కామేశ్వర్రావూ! ‘కరోనా’ లోపెళ్ళీ - ఆదూరి.హైమావతి.

kameshwar rao marriage in korona

" ఒరే కామేశూ ! నామాట వినరా నాయనా! ఇప్పుడేం పెళ్ళిరా!---"

"ఇంకెప్పుడే ! కుదిరాక నేనాగను.అసలు నిన్ననాలి.నిశ్చితార్ధం తర్వాత , ముందు పెళ్ళి చేసేయమంటే కాదంటివి! "

" హవ్వ ! ఎవరైనా ముందు పెళ్ళి చేసేసుకుని ఆనక నిశ్చితార్ధం -నా శ్రార్ధం పెట్టుకుంటారుట్రా!నవ్వరుట్రా ఎవరైనా వింటే! "

"పోవే బామ్మా! నీవిలాగే చిన్నతనం నుంచీ నన్ను అన్నిటికీ వెన కేశావ్! నాతోటి వాళ్లకు నలుగురేసి పిల్లలే! నేనే ఇలా పెళ్ళిగాని ప్రసాదునై పోయా ను."

"ఏం ఏడవమంటావురా!ఉద్యోగమా ! సద్యోగమా! సరిగా చదవక పోతివి, డిగ్రీపూర్తికాను ఎనిమిదేళ్ళుపట్టె!ఏసంబంధాని కెళ్ళినా 'అబ్బాయి కెక్కడ ఉద్యోగ మండీ!' అని అడిగినవారే! ఇంతబతుకూ బతికి ఎలా అబధ్ధాలు చెప్పి పెళ్ళి చేయమంటావురా!సరిగా చదివేడిస్తే నీవూ ఉద్యోగస్తుడివైతే , ఆమూడు ముళ్ళూ వేయించేద్దునుకదా! ఈ పాటికి పదిమందిని కని నాముఖాన పడేసే వాడివేగా!"

" పోవే 'మొదల్లేదు మగడా, అంటే పెసర పప్పొండు పెళ్ళామా!' అన్న ట్లు అన్నీ వుంటే ఈ నా ఏడుపెందుకే బామ్మా!! ఏమైతేకానీ నాకు ఈ వారాంతానికి పెళ్ళి చేసే స్తావాలేదా! "

"ఒరే! మతి మడుతున్నదా ఏంటిరా! మనుషుల్నే మూడేసి మీటర్ల దూరంలో వుండమంటుంటే పెళ్ళీ పెళ్ళీ అంటావేటిరా !పెళ్ళి చేసు కుని ఏం చేస్తావురా!"

"అదేంటే అందరూ పెళ్ళి చేసుకుని ఏం చేస్తారే బామ్మా! ‘అడిగే వాడికి చెప్పేవాడు లోకువ' ని అన్నీ నాచేతే చెప్పిస్తావుటే!"

" ఛా నోరుముయ్యరా! ఇరుగూ పొరుగూ వింటే నవ్వుతారు!'

"నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని ' పెళ్ళి చేయమంటే ఏదేదో చెప్తావేంటే బామ్మా!"

" ఒరే నాయనా! నీకు నచ్చ జెప్పడం నావల్ల కాదురా! ఐనా కుదిరిన సం బంధం నిశ్చితార్ధం కూడా ఆయె , కాస్త పరిస్థితులు స్థిమిత పడనివ్వరా! చేసేస్తానూ -- "

" అదంతా నాకు తెలీదే ! నీవు ఈవారాంతానికి పెళ్ళిచేస్తావా! లేదా!"

కత్తి మొడమీదపెట్టినట్లు ఎదురుగా మఠం వేసుక్కూర్చున్న మనవడు కామేశాన్ని చూసి ఇహ ఎమీతోచక బామ్మ గబగబా మొబైల్ ఫోన్ తీసుకుని కొన్ని నెంబర్లు ఒత్తింది,

" ఒరే వెంకటేశూ! నీ చెలికాడు ఇల్లు పీకి పందిరేస్తున్నాడురా!కాస్త కర్ఫ్యూ లేనిసమయం చూసుకుని రా నాయనా ఒకమారు ! సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం లే"

" ఏవైందేంటి బామ్మా! ‘ఉరుములేని పిడుగులా ‘ఈ పిలుపేంటే! " అవ తలనుంచీ వెంకటేసు.

"ఇక్కడ ఉరుములూ పిడుగులూ అన్నీ పడుతున్నై రా వెంకటేశూ!"

"ఏమైందే బామ్మా!"

"ఒరే నాయనా! లేడికి లేచిందే పరుగని కామూగాడికి ఈ వారాంతా నికి పెళ్ళిచేసే యాలిట్రా!"అందిబామ్మ .

అటునుంచీ నవ్వులే నవ్వులు "ఏదీ కాముడుకోమారు ఫోనివ్వు."

బామ్మ ఫోను కామేశానికిచ్చి ," నీ స్నేహితుడు వెంకటేసు మాట్లాడు." అంది .

" ' ఇంటిగుట్టు రచ్చకేయడ ‘మేంటే బామ్మా!ప్రతిదానికీ వాడిని పిల వంది నీకు తోచదా!"

"ఏం చేయనురా!ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ము డు లేడ’నీ ఒంటికాయ సొంఠికొమ్మువు , ఎవరి సలహా ఐనా తీసుకోవా లంటే మన కెవరున్నారురా! వాడుతప్ప"

"నువ్వేచెప్పావే !'పెదవి దాటితే పృథ్వి దాటుతుంది'అని, అన్నీ వెనక టిలా వాడికి ఎలాచెప్తామే! పెళ్లయినవాడు , వాళ్ళావిడ వింటే ఏమను కుంటుంది చెప్పూ!"

" అబ్బో సానానే తెలుస్తున్నాయే !మరి నామాట వినకపోతివి! ఏంచేయ మంటావురా కామేశూ! "

ఫోనులో అన్నీ వింటూ ,అరుస్తున్నాడు అవతలినుంచీ వెంకటేశు.

"ఒరే కామేశూ ! చెవిదగ్గ రెట్టుకోరా!అరవలేక చస్తున్నాను.పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు ' నీకు ఎప్పుడేది తోస్తే అదేనుట్రా! బామ్మను బాధపెట్ట కురా! కాస్త మూతికున్న మాస్కు పక్కకు తోసి మాట్లాడి చావు, వినిపించ ట్లా "

" నీకేమోయ్! హాయిగా పెళ్ళిచేసుకుని లాక్ డవున్లో హాయిగా ఇంట్లో ‘నిండు కుండ తొణకదు' అన్నట్లు కూర్చున్నా వ్! నాలాంటి వానిపని నీకేం తెలుస్తుందిలే , ‘కడుపు నిండినవానికి గారెలు చేదని"

" ఓరీ శుంఠా !' పెళ్ళంటే నూరేళ్ళ పంట'రా ఈ కర్ఫ్యూలో పెళ్లేం ట్రా! లేడికి లేచిందేపరుగని ' ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలీ !ఏంకథా! ఐనా నీ వాటం ఇంతే కదుట్రా మొదటినుంచీ! మీబామ్మ కనుక వేగుతున్నది. మరొకరైతేనా.---"

"ఏం రా!అక్కడికి నేనేదో అడగరానివి అడిగినట్లు!ఐనా ‘రాజు గారి దివా ణంలో చాకలోడి పెత్తనమ' ని నాపెళ్ళికి నీపెత్తన మేంట్రా!"

"అయ్యోనాయనా! నీపెళ్ళికి నా పెత్తనమేముంటుందిరా! అరవ చాకిరి తప్ప. నీ పెళ్ళికి అందర్నీ పిలవడం ,మేళ గాళ్లనుంచీ వంట వాళ్ల వర కూ ,పెళ్ళిమంటపం నుంచీ అలంకారం వరకూ, ఫోటోలూ వీడియోలూ నుంచీ విడిదింటివరకూ అన్నీ నేను చేస్తే ,షోగ్గా పెళ్ళిపీటలమీద కూర్చు ని కులుకుతావుట్రా!’పుట్టి నిల్లు మేన మామ దగ్గరానీ’ నీ సంగతి నాకు కొత్తకాదులేరా!

చిన్నప్పుడు రాత్రి తొమ్మి దింటికి , గుమ్మపాలుత్రాగితే లెక్కలిట్టేవచ్చే స్తాయని ఎవరో చెప్పగా వెధవ్వి గుమ్మపాలు కావాలని, నడిమంచమ్మీద నీలిగి కూర్చుంటే నేనే కదురా బామ్మకు తోడుగా లాంతరు పట్టుకుని పొలం చేసే పోలయ్య దగ్గరికి వెళ్ళి, మీ బామ్మ బతి మాలి బతిమాలి ' ఇప్పుడు పశువులు పాలుఇవ్వవమ్మా! అని అతడు ఎంత చెప్పినా వినక ,గేదెకు తౌడుపెట్టి దూడను విడిచి పాలు కుడిపించి ,పిండించి తెచ్చిన పుడు నేనేకదురా బామ్మకు తోడెళ్ళింది.

నడిరాత్రప్పుడు పెరుగు వడలుకావాలంటే , మీ బామ్మకూ తోడుగా మైసూరు హోటలుకెళ్ళినిద్రపోతున్న వంట వాళ్లను లేపి నానపోసిన మినప్పప్పు రుబ్బించి గారెలు కాలిపించి వాటిని పెరుగులో వేయించి తెచ్చి ఇచ్చినపుడు మీ బామ్మకు ఎవర్రా తోడుగా వెళ్ళింది?

అంతెందుకూ ! మా తాతగారి రెకమెండేషన్ తో నీకు పంచాయితీ ఆఫీసులో ఉద్యోగం వేయించను శ్రమపడిం దెవర్రా! నీకు మీ బామ్మ బాధ చూడలేక పెళ్ళి సంబంధం చూసి మాట్లాడిందెవర్రా! నీ ఒళ్ళు తగ్గించను నీతో పాటు పదేసి కీలో మీటర్లు రెండుపూటలా పరుగుపెట్టి బక్కగా తయా రైం దెవర్రా! అసలు నీవు తిండి మీదపడి ఏడవకుండా సరిగా చదివేడ్చి డిగ్రీ పాసై వుంటే నాతోపాటు మంచి ఉద్యోగమూ పెళ్ళీ ఈ పాటికి పిల్లలూ కూడా పుట్టేవారు కాదుట్రా! ఇన్ని చేసిన నన్ను ' చద్దన్నం తిన్నమ్మ కు మొగుడాకలితెలీ' దన్నట్లు మాట్లాడుతావురా! ఛీ ఛీ నీస్నేహమూ వద్దు , నీ తిట్లూ వద్దు .." అంటున్న వెంకటేష్ తో వాని మాటలకు గూబ గుయ్యి మని నసాళానికంటగా ,

" బాబ్బాబు! ఏదో స్నేహితునివని అన్నాన్లేరా! మర్చిపో! ఎలాగైనా ఈ వారాంతానికి నాపెళ్ళి చేసిపెట్టు , నీపాదాలు పడతా, నీ చెప్పులు మోస్తా, నీకు తలంటిపోస్తా " అంటూ రాజీకి వచ్చాడు.

వెంజటేష్కూ పాపమనిపించి "చూస్తాన్లే. బామ్మ దగ్గర నోరుమూసుక్కూ ర్చో. వయసావిడ్ని, అమ్మా నాయన పోతే కడుపుకట్టుకుని, కళ్ళల్లోవత్తు లేసుకుని పెంచినావిడ్ని గాబరా పెట్టి విసిగించకు. చూస్తాన్లే "అని ఫోన్ కట్ చేసాడు వెంజటేష్.

***

‘ఆనంద మానంద మాయెనే! మా కామేసు పెళ్ళికొడుకాయెనే!’అని ఫోన్ లోనే వెంజటేష్ పాడుతూ పెళ్ళి ఏర్పాట్లన్నీ అయ్యయాని , మేళం మాత్రం మొబైల్ ఫోన్ అలోన పెడతాననీ నానా తిప్పలూ పడి అన్నీ చేశాననీ చెప్పగానే కామేశు ఆకాశమంత ఎత్తెగిరాడు .

సోషల్ డిస్ట్రేన్స్ పాటించాలి కనుక , బామ్మే వాడికి పెళ్ళికొడుకుగా ముస్తాబు చేసుకోడం ఎలాగో మూతిక్కట్టుకున్న మూతిగుడ్దలోంచీ చెప్తుం డగా తనకు తానే జుట్టు, కట్టు ,బొట్టు అన్నీ పెట్టుకుని , ఫోన్ లో పూజారి గారు మంత్రాలు చదువుతుండగా , పెళ్ళికూతురు తన ఇంట్లోనే ముస్తాబై తెల్లారు ఝామున కర్ఫ్యూ వదలిన వేళ హడా విడిగా పెళ్ళి మంటపానికి , దూరం పాటిస్తూ అమ్మ, నాయనా, తమ్ముడూ రాగా, బామ్మా, కామేశమూ, వెంకటేసూ వెడివిడిగా దూరం పాటిస్తూ , అంతా మూతులకు మాస్కులు కట్టుకుని మంటపానికి వచ్చారు.

పురోహితులవారు ఒక గదిలో దూరం గా వుండి , మూతిగ్గుడ్దకట్టుకుని ఫోన్ లో మంత్రాలు చదువుతూ ఏమేంచేయాలో చెప్తుండగా వరపూజ ఎవరికి వారే దూరం పాటిస్తుండగా ,పెళ్ళుకూతురు తమ్ముడు ఇలా కాళ్ళు కడగాలి అనిపురో హితుడు చెప్పగా దూరం నుంచీ పళ్ళెంలో కాళ్ళున్నా యని భావించి పెళ్ళికొడుకు కాళ్ళుకడగడం , బావమరిదికి కాళ్ళు కడ క్కుం డానే కడిగి నట్లు భావించి బావగారు ఒక ఆరడుగుల పెద్ద గడ కర్రకు తగి లించిన బట్టలు అందీయడం, బావ మరిది ఆగడ కర్రకే బావ గారికి సూటు తగి లించి ఇవ్వడం , అవిధరించి పెళ్ళికొడుకూ పెళ్ళి కూతురూ హాల్లో చెరో మూల పదడుగుల దూరంపాటిస్తూ ఎదురుకోలని చేసుకోడం , అంతా కలిసి వరపూజని, ఆరేసి అడుగులదూరం నుంచే కర్రకు కట్టిన పానకపు గ్లాసులో పానకం అందుకుని త్రాగడం గట్రా అయ్యాయి.

పురోహితుడు 'కర్ఫ్యూ టైమైపోతుంది మీ పెళ్ళిచెడా రండయ్యా లేకపోతే నన్నూ నా టూవీలర్నీ వారంటైన్లో నో, క్వారంటైన్లోనో వేస్తారూ! ఇద్దరూ అక్కడున్న పదడుగులదూరంలోని పీటలమీద కూర్చుని నేను మంత్రా లు చెప్తుండగా తతంగం చేసుకోండి " అంటూ ఉగ్రుడై అరవగా ,అంతా సరేని కూచున్నాక మత్రాల ప్రకారం తతంగం అయిందనిపించి , "తలలమీద జీలకర్రా బెల్లం పెట్టుకోండి ", అని పురోహితుడు అరిచాక , వెంకటేష్ ముందుగానే జాగ్రత్తగా చేయించిన వుంచిన గడకర్ర చివర అతికించిన జీలకర్రా బెల్లం కర్రలతోనే ఒకరి తలలమీద ఒకరు అతి కించుకుని ,పురోహితుల వారు 'మాంగల్యంతంతునానేనా ' అని అరు స్తుండగా కామేశుడు గడకర్రకు మూడుముళ్ళూ వేసిన మంగళ సూత్ర న్నీ పెళ్ళి కూతురి మేడలో వేసేశాడు. ' అమ్మయ్య నాపెళ్లయింది ' అని సంబరంగా గుండెనిండా గాలిపీల్చుకుం టుం డగా , “ నా పెళ్ళి కట్నం అడ్వాన్సుపోను పిటీయంలో వేసేయండి నేవెళ్ళిపోతా , మీరూనూ గబ గబా దూరంపాటిస్తూ ఇళ్ళకెళ్ళండి. లేకపోతే , క్వారంటైనో , వారంటైనో కెళ్ళాలి, శుభ మాని పెళ్ళిచేసుకుని -- కానీ వెంకటేశూ నాకు పీటియం చేయి" అంటూ గోచీ ఎగదీసుకుంటూ పురోహితుడు టూవీల రెక్కి తుర్రు మన్నాడు.

***

“ బామ్మా! మనమెక్కడికెళ్లాలే ! పెళ్ళికూతురింటికా మనింటికా " అని అరుస్తున్న కామేశాన్ని తట్టిలేపి "ఏమైందిరా! అలా అరుస్తున్నావ్! మళ్ళా పెళ్ళికల వచ్చిందేంట్రా ! కాస్తాగు నాయనా! ఈ లాక్ డౌ న్లు కానీ , చేసే స్తాగా మానాయనే మా బాబే బంగారు కదూ ! లేచి ముఖం కడుగు కాఫీ ఇస్తా ! ఈరోజు మేదువడ ,కొబ్బరి చట్నీ చేస్తున్నా రారా!" అంటూ వెళ్ళిన బామ్మకేసి అయోమయంగా చూసాడు కామేశం.

***

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు