దేవుడిని చూపించిన మేనమామ - కృష్ణ చైతన్య ధర్మాన

uncle that shown god to girl

తనుశ్రీ అనే పదేళ్ల అమ్మాయి ఒకసారి తన తల్లిని ఇలా అడిగింది, "అమ్మా! ప్రతిరోజు ఆ పటాలకు పూజలు చేసి మొక్కుతావు; నన్ను కూడా మొక్కమని బలవంతం చేస్తావు; ఏమంటే వాటిలో ఉన్నవారు దేవుళ్ళంటావ్, మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంటారంటావ్; ఎప్పుడైనా వారిని స్వయంగా చూసావా?" అని.
"నేను చూడలేదు కానీ..." అంటూ కూతురు అడిగిన క్లిష్టమైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేక ఏమి చెప్పాలో తోచక, "నన్ను పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగి విసిగించకు!" అని ముగించింది తల్లి.
అదే సాయంత్రం తండ్రిని కూడా అదే ప్రశ్న అడిగింది తనుశ్రీ. కానీ ఎటువంటి స్పష్టమైన సమాధానం రాలేదు. రాత్రి భోజనసమయంలో అదే ప్రశ్న నాయనమ్మను అడిగింది. అప్పుడు నాయనమ్మ, "సాధారణమైన మనుషులందరికీ కనిపించేస్తే దేవుడుకి విలువెక్కడుంటుంది?" అని తిరిగి ప్రశ్నించింది.
తనుశ్రీకి అలా ఆలోచిస్తూ ఉంటే పిచ్చెక్కుతుంది. "దేవుడిని ఎవరూ కలవనూలేదు, చూడనూలేదు, మాట్లాడనూలేదు! అలాంటప్పుడు ఎలా నమ్ముతున్నారు? ఇంకెలా పూజలు చేస్తున్నారు?" అని తనలో తాను మాట్లాడుకుంటుంది. "ఏదో దేవుడి వ్రతం అంటారు. ఆ వ్రత కధ చదివితే పాపాలు తొలిగిపోతాయంటారు. అలా అని ఆ వ్రతకధ చదివితే అందులో ఇంకెవరో ఆ వ్రతం చేసి సకల ఐశ్వర్యాలు పొందారని ఉంటుంది. మరి కధ ఎక్కడుంది?" అనుకుంటూ తనుశ్రీకి తల వేడెక్కింది.
ఆ సంక్రాంతి సమయంలో తనుశ్రీ మేనమామ దేవేంద్ర, వారిని పండగ పిలుపుకు వచ్చాడు. తనుశ్రీ అతడిని కూడా దేవుడి సంగతేంటో అడగాలని అనుకుంది. కానీ అమ్మానాన్నలు, నాయనమ్మ చెప్పలేని విషయం ఇతనికి ఏమి తెలుస్తుందనుకుని అడగలేదు. అయితే దేవేంద్రకు తన మేనకోడలు ఏదో సందేహంలో ఉన్నట్టు అనిపించింది.
"నన్నేమైనా అడగాలనుకుంటున్నావా తల్లి?" అని తనుశ్రీకి తన ఒడిలో కూర్చోపెట్టుకుని అడిగాడు.
"ఏమీ లేదు మామయ్య! నాకొక చిన్న సందేహం ఉంది. దానిని ఎవరూ తీర్చడంలేదు," అని బదులిచ్చింది తనుశ్రీ.
"అదేంటో నన్నడుగు. తెలిస్తే చెప్పడానికి ప్రయత్నిస్తా," అన్నాడు దేవేంద్ర.
"నువ్వు దేవుడికి పూజలు చేస్తావా?" అని అడిగింది.
"లేదు!"
"నమ్మకం లేదా?"
"సమయం లేదు!"
"అయితే దేవుడున్నాడంటే నమ్ముతావా? నమ్మితే, అతడిని ఎప్పుడైనా చూసావా? కలిసావా? అతడితో మాట్లాడావా?"
"వివేకానందుడు అందరిని అడిగినట్టు అడుగుతున్నావ్ తల్లి!"
"చెప్పు మామయ్య! ఎందుకు అందరూ ఉందో లేదో తెలియని ఒక విషయం గురించి ఇంత ఆసక్తి కలిగి ఉన్నారు?"
"నీవడిగిన రెండు ప్రశ్నలలో ముందు రెండవ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసి అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాను. నీవడిగిన రెండో ప్రశ్నకు సమాధానం దానిలోనే ఉంది. ఏదైనా ఉందని తెలిసిపోయినా, లేదని నిర్దారణ అయ్యినా; ఇక దాంట్లో ఆసక్తి కనబరుచుట లాభమేముంటుంది! ఒక విషయం పైన విపరీతమైన ఆసక్తి ఎప్పుడు కలుగుతుందంటే: అసలది ఉందని ఋజువు కాకుండా, అలాగని లేదని చెప్పేంత ధైర్యం చెయ్యలేని సందర్భాలలో మాత్రమే!"
"నిజమే మామయ్య! ఇప్పుడు మనకి ఎవరైనా ఒక పాడుబడ్డ బంగ్లా పునాధుల్లో నిది ఉందని, కానీ అక్కడ భయంకరమైన విషసర్పాలు ఉంటాయి అంటే చాలా ఆసక్తి కలుగుతుంది, అదే సమయంలో విపరీతమైన భయం కూడా వేస్తుంది. అది వెళ్లి తెచుకోవాలనే ఆశ, వెళ్తే ఏమవుతుందో అన్న భయం మనల్ని ఎప్పటికీ అలా సంశయంలో ఉంచేస్తాయి," అని తానే ఒక ఉదాహరణ చెప్పి అర్థం అయ్యినట్టు స్పష్టం చేసింది.
"ఇక నీ రెండవ ప్రశ్నకు సంబంధించి దేవుడు ఉన్నడా లేడా అనేదానిని పక్కనబెడితే, ఉందో లేదో తెలియని దానికోసం ఊరికే వెంపర్లు పడటానికి జనమంతా మూర్ఖులు కారు. ఎందుకంటే ఎంతోమంది గొప్ప మేధావులు కూడా దేవుణ్ణి నమ్ముతారు, ఎంతో భక్తితో పూజలు చేస్తారు. దీనివెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగివుంది." అన్నాడు దేవేంద్ర.
"ఏంటది మామయ్య?" ఆతృతగా అడిగింది తనుశ్రీ.
"చాలా చిన్న విషయమే. 'మనుషులను నడిపించేవాడు ఇంకెవడో ఒకడున్నాడు, వాడు మనిషి కాదు; ఆ ఇంకెవడో, ప్రార్ధన చేసే ఎవరికైనా చల్లగా చూస్తాడు;' అని మనం నమ్మితే ఏ ఇతర మనిషికీ భయపడే పని ఉండదు. అలాగే మనం జీవితంలో అట్టడుగు స్థానంలోకి జారిపోతే, మనల్ని రక్షించడానికి అతగాడు ఉన్నాడులే మన వంతు మనం కృషి చేద్దాం అనుకుని పనిచేస్తే ఎవ్వరూ ఇవ్వలేని ఆత్మవిశ్వాసం మనం పొందగలుగుతాం. అదేవిధంగా మనం ఎంత ఎత్తుకి ఎదిగినా మనకంటే ఎత్తులో ఎప్పుడూ అతడు ఉన్నాడనే విషయం మనకి అనిపిస్తుంది కాబట్టి, ఎంత సాధించినా అహంకారాన్ని అనిగిపెట్టుకునే వీలుని కల్పించుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎత్తుకి ఎదిగే అవకాశం మనకి ఉంటుంది. ఈ లెక్కలు మనకెక్కాలంటే దేవుడున్నాడని నమ్మితీరాలి, దేవుడి పటాలకు పూజలు చెయ్యాలి."
తనుశ్రీకి మబ్బు విడిపోయింది. అంతా స్పష్టంగా అర్ధమైంది.
"నిజమే మామయ్య! రాత్రి పూట దెయ్యాలు తిరుగుతాయంటారుగా, దానికి కూడా ఇలాంటి కారణాలేవో ఉండే ఉంటాయి! బహుశా రాత్రి చీకటిగా ఉంటుందనెమో? ఊరికే అన్నీ నమ్మటానికి మనుషులేమంత వెర్రివాళ్ళు కాదు కదా!" అంటూ గట్టిగా నవ్వింది. మామయ్య కూడా నవ్వాడు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు