చాప కింద నీరు - ఎం బిందుమాధవి

water under mat

అలవాటుగా ....ఉదయం కాఫీ తాగుతూనే గబ గబా పేపర్ లో...విహంగ వీక్షణంగా ఆరోజు విశేషాలని తిరగేస్తున్నాడు....ముకుంద రావు. లేచి స్నానం చేసి వెంటనే బయలుదేరితేకానీ, ఫ్యాక్టరీ బస్ అందుకోలేడు.

ఇంతలో కొడుకు రవి వచ్చి ..."నాన్నా ...నాయనమ్మ వాంతి చేసుకుందిట. జ్వరం కొంచెం ఎక్కువగా ఉన్నది..నిన్నోసారి చూడమన్నది అమ్మ" అని చెప్పి స్కూల్ కి తయారవ్వటానికి వెళ్ళిపోయాడు.

*************

ముకుంద రావు ఒక ఫ్యాక్టరీలో చిరుద్యోగి.

ఇరవై కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆఫీస్ కి ..రోజూ బస్సులో కొంత దూరం వెళ్ళి..అక్కడి నించి కంపెనీ వారి వ్యాన్ లో వెళతాడు.

ఆ రోజు తల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్ళి..వచ్చి బయలుదేరేసరికి ఆలశ్యమైందని ఆఫీస్ కి స్కూటర్ మీద వెళ్ళాడు.

" అమ్మ ఎలాఉందో..మధ్యాహ్నం ఏమైనా తిన్నదో..లేదో? డాక్టర్ గారి మందుతో ఈ పాటికి జ్వరం కొంచెం తగ్గు ముఖం పట్టి ఉండాలి! కానీ ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ వస్తే... భార్య కుసుమ ఒక్కతే హాస్పిటల్ కి తీసుకెళ్ళగలదా" అని సాయంత్రం ఇంటికి వస్తూ ఆలోచిస్తూ అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్నాడు ...ముకుంద రావు.

తన ముందు ఉన్న ట్రక్ ని దగ్గరకెళ్ళేవరకు గమనించలేదు.

హార్న్ విని హఠాత్తుగా ఇహ లోకంలోకి వచ్చి సడెన్ బ్రేక్ వేశాడు. లిప్తపాటు కాలం లో జరిగిన ఈ హఠాత్పరిణామానికి అదుపుతప్పి వెనక వచ్చే బస్ ముందు టైర్ కింద పడ్డాడు. తొడమీదనించి బస్ టైర్ వెళ్ళింది.

చూసిన వాళ్ళు వెంటనే హాస్పిటల్లో చేర్చి..అతని ఐడి కార్డ్ ఆధారంతో ...ఫ్యాక్టరీ లో సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఆ ఫ్యాక్టరీ సంక్షేమ అధికారి..త్రివిక్రం హాస్పిటల్ కి వెళ్ళి ముకుందరావుని చూసి.."ఇన్స్యూరెన్స్ వచ్చే ఏర్పాటు చేస్తాలే! బెంగ పెట్టుకోకు..మీ ఇంటికి కబురు పంపాను. ధైర్యంగా ఉండు" అని చెప్పి ...ప్రాణాపాయం లేదులే అనుకున్నాడు మనసులో!

***********

ముకుంద రావుకి కొడుకు రవి తరువాత ఆరేళ్ళకి కూతురు పుట్టింది. పేరు అపర్ణ.
కూతురంటే అమిత ప్రేమ ముకుందరావుకి!

ఉద్యోగం చిన్నది కాబట్టి..జీతమూ తక్కువే! అయినా వచ్చే ఆదాయంలో కుటుంబ పోషణ చేసుకుంటూ...భేషజాలకి పోని పొదుపరి. ఫీజులుండవని.. పిల్లల్ని దగ్గరే ఉన్న సర్కార్ పాఠశాలలో చదివిస్తున్నాడు.

భార్య కుసుమ చదువుకుని సంపాదించక పోయినా... "గొంతెమ్మ కోరికలు" కోరకుండా భర్త సంపాదనతో గుట్టుగా సంసారం నిర్వహించుకునే సగటు ఇల్లాలు. ఇంటి నాలుగు గోడలు దాటి బయటికెళ్ళే అలవాటు లేని వ్యక్తి.

ముకుందరావు తన తెలివితేటలతో..పిల్లల చిన్న తనంలోనే తడవకి కొంత చొప్పున డబ్బు వెనకేసి ... అది పెద్ద మొత్తమయ్యాక..తన ఫ్యాక్టరీలో వర్కర్లకి వడ్డీకి అప్పులిస్తూ ఉండేవాడు.

ముకుందరావు వర్కర్లతో చేసే వడ్డీ వ్యాపారం గురించి ఆ ఫ్యాక్టరీ సంక్షేమాధికారి త్రివిక్రం కి తెలుసు!

మనుషులన్నాక అనేక అవసరాలు...అసహాయతలు!

అందువల్ల వర్కర్లకి..సహోద్యోగులకి ముకుందరావు దగ్గర చేబదులు తీసుకోకుండా గడిచేది కాదు. అప్పుడప్పుడు వడ్డీ సరిగా ఇవ్వలేని వాళ్ళ దగ్గర చక్రవడ్డీ కూడా వసూలు చేసేవాడు.

అయినా సమయానికి వెంటనే డబ్బు సమకూడటం అనేది మధ్య తరగతి జీవికి వరమే!

అలా ప్రతి నెలా జీతంతో పాటు..అంతో ఇంతో పై సంపాదనగా వడ్డీ డబ్బు చేతికందేది.

*********

ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నంభోజనాలయ్యాక తీరుబడిగా భార్యతో కబుర్లు చెబుతూ. . "అపర్ణ పెద్దదౌతున్నది. పండగనో..పుట్టినరోజనో ..అప్పుడప్పుడు కొంత బంగారం కొంటూ ఉంటే పెళ్ళినాటికి భారం తగ్గుతుంది" అన్నాడు.

"బంగారం కొనటం అంటే మనబోటి మధ్య తరగతి వారికి మాటలా?" అన్నది కుసుమ.

అనుకోవటం ఏమిటి కార్యాచరణలోకి దిగాడు!

ఆ రోజు ఆఫీస్ నించి వస్తూనే కుసుమతో.."త్వరగా బయలుదేరు. బజారుకెళ్ళొద్దాం. అపర్ణకి బంగారం కొందామనుకున్నాం కదా! ఇవ్వాళ్ళ కొంత డబ్బు చేతికొచ్చింది" అన్నాడు.

"మొన్న మీరు బంగారం కొందామన్నప్పుడే అడుగుదామనుకున్నాను..ఇప్పుడంత డబ్బెకడిదీ అని? మొన్న మీ చెల్లెలి గృహప్రవేశానికి వెళ్ళిరావటానికి చార్జీలు... పెట్టిన కట్నాల కోసం డబ్బు ఖర్చయింది కూడాను!" అన్నది కుసుమ

ముకుందరావు తన తెలివితేటలతో డబ్బు వెనకెయ్యటం..అది ఫ్యాక్టరీలో వడ్డీలకి తిప్పటం గురించి చెప్పాడు.

కుసుమకి అంతవరకే తెలుసు. వడ్డీలకి తిప్పే డబ్బు ఎంతో..ఎవరెవరికి ఇచ్చాడో.. ఎన్నాళ్ళకి ఇచ్చాడో..వాళ్ళెప్పుడు తిరిగిస్తారో..ఆ వివరాలు అతను చెప్పనూ లేదు .. కుసుమ అడగనూ లేదు!

**********

ముకుంద రావుకి యాక్సిడెంట్ అయిన మరునాడు....ఆఫీస్ కి బయలుదేరే ముందు బ్రేక్ ఫాస్ట్ కి కూర్చున్న త్రివిక్రం ముఖంలో .. మాటలో కంగారు.. గమనించి భార్య శ్యామల.."ఏమయిందండీ" అని అడిగింది.

"మా ఆఫీస్ లో ముకుందరావు తెలుసు కదా నీకు.. అతనికి నిన్న యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ కివెళ్ళి అక్కడి లాంఛనాలన్నీ చూసి వచ్చినందుకే నిన్న రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆలశ్యమయింది.
ప్రాణ ప్రమాదమేమీ లేదనుకున్నాం.
అతను మా ఫ్యాక్టరీ లో చాలా మందికి వడ్డీకి డబ్బిస్తూ ఉంటాడు.
దానికి సంబంధించిన వివరాలు కొన్ని మాత్రం నాకు తెలుసు."

"తనకి రావలసిన బాకీల గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదు.
ఈ అవకాశం తీసుకుని వాళ్ళు డబ్బు ఎగ్గొట్టేస్తారేమోనని నిన్న హాస్పిటల్లో ఉన్నంత సేపు నాతో అదే మాట్లాడాడు.
కొంచెం కోలుకున్నాక అందరి దగ్గర ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకోవచ్చు.
కొంత మంది దగ్గర ఈ వైద్యం పేరు చెప్పి వసూలు చేసుకోవచ్చు..అని నిన్న ధైర్యం చెప్పి వచ్చాను."

"మనిషి సంకట పరిస్థితిలోకి నెట్టివేయపడ్డప్పుడు...ఏం ఆలోచిస్తాడు...ఎలా స్పందిస్తాడు అనేది మన ఊహకి అందకపోవచ్చు. కానీ..మెలకువలోను..సుషుప్తిలోను కూడా అదే ఆవరించి ఉంటుంది కాబోలు!"

"దాని గురించే ఆలోచిస్తున్న అతను ...బాగా బెంగ పడ్డట్టున్నాడు! హార్ట్ ఎటాక్ వచ్చి ఈ ఉదయం చనిపోయాడుట. వెళ్ళి కంపెనీ లాంఛనాలు పూర్తి చెయ్యాలి" అని చెప్పి త్రివిక్రం హడావుడిగా వెళ్ళిపోయాడు.

*********

ముకుంద రావు పోయి అప్పటికి ఇరవై రోజులయింది.

పెద్ద కొడుకు చనిపోయేసరికి..ఆ కుటుంబానికి భారం కాలేక ముకుందరావు తల్లి చిన్న కొడుకింటికి వెళ్ళిపోయింది.

తమ తోటి ఉద్యోగి ..అప్పటి దాకా ఆరోగ్యంగా తమ కళ్ళ ముందు తిరుగుతూ..అకాలంగా చనిపోతే..ఆ సహోద్యోగులకి షాక్ తగలటం సహజమే! అయ్యో పాపం..అతని కుటుంబానికి సహాయం చేద్దాం అనుకోవటమూ సహజమే!

ఆ ఉద్దేశ్యంతోనే ..ఆ ఫ్యాక్టరీలో వర్కర్ల వర్గానికి సూపర్ వైజర్ అయిన భిక్షపతి ...మిగిలిన వర్కర్స్..స్టాఫ్ తో కలిసి ముకుందరావు భార్య కుసుమని పలకరించి...తన సానుభూతిని తెలియజేద్దామని వెళ్ళాడు.

"మా నించి ఏమైనా సహాయం కావాలంటే నిస్సంకోచంగా అడుగమ్మా! ఒక చోట పని చేసేవాళ్ళం! ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ఎలా?" అన్నాడు.

దెబ్బ తగిలిన రోజు ఉన్న నొప్పి..బాధ మరునాటికి కొంత తగ్గి ( అది దెబ్బ తగిలిన వారికైనా...పక్క వారికైనా) క్రమేణా అది మరుగున పడి...మనిషిలోపలి మనిషి బయటికి వస్తాడు.

అవతలి వ్యక్తి పట్ల తమకి కలిగిన సానుభూతి, నిజాయితీగా...నిస్వార్ధంగా సహాయం చెయ్యాలన్న తలంపు అలాగే ఉంటుంది అనుకోలేం. అవతలి వారి నిస్సహాయత వీరిని స్వార్ధానికి పురికొల్పటంలో ఆశ్చర్యం లేదు!

**********

కుసుమకొచ్చిన కష్టసమయంలో నేనున్నానని తోడవ్వగలిగిన అక్క చెల్లెళ్ళు లేరు. ఉన్న తల్లి.... చదువు సంధ్యలు లేని అమాయకురాలు. సలహాలిచ్చి ఆసరా అవ్వగలిగిన మనసెరిగిన స్నేహితులూ లేరు.

ఒకరోజు పొద్దున్నే కుసుమ కొడుకు రవిని త్రివిక్రం వాళ్ళింటికి పంపింది.

"అంకుల్...మిమ్మల్ని ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళమని మా అమ్మ చెప్పిరమ్మన్నదండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంటికొచ్చిన త్రివిక్రం తో కుసుమ ..

"నిన్న మీ ఆఫీస్ నించి ఎవరో భిక్షపతి అనే అతను వచ్చాడండి. మా వారు చనిపోయిన రోజు కూడా వచ్చాడుట. నాకు అంత గుర్తు లేదు. మా వారు ఫ్యాక్టరీ లో వర్కర్స్ కి ఇచ్చిన అప్పుల మొత్తం వివరాలు తనకి తెలుసునని, నేను సహకరిస్తే... ఒక్క పైసా నష్ట పోకుండా తను వసూలు చేసి పెడతానని..అన్యాపదేశంగా మాట్లాడండి."

"ముందు నుయ్యి..వెనక గొయ్యి" లాగా ఉన్నదండి! నాకేంచెయ్యలో తెలియట్లేదు. అప్పుడెప్పుడో మా వారు..తను ఇచ్చిన అప్పులగురించి మీకు తెలుసని మాటల్లో చెప్పారు. పిల్లలా చిన్న వాళ్ళు. నేనేం చదువుకోలేదు. ఎవర్ని నమ్మాలో..ఎవరిని అనుమానించాలో తెలియట్లేదండి!..అందుకని మీ సహాయం కోసం పిల్లాణ్ణి పంపించానని" భోరుమన్నది.

తన చేతనైనంతవరకు... హోదా..అధికారం ఉపయోగించి ...త్రివిక్రం కొంత డబ్బు వసూలు చేయించి పెట్టాడు.

ఉద్యోగ రీత్యా వేరే ఊరు వెళ్ళిపోయిన త్రివిక్రం కి వారితో రాకపోకలు తగ్గి విషయం మరుగున పడింది.

********

అడపా దడపా పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు ..కుసుమ ఒంటరిగా ఉన్నప్పుడు.. భిక్షపతి ముకుంద రావు ఇంటికి వెళ్ళేవాడు. యోగ క్షేమాలు విచారిస్తున్నట్లు..సానుభూతిగా మాట్లాడుతూ..పిల్లలకోసం బిస్కెట్లు..పండ్లు తీసుకెళ్ళేవాడు.

ఇంకా రావలసిన బాకీలూన్నాయనీ...అవి వసూలు చేసి పెడతాననీ ..ఏ విధమైన ఆదాయం లేని ఆవిడకి ఆ డబ్బు అవసరమని నమ్మకం కలిగేట్లు మాట్లాడేవాడు. అసలే ఒంటరి ఆడది. ఏం చెయ్యగలదు పాపం!

*********

కాలం పెట్టే పరీక్షలకి తట్టుకుని నిలబడటం మహా మహా వారికే కష్టం! కాలానికి ఎవ్వరూ అతీతులు కారు! అలాంటిది భర్త చాటున గుంభనంగా ..ప్రశాంతంగా బ్రతికిన కుసుమ జీవితంలో ...కాలమనే పెను తుఫాను సృష్టించిన అలజడి అంతా ఇంతాకాదు!

ఆర్ధిక అవసరాలు..మానవ సంబంధాలని శాసించటం మొదలుపెడితే..జీవిత నావ ఎటు ప్రయాణిస్తుందో మళ్ళీ ఆ కాలమే నిర్ణయించాలి.

********

చాప కింద నీరులాగా చేరిన భిక్షపతి కుసుమ నిస్సహాయతని అవకాశంగా వాడుకోవటం మొదలుపెట్టాడు.

పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నారు.
ఇంకా వారితో రాకపోకలు సాగిస్తే ఖర్చులు తను భరించాల్సి వస్తుందని ...భిక్షపతి నెమ్మదిగా వారింటికి రావటం తగ్గించాడు.

********

మధ్య తరగతి వేతన జీవులకి వారి బ్రతుకే వారికి బరువు.
అలాంటిది పక్కవారికి కష్టం వస్తే తీర్చగలిగిన సమర్ధత కానీ..ఆసరా అవ్వగలిగిన ఆర్ధిక స్తోమత కానీ ...సలహా ఇవ్వగలిగిన పరిణతి కానీ ..అసలు వారి గురించి ఆలోచించగలిగిన తీరుబడి కానీ వారి జీవితాలు వారికివ్వవు.

కానీ అవతలి వారి జీవితంలో ఉండే చీకటి కోణాలని గమనించటానికి..వారిని విమర్శలతో కుళ్ళబొడవటానికి బోలెడంత కాలం వారి చేతిలో ఉంటుంది!

"ఆడదానికి ఆడదే శతృవు" అన్నట్లు చుట్టుపక్కల ఇల్లాళ్ళు.. కుసుమ జీవితం..వారి ఖర్చులు అవసరాలు..ఎలా గడుస్తున్నయో చాటుమాటుగా ఆరాలు తియ్యటం మొదలుపెట్టారు. బుగ్గలు నొక్కుకోవటం మొదలుపెట్టారు.

ఇంక అక్కడ ఉండటం వల్ల వారి మాటల ప్రభావం పిల్లల మీద పడుతుందని...ఆ పరిసరాలకి దూరంగా బ్రతకాలని నిర్ణయించుకున్నది కుసుమ.

"ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా..ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా నష్టం ఆకుకే" నని తన భర్త కట్టించిన స్వంత ఇంటిని అద్దెకిచ్చి దగ్గరలో ఉన్న బస్తీకి మారింది

ముర్కులు..జంతికలు....స్వీట్స్ ఇంకా కొన్ని రకాల తినుబండారాలు చేసి చుట్టుపక్కల వారికి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేది.

టైలరింగ్ నేర్చుకుని...చుట్టుపక్కల ఉన్న పెద్ద టైలర్ల దగ్గర బట్టలు తెచ్చుకుని..జాబ్ వర్క్ చెయ్యటం మొదలుపెట్టింది.

*********

పదేళ్ళ కాలం గడిచింది.

త్రివిక్రం రిటైర్ అయ్యాక....కుటుంబం తిరిగి ఆ ఊరు వచ్చింది. వీరుండే ఇంటికి దగ్గరగా ఉండే బస్తీలోనే కుసుమ ఉంటున్నది.

త్రివిక్రం తల్లిదండ్రులు వీరితోనే ఉంటున్నారు. త్రివిక్రం పిల్లలు పెళ్ళీడుకొచ్చారు. ఆ పనుల్లో శ్యామల పగలంతా బిజీ గా ఉండేది. పనుల నిమిత్తం బయటికి వెళితే ....పెద్ద వాళ్ళకి తోడుగా ఉన్నట్టుంటుంది..వంటలో సహాయంగా ఉంటుంది అని వంట మనిషి కోసం చుట్టుపక్కల వాకబు చేస్తే..తెలిసిన వాళ్ళు కుసుమని తీసుకొచ్చి పరిచయం చేశారు.

ముకుందరావు కుటుంబ సభ్యుల గురించి పెద్దగా తెలియని శ్యామల...కుసుమ వ్యక్తిగత వివరాలు అడిగింది.

వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా...త్రివిక్రం బయటినించి వచ్చాడు. కుసుమని చూస్తూనే గుర్తు పట్టి..."ఏమ్మా..ఎలా ఉన్నారు? పిల్లలు కులాసానా? రవి ఏం చేస్తున్నాడు?"అని అడిగాడు.

"మీరు ఈ ఊరు వదిలి వెళ్ళాక....భిక్షపతి తన నిస్సహాయతని ఆసరాగా తీసుకుని నమ్మకంగా మాట్లాడుతూ నన్ను లోబరుచుకున్నాడు సర్.
చుట్టుపక్కలవారి చూపులు.. మాటలు భరించలేక
స్వంత ఇల్లు అద్దెకిచ్చి ...దగ్గర బస్తీలో చిన్న ఇంట్లో అద్దెకుంటున్నానని" చెప్పింది.

"వంటలు చేసుకు బ్రతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నానండి.
రవి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ..మా అమ్మాయి టెంత్ క్లాస్ లో ఉన్నదని" చెప్పింది.

అంతా విని త్రివిక్రం బాధపడి...
"అంతేనమ్మా..కుటుంబ పెద్ద మరణిస్తే...మరో ఆధారం లేని వారి కుటుంబం పరిస్థితి...కుక్కలు చింపిన విస్తరి లాగా మారుతుంది."
"పోనీలెండి..రవి చేతికందొస్తున్నాడు. వాడి చదువైపోతే నన్ను కలవమనండి. ఎక్కడో ఒక చోట ఉద్యోగంలో పెడతాను. వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు తోడౌతాయి. పిల్ల పెళ్ళి చేసి ఒడ్డున పడతారు" అని ఓదార్చాడు.

********

అలా తెలిసిన వారి అండ దొరికిందని ..
నెల నెలా స్థిరమైన ఆదాయం వచ్చే మార్గం దొరికిందని..
కష్టం సుఖం విచారించే మనుషుల తోడు దొరికిందని సంతోషపడింది కుసుమ.

కూతురు పెద్దదయింది..డిగ్రీ వరకు చదివిస్తే.... కాలం ఎలాంటి పరీక్షలు పెట్టినా తన లాగా మరొకరి మోసానికి బలవ్వకుండా బ్రతకగలుగుతుంది అనుకుంది.

**********

కానీ కుసుమ కి కాలం పరీక్ష పెట్టటం అంతటితో ఆగలేదు.

ముకుందరావు దూరపు బంధువుల అబ్బాయి..కుమార్.. రవి ఈడువాడే...ఈ మధ్య తరచు వారింటికి రాకపోకలు సాగించటం మొదలుపెట్టాడు.

ఒకనాడు కుసుమ త్రివిక్రం వాళ్ళింటికి వంట పని కోసం బయలుదేరుతుంటే కుమార్ వచ్చాడు. "నేను అటే వెళుతున్నాను అత్తయ్యా..నిన్ను దింపి వెళతాను రమ్మని" కుసుమని స్కూటర్ మీద తీసుకెళ్ళాడు.

వాకిట్లో స్కూటర్ దిగిన కుసుమని..బాల్కనీ లోనించి చూసిన శ్యామల " ఏమండీ ఎవరా అబ్బాయ్? మీ రవి లాగా లేడే?" అని అడిగింది.

"మా దూరపు బంధువుల అబ్బాయండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు" అన్నది.

"జాగ్రత్తండి..మీ అమ్మాయి ఎదుగుతున్నది.
తెలిసీ తెలియని వయసు! ఏ వస్తువులో కొనిపెట్టి..ఇచ్చకాల కబుర్లు చెప్పి.. ఆ వయసులో వాళ్ళని ఆకర్షిస్తారు!
మీరు ఇంట్లో లేని సమయం చూసి రాకపోకలు సాగిస్తారు.
ఏ దురుద్దేశ్యాలు లేకుండా ఈ కాలంలో ఎవరూ ఎవరి ఇళ్ళకి రారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు...ఆ విషయం మీకు నేను చెప్పక్కరలేదు" అని పెద్దరికంతో హెచ్చరించింది.

శ్యామల హెచ్చరించిన తరువాత పిల్లలతో ముఖ్యంగా..కూతురు అపర్ణతో...మామూలుగా మాట్లాడుతూనే మంచీ..చెడు చర్చిస్తూ ఉండేది, కుసుమ.
"జీవితం సినిమాల్లో చూపించినట్లు అందమైన కల కాదమ్మా!
"తెల్లనివన్నీ పాలు-నల్లనివన్నీ నీళ్ళు" అని నమ్మకూడదు.
"మనుషులు పైకి కనిపించినంత మంచివాళ్ళు కారు"..
"అవకాశం దొరికేవరకు మంచివాళ్ళుగా మసలుకుంటారు"
" జాగ్రత్తగా మసలుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయమ్మా" అని చెప్పింది.

"కంప్యూటర్ క్లాసుల్లో మగపిల్లలు అక్కడా..ఇక్కడా చేతులు వేస్తూ వెకిలి చూపులు..మాటలతో అతి చనువు తీసుకుంటారు..జాగ్రత్త" అని చెప్పింది.

అప్పటికప్పుడు అమ్మ చెప్పేది అర్ధం కాకపోయినా...అపర్ణ కొత్తవారిపట్ల జాగ్రత్తపడటం నేర్చుకున్నది. అమ్మ ఇంట్లో లేనప్పుడు వచ్చే కుమార్ ని రావద్దని అన్నయ్యతో చెప్పించింది.

*********

రవి డిగ్రీ పూర్తి చేశాక...త్రివిక్రం ఇప్పించిన ఉద్యోగంలో చేరాడు. ఇంకా ఆ బస్తీలో ఉంటే..చెల్లికి సరైన సంబంధాలు రావని..తమ స్వంత ఇంటికి మారిపోయారు.

తండ్రి పోయినప్పటి నించీ తమని పెంచి పెద్ద చెయ్యటానికి అమ్మ పడ్డ అవస్థలు..చుట్టూ మనుషులు తమ స్వార్ధానికి ఆవిడ నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకోవటం...అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు రీల్ లాగా తిరుగుతుంటే.. తను పెళ్ళి చేసుకుని ఇకనైనా అమ్మకి విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు రవి.

అనుకూలమైన వరుడిని తెచ్చి ముందు చెల్లికి పెళ్ళి చేశాడు. త్రివిక్రం గారికి తెలిసిన వారమ్మాయిని పెళ్ళి చేసుకుని.."అమ్మా ఇప్పటిదాకా నువ్వు కష్టపడింది చాలు..విశ్రాంతి తీసుకో. ఏమి తోచకపోతే... అప్పుడప్పుడు త్రివిక్రం అంకుల్ వాళ్ళింటికి వెళ్ళి ఆ ఆంటీతో కబుర్లు చెప్పి వస్తూ ఉండు" అన్నాడు.

ప్రయోజకుడైన కొడుకుని కంటి నిండా చూసుకుని...కుసుమ తను అప్పటివరకు పడ్డ కష్టాలు..అవమానాలు మరో ఆడదానికి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుని...అలా చెయ్యమని భగవంతుడిని వేడుకోవటానికి పూజ గదిలోకి వెళ్ళింది.

ఎం బిందుమాధవి

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు