అది పోచారమనే ఒక గ్రామం. అందులో అచ్చుల మల్లన్న అనే ఒక అమాయకుడు నివసిస్తున్నాడు.
మల్లన్న అనాథ దానికి తోడు చదువు సంధ్యా లేనివాడు కూడా. మల్లన్న మాట్లాడినప్పుడు
ప్రతి వాక్యానికి చివర ‘మీ దయవల్ల’ అని చేరుస్తుంటాడు. అది వాడి ఊతపదమైంది.
ఆ ఊరి మునసబు, బసవయ్య బాగా ధనవంతుడు. తానేపని చేసినా ఎప్పుడూ అందరూ ‘ఆహా ..ఓహో’
అని పొగడాలని తెగ తాపత్రయ పడుతుంటాడు. ఆయనే మల్లన్నని చేరదీసి పెంచి పెద్ద చేసి ఉండడానికి
చిన్నపాక వేసిచ్చాడు. చదువబ్బని మల్లన్న బసవయ్యగారి దగ్గరే పాలేరుగ చేరిపోయాడు. ప్రతి రోజూ
ఉదయాన్నే ఠంచనుగా ఐదింటికల్లా పని మొదలు పెట్టేస్తాడు మల్లన్న.
ఇలా ఉండగా పోచారం గ్రామదేవత జాతర వచ్చింది. ప్రతి ఏడూ అమ్మవారి జాతర ఎంతో ఘనంగా
జరుపుతారు పోచారం గ్రామస్థులు.
ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే జాతర చూడ్డానికి చుట్టుప్రక్కల గ్రామాలనుంచి పెద్ద ఎత్తున జనం వచ్చారు.
ఉన్నవాడైన బసవయ్య, జాతర అవకాశాన్ని పురస్కరించుకుని చుట్టుప్రక్కల గ్రామాలనుండి వచ్చిన
తన తోటి మునసబులకీ మరికొంతమంది పెద్దలకీ ఘనమైన విందు ఏర్పాటు చేసాడు.
ఊళ్ళో జాతర చూసుకుని మునసబులూ తదితర పెద్దలందరూ బసవయ్య ఇంటికి చేరారు .
ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా ఎన్నో రుచికరమైన వంటకాలతో విందు ఏర్పాట్లు జరిగాయి. సుష్టుగా
విందారగించి మందు త్రాగుతు కబుర్లలో పడ్డారందరూ..
ఏ నోట విన్నా బసవయ్య విందు గురించిన కబుర్లే.... అంతబాగుందీ..ఇంత బాగుందీ అంటూ...ఇంతలో
భళ్ళున తెల్లవారింది.
ఐదింటికల్లా యథాప్రకారం పనిలోకొచ్చిన అచ్చుల మల్లన్న పెద్దలందరినీ చూసి దండాలు పెట్టాడు.
ఒకసారి వాడ్ని ఎగాదిగా చూసి ‘ఏరా బాగున్నావా?’ అని కుశలమడిగాడు , మల్లన్నని బాగా ఎరిగున్న, బసవయ్యకి కావలసినవాడు అయిన, పొరుగూరి మునసబు.
‘ఓ మహాసక్కగా ఉన్నానయ్యా మీ దయవల్ల’ అన్నాడు మల్లన్న ముఖం చాటంత చేసుకుని .
‘ఔనొరేయ్ నీకామధ్య పెళ్ళయిందని చెప్పారు మీ అయ్యగారు చాలా సంతోషం రా’ అని అంతటితో ఊరుకోక ‘ఊ అయితే మరి పిల్లలో?’ అని ఆరాతీసాడు
అందంగా సిగ్గుపడుతూ ‘ఆయ్ మా ఇంటిది నీళ్ళోసుకుందండీ మొన్ననే మీ దయవల్ల’ అని అమాయకంగా బదులిచ్చి లోపలికెళ్ళిపోయడు మల్లన్న .
అః...హ...హ..... అంటూ ఆ పరిసరాలన్నీ పెద్ద పెట్టున నవ్వులతో ప్రతిధ్వనించాయి అచ్చుల మల్లన్న మాటలకి. పాపం ఆ మునసబు ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదంటే నమ్మండి!!!!!!
***********************