పూర్వం విషాద రాజ్యాన్ని పరిపాలించే విక్రమసేనుడి పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్న తరుణంలో ఆ రాజ్యంలో హఠాత్తుగా ఓ వింత మహమ్మారి ఒక్కసారిగా ఆ రాజ్యమంతటా వ్యాపించింది. చూడటానికి చాలా చిన్నవ్యాధిలా కనిపించే ఆ వ్యాధి మొదట్లో చిన్నపాటి జలుబూ, దగ్గుతో ప్రారంభమై ఊపిరితిత్తులపై తన ప్రభావం చూపెట్టి మనుష్యులను కబళించసాగింది. ఆ మహామ్మారి తీవ్రత రోజురోజుకూ ప్రబలి ఆ రాజ్యంలో చాలామంది, ముఖ్యంగా వృద్ధులు దాని బారినపడి పిట్టల్లా రాలిపోసాగారు. ఆ వింత వ్యాధిని నయంచేయడం ఏ వైద్యులవల్లనూ కాలేదు. అలాంటి వ్యాధి గురించి గతంలోనూ ఎవ్వరూ వినిఉండలేదు. ఆ రాజ్యంలో వృద్ధులు సైతం అలాంటి రోగం గురించి ఎప్పుడూ వినిఉండలేదు. ఆ వ్యాధిని నియంత్రించడం ఎవరివల్లా కాలేదు.
రోజురోజుకూ పెరుగుతున్న మహమ్మారి తీవ్రతకూ, దానివల్ల అదుపుతప్పుతున్న ప్రజల ఆరోగ్య పరిస్థితికి విక్రమసేనుడు చింతాక్రాంతుడైయ్యాడు. తన మంత్రులను, రాజ వైద్యులనూ ఇతర ప్రముఖులనూ సమావేశపరచి వారితో సంప్రతించాడు.
ముఖ్య రాజవైద్యుడైన వైద్యాచారి, "మహాప్రభూ! ఈ కొత్త వ్యాధి గురించి ఏ మాత్రం అంతుబట్టకున్నది. అన్ని వైద్యగ్రంథాలు తిరగేసినా ఏ మాత్రం ఆచూకీ తెలియడంలేదు. మన రాజ్యంలోకి ఈ వ్యాధి ఎలా ప్రవేశించిందో తెలియడంలేదుగాని, ఒకరినుండి ఇంకొకరికి చాలా సులభంగా సంక్రమిస్తోంది. మామూలు జలబు, దగ్గులకి ప్రయోగించే ఔషధాలేమీ పనిచేయటం లేదు. ఈ వ్యాధి గురించి ఏ వైద్యగ్రంథాల్లోనూ ప్రస్తావన లేదు. ఈ పరిస్తితుల్లో ఏం చేయాలో తోచడం లేదు మహాప్రభూ." అన్నాడు.
మిగతా వైద్యులూ, మంత్రులూ కూడా రకరకాల అభిప్రాయాలు వెలుబుచ్చారు. కాని వాటివల్ల ఏమీ తేలలేదు. ఈ సమావేశంవల్ల ఏ ఫలితం రాకపోవడంవల్ల మహారాజు తీవ్ర చింతగ్రస్తుడయ్యాడు.
అది చూసి, రాజపురోహితుడు లేచి నిలబడ్డాడు.
"ప్రభూ ఇదంతా చూస్తూంటే మన రాజ్య అధిష్థాన దేవతైన విషాదదేవికి ఏదో అపచారం జరిగినట్లుంది. ఆ దేవత యొక్క ఆగ్రహం వల్ల ఈ మహమ్మారి ప్రబలి ఉంటుంది. అందుకని ఆ దేవికి విరివిగా పూజలు జరిపించి జంతుబలి ఇస్తే ప్రయోజనం ఉంటుంది మహాప్రభూ!" అన్నాడు.
మహారాజు విక్రమసేనుడు తల పంకించాడు.
మరో పండితుడు లేచి, "ప్రభూ! యాగయఙాదులవల్ల కూడా మనకి తెలియని విపత్తులనుండి తగిన రక్షణ దొరకగలదని పురాణ గ్రంధాలు ఘోషిస్తున్నాయి. అందుకని తమరు ఆ ఏర్పాట్లు చేస్తే ఈ విపత్తు నుండి బయటపడవచ్చని నాకు తోస్తున్నది." అన్నాడు.
దానికీ విక్రమసేనుడు తన ఆమోదం తెలిపాడు. ఆ తర్వాత రాజపురోహితుడు చెప్పినట్లు విషాదదేవి పూజలూ జరగాయి, యాగాలు కూడా నిర్వహించడం జరిగింది. అయినా ఆ రాజ్య పరిస్థితుల్లో ఏమీ తేడా రాలేదు. అంతేకాకుండా ఇంతకు ముందు కన్నా మహమ్మారి ఇంకా వేగంగా ప్రబలి ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకుంటోంది. ఇదే అదుననుకొని, కొంతమంది మాంత్రికులైతే ప్రజలకి మంత్రించిన తాయత్తులు కట్టి బాగా సొమ్ము చేసుకున్నారు.
విక్రమసేనుడు ఇంకా చింతాగ్రస్తుడైనాడు. తనను నమ్మిన ప్రజల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవసాగాడు. ఇంతలో అతనిని కలవడానికి వివేకుడనే యువకుడు వచ్చాడు. వివేకుడు మహరాజుకి నమస్కరించి, "ప్రభూ! తమరు వింటానంటే ఈ మహమ్మారి కట్టడికి నేను కొన్ని సలహాలివ్వదలచాను." అన్నాడు.
అప్పటికే చాలామంది సన్నిహితులు, ప్రముఖులనుండి సలహాలు పొంది ఆ విధంగా పాటించినా కూడా తగిన ఫలితాలేవీ రాకపోవడంతో విసుగుచెంది ఉన్నాడు విక్రమసేనుడు.
మహామహులే ఈ విషయంలో విఫలమైనప్పుడు, చాలా పిన్న వయస్కుడైన ఈ యువకుడివలన ఏమవుతుందని మనసులో అనుకున్నాడు. అయినా ఆశ చావక ఆ యువకుడికి ఒక అవకాశం ఇచ్చాడు.
అప్పుడు వివేకుడు, "ప్రభూ! నేను కొన్నిరోజుల కిందట మా మేనమామను కలిసేందుకు పొరుగు రాజ్యమైన నందనరాజ్యం వెళ్ళాను. అక్కడ కూడా మూడు నెలల క్రితం ఇలాంటి మహమ్మారి ప్రబలింది. అప్పటికే కొంతమంది జనం దాని బారిన పడి మరణించారు. ఈ వ్యాధికి ఇంతవరకూ ఔషధాల ప్రస్తావన ఏ వైద్య గ్రంధాల్లో లేకపోయినా ఆ దేశం మహామంత్రియొక్క సలహాతో ఆ వ్యాధిని సమూలంగా నిర్మూలించగలిగాడు ఆ రాజు." అన్నాడు.
విక్రమసేనుడు ఆతృతగా వివేకుడివైపు చూసి, "అలాగా! ఈ మహమ్మారిని కట్టడి చేయడం వాళ్ళకెలాగ సాధ్యమైంది?" అని అడిగాడు.
"మహారాజా! వైద్యులు చెప్పిన ప్రకారం ఈ వ్యాధి ఒకరినుండి ఒకరికి సులభంగా పాకుతుంది. అందుకే, ఆ రాజ్యం మహామంత్రి సలహామేరకు, ఆ దేశం రాజు తన ప్రజలని బయట తిరగకుండా కట్టడి చేసాడు. ఎవరింట్లోనే వాళ్ళుండాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసాడు. ప్రజలు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించవలసిందిగా ఉత్తర్వులు చేసాడు. రోగనిరోధకశక్తి పెంపొందే విధంగా తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆదేశాలిచ్చాడు. ఇతర ప్రాంతలనుండి వచ్చేవాళ్ళను విధిగా ఆరోగ్య పరీక్ష చేసిన తర్వాతే ఆ దేశంలోకి రానిస్తున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం మాత్రమే ఆ రాజ్యంలోకి అడుగుపెట్టనిచ్చారు. ఆ విధంగా ఆ రాజ్యప్రజలు నడుచుకున్న కొద్దిరోజులలోనే ఆ వ్యాధి మరి ఇతరులకు వ్యాపించలేదు. నెమ్మదిగా ఆ వ్యాధి నియంత్రణలోకివచ్చి త్వరలోనే తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఆ రాజ్యంలో మరి వ్యాధిగ్రస్తులెవరూ లేరు. అందుకే, మహారాజా, తమరు కూడా ఆ విధంగా ఆచరిస్తే ఈ మహమ్మారిబారినుండి రక్షణ పొందవచ్చు." అన్నాడు వివేకుడు.
వివేకుడి మాటలు విక్రమసేనుడికి అమృతతుల్యంగా తోచాయి. వివేకుణ్ణి మెచ్చుకుని తన మహామంత్రిని పిలిపించి మహమ్మరి కట్టడికి తగిన ఆఙలు జారీచేసాడు. అవి ప్రజలు సక్రమంగా పాటించసాగారు. త్వరలోనే మహమ్మారి అదుపులోకి వచ్చి మరింత ప్రాణనష్టం నివారించగలిగాడు. సమయానికి తగిన సలహా ఇచ్చి రాజ్య ప్రజల ప్రాణాలను కాపాడినందుకు వివేకుడికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు విక్రమసేనుడు.