రెండు గంటల నుండి నానా హైరానా పడుతుంది లక్ష్మి. బయట తుఫాను భయంకరంగా ఉంది. ఉదయం నుండే ఒకటే గాలి, వర్షం. టీవీ ల్లో తుఫాన్ గురించి ఊదరగొడుతున్నారు. రాత్రి తొమ్మిదైంది. వర్షం అస్సలు తగ్గడం లేదు. ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని టీవీ లల్లో చెప్తున్నారు. లక్శ్మి మాత్రం కంగారుపడుతోంది. నిముషానికొక్కసారి గేట్ కేసి చూస్తుంది. మనసు రకాలుగా పోతుంది. కాలు చేయి ఆడట్లేదు. ఏం చేయాలో పాలుపోవట్లేదు లక్ష్మి కి
లక్ష్మి భర్త చలం గవర్నమెంట్ కాలేజీ లో క్లర్క్. భార్యాభర్తల ఇద్దరిదీ అదే ఊరు. వీళ్ళిద్దరికి కుసుమ ఒక్కతే సంతానం. యే చీకు చింతా లేదు. ఇద్దరు జాగ్రత్తపరులే కావడం, అందునా ఇద్దరిదే అదే ఊరు కావడం వల్ల ఆస్తి బాగానే సమకూరింది. కూతురు పెళ్లి చేశారు. అల్లుడు కూతురు పక్క వీధి లోనే ఉంటారు. అల్లుడు సొంత వ్యాపారి..
చలం నోట్లో నాలిక లేని మనిషి. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అవ్వడం వల్ల గారాబంగా పెరిగాడు. మెత్తటి మనిషి. లోకజ్ఞానం, ధైర్యం రెండూ తక్కువే. లక్ష్మి మాత్రం చాలా గడుసు. నోరు కొంచెం జాస్తి. ఎవ్వరిని లెక్కపెట్టదు. మర్యాద ఇవ్వకపోయినా ఆమె నోటికి భయపడి చలం ఆమె చెప్పినట్లే వింటాడు.
పొద్దున తొమ్మిదింటికి కాలేజీ కి వెళ్ళిన చలం రాత్రి పదైనా ఇంటికి చేరలేదు. రాత్రి ఎనిమిది వరకు లక్ష్మి పెద్దగా పట్టించుకోలేదు . ఆ తర్వాత నుండి లక్ష్మి లో భయం మొదలైంది. రోజు ఆరు గంటలకే ఇంట్లో ఉండే చలం రాత్రి పదైనా ఇంటికి చేరకపోవడంతో ఆమె మనసు పరిపరి విధాలుగా పోతుంది. మనసంతా భయంతో నిండింది. చలం ఫ్రెండ్ రాంబాబు కి ఫోన్ చేసింది...
“ ఈయన ఏమైనా కనబడ్డారా...అన్నయ్య గారు” అడిగింది లక్ష్మి
“లేదమ్మ. నేను ఈ రోజు లీవ్ పెట్టా. వాడు ఇంకా రాలేదా ” అడిగాడు రాంబాబు...
“ఇంకా రాలేదు.. అందుకే భయం. ఎప్పుడు ఇలా జరగలేదు.” చెప్పింది లక్ష్మి.
“ఎందుకు భయం... వర్షానికి ఎక్కడో ఆగుంటాడు.. నేను కాలేజీ కి ఫోన్ చేసి కనుక్కుంటా” అన్నాడు రాంబాబు
“నేనిప్పుడే చేశా.. ఫోన్ ఎవరు తీయట్లేదు” చెప్పి ఫోన్ పెట్టేసింది లక్ష్మి..
ఇక తట్టుకోలేక పక్క వీధిలోనే ఉన్న కూతురికి ఫోన్ చేసింది. వర్షం లోనే అల్లుడు కూతురు ఆదుర్దాగా వచ్చారు. అల్లుడు కూతురు ఎంత ధైర్యం చెప్పినా లక్ష్మి మనసు స్థిమిత పడ్లేదు.
“ఇక్కడే కూర్చోపోతే కాలేజీ దాకా పోయి రావోచ్చుగా ” అంది కుసుమ తన భర్త శ్రీను తో.
“అదే పన్లోఉన్నా... ఇందిరా మేడం కి ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. ఏమైందో ” అనే లోపే ఇందిరా మేడం కాల్ బాక్ చేసింది..
“నమస్తే మేడం. నేను శ్రీనుని ని చలం గారి అల్లుడ్ని.. మావయ్యా ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లాడో మీకేమైనా తెలుసా” అడిగాడు శ్రీను.
“మధ్యాన్నం చూశాను. బిజీ బిజీ గా తిరుగుతున్నాడు. సాయంత్రం నాకు కలవలేదు. ఒక్కసారి కాలేజీ కి వెళ్ళి చూడకపోయావా” అంది.
“సరే ఉంటా మేడం” అని ఫోన్ పెట్టేసి బండి మీద వర్షం లోనే తడుస్తూ కాలేజీ వైపు బయలుదేరాడు శ్రీను..
“ఇవ్వాళ నాన్నని ఏమైనా అన్నావా” అడిగింది కుసుమ తల్లిని
“ఏమి అన్లెదే... పొద్దున్నే కూరగాయలు సరుకులు తెమ్మన్నా.... మంచివి తేలేదే.. కోపంలో అరిచా.. అంతే భోజనం కూడా చేయకుండా పోయాడు. మధ్యలో ఫోన్ చేశా... ఎత్తలేదు. అలిగాడ్లే అనుకున్నా..” అంది ఏడుపు ముఖంతో లక్ష్మి.
“నీ నోటి సంగతి నాకు తెలీదా.. తిట్టే ఉంటావు. ప్రతి చిన్న విషయానికి నాన్నని అన్నేసి మాటలంటావు.. నీకు సిగ్గనిపించదా. నాన్న వైపు వాళ్ళని రోజు తిడతావ్... పాపం నాన్న నైతే దద్దమ్మ అని పెద్దపెద్ద మాటలంటావ్.. నువ్వు చస్తే బాగు అనికూడా చాలాసార్లు తిట్టావ్ . ఇన్నేళ్లొచ్చినా బుద్ది మాత్రం రాలే నీకు. నీ తొందరపాటు ఇంతవరకు తెచ్చింది. నాన్నకి కోపం వచ్చే ఉంటుంది. అసలే మెత్తటి మనిషి. నీ తిట్ల తో రోజు నరకం చూస్తున్నాడు. నువ్వు మారవు. నాన్నని చూడగానే అమ్మోరి తల్లిలా మీదపడతావ్. అనుభవించు నీ ఖర్మ” అని తల్లికి తలంటుపోసింది..
కూతురు మాటలు లక్ష్మి ని నేరుగా తాకాయి.. కానీ ఏం చేయాలి... ఏ పని చేసినా సవ్యంగా చేయడు. ఎదుటివాడు మోసం చేసినా గమనించడు. ఈ మెతకదనం వల్లే చాలా నష్టపోయారు.. అందుకనే తను గట్టిగా మాట్లాడాల్సివస్తుంది.. చూసేవాళ్ళు తనని గయ్యాళనుకుంటారు. కుటుంబ క్షేమం కోసమే తాను మాట్లాడాల్సి వస్తుంది.
ఎదురు చెప్పే వ్యక్తి కాదు కాబట్టి సరిపోయింది. ఇంకొకళ్లైతే ఇంట్లోనే ఉండలేరు. పసిపిల్లల మనసు కాబట్టి ఎన్ని మాటలన్నా వెంటనే మర్చిపోతాడు. ఎన్ని తిట్టినా అరిచినా బాధపడతాడే గాని తిరిగి గొడవ పెట్టుకోడు. తనది అంతా తల్లి పొలికే. ఆమె కూడా ఇంతే. నాన్న మాత్రం ఎదురుతిరిగి గట్టిగా అరిచి పంచాయితి పెడతాడు కాబట్టి తన తల్లికి కొంతన్నా భయం ఉంది. ఆ పాపిష్టి సరుకులేవో నేను పోయి తెచ్చుకున్న బాగుండేది. తెలీదు అని తెలిసినా ఆయనని సరుకులు తెమ్మని తప్పుచేశా. ఆవేశంలో ఒళ్ళు తెలీకుండా నానా మాటలన్నా.. నువ్వు చచ్చిపోతే బావుండు అని కూడా తిట్టా , పాపిష్టి దాన్ని తిట్టకుండా ఉండాల్సింది. ఏం చేయలేక అలిగి అన్నం మానేసి కాలేజీ కి పోయాడు. అనుకుంది లక్ష్మి. మాటల్ని సీరియస్ గా తీసుకొని ఏదైనా అఘాయిత్యం చేసుకున్నాడా అన్న అనుమానం తో భయంతో ఒంటికి చెమటలు పట్టాయి. అన్ని దేవుళ్ళకి మొక్కింది. ఆయన కేమైనా అయితే తన బ్రతుకేంటని వణికిపోతోంది.
ఇంతలో శ్రీను కాలేజీ నుండి తిరిగొచ్చాడు...
“కాలేజీ లో లేడు. సాయంత్రం నాలుగున్నరకే బయటకు పోయాడట. ఈ రోజంతా ఏదో పనిలో బిజీ గా ఉన్నాడట. మొగిలి చెప్పాడు.” చల్లగా చెప్పాడు శ్రీను.
మొగిలి కాలేజీ ప్యూను అక్కడే ఉంటాడు.
తల్లి కూతుళ్ళు బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టారు. శ్రీను ఎంత అనునయించినా వాళ్ళ ఏడుపు ఆగలేదు.
వీళ్ళ ఏడుపుకి చుట్టుపక్కలవాళ్లు పరుగున వచ్చారు. చలం ఇంటికి రాలేదన్న విషయం వాళ్ళతో చెప్పాడు శ్రీను...
“ఎప్పుడో అప్పుడు ఇలా జరుగుద్దని నేను అంటూనే ఉన్నా. నోటి కేమైనా హద్దా పద్దా. ఎంతమాటొస్తే అంతా అనేయడమే. అంతా తల్లి పోలిక. ఇప్పుడేడ్చి ఏం లాభం.. నువ్వుఈ జన్మలో మారవు. అనుభవించు” అని పక్కింట్లోనే ఉంటున్న లక్ష్మి పిన్ని లలిత తిట్టింది.
లలిత భర్త గోవిందయ్య కలుగజేసుకొని...
“నువ్వాగవే.. అది బాధలో ఉంటే సాధిస్తావే. పోలీసు కంప్లైంట్ ఇద్దాం బయలుదేరు శీను..” అన్నాడు.
ఇద్దరు లేచి బయటకొచ్చారు. గాలి, వర్షం తగ్గలేదు. కరెంటు పోయింది. టైమ్ అర్ధ రాత్రి రెండయ్యింది. చేసేదేంలేక తెల్లరాక కంప్లైంట్ ఇద్దామని కూర్చున్నారు. లక్ష్మి ఏడుపు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూ ఉంది..
లక్ష్మికి రాత్రి నుండి తిండి లేదు, నిద్ర లేదు కాబట్టి ముఖం వాడిపోయింది. మొగుడ్ని తిట్టి తప్పుచేసానేమో నన్న బెంగ ఆమె ముఖంలో కనబడుతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి పలకరిస్తూనే చురకలు వేశారు. లక్ష్మి సిగ్గుతో తలవంచుకొని కూర్చుంది.
టైమ్ ఉదయం ఎనిమిదయ్యింది. గోవిందయ్య, శ్రీను ఇద్దరు కాఫీ తాగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరారు. లక్ష్మి కూతురు ఒళ్ళో పడుకొని మౌనంగా రోదిస్తోంది. గోవిందయ్య శ్రీను ఇద్దరు గుమ్మం తలుపు దగ్గరకేసి పోలీసు స్టేషన్ కి బయలు దేరారు...
ఇంతలోనే గుమ్మం తలుపు తీసుకొని చలం లోపలికొచ్చాడు. చలం వెనుక శ్రీను గోవిందయ్య ఉన్నారు. వాళ్ళ ముఖంలో సంతోషం కనబడుతుంది...
“అమ్మా అదిగో నాన్న ఇప్పుడే వచ్చాడే” కుసుమ గట్టిగా కేకవేసింది. లక్ష్మి జెట్ స్ప్పెడు లో లేచి నిలబడింది. భర్తని చూసిన ఆమెకి కన్నీళ్లు ఆగలేదు. దేవుడున్నాడనిపించింది. ఒక్క గంతేసి మొగుడు చేయి పట్టుకుంది...
“రాత్రంతా ఏమయ్యావు... ఎక్కడికన్నా వెళితే చెప్పి వెళ్లాలిగా.. అందర్నీ ఇలా కష్టపెట్టడం ఏమైనా బాగుందా. రాత్రంతా రాకపోయేసరికి ఎంత భయపడ్డామో తెలుసా. రాత్రి ఏమైనా తిన్నావా. టీ తాగవా...” అని కన్నీళ్లతో మొగుడ్ని ప్రశ్నిస్తూనే ఉంది...అంతలో చలం కలగజేసుకొని...
“రాత్రి ఇంటికి రానని శేషయ్య గాడికి చెప్పి పంపించాగా. ఇంత కంగారేందుకు... మా కాలేజీ లో ఆడిట్ నడుస్తుంది. నిన్నంతా అదే గోల. వర్షం బాగా ఉండేసరికి కాలేజీ బిల్డింగ్ కురుస్తుందని R&B గెస్ట్ హౌస్ లో ఆడిట్ చేశారు. వచ్చినవాళ్ళకి అక్కడే బస. అందువల్ల రికార్డులు అన్నీ తీసుకొని ప్రిన్సిపాల్ గారు, నేను, శేషయ్య అందరం అక్కడికెళ్ళాం. శేషయ్య మధ్యలోనే ఇంటికొచ్చాడు. నేను ఇంటికి రానని నీకు చెప్పమని చెప్పా వాడికి. మతిమరుపు వెధవ మర్చిపోయుంటాడు. ప్రిన్సిపాల్ గారు నేను అందరం రాత్రంతా అక్కడే ఉన్నాం. పని అయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. వర్షం బాగా ఉంది. అందుకే అక్కడే ఉన్నాం. ఫోన్ చేద్దామంటే ఫోన్ లో ఛార్జింగ్ లేదు. చార్జర్ ఇంట్లో ఉంది” అని చిన్నగా చెప్పాడు చలం.
“ఇంటి కొచ్చి అత్తయ్యకి చెప్పి అన్నం తిని వెళ్ళాల్సింది మావయ్య. నేను కాలేజీకి వచ్చి అడిగా సాయంత్రమే బయటకు వెళ్ళావని చెప్పాడు మొగిలి. నువ్వు చెప్పకపోవడం వల్లే ఇంత రచ్చ అయ్యింది. రాత్రి నుండి అందరికి నిద్ర లేదు, భోజనం లేదు. అత్తయ్య పరిస్థితి అయితే నరకం. రాత్రి నుండి ఏడుస్తూనే ఉంది. అత్తయ్య ముఖం చూడు పది లంఖణాలు చేసినట్లుగా ఎట్లా ఉందో” అన్నాడు శ్రీను.
“మొగిలి కి ఏం తెలవదు. ఎందుకే ఏడవడం నేనెక్కడికి వెళతా. శేషయ్య చెప్పి ఉంటాడనుకున్నా” అని చెప్తుండగానే...
“నీకీ జన్మకి బుద్ది రాదు. శేషయ్య సంగతి తెలుసుగా. వాడికి ఏది గుర్తుండదు. ఏ పని జేసినా వివరముండదు. బుద్దిలేక మా వాళ్ళు నీకిచ్చి జేశారు. నీకు మైండ్ లేదు. నీ అయ్యా అమ్మ నిన్ను బాధ్యత లేకుండా పెంచారు. వాళ్ళ దరిద్రపు బుద్దులే నీ కొచ్చాయి” అని మళ్ళీ తిట్లదండకం అందుకుంది. పాత విషయాలను గుర్తుజేసుకుంటూ తిడుతూనే ఉంది.
అందరూ ఆశ్చర్య పోయారు. లక్ష్మిఎప్పటికీ మారదనుకుని లేచి ఎవరి ఇళ్లకు వాళ్ళు పోయారు. కూతురు అల్లుడు అక్కడే ఉన్నారు...
“చేసిన నిర్వాకం చాల్లే... స్నానం చేసి రా...టిఫిన్ చేద్దువు గాని ..రాత్రి అసలు తిన్నావో లేదో” అంది లక్ష్మి.
చలం బాత్ రూమ్ లోకి దూరాడు. కూతురు అల్లుడు వెళ్ళిపోయారు...
‘టేబల్ మీద ఇడ్లీ పెట్టా తిను.... నెయ్యి గుమ్మరించుకో మాకు... కొద్దిగా వేసుకో” మళ్ళీ చెప్పింది లక్ష్మి. చలం టిఫిన్ తిని ఉద్యోగానికి బయలుదేరాడు...
“సాయంత్రం వచ్చేటప్పుడు బియ్యం మూట తీసుకురా. మంచివి తే.. నిన్న రాంబాబు గాడిచ్చిన బొంబాయి రవ్వ బాలేదు. ఇదిగో పొట్లం. వాడిమొఖానా కొట్టు. ఎప్పుడు తెచ్చే సాంబ మసూరి బియ్యం తే .. చూసి తీసుకో... అన్నీ నేనే చెప్పాలి..” అంటూ లోనికి వెళ్లింది లక్ష్మి.. వెంటనే మళ్ళీ బయటకొచ్చి..
“ఇదిగో నిన్నే.. రఘు డబ్బు అప్పు అడుగుతున్నాడు. ఇయ్యమాక. లేవని చెప్పు. నా మాట వినకుండా డబ్బిస్తే వాడి కొంప చుట్టూ నువ్వే తిరగాల...అందుకే లేవని చెప్పు. డబ్బు అడగ్గానే మూగిమొద్దులా తలాడించి డబ్బు ఇయ్యమాక... లేవని గట్టిగా చెప్పు..వినబడిందా” అని ఆవేశంగా గట్టిగా అరిచింది లక్ష్మి...
చెప్పిందానికి తలాడించి కాలేజీకి బయలుదేరాడు...
“ మళ్ళీ మొదలు...దీంతో చస్తున్నా... దీనికి నోరు జాస్తియే ప్రేమ జాస్తియే... తట్టుకోలేకపోతున్నా.. ఏదో ఒకటి చేయాలి ” అని గొణుక్కుంటూ రోడ్డు మీదకు వచ్చాడు చలం.. కానీ ఏం చేయాలో మాత్రం తెలీదు ..
కొద్దిసేపటికే అంతా మర్చిపోయి పనిలో మునిగిపోయాడు చలం.
దంపతుల మధ్య ఉండే ప్రేమ కోపం రెండు కవల పిల్లలేగా
అందుకే ఎప్పటికీ ఏమి చేయలేనని తెలుసు చలానికి...