కొత్త పరిమళం - నన్ద త్రినాధరావు

New perfume

అది నాలుగు రోడ్లు కలిసే జంక్షన్. ఒకవైపు వేణుగోపాలస్వామి గుడి, మరోవైపు భారీ షాపింగ్ మాల్స్, ఇంకోవైపు పెద్ద మార్కెట్, మరో పక్కగా ఆఫీసులు కాలేజీలతో ఆ ప్రాంతమంతా చాలా రద్దీగా ఉంటుంది.

బస్ స్టాపులన్నీ జనాలతో కిక్కిరిసి ఉంటాయి. అదే తనకు చాలా అనువైన ప్రదేశంగా భావిస్తాడు యాదగిరి. అక్కడే అడుక్కోవడం మొదలు పెడతాడు. చాలా హృదయ విదారకంగా అతడు అడుక్కునే తీరుకు అతని చేతులు పైసలతో నిండుతాయి. సాయంత్రం వరకు అడుక్కున్న డబ్బులతో జీవనం సాగిస్తుంటాడు అతడు.

యాదగిరి నా అనేవాళ్ళు లేని ఒక అనాధ. చిన్నప్పుడే తల్లిదండ్రులను, పెద్దయ్యాక భార్యని పోగొట్టుకున్న దురదృష్ట వంతుడు. కాళ్ళూ, చేతులు బాగానే ఉన్నాకష్టపడి పనిచేయలేని దుస్థితి అతనిది. కొంచెం సేపు నడిచినా, చిన్న పనిచేసినా విపరీతమైన ఆయాసంతో బాధపడే వ్యాధి గ్రస్తుడు. అంతుచిక్కని రోగం నయం చేసుకోలేని నిరుపేద. అభాగ్యుడు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో బెగ్గర్ గా మారాడు. బస్ స్టాపుల్లో మాత్రమే అడుక్కుంటాడు.

రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. రోజూ ఉదయం తొమ్మిదిగంటల కల్లా అతడు బస్టాపులో నిల్చుంటాడు తనకు కావల్సిన బస్ కోసం ఎదురుచూస్తూ.

సరిగ్గా అదే సమయానికి యాదగిరి కూడా అదే బస్ స్టాపులో అడుక్కోవడం మొదలు పెడతాడు. ప్రయాణికులంతా చిరపరిచితుడైన యాదగిరికి జాలి, దయతో తో తమకు తోచిన ధర్మం చేస్తుంటారు.

ఒక్క రమేష్ తప్ప!

రమేష్ కి అడుక్కునేవాళ్ళంటే అసహ్యం. పరమ చిరాకు. వాళ్ళని చూస్తూనే ముఖం చిట్లించుకుంటాడు. వాళ్ళకి ఒక్క పైసా కూడా ధర్మం చేయకపోగా “బ్లడీ బెగ్గర్స్” అని తిడుతూ ఉంటాడు. మనదేశంలో బిచ్చగాళ్లకి లోటు లేదనీ, అందరూ వాళ్లకు ధర్మం చేసి వాళ్ళని సోమరిపోతుల్లా తయారు చేస్తున్నారనీ లెక్చర్స్ పీకుతుంటాడు.

యాదగిరికి రమేష్ ని చూస్తే భయం. ఒకటి రెండు సార్లు అతడ్ని ధర్మం అడిగి తిట్లు తిన్నాడు. అందుకే ఎప్పుడూ రమేష్ పక్కనున్న వాళ్ళని అడుగుతాడే తప్పా, రమేష్ని అడగడు.

