున్నాను.
మా వారు కాసేపు పిల్లలని చూస్తానని హామీ ఇవ్వడంతో మెయిల్స్ చెక్ చేసుకుందామనికూర్చున్నా, "సో మెనీ మిస్స్డ్ కాల్స్ అండ్ సో మెనీ మెయిల్స్". భయపడుతూనే నా కలీగ్ కి (నాక్లాసుమేట్ కూడా అది) కాల్ చేశాను. ఏమైపోయావే పొద్దుటి నుండి !!! ఎన్ని కాల్స్, మెయిల్స్చేశామో చూసుకున్నావా అసలు. నీ కోడ్ లో ఇష్యూస్ ఉన్నాయని డీబగ్ చేసి ఫిక్స్ చేస్తావని కంటిన్యూయస్ గా కాల్స్ చేస్తున్నాము.
బాస్ నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. క్లయింట్ ఆయన మీద ఫైర్అయిపోతున్నాడట మరి. వెంటనే కాల్ చేసి ఏదైనా పెద్ద రీజన్ చెప్పకపోతే నీ పొజిషన్ డౌటేఅనిపిస్తోంది నాకు అంది. పై ప్రాణాలు పైనే పోయాయి నాకు. ఈ గడ్డు పరిస్థితుల్లో నా జాబ్కూడా పొతే మళ్ళీ దొరకడం కష్టం. ఈయన ఆల్రెడీ బెంచ్ మీదున్నారు అని టెన్షన్ పడుతూ బాస్కి కాల్ చేశాను. మా బాస్ ఫోన్ లిఫ్ట్ చేసేలోగానే డోర్ బయట దబ దబామని చప్పుళ్ళు. ఈ లోపేఅమ్మా!!!! అని ఓ ఆర్తనాదం. ఎవరికి ఏమైందో అనే భయంతో ఫోన్ కట్ చేసి రూమ్ లోంచిబయటకు పరుగెట్టా. W.W.F. ఫైట్స్ అయిపోతున్నాయి మా ఉద్ధండులిద్దరి మధ్య. ఏ ఒక్కరూతక్కువ కాకుండా కుస్తీ పడుతున్నారు. పిచ్చి కోపంతో ఇద్దరినీ ఓ నాలుగు పీకాను. ఈయనొచ్చి నామీద అరుపులు. పిల్లలని కొట్టడమేంటి... కంట్రోల్ చెయ్యడం రాకపోతే సరి అని. ప్రొద్దుటి నుంచిఉన్న వర్క్ స్ట్రెస్, జాబ్ టెన్షన్ అన్ని వెరసి.... మా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్. పిల్లలు భయపడిసైలెంట్ అయిపోయారు.
ఈ లోపే మా మావ గారు ఖంగారుగా వచ్చి..ఉష్ .. ఉష్....... అరవమోకండి, మీ అత్తగారికి ఇప్పుడేనిద్ర పట్టింది, డిస్టర్బ్ అవుతారని అన్నారు. ఇదేం విడ్డూరమో నా కర్ధం కాలేదు. రాత్రి పగలూనిద్ర పోతూనేఉంటారు, ఆవిడకి నిద్రా భంగం అవడమేంటో తెలీలేదు మా ఇద్దరికీ.
మెయిల్స్ కూడా సరిగా చూడటం అవలేదు, సాయంత్రం అయిపొయింది. పిల్లలు ఆకలని ఒకటేగొడవ, పెద్దవాళ్ళకి టీ, పకోడీ గట్రా టైం....... రెడీమేడ్ స్నాక్స్ పెద్ద లిస్ట్ చదివా......... ఎక్కీ...... అనిమొహాలు పెట్టారు పిల్లలు. చేసేదేముంది అని ఫ్రెంచ్ ఫ్రైస్ డీప్ ఫ్రై చేస్తుంటే నూనె కాగిన వాసనకిహా... ఎంత మంచి స్మెల్ అనుకుంటూ ఈయన వచ్చి అదే చేత్తో రెండు పకోడీలు కూడా వెయ్యిసుధా ప్లీజ్ ఎలాగూ నూనె కాగే ఉందిగా అన్నారు. అంత జాలిగా అడిగితే కాదనేదేముందిచెప్పండి. అసలే జాబ్ ఉంటుందో, ఊడుతుందో అనే టెంషన్లో సెనగపిండి బదులుగా అలాగేఉన్న మైజ్ ఫ్లోర్ తో బజ్జీలు వేసేసాను. లబో దిబో అంటూనే ఒక్కటి కూడా మిగలకుండాలాగించేశారు.
మా బాస్ కి ఫోన్ చేసి సారీ చెప్పి ఫోన్లోనే కాళ్ళా వెళ్ళా పడ్డంత పని చేస్తే కాస్త కూల్ అయి ఇదే లాస్ట్వార్నింగ్ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఇవండీ..... "వర్క్ ఫ్రొం హోమ్" మహిళ కష్టాలు. ఇంట్లో ఉన్నఅందరూ కో ఆపరేట్ చెయ్యకపోతే ఈ ఒక్క ప్రాణి వల్ల ఏమవుతుంది చెప్పండి!!
రాత్రి పన్నెండు అయింది పడుకునేటప్పటికి. ఈయన సుధా!! సుధా!! అని పిలుస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఏదో కొత్త సినిమా చాలా బాగుందట, నాతొ కలిసి చూద్దామని ఆయన కోరిక. ఇంకోసారిసుధా...అని పిలిచారంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి లాప్ టాప్ వెలుగు పడకుండాఅటు తిరిగి పడుకున్నా.
మర్నాడు ప్రొద్దున్నే కెవ్వుమని నేను వేసిన కేకకి ఇంట్లో
అందరూ హడలి పోయారు ఏమైపోయిందా అని. లాక్ డౌన్ ఎత్తేశారు, ఎవరి విధులకు వాళ్ళువెళ్ళవచ్చు అని న్యూస్. కరోనా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందని, అయినా ఒక ఆరు నెలల పాటుమాస్క్స్, హ్యాండ్ వాష్ అన్ని జాగ్రత్తలు కంటిన్యూ చేయాలని, మళ్ళీ మనం దాని బారినపడకుండా ఉండాలంటే అని న్యూస్ సారాంశం.
టైం కన్నా ముందే ఆఫీస్ కి వెళ్లిపోయానంటే నమ్మండి!! నేనే మహా రాణిని నా డెస్క్ కి. వేడి వేడికాఫీ పక్కన పెట్టుకొని ఒక్కొక్క సిప్పు కొడుతూ వర్క్ చేసుకుంటుంటే ఉంది మజా!!! ఆ... హా.."వితౌట్ ఎనీ డిస్టర్బన్స్" అది ఎక్స్పీరియన్స్ చెయ్యాలే కానీ చెప్పడం కష్టం అండీ. నాకుఆఫీస్ విలువ తెలిసి వచ్చిందీ రోజు.
మేమందరం లంచ్ చేస్తుంటే మా బాస్ వచ్చి "వీక్లీ ఒన్స్ నీ వర్క్ ఫ్రొం హోమ్ రిక్వెస్ట్ ఓకే చేశానుసుధా!! అంటే బాబోయ్..😳😳...వర్క్ ఫ్రమ్ హోమా!! వద్దు సార్..... వద్దు.... అని గట్టిగాఅరచినంత పని చేస్తే అందరూ పక పకా నవ్వేశారు.