కర్మాను సారే! - వారణాసి భానుమూర్తి రావు

as our destiny
నా కప్పటికి పదేళ్లు. మా ఇంట్లో నేనే పెద్దోణ్ణి . మా నాయన కున్న రెండు ఎకరాల భూమిని సేద్యం చేసే వాడు. అమ్మ ఇంట్లో పేడకల్లు వేసే గాణ్ణుంచి , పాలు పితికి, మజ్జిగ కవ్వంతో చిలికి , వెన్న తీసి, రాగి సంగటి ముద్దలు , పచ్చిపులుసు సేసి, రాత్రి పశువుల్ని గాట్లో కట్టేంత వరకు నిద్ర పోదు . ఒంటి చేత్తో అన్ని పనులు మా యమ్మే చేసేది.
మా యమ్మ పేరు చౌడమ్మ. అలుపు సొలుపూ లేనే లేదు ఆయమ్మకి . మా నాయన సేద్యము పనులు కోసం బయటకు పొతే , ఇల్లంతా ఒంటి చే త్తో చక్రం తిప్పుతుంది మా యమ్మ.
మా నాయన పొద్దున్నే నాలుగు గంటలకే లేసి , కపిల తోలడానికి ఎద్దల్ని కట్టుకొని, బాయి కాడికి పోతాడు. పొద్దు గూకే దాక మడి లోనే ఉంటాడు. కాలువలు కట్టి పంటకు నీళ్లు తోలేది , పురుగు పుట్రా , సీడా తగలకుండా మందులు కొట్టేది మా నాయన పని.
పది గంటలకే మా యమ్మ సంగటి ముద్దలు చేసుకొని, పుల్లగూరో, వూరిమిండో చేసుకొని గంపలో పెట్టుకొని పోతుంది మడి కాడికి. మా నాయనకు మోదుగాకులోనో, అరిటాకులోనో, మర్రాకు లోనో ఇస్తరాకులు చేసి అన్నము పెడుతుంది మా యమ్మ.
మా రెండెకరాల భూమి అంటే మా నాయనకు ఎంతో ప్రాణం. అద్దెకరంలో కూరగాయలు పండిస్తాడు. మిగతా భూమి అంతా వరి పంటకే వాడతాము. ప్రతి బుధ వారం కలకడ సంతలో కూరగాయలు అమ్మి దుడ్లు తెచ్చి ఇచ్చే వాడు మా నాయన. ఒక్కొక్క సారి కూరగాయలకు బలే గిరాకీ ఉంటాది. అప్పుడు కొన్ని దుడ్లు చేతిలో తిరుగు తాయి. మాకు ఇదే ఆదాయం గదా ! దీనితోనే బతకల్లా . మా నాయన ముకంలో నవ్వు బుధ వారమే కనబడుతుంది. ఎందుకంటే పచ్చ నోట్లు చూస్తే సంతోషం లో జల్సా చేస్తాడు మా నాయన . ఒక యాభై రూపాయలకు కల్లో , సారాయి తాగేసి , మిగిలిన దుడ్లు అన్నీ మా యమ్మ సేతిలో పెడతాడు మా నాయన.
నా కిద్దరు తమ్ముళ్లు , ఒక్క చెల్లెలు. ఆరు మంది మేము ఈ ఆదాయంతోనే బతకల్లా . అమ్మ నెయ్యి అమ్ముతా ఉంటాది . పాలు అమ్ముతామంటే మా నాయన ఒప్పుకోడు. . లేగ దూడల నోటి కాడ పాలు అమ్మితే మనకి శని తగులుతుందని అయన బయ్యం.
నా కప్పుడప్పుడే జ్ఞానం వస్తా ఉండాది. ఇంట్లో పరిస్థితులు అన్ని అర్థం అవతా ఉండాయి.
'' ఒరేయ్ ఎంకట్రామనా ! ఎల్లాగయినా నిన్ను మహలు హైస్కూల్లో సదివిస్తా ! నువ్వు మంచి ఉద్యోగంలో సేరి నీ తమ్ముళ్లను , సెల్లెల్ని బాగా సదివించల్ల రా ! '' అన్నాడు మా నాయన ఒక్క రోజు నన్ను దగ్గరకి పిలిసి కూర్చో బెట్టి. ఆ రోజు సేద్యంలో ఉండే కష్ట నష్టాల గురించి గూడా సెప్పినాడు . అప్పుడు నాకు ఎట్లాగయినా బాగా సదువుకోవల్లని , మా అమ్మ , నాయన్ని , తమ్ముళ్లు, సెల్లెల్ని బాగా చూసు కొవల్ల అని అనుకొన్నాను.
'' నువ్వు కల్లు , సారాయి తాగేది మానేస్తే , నేనింకా బాగా సదువు కొంటా నాయనా ! నీ వొళ్ళు గూడా సెడి పోతుంది గదా ! ఆ దుడ్లు ఉంటే నాకు, తమ్ముళ్లకు స్కూలు ఫీజులకు సరి పోతుంది గదా ! ' అని అన్నాను నేను .
ఏమనుకొన్నాడో ఏమో , మా నాయన మళ్ళి తాగనే లేదు. తాగుడు మానేసి ఇంట్లోనే సక్కగా పను లన్ని చేసు కొంటున్నాడు . దుబారా కర్సులన్నీ చెయ్యకుండా దుడ్లన్నీ మిగిలించి నాడు మా నాయన.
అందుకే మా నాయనంటే మాకు చానా గౌరవం పెరిగింది.
మా అమ్మ ఒక రోజు నన్ను పిలిచి , '' ఒరేయ్ రమణ .. రోజు పచ్చిపులుసు చేసి మీ నాయన దగ్గర తిట్టించి కొంటున్నాను. సింత చెట్టెక్కి సింత సిగురు కోసుకొని వస్తావా నాయనా ? '' అని అడిగింది.
నాకు చెట్లు ఎక్కే అలవాటు బాగా ఉంది. ఏ చెట్టయినా బర బర మని పాకతా ఉంటే కోతులు గూడా బలాదూరే నా ముందు. ఎంత పెద్ద చెట్టయినా భయం లేకుండా ఎక్కుతాను . చింత చెట్టు మా దొడ్లోనే ఉంది . సింత కాయలు ఇరగ బడి కాస్తుంది. ఈ సారి గూడా సింత సిగురు బాగా పట్టింది. పచ్చగా కళ కళ లాడతా ఉంది సెట్టు . నెత్తికి రుమాలు చుట్టుకొని , మేడలో ఒక బ్యాగు ను ఏసుకొని చెట్టు ఎక్కి చిగురు తిత్తి నిండుకు కోసి అమ్మకు ఇచ్చినాను. అమ్మకు ఎంత సంతోషమైందో ! సింత సిగురు , కంది పప్పు ఏసి పుల్ల గూర చేస్తే ఎంత రుచిగా ఉంటుందో!
రాగి సంగటితో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పుల్ల పుల్ల గా అట్లే గొంతు లోంచి దిగి పోతుంది.
ఎండాకాలం సెలవులు అయిపోయినాక , హైస్కూల్ తెరిచి నారు. మా నాయన ఆరవ తరగతిలో మహల్ హైస్కూ ల్లో చేర్పించి నాడు. మా పల్లెకు నాలుగు మైళ్ళు దూరం ఉంది. రోజు నడుచు కొంటూ పొయి రావల్ల. పొద్దున్నే మా అమ్మ కారియర్ కట్టిస్తే , అక్కడనే తిని సాయంత్రం ఇంటికి నడుచు కొంటూ రావల్ల. మా జోడి పిల్లల్తో కుసాలుగా నవ్వుకొంటూ పోతాము మేము స్కూలుకు .
అలా నాలుగేళ్లు గడిచాయి.
నేను తొమ్మిదో తరగతికి వచ్చినాను. మా తమ్ముళ్లు , చెల్లెలు గూడా మా స్కూల్లోనే చదువుతున్నారు. నా భాష , శైలి గూడా మారింది . తెలుగంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకు మంచి మార్కులు వస్తున్నాయి. మా తెలుగు టీచర్ నాకు దగ్గరుండి మరి అన్నీ నేర్పి స్తున్నారు . తెలుగులోనే కాకుండా , మిగతా సబ్జక్ట్స్ లో గూడా నేను క్లాసులో ఫస్ట్ వస్తున్నా .అందుకే మా టీచర్లకు , మా హెడ్ మాస్టర్ కి నేనంటే చాలా ఇష్టం . నాకు బిఎ , ఎం ఏ చదివి తెలుగు టీచర్ లేదా లెక్చరర్ కమ్మని మా తెలుగు టీచర్ చెప్పిన కాడ్నుంచీ , తెలుగు ఎం ఏ చదవాలని భలే కోరికగా ఉండేది .
మా నాయన , అమ్మ దేవుని దయ వల్ల కష్ట పడి సేద్యం లో కొన్ని డబ్బులు సంపాయిస్తు , ఒక పూట తిని తినకో , పస్తులుండి , మమ్మల్ని బాగా చదివిస్తా ఉన్నారు. మాకు ఏ లోటు రానీయకుండా చూసు కొంటున్నారు.
ఎండా కాలం సెలవులు వచ్చాయి. అందరం ఇంటిలోనే ఆడుకొంటూ ఉన్నాము. మా గాట్లో పశువులు కుమ్ముకొంటు , ఖుషీగా చొప్ప , వరి గడ్డి మేస్తున్నాయి. వాటి గంటల శబ్దం ఎదో పాటకు తాళం లా వినబడతా ఉంది మాకు.
అమ్మ నన్ను పిలిచి , '' ఒరేయ్ . . .ఎంకట్రమణ ! రాగి సంగటి సేస్తా గానీ , సింతాకు కోసుకుని వస్తావా ? '' అని ఒక బాగు చేతికి ఇచ్చింది.
నాకు సంతోషం పట్టలేక పోయింది. ఎందుకంటే మా నాయన ఆ రోజు మంచి పులుసు చేపల్ని కొనుక్కొని వచ్చాడు. చింత చిగురు , చేపల పులుసు , రాగి సంగటి , నెయ్యి , గడ్డ పెరుగు .. అది ఆ రోజు మాకు విందు . నోట్లో నీళ్లు ఊరుతుంటే గబా గబా అని చెట్టు ఎక్కి , పైకి వెళ్లి కొమ్మ చివర్లో నిలబడి చింతాకు చిగురు కోస్తున్నాను. అంతే ! నన్ను ఎవ్వరో బలంగా క్రిందకు తోసి నట్లయ్యింది. చెట్టు కొమ్మ నా బలానికి విరిగి పోయింది. నేను ఒక్క సారిగా ' అమ్మా ' అని అరచి ఇరవై అడుగుల పై నుండి క్రిందకు పడి పొయ్యాను. నా తల మీద బాగా గాయం అయ్యినట్లు , రక్తం కారు తున్నట్లు అనిపిస్తా ఉన్నది. కాళ్ళ ఎముకలు విరిగినట్లు ఒకటే నొప్పి. అంటే ఏమయ్యిందో..ఏమో నాకు .. నేను అపస్మారక స్థితిలోకి జారు కొన్నాను. స్పృహ లేని నేను నేల మీద బోల్తా పడినట్లున్నది.
ఒక్క గంట తరువాత , నాకు తెలివి వచ్చేసరికి , అమ్మ , తమ్ముళ్లు , చెల్లెలు అంతా ఒక్కటే ఏడుపు. నేను హాల్లో పరుపు మీద పడుకోబెట్టినారు. మా నాయన నన్ను గట్టిగ హత్తుకొని ,'' ఎట్లా ఉంది నాయనా ? '' అన్నాడు.
నా కాలుకు పెద్ద కట్టు కట్టినారు . నా తల మీద గాయానికి గూడా ఏ దో పసరు పూసి తలకు గుడ్డ కట్టినారు.
'' రక్తం ఆగి పోయింది. ప్రాణానికి భయం లేదు. పీలేరు ఎముకల డాక్టర్ దగ్గరికి తీసుకోని పోదాము. లేదంటే పుత్తూరు కి తీసుకెళ్లి కట్టు కట్టిద్దాము '' అన్నాడు మా మామ .
''ఎట్లా ఉంది నాయనా ? నొప్పి ఉందా ? '' మా అమ్మ ఒక్కటే ఏడుపు.
'' నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఎముకలు విరిగి పోయినా యోమో ? అని అన్నాను నేను ఏడుస్తూ .
ఊర్లో వాళ్ళందరూ పుత్తూరికి పోయి కట్టు కట్టించు కొని రమ్మన్నారు. నేను , మా అమ్మ నాన్న , మా మామ రాత్రికి రాత్రే పీలేరు నుండి పుత్తూరికి పొయ్యే బస్సు ఎక్కినాము. బస్సు కుదుపులతో నొప్పి ఇంకా ఎక్కువవుతా ఉంది.
పుత్తూరు డాక్టర్లు పరీక్షలు చేసి రెండు కాళ్ళ ఎముకలు బాగా దెబ్బ తిన్నాయి అన్నాడు . ఏవో నూనెలు, పసుర్లు పూసి కట్టు కట్టి వారం రోజుల తర్వాత డిస్చార్జి చేసినారు.
ఇంటికి వచ్చిన తరువాత రెండు నెలలు రెస్ట్ తీసుకొన్నాను. అయినా కాళ్ళు సరిగా నడవడానికి రాలేదు. ఎముకలు సరిగ్గా అతుక్కోలేదు. నా కాళ్ళు ముందు మాదిరి నడవడానికి రావడం లేదు.
అమ్మ, నాన్న నా అవస్థ చూసి ఏడవని రోజు లేదు.
వాళ్ళు పీనుగుల్లా తయారయ్యారు. పెద్ద ఆసుపత్రిలకి పోవాలంటే అన్ని డబ్బుల్లేవు మాకు. వాళ్లకు నేనే ధైర్యం చెప్పినాను.
పుత్తూరులో ఒక్క క్రచర్స్ కొనుక్కొన్నాము. దానిని చంకల్లో పెట్టుకొని నడవడానికి ప్రయత్నిస్తున్నాను. స్వంతంగా నడవడానికి కాళ్ళు రావడం లేదు.
చదువు మానేస్తాను అన్నాను గాని మా నాయన ఒప్పుకోలేదు. ఎలాగైనా పదవ తరగతి పాస్ కావాలన్నాడు. ఒక సైకల్ కొని దాని మీద నన్ను రోజు స్కూల్లో దింపి , మళ్ళి సాయంకాలం నన్ను ఇంటికి పిలుచు కొని వచ్చే వాడు మా నాయన . ఆయన ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో అని అనిపిస్తుంది నాకు.
మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ వీరభద్రం గారు నా అవస్థకు చాలా బాధ పడినాడు.
'' క్లాసులో క్లాసులో అందరి కన్నా తెలివిగా ఉండే వాడివి . నువ్వు తెలివైన వాడివి రమణ .నువ్వు భయ పడ వద్దు. నేను మదన పల్లి కాలేజీ లో ఇంటర్మీడియట్ కోర్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను '' అని అన్నాడు మా సారు.
ఆయన మా నాయనకు అన్ని సలహా లిచ్చి మదనపల్లి కాలేజీలో చేర్పించి నాడు. మా స్కూల్ టీచర్లు అందరు ఆర్థికంగా సహాయం చేసి నన్ను కాలేజీలో చదవడానికి ఏర్పాట్లు చేసినారు.
మా హెడ్ మాస్టర్ గారు నాకు మూడు చ క్రాలతో నడిపే ఒక సైకల్ని కొనిచ్చినాడు. ప్రయివేట్ రూము తీసుకోని వంట చేసుకుని కాలేజీకి వెళ్లే వాడిని.
మా ఫ్రెండ్స్ నను చూసి ' కుంటోడా ' అని నవ్వి అపహాస్యం చేసే వారు. నేను జన్మతః కుంటి వాడిని గాదు గదా! నాకు గ్రహ చారం బాగా లేక కుంటి వాడిని అయ్యాను. లేకుంటే అందరి లాగా నా కాళ్ళు గూడా బాగా ఉండేవి.
వికలాంగుల కోటాలో ప్రభత్వం వారు నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. బి ఏ తెలుగులో మొదటి శ్రేణి లో పాస్ అయ్యాను. నా ఆనందానికి అంతే లేదు. మా వా ళ్ళంతా నన్ను అభినందించడానికి మదన పల్లిలో నేనున్న చోటికి వచ్చినారు. ఇక ఎం ఏ చదువుతానన్నాను. తిరుపతికి పోయి చదవల్ల అంటే డబ్బులు శ్యానా కావల్ల. మా నాయన అరెకరం పొలం అమ్మేస్తా అన్నాడు. చేసేదేమి లేక ఉన్న అరెకరా పొలం అమ్మి , మా నాయన తిరుపతి యూనివర్సిటీ కాలేజీలో ఎం. ఏ తెలుగు లో చేర్పించాడు.
ఆ రెండేళ్లు ఎలాగో ఒక లాగు కష్టపడి చదివి నాను . అక్కడున్న లెక్చరర్లు కూడా నా సానుభూతితో నాకు సహాయం చేసే వాళ్ళు . ఎం . ఏ ఫస్టు క్లాసు లో పాస్ అయినా నాకు తెలుగు లెక్చరర్ ఉద్యోగం రాలేదు. ఎం ఫిల్ ఉన్నవాళ్లకు ప్రిఫెరెన్సు ఇచ్చారు. అయినా సరే వికలాంగుల కోటా క్రింద నాకు గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. అదే పదివేలు అని అనుకొన్నాను .
ఉద్యోగం వచ్చిన రోజు మా అమ్మ, మా నాయన తిరుపతికి వచ్చి నన్ను చూసి ఆనంద పడి పోయినారు.నేను వాళ్ళ పాదాలకు నమస్కరించి వారి దీవెనలు తీసుకొన్నాను. ఎప్పటికయినా తల్లి తండ్రుల దీవెనలే గొప్ప. వారు ఆశీర్వదిస్తే మన కింక ఏ కష్టాలు రావని నమ్మే వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి.
నేను ఎం ఏ చదివి పాసయినా , నా భాష , యాసలో మార్పు రాలేదు. ఎందుకంటే నాకు మా సీమ భాష అంటే చాలా ఇష్టం. మా అమ్మ ,నాయనతో, మా ఊరోళ్ళతో నేను మా చిత్తూరు జిల్లా యాసలోనే మాట్లాడుతాను.
'' నీ కట్టం తీరిపోయింది నాయనా ! నేను ఇంకా అందర్నీ చూసు కొంటాను. నువ్వేమి దిగులు పడ మాక! నేనింక అందర్నీ చూసు కొంటాను. '' అని అన్నాను మా నాయనతో.
ఉద్యోగంలో చేరిన నెల తర్వాత వచ్చిన నా జీతాన్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది . మా అమ్మ నాతోనే ఉండి నాక్కావలసిన వన్నీ చేసి పెట్టి నన్ను ఆఫీసుకు పంపేది. మొట్ట మొదటి నెల జీతం మా అమ్మ , మా నాయన చేతిలో పెట్టినాను. వాళ్ళ కళ్ళల్లో ఆనంద భాష్పాలు జల జల మని రాలాయి.
ఆ తరువాత మా తమ్ముళ్లను, చెల్లల్ని చదివించి నాను . వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత గూడా నా పైననే ఉంది.
ఒక రోజు మా అమ్మ నా చెయ్యి పట్టుకొని , '' నాయనా .. ఎంకట రమణ .. నీకు ముప్పై రెండేళ్ల వయసు వచ్చింది. పెళ్లి చేసుకో నాయనా ! పిల్లోళ్లను వృద్ధి లోకి తీసుకొచ్చినావు. ఇక నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. మేమెంత కాలం బతుకు తామో తెలీదు. '' అని కళ్ళ నీళ్లు పెట్టుకోంది .
'' ఈ కుంటోడికి పిల్ల నెవ్వరు ఇస్తారమ్మా ? అన్నాను నేను.
అందుకు మా అమ్మ భోరున ఏడ్చింది.
'' ముద నష్టపు దాన్ని నేను. ఆ రోజు సింతాకు కోసం సెట్టు ఎక్కమని నేనే సెప్పినాను. నా కొడుకు జీవితం చేజేతులారా నాశనం చేసుకొన్నాను. '' అని నా తల నిమురుతూ ఏడుస్తా ఉండాది.
''అమ్మా! మన సేతుల్లో ఏమీ లేదు . అంతా కర్మానుసారం జరగతా ఉంటాది. దేవుడు నా కాళ్ళు తీసుకొన్నాడు గానీ , చేతులు , కళ్ళు ఇచ్చాడు గదా ! తెలివి , జ్ఞానం ఇచ్చాడు గదా ! అందుకు సంతోషంగా ఉండల్ల మనం. దేవుడు నాకు చదువు ఇచ్చినాడు. . మంచి ఉద్యోగం గూడా ఇచ్చినాడు గదా ! ఇంకేం కావాలా చెప్పు నాకు .'' అన్నాను నేను.
'' అయినా సంబంధాలు వెతుకు తాము నాయనా ! మనకు మంచి పిల్లే దొరుకుతుంది. పెళ్లి చేసుకొని నువ్వు హాయిగా ఉండల్ల'' అంది మా అమ్మ.
నాలుగైదు సంబంధాలు వెతికినా అమ్మాయిలు నన్ను ఒప్పుకోలేదు. అవిటి వాడని కొందరు, ఆస్తి లేదని కొందరు, భాద్యతలు తీసుకోలేమని కొందరు నన్ను తిరస్కరించారు. నాకు పెళ్లి అంటే విరక్తి కలిగింది. తరువాత నేను పెళ్ళికి ససేమిరా ఒప్పుకోలేదు. బ్రహ్మ చారిగానే ఉండి పోదామను కొన్నాను. ఎందుకంటే నా అవిటి తనాన్ని చూసి ఏ పిల్ల ఒప్పుకొంటుంది?
తమ్ముళ్లకు, చెల్లెలికి మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేసాను. ఈ మధ్య కాలంలో మా నాయన నా మీద దిగులుతో కాలం చేసినాడు. అయినా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాను.
ఆత్మ స్థైర్యంతో జీవన నౌకను ముందుకు నడిపిస్తా ఉన్నాను నేను. నా జీవితంలో ఎన్నో ఒడు దొడుకులు , ఎన్నో ఆటుపోట్లు . అది ప్రారభ్ద కర్మ , ఇంకే కర్మో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకరికి సహాయం చెయ్యడం వరకే ! ఈ మధ్య పది మంది పేద పిల్లలకు చదువు కోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నాను. ఇంకా నా కొచ్చే జీతంలో ఒక వృద్ధా శ్రమం గూడా పెట్టాలని అనుకొంటున్నాను.
వికలాంగుడినని నేనెప్పుడూ బాధ పడ లేదు.
నా అవిటి తనం నా శరీరానికే గానీ , నా మనస్సు కు గాదు గదా !

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు