రాధే శ్యామ్ - ఇందిరా రావు దువ్వూరి

radhe shyam

తల్లి తండ్రి ఆశ్చర్యపోయారు సింధు మాటలకి..
"నీకేమైనా మతి పోయిందా??" అన్నారు ఒక్కసారిగా..
"అవునమ్మా, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను" మరోసారి స్థిరంగా అంది సింధు.
"లేదే, నీకు మతి పోయింది తెలివి లో ఉంటే ఇలాంటి ఆలోచన రావు" అంది మళ్ళీ
కోపంగా తల్లి భార్గవి..
"ఎందుకు? నేను ఏమంత కాని పని చేస్తున్నాను, ఒక అనాధ కి ఆశ్రయం ఇవ్వడం తప్పెలా అవుతుంది? రోజు చాగంటి వారివి, గరికపాటి వారివి, ఇలా అనేక మంది చెప్తున్న ప్రవచనాలు, హితోక్తులు విని ఏం ప్రయోజనం? ఆచరణలో పెట్ట లేనప్పుడు" అంది మళ్ళీ సింధు.
"నీ మొహం, అవన్నీ వేరు, నీకు ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నాం అని నీకు తెలుసు, ఇప్పుడు ఎవర్నో తెచ్చుకొని పెంచుకుంటున్నావంటే పెళ్లి అవుతుందిటే నీకు? నలుగురిలో తలెత్తుకుని తిరగగలమా?? అసలు ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అంటే నమ్ముతారా? అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు, నలుగురు నానారకాలుగా మాట్లాడుతారు, అవన్నీ ఆలోచించావా?" మళ్లీ విసుగ్గా అసహనంగా అంది భార్గవి.
"ఏం నాన్నా? మీరు కూడా మాట్లాడరు? నేను చేసేది తప్పా? చిన్నతనం నుండి స్కూల్ లోనే కాదు, ఇంట్లో పనివాడు విషయంలోనే కాదు, బయట ఇలా అందరినీ ఆదరించాలి, మనకున్న దాంట్లో సహాయం చేయాలి, భగవంతుని దయ వల్ల మనకు కాస్తో కూస్తో ఉంది. దాన్ని నలుగురికి పంచినప్పుడు, అందరిలో మంచి వారు, దయ కలిగిన వారు అనిపించుకున్నప్పుడే పుణ్యం పురుషార్థం, అని చిన్నప్పటినుండి సహాయం చేసే ఏ ఒక్క అవకాశం వదలనివ్వలేదు, అలా ఫలానా రాజేష్ కుటుంబం అంటే అందరూ మెచ్చుకునేలా పెంచారు మమ్మల్ని మీరు. చిన్నప్పటినుండి నాటిన ఆ విత్తనాలే ఈనాడు ఈ ఆలోచన అనే మహా వృక్షాన్ని నిలబెట్టింది. ఎవరో తల్లి తండ్రి లేని కన్నబిడ్డ, అందులో మిగతా వారిలా కాకుండా కొంత అవకరం ఉన్న వారిని పెంచి, తగినంత వారికి అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి మామూలు మనిషిని చేసి, ఒక మంచి పౌరుని గా తీర్చిదిద్దగలని నాకు నమ్మకం ఉంది. మీరైనా అమ్మకు చెప్పండి. ప్లీజ్ కాదనకండి!!"'అంది అభ్యర్థిస్తూ సింధు.
ఏం మాట్లాడలేకపోయాడు రాజేష్.. నిజమే.. చిన్నప్పటినుంచి పిల్లలని క్రమశిక్షణతో ను, ఒక రకంగా "అందరికీ అందుబాటు" అన్న స్ఫూర్తితో ను పెంచాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, అవసరం వచ్చినా, రాజేష్ కుటుంబం ముందుండేది సహాయం చేయడంలో.. పిల్లలకు అదే నేర్పారు.. స్కూల్ లోను, చుట్టుపక్కల "మేము సైతం" అన్న నినాదాన్ని మంచి వైపు నడిచే లా పెంచాడు.. ఇదంతా తన పని చేస్తున్న స్కూల్ లో రాజవ్వ మొదటిసారి ఈ బాబుని స్కూల్ కి తెచ్చిన దగ్గరనుండి మొదలైంది. అందరిలా కాకుండా స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ వచ్చే సింధు మెడిసిన్ , ఇంజనీరింగ్ కాకుండా టీచింగ్ వైపు మొగ్గు చూపింది. చిన్నప్పటి నుంచి అంతే. ప్రతి విషయంలోనూ ఏదో ఒక ప్రత్యేకత. అందరూ అదే కోర్సు చేస్తూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతుంటే పిల్లలకి పాఠాలు చెప్పే గురువులు తక్కువైపోతున్నారు అని ఎవరో ఉపన్యసిస్తుండగా వింది..అంతే తను టీచర్ అవుతానని పట్టుబట్టి కావలసిన కోర్సులు అవి చేసి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పోస్టు సంపాదించుకుంది. మారుమూల పల్లెటూరు పోస్టింగ్ వద్దు అని శత విధాల బతిమాలినా వినలేదు. "అందరూ అలా అంటే ఎలా? చూడండి నా స్టూడెంట్స్ ని నేను ప్రపంచ పటంలో మేధావులుగా ఎలా నిలబడతానో!! " అని సవాలు చేసి గవర్నమెంటు స్కూల్లో జాయిన్ అయింది ..అంతా బానే ఉంది. పిల్లలంతా చాలా తొందరగా తనంటే ఇష్టపడ్డం మొదలుపెట్టారు. స్కూల్లో పరపతి పెరిగింది. సింధు టీచర్ అంటే అందరికీ అంతులేని అభిమానం. కానీ ఒకరోజు స్కూలు ఊడ్చే రాజవ్వ ఈ పసివాణ్ణి స్కూల్ కి చంకన వేసుకొని వచ్చింది. చూడ్డానికి ముద్దుగా ఉన్నా కొంచెం మెంటల్లీ డిసెబుల్డ్ అని అర్థం అయ్యేటట్లు ఉన్నాడు. వచ్చిన దగ్గర నుండి రాజవ్వ ని పని చేసుకొనివ్వకుండా ఒకటే ఏడుపు.. హెడ్మాస్టర్ గట్టిగా చీవాట్లు వేసాడు అసలు స్కూల్ కి ఎందుకు తెచ్చావు అని. వాడికి తల్లి తండ్రి ఏవరూ లేరని, తనకు ఇంటి దగ్గర తుప్పల్లో దొరికాడని, అలా వదిలేయలేక, తనకి నా అన్నవారు ఎవరూ లేరని వాడిని పెంచుకున్నానని, ఈ ఒక్కరోజు వాడిని స్కూల్లో ఉంచడానికి ఒప్పుకోమని హెడ్మాస్టర్ ని బతికిమాలుతుండగా అక్కడికి వచ్చిన సింధు అంతా వింది. ఎందుకో వాడిని చూడగానే ఏదో అభిమానం ప్రేమ పొంగుకొచ్చాయి. రాజవ్య ని పిలిచి వాడిని చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంది. ఠక్కున ఏడుపు ఆపేసాడు వాడు. "వారిని ఇంత ఘనం ఏడ్చి ఇప్పుడు ఈ యమ్మ ఏత్తుకొంగానే ఆపినావ్??" అంది ప్రేమగా వాడిని తిడుతూ రాజవ్వ. వాడికి ఆకలేమో అని ఎప్పుడూ తన బాగ్ లో ఉంచుకొననే బిస్కెట్ ప్యాకెట్ తీసి పాకెట్ విప్పి నాలుగు బిస్కెట్లు వాడి చేతిలో పెట్టింది.

"రాజవ్వ ఎవడు వీడు?" మళ్ళీ అడిగింది సింధు. మళ్లీ కథంతా చెప్పింది రాజవ్వ. రోజు వాడిని చూసుకునే పక్కింటి ఆమె ఇవాళ ఏదో పని ఉందని చెప్పి ఎటో పోయింది. ఎక్కడ వదలడానికి లేక స్కూల్ కి తీసుకు వచ్చింది. సింధు అడిగిందే తడవుగా వాడిని పెంచడంలో తన పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టింది. "ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేద్దామనుకుంటున్నాను అమ్మ. నేను కూడా ముసలిదానయిపోతున్న" అంది. "కానీ వాడు అందరిలా లేడు కదా" అంది కొంచెం సంకోచంగా సింధు.

"అవునమ్మా అదే మల్ల నా బాధ, ఈ పిల్లాడుకి ఏం తక్కువయిందో నాకు అర్థం కాలే, మీ చదువు కున్నోళ్ళకి అయిన్నీ తెలుస్తాయి, అట్లనే చూస్తుంటాడు. సంవత్సరం అయి పోయె ఒక్క మాట కూడా రాలే. నాకు ఎవరూ లేరు .డాక్టర్ కి చూపించే శక్తి నాకు లేదు తల్లి" అంది బాధగా రాజవ్వ. చాలా బాధగా అనిపించింది సింధుకి. పిల్లాడుకి నా అన్నవారు ఎవరూ లేరు, పైగా కొంత అవకరం. వారం రోజులుగా వాడే రోజు గుర్తుకొస్తున్నాడు. ఏ పని చేస్తున్న బాబు గురించి ఆలోచనలు. వారం తర్వాత ఒక రెండు రోజులుగా స్కూల్ కి రాజవ్వ రావటం లేదు అని తెలిసింది .కారణం ఏమిటి అంటే తను పెంచుతున్న బాబుకి జ్వరం అని స్కూల్ లో పనిచేసే మరో అమ్మాయి చెప్పింది. మరో రెండు రోజులు చూసి ఇంక వుండబట్టలేక పోయింది సింధు. వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసి బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది రాజవ్వ

."అమ్మ , మీరు మా ఇంటికి " ఏమనాలో తెలియక తడబడుతూ కొంచెం దుమ్ము పట్టి, ఒక కాలు విరిగిన కుర్చీ ముందుకు జరిపి దానికి కింద ఒక చెక్కపెట్టి రండమ్మా కూర్చొండి! అంది.

"పరవాలేదు ఎట్లా ఉన్నాడు బాబు??" అంది వాడి కోసం వెతుకుతూ. ఒక మూల బొంత మీద పడుకొని ఉన్నాడు బాబు. "అట్లనే ఉన్నాడు అమ్మ" దిగులుగా అంది రాజవ్వ. దగ్గరికి వెళ్లి ముట్టుకొని చూసింది, కొద్దిగా వేడిగా తగిలింది వాడి శరీరం.

"పద నేను తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరికి" అని వాడిని ఎత్తుకుని బయటికి వచ్చింది. కొంత ఆశ్చర్యం గానే సింధు ని అనుసరించింది రాజవ్వ. డాక్టర్ కి చూపించి వాడికి అవసరమైన వైద్యం చేయించాక గాని కుదుటపడలేదు సింధు. ఆరోజు నుండి నిన్నటి వరకు అన్యమనస్కంగానే ఉంది సింధు. "ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? అని అడిగినప్పుడల్లా "ఆ బాబు గురించి అమ్మ, ఎలా వాడి జీవితం బాగు చేయడం? అనేది దీనంగా. జరిగినదంతా తెలుసు రాజేష్ భార్గవిలకి. సింధూ అలా అందరికీ సాయం చేయడం అలవాటే కనుక ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. "నువ్వు అంతా మనసులో పెట్టుకోకు సింధు, ప్రపంచంలో అలాంటివాళ్లు లక్షల మంది ఉన్నారు. దేవుడు అలా రాశారు వారి నొసటన" అంది భార్గవి తేలిగ్గా తీసుకుంటూ.

కానీ సింధు ఆలోచన మారలేదు, ఓక రోజు ఇంట్లో బాంబు పేల్చింది, తాను రాజవ్వ తో మాట్లాడానని, ఆ పిల్లాడిని తెచ్చి పెంచుకోవడానికి ఒప్పుకుందని. అంతే కాదు ఆ బాబును దత్తత తీసుకుని తనే వాడి బాగోగులు చూస్తానని కూడా అంది. మూడు వంతులు రాజవ్వ కి కొంత డబ్బు ముట్టచెప్పి ఉండొచ్చు కూడా అనుకున్నారు రాజేష్ భార్గవి.

"ఏంటండీ మాట్లాడరు? అదేదో వాగుతుంటే? అయినా ఇదంతా మీ వల్లే, చిన్నప్పటినుండి సమాజ సేవా, గాడిదగుడ్డు అని పిల్లల్ని పాడు చేశారు" ఉక్రోషంగా అంది భార్గవి.

ఆలోచనల నుంచి బయట పడ్డాడు రాజేష్. "అమ్మా సింధు, నీ ఆలోచన మంచిదే కానీ తర్వాత పరిణామము ఆలోచించావా? నీకు పెళ్లి కావడం అంత సులభం కాదు, అలాగే బాబు ని ఎలా చూసుకోగలవు? స్కూల్ ఉద్యోగం ఏం చేస్తావ్? ఆఖరి ఆయుధంగా అడిగాడు రాజేష్.

"పరవాలేదు నాన్నా, వీడిని పెంచుకుందామన్న ఆలోచన రాగానే ఇలాంటి పిల్లల కోసం ఉన్న స్పెషల్ రిహాబిలిటేషన్ స్కూల్ కోసం వెతికాను. మీకు చెప్పకుండా నేను చేసిన పని అది ఒక్కటే. ఆ స్కూల్ లో జాబ్ కి అప్లై చేసి సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ట్రైనీ గా తీసుకుంటున్నారు. ఆరు నెలలు చూసి నేను అందులో బాగా రాణించాను అంటే పెర్మనెంటు చేస్తారు. నాకు అందులో వచ్చే జీతం కన్నా నా కొడుకుగా వాడికి కొంత ఫీజులో డిస్కౌంట్ ఉంటుంది. నేను అక్కడే ఉంటాను కాబట్టి స్పెషల్ కేర్ ఉంటుంది, అన్ని రకాలుగా అది లాభం నాకు. ఇంక పెళ్లి అంటారా, నన్ను, నా ఆలోచనల్ని గౌరవించేవాడిని, నన్ను నన్నుగా ప్రేమించే వారిని నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఒక్కటే జీవిత పరమార్ధం కాదు, కాకపోయినా నాకేం బాధలేదు. ప్రతి మనిషికి సమాజంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి నా ఉద్దేశం లో. మారుతున్న సమాజంలో పెళ్లి కాక , సమాజసేవ, పరోపకారం లాంటివి కూడా ముఖ్యమైనవే. దేవుడి దయ వల్ల మనకు డబ్బు ఇబ్బంది లేదు, అలాగే ఈ కొత్త జాబ్ తో వాడికి తగిన ట్రీట్మెంట్ ఇప్పించగలనని ధైర్యం నాకుంది" అని ఒక రకమైన దృఢనిశ్చయంతో అంది సింధు.

రాజేష్, భార్గవి ఎన్ని చెప్పినా వినలేదు. అన్ని విధాలా అన్ని రకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి "రాధేశ్యామ్" (ఆ పేరు తనే పెట్టుకుంది) ని ఇంటికి తీసుకువచ్చింది. అనుకున్నట్టే బంధువుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. "ఎవరో అనాధ పిల్లాడిని సింధు పెంచుకుంటోందిట కదా, వాడు కొంచెం తెలివి తక్కువ వాడుట కదా" అని అతి హీనమైన భాషలో అడుగుతుంటే సింధు బంధువుల ముందుకు రావడం మానేసింది. వాడితోటే లోకం. తను వెళ్ళే స్కూల్లో కూడా ఇంచుమించు ఇలాంటి పిల్లలే. వాళ్ళ అమాయకత్వం, ఆ పసితనాన్ని చూస్తుంటే జాలి, ప్రేమ అన్ని రకాల భావాలు ఒక్కసారిగా కలిగాయి. ఆడుకునే పిల్లలు , కొంచెం వీళ్ళకి అందరి లాగ మామూలు జీవితం భగవంతుడు ఇచ్చి ఉంటే ప్రపంచాన్ని ఏలేద్దురు అనుకునేది అప్పుడప్పుడు. అనుకున్నట్టుగానే పెళ్లి కాకుండా పిల్లాడిని పెంచుతుంది అని తెలిసి వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళి పోయాయి.

"పర్వాలేదు, నాకు పెళ్లి కాలేదు అని బాధ లేదు" అనుకుంది సింధు. చూస్తుండగానే నాలుగేళ్ళు గడిచాయి. రాధేశ్యామ్ పెద్దవాడవుతున్నాడు. ఇప్పుడప్పుడే పూర్తి వాక్యం తడబడుతూ అయినా మాట్లాడగలుగుతున్నాడు.

"అమ్మ, అమ్మ" అంటూ సింధు వెనక వెనక తిరుగుతుంటాడు. వాడిని, వాడి ముద్దు మాటలు వింటే కడుపు నిండిపోతుంది సింధుకి. "ఏ జన్మలో నో చాలా పుణ్యం చేసుకున్నాడు వీడు" ఇలా పుట్టినా సింధు లాంటి తల్లి దొరికింది" అనుకునేవారు రాజేష్, భార్గవి.అంత ముద్దు చేసేది వాడిని. వాడు ఏదైనా వేలుపెట్టి చూపించి కావాలంటే వెంటనే కొనాల్సిందే. ఒకోసారి భార్గవి విసుక్కునేది. వాడిని మరీ ముద్దు చేసి పాడు చేస్తున్నావని. రోజులాగే బాబుని తీసుకొని స్కూల్ కి వెళ్ళిన సింధుకి, పిల్లలకి స్పీచ్ థేరపిస్ట్, పిడియాట్రిక్ డాక్టర్, చంద్రశేఖర్ గారి రూములో హడావుడి కనిపించింది.

“ ఏంటి? అంతా హడావుడి గా వున్నారు?” అని అడిగింది టీచర్ కళ్యాణ్ ని.

"అదే మన డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇవాళ రిటైర్మెంట్ రోజు. అందరం కలిసి చిన్న సెండాఫ్ పార్టీ అరేంజ్ చేశాము. నిన్న నేను చెప్పాను కదా నీకు" అంది కళ్యాణి.

"అయ్యే! అవును కదూ, తను మర్చేపోయింది. చాలా మంచి డాక్టర్, చంద్రశేఖర్ గారు.
పిల్లలందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. తనంటే కూడా చాలా అభిమానంగా ఉంటారు. ఆయన వెళ్ళిపోతే ఎవరు వస్తారో? ఎలా ఉంటారో? ఈ పిల్లలకి కావలసింది సహనంతో ప్రేమతో తమని పలకరించేవాళ్లు, మందుల కన్నా ప్రేమ, ఆప్యాయత అన్నది ముఖ్యం వీళ్ళకి అనుకుంది. ఆలోచనల నుంచి బయట పడి తను కూడా ఆ హడావిడి లో పాలుపంచుకుంది.. పూలదండలు, బొకేలు, గిఫ్ట్ లు అందజేయడం అయ్యాక చిన్న పార్టీ జరిగింది. పార్టీ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. హాల్లోకి చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు సందేహిస్తూ .. ఇంతలో డాక్టర్ చంద్రశేఖర్ అటు వైపు చూసి " హలో వెల్కమ్, డాక్టర్ మురళి !! రండి! రండి !మీ కోసం వెయిట్ చేస్తున్నానని" "హలో ! అందరు వినండి, రేపటి నుండి మన హాస్పిటల్, క్షమించాలి మన స్కూలుకు నా ప్లేస్ లో వస్తున్న డాక్టర్.. డాక్టర్ మురళీ!! ఈయన ఈ సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేశారు.. విదేశాల్లో చదివి వాళ్ళు మంచి ఉద్యోగాలు ఇస్తామన్నా మన దేశం, దేశ సేవ లాంటి మంచి ఉద్దేశాలు ఉన్న డాక్టర్. నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు." అని డాక్టర్ మురళి ని పరిచయం చేశారు. చక్కటి చిరునవ్వుతో మృదువైన మాట సరళత్వం ఆకట్టుకునే రూపం తో డాక్టర్ మురళీ అందర్నీ మెస్మరైజ్ చేశాడు. పిల్లలు, పెద్దలు కూడా అతను కోసం అతని తో సమయం గడపడం కోసం వేచి చూడటం మొదలైంది.సింధు కూడా తనకి తెలియకుండా నే అతని వైపు ఆకర్షితురాలైంది. ఎందుకిలా జరుగుతోంది తనకి? "ఛీ !”తప్పు!”. ఒకవేళ పెళ్లి అయిన వాడైతే? అమ్మో! అలా అవ్వకపోతే బాగుండును" పరి పరి విధాల పోయే మనసును నిగ్రహించుకోవడం కష్టంగానే ఉంది సింధుకి.

ఒకరోజు తన క్లాస్ అయ్యాక బాబు క్లాస్ కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ మురళీ పిల్లలందరికీ రొటీన్ చెకప్ చేస్తున్నారు. సింధు ని చూడగానే చిరునవ్వు నవ్వాడు. అయిపోయింది ఒక్క ఐదు నిమిషాలు అన్నట్టుగా చూశాడు. కాళ్ళు వణికాయి సింధు కి. ఎందుకు ఇతన్ని చూడగానే ఇలా అవుతుంది తనకి అనుకుంది. ఆలోచన నుంచి తేరుకునే సరికి అతను చెకప్స్ అయిపోయి బ్యాగు సర్దుకుంటున్నాడు.

"రండి సింధుజ! నా చెకప్స్ అయిపోయాయి. మీ క్లాసా ఇప్పుడు " అని అడిగాడు. "లేదంటే మా బాబు కోసం వచ్చానని" అంది సింధు.

"మీ బాబా?" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ మురళి. " అవును" అని రాధేశ్యామ్ వైపు వేలుపెట్టి చూపించింది. "నాకు తెలియదు ఇన్ని రోజులు" మళ్లీ ఆశ్చర్యంగా అన్నాడు మురళి. అతని చూపులు తప్పించుకొని, బాబు దగ్గరికి వెళ్లి వాడి బ్యాగును తీసుకొని వాడి చెయ్యి పట్టుకుని బయటకు నడిచింది సింధు. సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు మురళి.

ఒక నాలుగు నెలలు ఏ మార్పులేకుండా గడిచిపోయింది. సింధూ కూడా రోజు మురళిని చూస్తున్నా చిన్న చిరునవ్వు తో ఆగిపోయిందా పరిచయం. అంతకంటే ముందుకు నడవలేదు. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే తల్లి " సింధు, కొంచెం మంచి చీర కట్టుకొని కాస్త త్వరగా తయారవు తల్లి, నాన్నగారి ఫ్రెండ్స్ వస్తున్నారు మనింటి కి " అంది వంటింట్లో హడావుడి పడుతూ. "ఎవరబ్బా" అనుకుంటూ తల్లి చెప్పినట్టే తయారై కిందకి వచ్చేసరికి హాల్లో హడావుడి కనిపించింది. లోపలికి వెళ్లగానే "మా అమ్మాయి సింధు" అని రాజేష్ "అమ్మ సింధు, డాక్టర్ విశ్వనాథం గారు, ఇతడు వీళ్ళ అబ్బాయి డాక్టర్ మురళి, ఈవిడ డాక్టర్ ప్రేమ, అని వాళ్ళను పరిచయం చేశాడు.. డాక్టర్ మురళి సింధు ని చూడగానే చిరునవ్వు నవ్వాడు. "ఇతను?? అరే వీళ్ళు నాన్న కు తెలుసా? అని ఆశ్చర్యపోయింది సింధు.

"సింధు నాకు డాక్టర్ మురళి ఇదివరకు తెలియదు, నిన్ను చూడగానే పెళ్లి అంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండి పోతాను. అని అనుకున్నాడుట. తన తల్లిదండ్రులైన వీరిద్దరికీ ఈ సంగతంతా చెప్పి ఇక్కడి కి తెచ్చాడు. నీకు ఇష్టమైతే" అన్నాడు రాజేష్.

"నాన్న, బాబు సంగతి?” అని సింధు సంకొచిస్తూ. అతను ఏదో చెప్పే లాగా మురళి "సింధు నాకన్నీ తెలుసు, నాకు మీ మీద ఇష్టం మీ బాబు సంగతి తెలిశాక ఇంకా పెరిగింది , అన్ని విధాలా ఇష్టపడే మనస్ఫూర్తిగా మిమ్మల్ని భార్యగా పొందాలి అనుకుంటున్నాను. మరి మీకు?? " అన్నాడు. అప్పుడే అక్కడి కి వచ్చిన రాధేశ్యామ్ "అమ్మ ఎవరు అది ? " అన్నాడు ముద్దుగా మురళి వంక చూపిస్తూ. "నాన్న" నెమ్మదిగా సిగ్గుగా అంది సింధు..

మరిన్ని కథలు

Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా
Aparichitudu
అపరిచితుడు
- డి.కె.చదువుల బాబు