లాక్ డౌన్ - శింగరాజు శ్రీనివాసరావు

lockdown

ఏమని లాక్ డౌన్ విధించారో గాని, ఇంటి పనితో, వంటపనితో వళ్ళు హూనమవుతున్నది. ఇంట్లో ఇద్దరమనే పేరే గాని ఏది తగ్గుతున్నది, గిన్నెల పరిమాణం తప్ప. పుట్టి బుద్దెరిగినప్పటి నుంచి పనిమనిషి లేకుండా నా జీవితం గడవలేదు. ఒకరికి ఇద్దరిని పెట్టుకునేదాన్ని. బట్టలకు ఒకరు, మిగిలిన పనికి ఇంకొకరు. అసలు విషయమేమిటంటే ఒకరు సెలవు పెట్టినా ఇంకొకరి చేత పని అంతా చేయించేదాన్ని. అలా ఎలా అంటారా? ఆ చాకచక్యం నాకు బాగా తెలుసు. ఇప్పుడు, అంత నేర్పరినైన నాకే పీకలమీదకొచ్చింది. ఈ అపార్టుమెంటులో చేరాక అందరి సన్నాయి నొక్కుళ్ళు భరించలేక ఒక పనిపిల్లనే పెట్టుకున్నాను. ఈ కరోనా పుణ్యమా అని చుట్టుపక్కల వారు పనిపిల్లలని మాన్పించారు. నలుగురితో పాటు నారాయణా యని నేనూ మాన్పించాల్సి వచ్చింది. అపార్టుమెంటయితే ఇదే గొడవ. ఒకరితో ఒకరికి వంతు. ముసలివయసులో ముదనష్టపు బ్రతుకయింది. పోనీ పిల్లల దగ్గరకు పోదామంటే బస్సులన్నీ బంద్. అష్టదిగ్బంధనం చేసింది చైనా మహమ్మారి. ఈయన చూద్దామంటే దద్దోజనం. ఒక్కపనికీ పనికిరాడు. ఆయనను అనుకోని ఏంలాభం, అలా తయారుచేసింది నేనేగా. పువ్వమ్మా, పత్రమ్మా అని వత్తులు వత్తి వత్తి ఇదిగో ఇలా తయారుచేసుకున్నాను.

పడుకుని ఆలోచిస్తున్నానే గానీ, పరిష్కారం కనుచూపు మేరలో కనబడడం లేదు. రేపు ఏవో కొన్ని సడలింపులు ఇస్తానన్నారుగా. పనిపిల్లను పిలిపించి మాట్లాడాలి. చుట్టుపక్కల వాళ్ళతో పెట్టుకుంటే కుదరని పని. అయినా ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకు ఓపిక వుందేమో గానీ, నాకు లేదు. రేపు ఫోను చేసి తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాను పనివాళ్ళ విషయంలో. అప్పటికిగాని మనసు కుదుటపడి కళ్ళు మూతపడలేదు.
********

ఇప్పటికి పదిసార్లు ఫోను చేశాను. ఎప్పుడూ ఎంగేజే. ఎంతమంది స్నేహితులో దీనికి. అవున్లే, తిని కూచోవడమేగా. ప్రభుత్వం తినడానికి గింజలు, ఖర్చులకు డబ్బులు ఇస్తుంటిరి. బహుశా పనిచేసే ఇళ్ళలో కూడ లాక్ డౌన్ పేరు చెప్పి ' నాదేముందమ్మా పోలీసోళ్ళు రానీయకపోతే నేనేం చేసేది. మీరు డబ్బులీయనంటే ఎలా?' అని నింద మా మీదే వేసి డబ్బులు గుంజుతూ కూడ ఉండి వుంటుంది. నన్ను రేపు అలాగే సతాయిస్తుందేమో...అనుకుంటుండగానే ఫోను మ్రోగింది.

" హలో.. అమ్మగారు. ఫోను చేశారా?" పేరుకు పనిమనిషనే గాని, రూపం, మాటతీరు చక్కగా వుంటాయి దీనికి అని అనిపించింది నాకు

" అవును వాణి. నేనే ఫోను చేశాను. రేపటినుంచి లాక్ డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తారట. ఇహనైనా పనికి వస్తావా? రావా?"

" ఆటోలు కదలాల కదమ్మా. బండి మీద కూడ ఒప్పుకోవడం లేదు. నేనేం చేసేది వాళ్ళు ఇల్లు కదలనీకపోతే"

" వేషాలు నేర్చుకున్నారే. మీ ఆయన బయటికి పోకుండా ఇంట్లోనే వున్నాడా? కరోనా సాకు పెట్టుకుని పని చెయ్యకుండానే జీతం తీసుకుందామని"

" అలా మాట్లాడతారేంటమ్మా. మేము కూడ మనుసులమే కదా. ఆ మాయదారి రోగం మాకు మాత్రం అంటుకోదా. మేము వస్తామన్నా మీకంటుకుంటుందని ముందు మీరేగా రావద్దన్నది. ఇప్పుడిలా మాట్లాడతారేంది" కొంచెం కోపం దాని గొంతులో.

ఈ రోజుల్లో పనివాళ్ళు పనివాళ్ళుగా వున్నారా. వాళ్ళదే రాజ్యం. వేలకు వేలు ఇచ్చే వాళ్ళున్నారు కదా ఇక మా మాట ఎందుకు వింటారు. ఒళ్ళు మండుతోంది ఒకపక్క. కానీ తగ్గక తప్పదు. ఇప్పుడు దాని మీద విరుచుకుపడితే, అది కాస్తా పని మానేస్తానంటే, ఈ గడ్డుకాలంలో ఇంకొకతి దొరకదు గాక దొరకదు. ఏం చేద్దాం టైం.

" రావద్దంటే. నేనొక్కదాన్నేనా. అందరూ వద్దన్నారుగా.
అయినా పని చెయ్యకుండా డబ్బులివ్వడానికి ఇక్కడ చెట్లకు కాయడం లేదు. ఏదో సగం రోజులైనా వచ్చావు కాబట్టి పోయిన నెలలో మొత్తం జీతం ఇచ్చాను. ఈ నెల నువ్వసలు రాలేదుగా" లాజిక్ లాగాను.

" దాచిపెట్టుకోండమ్మా. పనిచేసే వాళ్ళకు ఎందుకు ఇస్తారు. ఆశ్రమాలకు పోయి వేలకు వేలు దానాలు చేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళకు నలిచి మట్టి కూడ పెట్టరు. ఇదంతా దేనికమ్మ, ఆటోలు వస్తే వస్తా లేకపోతే లేదు. అది కూడ మీరు ముసలోళ్ళు గనక" కుండబద్దలు కొట్టింది. గత అయిదేళ్ళుగా మా ఇంట్లో పని చేసి చేసి సామెతలు, తెలివిగా మాట్లాడడాలు బాగా నేర్చుకున్నది నెరజాణ.

ఆపుకోలేని కోపం వస్తున్నది నాకు.

" అయితే ఆటో వస్తే గానీ రావా. ఏం మీ ఆయన బండి మీద రాకూడదా. ఉదయం తొమ్మిది లోపల వచ్చి చేసిపో. వేషాలు వెయ్యకు"

" అంత పొద్దుగాల కుదరదమ్మా. మా ఆయన లేవడసలు. లాక్ డౌన్ తీసిందాకా రాను."

" అయితే నువ్వింక పనికి రానక్కరలేదు. అడిగేకొద్దీ బెట్టు చేస్తున్నావు. మీ జన్మలింతే ఎంత పెట్టాను నీ మొహాన. పిల్లలకు బట్టలిచ్చాను. సంవత్సరానికి ఫీజులకు కొరవబడతాయంటే వెయ్యి రూపాయలిచ్చాను. విశ్వాసం లేని మనుషులు. ఎంత పెడితే ఏముంది" గయ్యిమని లేచాను.

" మీరేందమ్మా పేట్టింది. ఎవురైనా పెడతారు. అబ్బో మా సంసారమంతా మీరే నడుపుతున్నట్టు. వద్దులే తల్లీ. మీ ఇల్లు వద్దు, మీ దెప్పులూ వద్దు. నేను ఇంకరాను పనికి" అని ఠపీమని ఫోను పెట్టేసింది వాణి.

ఎంత పొగరు దానికి. నన్నే లెక్కలేకుండా మాట్లాడుతుందా. ఛీ. విశ్వాసం లేని మనిషి. ఆవేశం తన్నుకు వస్తుంది నాలో. ఎవరిమీద చూపాలి.

ప్రశాంతంగా పేపరు చదువుకుంటున్న ఆయనను చూస్తే చిర్రెత్తుకొచ్చింది. పెద్దగా కేక పెట్టాను. ఉలిక్కిపడి చూశాడు.

*****

" రాధ... రాధ... ఏమయిందే. అంత పెద్దగా కేక పెట్టావు. తెల్లవారిగట్ల పీడకలేమైనా వచ్చిందా?" అని తట్టిలేపుతున్న మావారి కుదుపులకు మెలకువ వచ్చింది నాకు. అంటే ఇప్పటిదాకా వచ్చింది కలా?

" అబ్బే ఏం లేదండి. ఏదో చిన్న కల. భయపడ్డారా?"
మనసు నొచ్చుకుంది.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. లేచి వెళ్ళి తలుపుతీశాను. ఎదురుగా వాణి. ఆశ్చర్యపోయాను.

" ఏందే. ఇంత పొద్దున్నే" కల దెబ్బ ఇంకా వదలలేదు

" మీరు పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారటకదమ్మా. నిన్న అయ్యగారు మా ఆయనకు ఫోను చేశారట. వీలుంటే ఒకసారి వచ్చి మాట్లాడిపొమ్మన్నారట"

నన్ను గురించి మా ఆయన ఆలోచిస్తున్నారంటే ఆశ్చర్యమేసింది నాకు.

" అవునే చేసుకోవటం కష్టంగానే ఉంది. రాగలవా మరి"

" నేను రానన్నా అమ్మా. మీరేగా రావొద్దని చెప్పి, నెల జీతం మొత్తం ఇచ్చి పంపారు. మేము బయటెక్కడ తిరగమమ్మా. ఆ జబ్బు మాకొచ్చినా ఇబ్బందే కదా. అందుకే మా ఆయన పని కూడ మానేశాడు. ఖాళీగా వుంటే గడవాల కదమ్మా. గవర్నమెంటోల్లు ఇచ్చేది దేనికి సరిపోద్ది. అందుకే పొద్దుటే లేచి కొబ్బరిబోండాలు తెచ్చి అమ్ముతున్నాడు. తొమ్మిదికల్లా కట్టేస్తున్నాము. పని చేయించుకోకుండా డబ్బులడిగితే ఏం బాగుంటదమ్మా ఎవురినైనా"
మాటల్లో సౌమ్యత. రాత్రి నా కలకు ఇక్కడసలు మ్యాచ్ అవటంలేదు.

" మరి నా ఒక్కదానికోసం వస్తావా?"

" అందరినీ అడిగానమ్మా లాక్ డౌన్ ఎత్తేసేవరకు వద్దన్నారు. ఎవరి భయం వారిది. మీరు నా మీద నమ్మకం ఉంటే వస్తాను" బంతి నా కోర్టులో వేసింది.

" నా ఒక్కదానికోసం అంటే కష్టం కదే నీకు"

" ఫర్లేదమ్మా. ఆయనతో పాటే వస్తాను బండి మీద. నా పని అయిపోగానే ఆయన బండి కాడికి ఎళతాను. పదింటిదాకా బోండాలు అమ్ముకుని ఇద్దరం కలిసే ఇంటికి పోతాము" క్లారిటీ ఇచ్చింది.

" దానికి మీ ఆయన ఒప్పుకుంటాడా"

" ఆయన గోలేనమ్మా ఇది. రాతిరి నుంచి సతాయిత్తున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే వాడికి, వాళ్ళ అమ్మ, అయ్య గుర్తుకు వస్తుంటారట. ఎక్కడపని మానేసినా మీ ఇంటికాడ మానేయ్యవద్దని ఎప్పుడో చెప్పాడు. ఆయన అన్నాడని కాదుగానీ అమ్మా, పెద్దవాళ్ళు ఈ వయసులో మీరీ చాకిరీ ఏం చేసుకుంటారు. మేం కూడ అజాగ్రత్తగా ఉండటం లేదమ్మా. మాస్కులు, చేతికి గ్లౌజులు వేసుకుని ఎడ ఎడంగా వుంటూనే వున్నాం. మావి ప్రాణాలే కదమ్మా. మా జాగర్తలో మేంవుంటాం"

దాని మాటల మీద నమ్మకం కుదిరింది. అయినా మన పిచ్చిగాని, వచ్చే రోగం ఎక్కడున్నా వస్తుంది. కూరలకు, పాలకు పోతున్నాము కదా. ఇదీ అంతే. ఏదయితే అదవుతుంది. ఈ వెట్టిచాకిరి నా వల్ల కాదనుకుని.

" సరే నీ ఇష్టం. రావే అలాగే" అన్నాను మనసులో సంతోషపడుతూ.

" మా పిల్లలకి బట్టలిచ్చారు. పుస్తకాలకు, ఫీజులకు అప్పుడప్పుడూ సహాయం చేశారు. మీరు చల్లగుంటే కదమ్మా. మాలాంటి వాళ్ళకి బ్రతుకు. పదండమ్మా, గిన్నెలు వెయ్యండి ఎలాగూ వచ్చా కదా తోమేసి వెళతాను" అంటూ లోపలికి వచ్చింది వాణి.

మరి రాత్రి నాకెందుకలా వచ్చింది కల. తప్పు నాదేనా. నేను పాజిటివ్ గా ఆలోచించలేకపోతున్నానా ఏ విషయాన్నైనా. అవును మా ఆయన గురించి కూడ అలాగే అనుకుంటా, నేను చస్తున్నా ఆయన పట్టించుకోరని. నిజమే మా చిన్నది చెప్పినట్టు కీడెంచి మేలెంచడమనే అలవాటు మానుకోవాలి. పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి గురించి చెడుగా కాకుండా మంచిగా ఆలోచించాలి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళాను, అంట్లగిన్నెలు వేద్దామని.

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు