బుజ్జిగాడు - అఖిలాశ

bujjigadu

ఏరా సుబ్బన్న చదువు అయిపోయి సంవత్సరం అయితాంది ఇంకా ఉద్యోగం రాలేదే? మీ అమ్మ నాయన చానా కష్టపడి చదివించి నారు ఉద్యోగం చేసి వాళ్లని పోషించాలా?

హ అక్క అదే పనిలో ఉండా బడి నుండి బుజ్జిగాడు ఇంకా రాలేదా?

ఇంకా పది నిముషాలు ఉంది ఇదో ఈ బోకులు కడిగేసి పోవాలని ఉండా అన్నది బుజ్జిగాడి అమ్మ రేణుక.

సరేలే అక్క నేను పోయి తీసుకొచ్చా అట్టనే వచ్చా వచ్చా బుజ్జిగాడిని గుడికి తీసుకుపోయి వచ్చాలే.

ఆ పని చేసిపెట్టు సుబ్బన్న నీకు పుణ్యం ఉంటాది.

***

సుబ్బన్న మిట్ట మీద ఉన్న వివేకానంద ఇస్కూల్ దగ్గరికి వెళ్లి బుజ్జి గాని ఎప్పుడు వచ్చాడా అని చూస్తాన్నాడు.

ఈలోపే బుజ్జి గాడు ఎగురుకుంటూ ఇస్కూల్ నుండి బయటకి వచ్చాడు. ప్రతి రోజు అమ్మ తన కోసం ఎదురుచూసే స్థలంలో సుబ్బన్న ఉండటం చూసి ఒక్కసారిగా మెత్తబడిపోయినాడు.

మాయమ్మ రాలేదా? నువ్వు ఎందుకు వచ్చావు? నేను నీతో రానని మొండికి వేశాడు.

అమ్మ ఇంటికాడ ఉందిలేరా పద పోదాం అంటూ సంకలో ఉన్న ఇస్కూల్ బ్యాగు తీసుకొని బుజ్జిగాడిని ఎత్తుకున్నాడు.

ఇదో నీకోసం చాక్లెటు తెచ్చిన ఇది తిను మనం గుడికి పోయి దేవుడిని మొక్కు కుందాము అన్నాడు సుబ్బన్న.

పో…నేను…,దేవుని కాడికి రానని ఏడవడం మొదలు పెట్టాడు.

సుబ్బన్న బుజ్జిగాడికి నచ్చ చెప్పి ఇంకొన్ని చాక్లెట్లు అంగట్లో ఇప్పించి ఇంటికి దగ్గరలో ఉండే శివాలయం గుడికి తీసుకుపోయినాడు.

అది అతి పురాతనమైన శివాలయం మనుషులు ఎక్కువగా రారు.., గుడి పక్కనే కొండ ఉండటం చేత నిర్మానుషంగా ఉంటుంది. సుబ్బన్న శివాలయం గుడిలో ఉన్న నవ గ్రహాల వైపు బుజ్జిగాడిని తీసుకుపోయినాడు. అక్కడైతే ఎవరూ రారు సుబ్బన్న అనుకున్న పని అక్కడ మాత్రమే చేయడానికి వీలు కుదురుతుంది.

నవగ్రహల వైపు వెళ్ళగానే బుజ్జిగాడి నోట మాట రాలేదు. సుబ్బన్న అనుకున్న ప్రకారం బుజ్జిగాడి నిక్కరు విప్పేసి ఏదేదో చేయడం మొదలు పెట్టాడు. బుజ్జిగాడు కేకలు వేస్తాడెమోనని నోటికి చేయి అడ్డుపెట్టి తన పశు వాంఛను తీర్చుకున్నాడు.

***

ఇంటికి వచ్చిన బుజ్జిగాడు ఒకటే వాంతులు చేసుకున్నాడు. ఏమైందిరా నీకు ఎప్పుడూ వాంతులు చేసుకుంటూ ఉంటావు. పోయినా వారమే కదా డాక్టరు కాడికి పిలుచుకుపోయినా మళ్లా ఎందుకు ఇలా అయితాంది.

ఈసారి పెద్ద డాక్టరు కాడికి తీసుకుపోవాలా ఆ ఆర్. ఎం. పి నూర్ గాడు సరిగా చూడటం లేదు అంటూ బుజిగాడికి వాంమోటారు తాపింది రేణుక. రాత్రి అయ్యేసరికి చిన్నగా జ్వరం కూడా కాసింది.

బుజ్జిగాడి నాయన ఇటికల పనికి పోయి ఇంటికి రావడం రావడంతోనే ఒరేయ్ బుజ్జి యాడుండావు ఇదో నీకోసం చికెన్ పకోడా తెచ్చిన అని బుజ్జిగాడిని వెతికినాడు.

వాడు పడుకున్నాడు సాయంత్రం నుండి ఒకటే వాంతులు జ్వరం కూడా కాసింది టానిక్ తాపి పడుకోపెట్టినాను. రేపు పొద్దున్నే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతాను నెల నుండి వారానికి ఒకసారి వాంతులు చేసుకుంటున్నాడు అన్నది రేణుక.

అవునా అంటూ పడుకున్న బుజ్జిగాడి తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకొని నేను కూడా రేపు పనికి పోనులే ఇద్దరం కలిసి పోదాం అన్నాడు ప్రసాద్.

భోజనం చేస్తూ నేను ముందే చెప్పినానా నాల్గవ తరగతికే ఆ పెద్ద పెద్ద ఇస్కూల్ లల్లో వద్దు వాళ్ళు పిల్లోలను సతాయిస్తారని. వద్దంటే వినకపోతివి. వాళ్ళు ఏం సతాయిస్తున్నారో ఏమో అంటూ గొణిగాడు.

సరే సరేలే వారిని పానం బాకాలేకపోతే ఇస్కూల్ వాళ్ళు ఏమి చేసినారని? అనవసరంగా ఏదంటే అది మాట్లాడొద్దు. చిన్న ఇస్కూల్ లల్లో చదువుకుంటే వాడు కూడా నీలాగే ఇటికల పనికి పోవాల్సిందే. మన బతుకులు ఎలాగో బాగుపడవు కనీసం వాడినైన పెద్ద ఇస్కూల్ లల్లో చదివించే బాగుపడతాడు.

రేణుక చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించిన ప్రసాద్ ఎదురు మాట్లాడలేదు.

***

పొద్దున్నే రేణుక, ప్రసాద్ ఇద్దరూ కలిసి బుజ్జిగాడిని పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయినారు. చిన్న పిల్లల డాక్టరు నరసయ్య బుజ్జిగాడికి ఆరోగ్య సమస్య లేదని దేని గురించో బాధపడుతున్నాడని కనుక్కున్నాడు. బుజ్జిగాడిని ఇస్కూల్ గురించి, స్నేహితుల గురించి, వీధిలో ఆడుకునే పిల్లోల గురించి ఇలా అందరి గురించి మెల్లగా అడుగుతూ బుజ్జిగాడి సమస్య తెలుసుకున్నాడు.

నరసయ్య ప్రసాద్ తో సుబ్బన్న అంటే ఎవరని అడిగాడు? ఏమైంది సారు? వాడు మా ఇంటి కాడ ఉంటాడు అన్నాడు. చూడు నువ్వు వెంటనే పోయి పోలీసు స్టేషన్ లో వాడిపై కేసు పెట్టాలా? వాడు బుజ్జిగాడిని శారీరకంగా హింసిస్తున్నాడు. ఇది ఆరు నెలల నుండి జరుగుతోంది. చిన్న పిల్లోడు పాపం చెప్పుకోలేక పోయాడు. తల్లిదండ్రులు పిల్లోన్ని సరిగా కనిపెట్టుకోవాలా గదా అసలే రోజులు బాగా లేవని మందలింపుగా అన్నాడు.

ఇషయం అర్థమయినా ప్రసాద్ వెంటనే పోలీసు స్టేషన్ కి పోయి సుబ్బన్న పై కేసు నమోదు చేశాడు. పోలీసులు సుబ్బన్నను అరెస్ట్ చేసి జైల్లో నూకినారు.

***

రేణుక బుజ్జిగాడిని ఒక్క క్షణం కూడా విడచకుండా చూసుకుంటోంది. మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి వాడికి అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు ముందులాగా బుజ్జిగాడి కళ్ళల్లో భయం గాని బెణుకు గాని లేవు చక్కగా చదువుకుంటున్నాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు