“ఏమిటి ఈ మద్య ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది లాంటి వంకలు చెప్పటం లేదు నా వంటకు” అని నాకు టిఫిన్ ప్లేట్ అందిస్తూ అడిగింది నా శ్రీమతి కరోన .. సారి కరుణ, గత రెండు నెలల నుండి ఏం ఆలోచించిన ,మాట్లాడినా అంతా కరోన గురుంచే ఉండటంవలన టంగ్ స్లిప్ అయ్యింది అంతే.
“ఇంకా నీ వంటేమిటి, లాక్ డౌన్ పెట్టినప్పటినుండి ఇంట్లో ప్రతివంటలో నా భాగస్వామ్యం, శ్రమధానం ఉన్నాయి కదా! అందుకే అంత పర్ఫెక్ట్ గా కుదురుతున్నాయి” అన్నాను టిఫిన్ ప్లేట్ అందుకుంటూ.
అంత పెర్ఫెక్ట్ చేసుకోగలిగితే, స్కూల్ హాలిడేస్ కి పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్లినప్పుడు భోజనం కుదరటం లేదని గగ్గోలు పెట్టి మరి నేను తిరిగి వచ్చేవరకు చిన్న పిల్లడిలా ఎందుకు ఏడ్చేవారు?” అంది వెక్కిరింపుగా.
“అంటే .. అప్పుడు.. గరిట పట్టుకోవటమే తెలియదు, అసలు వంట గురుంచే నేను ఆలోచన చెయ్యలేదు, ఆలోచన చేసి ఉంటే నిన్నెందుకు రమ్మని బ్రతిమాలే వాడిని?, లాక్ డౌన్ పుణ్యమా అని ఇంట్లో ఉండటం వలన వంట మీద కొంచెం దృష్టి పెట్టటం వలన తెలిసిందేమిటంటే వంట చేయటం అంత కష్టం కాదని” అన్నాను.
“అవునా! అంత కష్టం కాకపోతే, ఈ రోజు నుండి మొత్తం వంట మీరే చేసుకోండీ, ఎలాను మీకు బయటకు వెళ్ళే పని లేదు కదా! నాకు కాస్త విశ్రాంతైనా దొరుకుతుంది“ నా ఎదురుగా సోఫా లో కూర్చుంది.
అబ్బో ఇదేదో నా మెడకు చుట్టుకొనేలా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, నోటికొచ్చినట్టు గొప్పలు మాట్లాడితే తను హర్టై అలిగిందనుకో వంట పని మొత్తం నా నెత్తిమీద పడేటట్టుంది.
మహానుభావుడెవరో అదేదో సినిమాలో చెప్పినట్టు “ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి”, ఇప్పుడు నాకు నెగ్గటం కంటే తగ్గటమే శ్రేయస్కరం.
“అంత కష్టం కాదన్నాను కానీ, అసలు కష్టమే లేదన్ననా?,నువ్వు ఎంత కష్ట పడుతున్నావో నేను చూడటం లేదా?” ఆమె ప్రక్కన కూర్చొని బ్రతిమాలుతున్నట్టు గా అన్నాను.
“అయితే, మీరు హెల్ప్ చేయటం వలనే వంటలు బాగుంటున్నాయా? అంతకు ముందు బాగా వండలేదా?”
చెప్పండి అని నిలదీసింది.
“ఇప్పుడు ఎంత బాగున్నాయో అప్పుడు కూడా అంతే బాగుండేవి వంటలు. విషయం ఏమిటంటే, ఫ్రీ గా వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు కంటే కష్టపడి వంద రూపాయలు సంపాదించినప్పుడే గొప్ప అనిపిస్తుంది కదా!. ఇంతకు ముందు నేను ఆఫీసు నుండి నీకే సహాయం చేయకుండా నువ్వు వండితే తినే వాడిని, ఇప్పుడు నీతోపాటు కలిసి వంట చేస్తున్నాను కనుక వంట చేసేటప్పుడు కష్ట మెంటో అర్థమైంది, వంటలో రుచి తెలిసింది. ఏ పనైనా సొంతం గా చేసినప్పుడే దానిలో విషయం, విలువ తెలుస్తాయి. అయినా నేను చేసే సహాయం ఎంత, ఏదో ఉడత సాయం. చేసేదంతా నువ్వెకదా, నా వల్లెమౌతుంది. అసలు నువ్వు లేకపోతే ఈ ఇంటికి దిక్కేవరు, ఆ మాట కొస్తే ఏ ఇంటి కైనా ఆ ఇంటి ఇల్లాలే దిక్కు కదా! ” ఈ మాటల తో నా శ్రీమతి ముఖం లో సంతృప్తి కనిపించింది.
“హమ్మయ్య“ అనుకున్నాను.
ఇంతలో బెడ్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టినే నా మొబైల్ రింగవుతుంది.
కరుణ లేచి బెడ్ రూమ్ నుండి నా మొబైల్ ఫోన్ తెచ్చి ఇచ్చి, టీ చేసి తెస్తానని కిచెన్ లో కి వెళ్లింది.
ఫోన్ వచ్చింది మా ఇద్దరి అబ్బాయిలు చెదివే స్కూల్ నుండి. పెద్దోడు ఐదో క్లాస్, చిన్నోడు మూడో క్లాస్. లాక్ డౌన్ చేసిన తర్వాత క్లాస్ వైస్ వాట్సాప్ గ్రూప్ తయారుచేసి పేరెంట్స్ ని ఆ గ్రూప్ లో యాడ్ చేసి డైలీ హోమ్ వర్క్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టటం మేము వీళ్ళ చేత ఒక నోట్ బుక్ లో కాపీ చేయించి ఆన్సర్స్ వ్రాయించి ఫోటో తీసి మళ్ళీ వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చెయ్యాలి. హోమ్ వర్కే కాదు ఎసైంమెంట్స్, ఎగ్జామ్ పేపర్ కూడా గ్రూప్ లో పెడతారట అది డౌన్ లోడ్ చేసి వాళ్ళు ఇచ్చిన టైమ్ లోపులో వీళ్ళ చేత ఎగ్జామ్ వ్రాయించి, వ్రాసేటప్పుడు వీడియో తీసి, ఆన్సర్ షీట్ తో పాటు వీడియో కూడా అప్లోడ్ చెయ్యాలట. అవి అన్నీ రికార్డ్స్ మెయింటెయన్ చెయ్యాలట వాళ్ళు.
రేపు ఎగ్జామ్ పెడుతున్నాము అని చెప్పి ఈరోజు హోమ్ వర్క్ ఇంకా అప్లోడ్ చేయలేదని గుర్తు చేయటానికి ఫోన్ చేశారు.
గవర్నమెంట్ వాళ్ళు తొమ్మిదో క్లాస్ వరకూ అందరినీ ప్రమోట్ చేశామని చెబితే ఈ స్కూల్ వాళ్లెమో ఎగ్జామ్స్, ఫోటోస్ అంటూ ఓవర్ చేస్తున్నారు.
ఒక విధంగా ఇదే బాగున్నట్టుంది. ఆన్ లైన్ లో క్లాస్ లు, వాట్సాప్ లో హోమ్ వర్క్స్, ఎగ్జామ్స్ . అపార్ట్మెంట్ లో నడిచే ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ కి పిల్లలు వెళితే ఏంటి వెళ్ళక పోతే ఏంటి. ఈ పద్దతి కంటిన్యూ చేస్తే సరి. వాళ్ళకు పెద్ద పెద్ద స్కూల్స్ మెయింటెన్ చేసే బాధ తప్పుతుంది. మనకు బస్ ఫీజులు, యూనిఫాం లాంటి ఖర్చులు తగ్గుతాయి, ఉదయమే హడావుడి గా బాక్స్ ప్రిపేర్ చేసే బాధ, సాయంత్రం పిల్లల కోసం ఎదురుచూసే టెన్షన్ తగ్గుతాయి.
టీ తీసుకొచ్చిన కరుణ తో అదేవిషయం చెప్పాను.
“బాగానే ఉంటుంది, మీరు కూడా ఇకముందు ఆఫీసు కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని ఇంట్లోనే ఉండండి. లేకపోతే ఈ పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉండి చేసే అల్లరి భరించటం నా వల్ల కాదు.” అని టీ గ్లాస్ నా ముందు పెట్టి వెళ్ళి పోయింది.
నిజమే కదా మినిమమ్ స్టాఫ్ తో ఆఫీసు లు నడిపించుకుంటూ, తక్కిన వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే, పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఆఫీస్ లకు అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ వాడకం తగ్గుతుంది,ట్రాఫ్ఫిక్ తగ్గుతుంది, పెట్రోల్ వాడకం తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఆహా! కరోన రాబట్టే కదా ఈ విధం గా చెయ్యొచ్చు అనే విషయం తెలిసింది.
అసలు వారనికో ఆదివారం లా ఇకనుండి ప్రతి సంవత్సరం ఒక నెల ప్రపంచం మొత్తం లాక్ డౌన్ పెడితే ఎలా ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ప్రజలు ఒక నెలపాటు ఇంట్లోనే ఫ్యామిలీ తో గడుపుతారు. ఇలా ఆలోచిస్తుండగా మా పెద్దోడు వచ్చాడు.
“నాన్నా, ఎన్ని రోజులు ఇంట్లోనే కూర్చుంటామ్? బయటకు తీసుకెళ్లు, కనీసం మన కాలనీ గుడి కైనా వెళ్దాం, బోర్ కొడుతుంది. గుడి దూరం గా ఏమి లేదు కదా, నాలుగిళ్లు అవతలే కదా ఉంది.” పాపం బ్రతిమాలుతున్నాడు.
దేవుడే టెంపుల్ క్వారెంటైన్ లో ఉన్నాడు, కరోనాను ఎలా తరిమేయ్యాలో పాపం ఆయనకు కూడా తెలియదు. తెలిస్తే ఎవరో ఒకరి కలలో కనపడి నాకు గుడి కట్టండి,జాతర చేయండి లాంటి విషయాలు చెప్పే దేవుడు ఇది మాత్రం ఎందుకు చెప్పడు.
“నాన్నా, పద వెళ్దాం “ మా వాడు చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు.
“అరె , హోం వర్క్ చేసావా ?”
“అయిపోయింది, అమ్మ నాది , తమ్ముడిది హోం వర్క్ షీట్స్ అప్లోడ్ కూడా చేసింది. పద వెళ్దాం” వాడు పట్టు విడవటం లేదు.
“మనం బయటకు వెళ్లకూడదు. ప్రైమ్ మినిస్టర్ తాత చెప్పాడు కదా బయటకు వెళ్లొద్దని వెళితే కరోన వైరస్ వస్తుందని”
“మరి శర్మ అంకుల్ రోజు గుడికి వెళ్తున్నాడుగా నేను చూశాను”
“అంకుల్ వెళ్లొచ్చు మనం వెళ్లకూడదు”
“ఎందుకు?”
“ఎందుకంటే .. మనం ఇంట్లో ఉంటే మనకు కావలిసినవి అమ్మ చేసిపెడుతుందిగా, అలాగే దేవుడికి నైవేద్యాలు,పూజలు అభిషేకాలు లాంటివి శర్మ అంకుల్ చేస్తాడు కాబట్టి ఆయన వెళ్లొచ్చు. లోపలికి పోయి తమ్ముడితో ఆడుకో ” అని బలవంతం గా లోపలికి పంపించాను.
పాపం దేవుడికి శర్మ గారు తప్ప ఎవరున్నారు ఈ పరిస్తితితులలో. పూజలకు, నైవేద్యాలకు కావలిసిన సామగ్రి ఏదో తంటాలు పడి ఆయనే సమకూర్చుకుంటున్నారు.
“మన పక్కింటి రమేశ్ ఫోన్ చేస్తున్నాడు “ అంటూ నా కరుణ ఫోన్ ఇచ్చి వెళ్లింది.
“రమేశ్ ఏంటి సంగతులు?”
“ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మన వెనక లైన్ లో పాలు పోసే రామ్మూర్తి కి కరోన పాజిటివ్ వచ్చిందట”
“అయ్యో పాపం, ఇప్పుడు ఏంటి పరిస్తితి?”
“ఏముంది, ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన ఎవరెవరికి పాలు పోస్తున్నాడో అందరినీ రాత్రి ఐసోలాషన్ వార్డ్ కి తరలించారట. వాళ్ళ దగ్గర శాంపిల్స్ తీసుకుని టెస్ట్ కు పంపించారట.
రిజల్ట్ నెగిటివ్ వస్తే రెండు వారాలు ఐసోలాషన్ వార్డ్ లేక పోతే జబ్బు తగ్గే వరకు హాస్పిటల్ లో ఉండాలి.”
“మనకేం ప్రోబ్లెమ్ లేదు కదా, అంటే ఒకే కాలనీ కదా మనల్ని తీసుకు పోరు కదా!”
“లేదు, వాళ్ళ కాంటాక్ట్ హిస్టరి లో మనం ఉంటే తప్ప. మర్చి పోయాను మన గుడి పూజారి శర్మ గారిని కూడా తీసుకెళ్లారు, ఎందుకంటే రెండు రోజుల క్రితం రామ్మూర్తి దగ్గర ఆవు పాలు తీసుకున్నారట దేవుడి అభిషేకం కోసం.”
“హత విధి ! ఎంత పని జరిగింది? ఆయనకు రిజల్ట్ నెగిటివ్ రావాలని ఆ దేవుడి ని కోరుకుందాం. మరి గుడి సంగతి, దేవుడి సంగతేంటి ?”
“ఏం చేస్తాం! ఇటువంటి పరిస్తితులలో ఎవరు దొరుకుతారు, కానీ ఎన్ని తిప్పలు పడైనా ఎవరో ఒకరిని చూడాలి, దేవుడిని అలా వదిలేయలేం కదా. సరే ఇక ఉంటాను.” అంటూ కాల్ కట్ చేశాడు.
ఫోన్ పక్కన పడేసి నేను ఆలోచనలో పడ్డాను.
పాలు తీసుకున్న శర్మ గారిని తీసుకెళ్లారు సరే, అభిషేకం చేయించుకున్న దేవుడి విగ్రహం సంగతేంటి? విగ్రహాన్ని శానిటైజ్ చెయ్యాలా ? మరో పూజారి దొరకక పోతే దేవుడికి దిక్కేవరు?
***********************************************************