యాదగిరి జీవితం గుడ్డిలో మెల్లగా సాగిపోతున్న తరుణంలో, దురదృష్టం అతడ్ని కరోనా రూపంలో వెంటాడింది. జనాలు ఎక్కువుగా తిరగకపోవటం వలన పైసలకి కట కట అయ్యింది. రోజు గడవడం కష్టం అయ్యింది. తిండి తిని రెండ్రోజులయ్యింది. ఈ కరోనా వచ్చి తనలాంటి వాళ్ళెందరికో పొట్ట కొట్టింది అని బాధ పడ్డాడు యాదగిరి.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా ఇండియాలో కూడా ప్రవేశించింది. అప్పటికే పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవసాగాయి. ఆ నగరంలో లో హాస్పిటల్స్ అన్నీ కరోనా వ్యాధి గ్రస్తులతో నిండి పోయాయి. దేశంలో ప్రబలుతున్న మందు లేని కరోనా వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం ముందుగా ఒక్క రోజు లాక్ డౌన్ చేయాలనుకుంది.

ఆ రోజుకి ముందు రోజు…

అప్పటికి లాక్ డౌన్ లేని రోజు…

ప్రజలంతా ఇళ్లకే పరిమితమై పోయారు. ఎక్కడా చూసినా కరోనా గురించే వార్తలు. కబుర్లు. ఎవ్వరిని చూసినా ముఖానికి మాస్క్ లు, జేబు రుమాళ్ళు కట్టుకుని కనిపిస్తున్నారు. నగర ప్రజలంతా పరిశుభ్రతే కరోనాకి మందు అని తెలుసుకొని సబ్బులు, శానిటైజేషన్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లల్లోనే ఉంటున్నారు.

ప్రభుత్వం ప్రజల్ని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్పా ఎవరినీ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దనీ, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగొద్దనీ, కరోనా ఒక అంటు వ్యాధనీ, ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాప్తి చెందుతుందనీ, దీనికి మందు లేదనీ, సామాజిక దూరం పాటించడమే మందనీ అందరూ జాగ్రత్త గా ఇళ్లల్లోనే ఉండాలనీ హెచ్చరికలు జారీ చేసింది. కానీ కొంతమంది ఆ మాటల్ని పెడచెవిన పెట్టారు.

అలాంటి పరిస్థితుల్లో…

ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ తగిలించుకొని కాయగూరలు, పచారీ సామాన్లు కొనడానికి బయటికి వచ్చాడు. గబ గబా అవన్నీ కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్లే దారిలో ఒక్క సారిగా కుప్ప కూలి రోడ్ పై పడిపోయాడు. అది చూసి రోడ్ పై వెళ్లే వాళ్ళు, దగ్గరలో బస్ స్టాప్ లో ఉన్నవాళ్ళు ఎవరూ అతని వద్దకు వెళ్ళలేదు.

కరోనా లేని సమయంలో అయితే ఎవరో ఒకరు వెళ్లి అతనికి సాయపడే వారే. కానీ కరోనా భయంతో అది అంటువ్యాధని, అతడు కరోనా వ్యాధితో పడి పోయాడని, అతని దగ్గరకు వెళితే అది తమకు కూడా అంటుకుంటుందని భయపడి అలాగే పడిపోయిన అతడ్ని వింతగా చూస్తున్నారే తప్పా ఎవరూ ముందుకు వెళ్ళటం లేదు.

మరి కొంతమంది ఉత్సాహవంతులు అత్యుత్సాహంతో తమ మొబైల్స్ తో ఆ దృశ్యం ఫోటోలు, వీడియోలు తీసి అప్పుడే సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేసేస్తున్నారు లైక్ ల కోసం, షేర్ ల కోసం.

ఒక మనిషిని కాపాడ్డంలో ఉన్న సంతృప్తి, సంతోషం కంటే లైక్ లు, షేర్ లు ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్నే ఎక్కువుగా అనుభవిస్తున్నారు నేటి జనం.

సరిగ్గా అదే సమయానికి అక్కడే బిచ్చమెత్తుతున్న యాదగిరి ఆ దృశ్యం చూసి వెంటనే అక్కడకి పరిగెత్తుకు వెళ్ళాడు. అతడు ఎంత మాత్రం ఆలోచించ లేదు. పడిపోయిన ఆ వ్యక్తిని ముట్టుకుంటే తనకు కరోనా వస్తుందని గానీ, తనకేదో ప్రమాదం అవుతుందని గానీ యాదగిరి ఆలోచించలేదు. అతని మనసులో ఒకే ఒక ఆలోచన. అది అతడ్ని ఎలాగైనా కాపాడాలని! అతడి ముఖం చూసాడు యాదగిరి. ఆశ్చర్యపోయాడు.

అతడు రమేష్!

ఎప్పుడూ తనకు భిక్షం వేయకపోగా తనని ఎన్నో సార్లు ఛీ కొట్టి, తిట్లు తిట్టిన రమేష్!!

ఇప్పుడు నిస్సహాయంగా రోడ్ పై పడిపోయి ఉన్నాడు.

యాదగిరి అవన్నీ ఆలోచించలేదు. రమేష్ ప్రాణాపాయంలో ఉన్నాడు. అతడ్ని ఎలాగైనా రక్షించి కాపాడాలి. ఎలా? అక్కడున్న కొంత మందిని అర్ధించాడు తనకు సహాయం చేయమని. కానీ ఎవరూ ముందుకు రాలేదు సరి కదా భయంతో దూరంగా పారిపోయారు.

ఇక ఎవరూ తనకు సహాయం చేయరని తెలిసి ఏం చేయాలో ఆలోచించాడు యాదగిరి. అతని బుర్ర చురుగ్గా పనిచేసింది. వెంటనే పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్ నుండి 108 కి ఫోన్ చేసి విషయం చెప్పి తానున్న అడ్రస్ కూడా చెప్పాడు.

అసలే కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న సమయం. క్షణాల్లో 108 అంబులెన్సు వచ్చింది. రమేష్ని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. అతనితో పాటూ యాదగిరి కూడా హాస్పిటల్ కి వెళ్ళాడు.

క్షణాల్లో పరీక్షలు చేసిన డాక్టర్లు అతడు కరోనా తో పడిపోలేదనీ, గుండె నొప్పితో పడిపోయాడనీ తేల్చారు. వెంటనే వైద్యం మొదలుపెట్టారు. ఇంతలో రమేష్ భార్యా పిల్లలు, బంధువులు హాస్పిటల్ కి చేరుకున్నారు.

సమయానికి హాస్పిటల్ కి తీసుకొచ్చారు కాబట్టి అతడు బ్రతికాడు. కొంచెం ఆలస్యం అయినా అతని ప్రాణాలకే ప్రమాదం జరిగేది అని చెప్పారు డాక్టర్లు యాదగిరితో. అందరూ ఆ మాట విన్నారు. యాదగిరిని దేవుడిలా చూసారు.

స్పృహలో కొచ్చిన రమేష్ ముందుగా తన కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసాడు. తర్వాత చివరగా నిల్చున్న యాదగిరిని చూసాడు. గుర్తుపట్టాడు. అతడే తన ప్రాణదాత అని తెలుసుకున్నాడు. అతని పట్ల తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుతో తల దించుకున్నాడు.

తనెంత గా అసహ్యించుకున్నా, తిట్టినా యాదగిరి అవి ఏవీ అతని మనసులో పెట్టుకోలేదు. తనకు కరోనా అనుకొని తనని చూసి అందరూ భయపడి పారిపోయినా, యాదగిరి మాత్రం మానవత్వంతో తనని రక్షించి కాపాడాడు.

మనుషుల్లో ఉత్తములుంటారని తను కథల్లో చదివాడు. సినిమాల్లో చూసాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అలాంటి ఉత్తముడుకి తానేమి ఇవ్వగలడు? తను ఎన్ని జన్మలెత్తినా అతని ఋణం తీర్చుకోలేడు.

తన కన్నీళ్లతో అతని పాదాలను అభిషేకించాలని ఉంది.

రమేష్ కళ్ళు అశ్రుధారల్ని కురిపిస్తూనే ఉన్నాయి.

మరిన్ని కథలు

Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా