ఎర్ర చున్నీ - భవ్య చారు

red chunni

ఎర్రచున్నీ అంటే నాకు గుర్తొచ్చేది నాకు మా నాన్నగారు కొనిచ్చిన మొట్ట మొదటి చుడిదార్ గుర్తొస్తుంది. అప్పుడు మేము ఒక మోస్తరు పట్టణము లాంటి పల్లెలో ఉండేవాళ్ళం. అవి నేను పదవతరగతి లోకి వచ్చిన తొలి రోజులు,అంతా భయం పదవతరగతి అంటే కొంచం గర్వం, అహంకారం, పొగరు ఉంటాయి కదా,

మేమే పదవతరరగతి పిల్లలం,మాకే అన్ని తెలుసు అని అన్నట్టుగా,చిన్న క్లాస్ ల వారితో మాట్లాడకుండా,మాకు మేమే మాట్లాడుకుంటూ, మాలో మేమే కబుర్లు చెప్పుకుంటూ, వారి దగ్గర డబ్బాలు కొట్టుకుంటూ, వారు మకంటే చిన్న వారు , వారికేమి తెలియదు అన్నట్టుగా ఉండే వాళ్ళం.అడపిల్లలం మరి ఎక్కువ, తొమ్మిదో తరగతి పిల్లలు వచ్చి మమ్మల్ని బుక్స్ అడిగితే అదో గొప్ప మాకు , అలా రోజులు గడిచిపోతున్నాయి హాయిగా, ఆనందంగా...

ఇంతలో మా తాతగారికి ఒంట్లో బాగాలేదని ఉత్తరం రావడంతో,మా అమ్మని ఒక్కదాన్నే పంపించారు మా నాన్నగారు. అప్పుడు నాకు మూడు నెలల పరీక్షలు జరుగుతున్నాయి. వెళ్లి ,చూసి వెంటనే రమ్మని ఒక్కదాన్నే పంపించారు. నేను,నాన్న, తమ్ముళ్ళం మేమే ఉన్నాం, రోజూ పొద్దున్నే వంట చేసి, వారికి పెట్టి, నేను తిని పది గంటల వరకు స్కూల్ కి వెళ్ళేదాన్ని,అలా పరీక్షలు అవుతుండగా, మధ్యలో ఒక ఆదివారం వచ్చింది..

ఆ ఆదివారం రోజు మా నాన్నగారు దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్దాం , రెడి అవమని, వంట ఏమి చేయొద్దు అని చెప్పారు. మేము సరే అని సంబరపడి, నేను తమ్ముళ్లని రెడి చేసాను,కొంచం ఉప్మా చేసి అందరం తినేసి,రోడ్ మీదకి వెళ్ళాం బస్ ఎక్కడం కోసం, బస్ తొందరగానే వచ్చింది. ఆదివారం కాబట్టీ ఎక్కువ జనాలు లేరు బస్ ఎక్కి కూర్చున్నాము.

ఆ ఊరు దాటి ఎప్పుడూ, ఎక్కడికి వెళ్ళలేదు మేము. మాకు చాలా సంతోషంగా అనిపించింది. కిటికీ పక్కన కూర్చుని, వెనక్కి వెళ్తున్న చెట్లు, చిన్న,చిన్న కాలువ లోని కలువలని చూస్తూ, అవి నేను వస్తున్న అనే పుచాయి అని అనుకుంటూ, మనసులో ఆనందపడుతూ, అన్ని ఊరి పేర్లని చదువుకుంటూ, ఎక్కే వారిని, దిగుతున్న వారిని చూస్తూ, వెళ్ళాము.

అది కాస్త పెద్ద పట్టణమే, మా జిల్లాకు తాలూకా లాంటిది, అన్ని ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. మూడు సినిమా టాకీస్ లు కూడా ఉన్నాయి. బస్ దిగే సరికి మార్నింగ్ షో టైమ్ అయిపోయింది అని చెప్పారు. దాంతో మధ్యాహ్నం ఆటకి ఇంకా సమయం ఉండడం వల్ల, కాసేపు ఆ పట్టణంలో ఉన్న పెద్ద, పెద్ద దుకాణాలు చూస్తూ, వాటిలోని బొమ్మలకి వేసిన రకరకాల, రంగు రంగుల బట్టలు చూస్తూ,నడుస్తున్నాము.

ఇంతలో మా పెద్ద తమ్ముడు ఆకలి అని ఏడవడం మొదలు పెట్టాడు, దాంతో మా నాన్నగారు మమ్మల్ని దగ్గర్లో ఉన్న హోటల్ కి తీసుకుని వెళ్లారు. మా పెద్దోడు అంటే మా నాన్నకి బాగా ఇష్టం లెండి. వాడికి ఏదీ కావాలి అన్నా ,నిమిషం లో తెస్తారు.అదే మేము హోటల్ కి వెళ్లడం మొదటి సారి, అందులోకి వెళ్తుండగానే ఘుమఘుమలు మాలో ఉన్న ఆకలిని మరింత పెంచాయి.

లోపలికి వెళ్లి ఓ టేబుల్ ముందు కూర్చున్నాం, మాములు దుస్తులు ధరించి,వచ్చిన ఒక అతను ఏం కావాలి సర్ అని అడిగాడు. మా నాన్న మమ్మల్ని ఏమి తింటారు అని అడిగాడు.మా తమ్ముడు అక్కడ ఉన్న పూరీని చూపించాడు చేత్తో, నా వైపు చూసారు మా నాన్న నేను అదేంటో తెలియక అక్కడ పెద్ద పెనం మీద వేసే దాన్ని చూపించాను.

దోశ నా అని ఆ వ్యక్తి మూడు పూరి,ఓ దోశ అని గట్టిగా అరుస్తూ చెప్పాడు.నాకు. చాలా సిగ్గు వేసింది, అతను మేము తినే వాటిని అందరికి తెలిసేలా అరిచి చెప్పడం వల్ల, సరే అవన్నీ వచ్చాయి, నేను దోశ ని చిత్రంగా చూసాను. అది మా ఇంట్లో మా అమ్మ వేసిన అట్టు లాగానే ఉంది.కాని కొంచం ఎరుపు, గోధుమ రంగులో, నెయ్యి వాసనతో, లోపల ఆలూకూర ఉన్నాయి. వాటితో పాటు పచ్చడి, సాంబార్ కూడా ఇచ్చారు.

నేను ఒక ముక్క తీసుకుని ఆలూ కూర ని నంచుకుని నోట్లో పెట్టుకున్న, కానీ నాకు ఎందుకో ఆ రుచి నచ్చలేదు. ఇంకో ముక్క తీసి వేరేగా ఇచ్చిన తెల్లని పచ్చడి తో తిన్నాను, అది బాగా అనిపించింది.( ఎంతైనా మనకి పచ్చళ్ళు ఉంటే చాలు ,ఇంకేమి అవసరం లేదు, ఇప్పటికీ హోటల్ కి వెళ్తే ,ముందుగా ఏం పచ్చళ్ళు ఉన్నాయి. అని అడిగి మరి వేసుకుంటా నేను, దోశ కూడా అంతే, అలు కూర వదిలేసి, సాంబార్ తో తింటా ) .

ఎలాగో తినడం అయ్యింది. ఇంకా సమయం ఉండడంతో మా నాన్నగారు మమ్మల్ని ఒక బట్టల షాప్ లోకి తీసుకుని వెళ్లారు. అక్కడ నాకు పంజాబీ డ్రెస్ లు చూపించమని అడిగారు. అతను అన్ని ముందు వేస్తున్నాడు.అయ్యో ఇవ్వన్నీ కొనమంటాడేమో అనుకున్నా, కానీ అదేమీ అనలేదు,

ఆ దుకాణం లోకి వెళ్లినప్పటి నుండి నా చూపు అంతా, అక్కడే అద్దాలలో ఉన్న ఒక డ్రెస్ మీద పడింది. షాప్ అతను ఎన్ని వేస్తున్నా నేను ఏమి మాట్లాడడం లేదు. అది గమనించిన మా నాన్న నా చూపున్న వైపు చూసి, అది తీయమని అన్నారు షాప్ అతనితో సర్ అది రేటు ఎక్కువ అని అన్నాడు అతను పర్వాలేదు తీయమని అన్నారు నాన్న, అతను తీసాడు.

నా ముందు దాన్ని విప్పి ,చూపించాడు. అబ్బా ఎంత బాగుందో అది , తెల్లని సిల్క్ బట్టమీద ఎర్రని చుక్కలు, బుగ్గల చేతులు, ఎంత బాగుందో, ముట్టుకుంటే జారిపోతుంది చేతిలోంచి,దాన్ని ముట్టుకుని, చేతిలోకి తీసుకుని,నాకు సరిపోతుందో,లేదో అని చూసుకున్నా,అక్కడే ఉన్న నిలువు అద్దంలో, తెల్లగా ఉన్న నాకు అది మరింత అందాన్ని తెచ్చినట్టు అనిపించింది.

"బాగుందా, సరిపోయిందా అన్నారు నాన్నా," " బాగుంది నాన్నా "అని చెప్పాను, రేటు అడిగారు.రెండువందల యాభై అని చెప్పాడు షాప్ అతను . అమ్మో అంత ధర నా, ఇక ఆ డ్రెస్ మీద ఆశ వదులుకున్న నేను , అంత ధర పెట్టి ఎప్పుడూ ఏది కొనలేదు మేము దాంతో నాకు గైడులు (పదవ తరగతి కి అప్పుడు గైడులు చదివే వాళ్ళం ,ఇప్పుడునట్టు అల్ ఇన్ వన్ లు లేవు) వస్తాయి. తమ్ముళ్ల కి చేరి రెండు జతల నిక్కర్లు వస్తాయి.

వద్దు నాన్నా వెళదాం పద , అన్నాను . సరే నువ్వు తమ్ముళ్లకి బట్టలు చూడు అని అన్నారు. తమ్ముళ్ల కి బట్టలు తీసుకుంటూ ఇలా నా మనసులో ఆలోచించుకుంటున్న. తముళ్ళకి డ్రెస్ప లు తీసుకున్నాం. పదమ్మా , వెళ్దాం అని నాన్నా అనడం తో నేను బయటకు వెళ్ళాం. సినిమాకు సమయం అవ్వడం తో ,నాన్న వెళ్లి టిక్కెట్ లు తెచ్చారు.

అది పెదరాయుడు సినిమా, చాలా బాగా నచ్చింది. మొదటి సారి నేను టాకీస్ లో చూసిన సినిమా అది.సినిమాలో పడి,నేను డ్రెస్ సంగతి మర్చిపోయాను. సినిమా అయిపోయింది.మళ్ళీ ఆకలి వేయడంతో పక్కనే ఉన్న హోటల్ లో, ఇదీ వేరే హోటల్, అక్కడ మళ్ళీ ఏం తింటారు అని అడిగారు. పొద్దున తిన్న టిఫిన్లు ఎప్పుడో అరిగిపోయాయి.

మేము అన్నము తింటాం అని అన్నాము.నాన్నా అతనికి చెప్పాడు,ప్లేట్ మీల్స్ అప్పుడు ఎంతో గాని, మాకు అతను తెచ్చిన అన్నం ఏమి సరిపోలేదు.ఓ పక్కకి కూడా కాలేదు, నాలుగు కూరలు, పచ్చడి,పెరుగు, సాంబార్, పప్పు, ఇన్ని ఉన్నాయి.అన్నం మాత్రం చిన్న గిన్నె లో తెచ్చి పెట్టాడు. నాకు ఆ గిన్నె లోని అన్నం పచ్చడికె సరిపోయింది.

తమ్ముళ్లు బాగా ఆకలితో ఉండడంతో, నేను ఏమి ఆడగలేదు నాన్న ఇంకా కావాలా అని అడిగారు,వద్దు నాన్నా ,సరిపోయింది అని చెప్పి, తముళ్ళకి తినిపించి, నేను మిగతా కూరలు తింటూ,వాళ్ళు తినే వరకు కూర్చున్నా, ఇంకా కావాలి అంటే నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయో,లేవో,మరి అని అనుకుంటూ, మరి అడగలేదు...

తిని మళ్ళీ బస్ స్టాండ్ కి వచ్చాము. బస్ ఎక్కి ,మా ఊర్లో దిగేసరికి రాత్రి 7 గంటలు అయ్యింది. ఇంటికి వెళ్లే సరికి మా అమ్మా వచ్చేసింది. వంట కూడా చెసినట్టు ఉంది. ఎక్కడికి వెళ్లారు అని అడిగింది, మేము చెప్పాము. మేము ఎక్కడికి వెళ్లినా పక్కింట్లో తాళాలు ఇచ్చి ,వెళ్తాము కాబట్టి అమ్మా వచ్చేసి, వంట కూడా చేసింది. గబగబా కాళ్లు కడుక్కుని, అమ్మా ఆకలి అంటూ,పెట్టమని ఆడిగాము, అమ్మా అన్నం పెట్టగానే, ప్రాణం లేచి వచ్చింది.

అప్పుడు సగమే,కాదు సగం లో సగం తిన్న , గబగబా తిన్నాను. హమ్మ కడుపు నిండే వరకు తిన్నాను.. కడుపు నిండగానే నిద్ర ముంచుకు వచ్చింది. చాప వేసుకుని, మెత్త వేసుకుని,పడుకున్నాను, అంతే నిద్ర పోయాను , ఆకలి వల్ల డ్రెస్ సంగతి అమ్మకు చెప్పలేదు.అమ్మే తర్వాత చూసింది అనుకుoటా, అన్ని సర్ది పెట్టేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి.

ఆ రోజు స్కూల్ లేదు,గాంధీ జయంతి కాబట్టి,ఆ రోజు ఇంకో విశేషం ఏమిటంటే అదే రోజు నా పుట్టినరోజు కావడం, అమ్మ పొద్దున్నే లేపి, నుదుటిమీద ముద్దు పెట్టుకుని,స్నానం చేయమని అంది, నాకు తలంటూ పోసింది. ఎప్పుడూ కొత్త బట్టలు ఉండేవి, ఈ సారి అమ్మ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళింది కదా, అందువల్ల లేవు, మా అమ్మ డ్రెస్ లు బాగా కుట్టేది, లంగా,జాకెట్ లు, గౌన్లు నాకు అన్ని అమ్మే కుట్టేది.

సరే ఇక మాములు బట్టలు కట్టుకుంటా అని అనుకుంటూ ఉండగానే, మా అమ్మా నా కళ్ళు మూసుకో అని అంది,నేను కళ్ళు ముసుకున్న,ఎందుకో తెలియకున్నా, నా చేతిలో ఒక సంచి పెట్టింది. నేను కళ్ళు తెరిచి చూసాను. ఆ సంచి లోంచి బట్టలు తీసే సరికి , ఆశ్చ5, ఆనందం రెండూ ఒకేసారి వచ్చాయి..


అవి ఆ రోజు నేను షాప్ లో చూసిన తెల్లని డ్రెస్ మీద ఎర్ర చుక్కలు ఉన్న డ్రెస్, పైజామా, ఎర్రని చున్నీ, గబగబా వేసుకున్న, దేవుడికి దండం పెట్టి, అక్షతలు తీసుకుని, నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, నాన్నా కుర్చీలో కూర్చుని, పేపర్లు దిద్దుతున్నారు.నాన్నా అని అంటూ చేతిలో అక్షతలు ఉంచి, కాళ్ళకి నమస్కరించాను. ఇంతలో అమ్మా కూడా వచ్చింది, ఇద్దరికి కలిపి మళ్ళీ ఒకసారి నమస్కరించాను.నన్ను చూసిన నాన్న అమ్మతో శాంతికి దిష్టి తీసెయ్యి అని చెప్పారు....

ఆ ఎర్రని డ్రెస్ తోనే నేను పదవ తరగతి మొదటి పరీక్ష రాసాను, అదే డ్రెస్ తో ఇంటర్ పరీక్షలు కూడా రాసాను.( దానితోనే ప్రతిరోజూ వెళ్ల లేదు. మొదటి రోజు మాత్రం అదే డ్రెస్ ). ఆ డ్రెస్ ని పదిలంగా దాచుకున్న, తర్వాత ఎన్ని డ్రెస్ లు కొనుకున్నా, అ డ్రెస్ అంటేనే ఇష్టం. కొన్నేళ్ళకి మా నాన్నగారు గుండె పోటు తో చనిపోయారు....

కానీ ఆ డ్రెస్ మాత్రం ఇప్పటికి నా దగ్గర పదిలంగా ఉంది. తల్లి ప్రేమ మాటల్లో తెలిపితే,తండ్రి ప్రేమ చేతల్లో కనిపిస్తుంది. ఆ రోజు మా నాన్నా ఎదో పరీక్ష కి కట్టాల్సిన డబ్బుని, నేను ఇష్టపడిన డ్రెస్ కోసం ఖర్చు పెట్టారు అని తర్వాత తెలిసింది. నా ఇష్టాన్ని గుర్తించి, నేను వద్దు అని అంటున్నా, నా మనసులో ఏముందో గ్రహించి, నా పుట్టినరోజు నాడు ,నా కళ్ళలో సంతోషం చూడడానికి మా నాన్న చేసిన ఆ పని తనకి కూతురు అంటే ఉన్న ఇష్టాన్ని, ప్రేమని చూపించింది.

ఇప్పటికీ ఆ ఎర్ర డ్రెస్ ,చున్నీ చిరిగిన ,అలాగే ఉన్నాయి బీరువాలో భద్రంగా, ఇప్పుడు నాకు నాన్న లేకున్నా , ఆయన గుర్తులు,జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు తినే ప్రతి మెతుకు,మా నాన్న కష్టార్జితం.ఆ ప్రేమ విలువ ఏమిటో తండ్రి లేని నా లాంటి వారికే తెలుసు...అలాంటి తండ్రులందరికి వందనాలు ..

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న