కృష్ణగా మారిన అబ్దుల్ - అఖిలాశ

abdul changed as krishna

“తెలుగు పంతులు హాజరు కోసం పిల్లోళ్ల పేర్లను గట్టిగా పిలుస్తున్నారు.”

రామూ.., ఆ..., వచ్చాను సారూ..! కిరణ్ ఆవచ్చినా సార్.., ఇలా అందరూ హాజరు పలుకుతున్నారు. అంతలోనే అబ్దుల్ వంతు కూడా రావడంతో ఏందో ఆలోచించానే లేచి వచ్చాను సారూ అన్నాడు.

“ఒరేయ్ అబ్దుల్ నీకెన్ని సార్లు చెప్పాలిరా వచ్చాను కాదు వచ్చినాను అనాలి.” సరే అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపి మల్లా ఎదో ఆలోచనలో పడ్డాడు.

లెక్కలు, సైన్సు మిగితా అన్నింటిలో మంచి మార్కులు వచ్చాన్నాయి, తెలుగులో మాత్రం పాసు కాడానికే కిందికి మీదికి అవుతాంటాడు. తెలుగు పంతులేమో అబ్దుల్ సమస్యను అర్థం సేసుకోడు, ఇంట్లో అమ్మిజాన్, బాబజాన్ కు కూడా తెలుగు మాట్లాడటం తెలుసు కానీ ఎలా రాయాలో పెద్దగా తెలీయకపాయే.

అబ్దుల్ ఐదవ తరగతి సదువుతాండాడు తెలుగొక్కటి వచ్చే సాలు ఆ తరగతిలో అబ్దుల్ కి మిచ్చినోడు ఎవడూ ఉండడు. ఈ విషయం తెలిసే జతగాళ్ళు అబ్దుల్ కి తెలుగు నేర్సుకోవడంలో సహాయం సెయ్యడంల్యా. ఇంకో వారం దినాల్లో పరీక్షలు ఉండాయి. తెలుగులో పాసౌతానో లేదోనని గుబులు పడతాండాడు.

“అబ్దుల్ మొఖంలో రోజు రోజుకి కళ తప్పిపోతాంది.” అది గమనించిన అబ్దుల్ అమ్మమ్మ మాబున్ని ఏమైందిరా మనవడా అట్లుండావు? బళ్ళో పిల్లోల్లు ఎవరైనా కొట్టారా? అని ఏమడిగినా సరే అబ్దుల్ నోట మాట మాత్రం పెగలడంల్యా. పిల్లోనికి బాలగహ సోకినట్లుంది సందెకాడ దిష్టి తియ్యాలని మనసులో అనుకుంది.

ఒరేయ్ నీ కొడుకుకి బాలగహ సోకింది అందుకే వాడు మెత్తగా ఉండాడు. “ఫకిరప్ప పొలానికి పోయి కొంచం బంకమన్ను తీసుకొనిరా అట్టాగే వచ్చా వచ్చా కోంటోల్ల అంగట్లో బాలగహ బుక్కు తీసుకొచ్చే సందెకాడ దిష్టి తీస్తానని కొడుకు ఖాజతో ఇషయం సెప్పింది మాబున్ని.”

అమ్మిజాన్ అల్లా దావలో ఉండాము ఇవన్ని సేయకూడదు జామాత్ వాళ్లకు తెలిచ్చే అరుస్తారు. కావాలంటే ఆసుపత్రికి తీసుకుపోదాములేనని నసిగాడు.

“పిల్లోనికి బాగాలేదంటే జామాత్ అంటావు ఏందిరా? వానికేమైనా అయితే జమాతోల్లు బాగుసేస్తారా. నోరు మూసుకొని పోయి నేను సెప్పింది తీసుకురా అని గద్దించింది మాబున్ని.”

తల్లికి ఎదురు సెప్పడం ఇష్టంలేక కావలిసినేవి తెచ్చిచ్చాడు ఖాజా.

“సందెకాడ చీకట్లో బుక్కులో ఉన్నట్టే ముగ్గు వేసి, దీపాలు ఎలిగించి, బంకమన్నుతో సేసిన బొమ్మను ముగ్గులో కుర్సోపెట్టి దానికి ఎదురుగా అబ్దుల్ ని కుర్సోపెట్టింది మాబున్ని.”

“బుక్కులో మంత్రాలు సదివి బొమ్మతో అబ్దుల్ తల చుట్టూ తిప్పుతూ అడస్కి,పడస్కి, ఘర్ వాల్లోకి, బహార్ వాల్లోకి అని వీధిలో ఆమెకున్న శత్రువుల పేర్లు సదివి వాళ్ళ కంట్లో కారం కొట్టా అని దిష్టి తీసింది.”

బొమ్మను, దీపాన్ని కొడుకు ఖాజా సేతికిచ్చి ఊరిబయట నాలుగురోడ్ల కాడ పెట్టి ఎన్నిక్కి సూడకుండా వచ్చేయాలా అని సెప్పింది.

***

“దిష్టి తీసి నాలుగు రోజులైనా కూడా అబ్దుల్ లో ఎలాంటి మార్పు లేకపాయే.”

నేను సెప్పిన కదా అమ్మిజాన్ అలాంటివి సుద్ధ దండగేనని ఆసుపత్రికి తోలుకుపోదాములే అన్నాడు కొడుకు ఖాజా. మాబున్ని ఏం సెప్పాలో తెలియక గమ్మగ ఉండిపోయింది.

ఇదంతా గమనించిన అబ్దుల్ తల్లి గౌసియా పిల్లోన్ని సంకలోకి ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అని ప్రేమగా అడిగింది.

“అమ్మ మా ఇస్కూల్ లో అందరి పేర్లు ఒకలా ఉంటే నా పేరెందుకు ఇంకోలా ఉంది. వాళ్లకు తెలుగు బాగా వస్తాంది. నాకెందుకు రాడంల్యా.” ఇంకో రెండు రోజుల్లో పరీక్షలున్నాయి. నాకు భయమైతాంది పాసు అవుతానో కానో అని సెప్పాడు అబ్దుల్.

కొడుకు మాటలతో ఇస్తుబోయిన గౌసియా అవును గదా! పేర్లకు మతాలెందుకు అది ముస్లిం పేరు, ఇది హిందువుల పేరని ఎందుకు ఇడగొట్టారు. అందరూ మనషులే ఎవరికిష్టం వొచ్చిన పేరు వారు పెట్టుకోవచ్చని మనసులో అనుకోని ఈ ఇషయం భర్తతో మాట్లాడాలనుకుంది.

అబ్దుల్ నీకు తెలుగు రాదని బాధపడకు నేను మన పక్కింటి లచ్చిందేవికి సెప్పి నీకు తెలుగు చెప్పిచ్చాలే అని అన్నం తినిపిచ్చి అబ్దుల్ ను పండబెట్టింది.

మరుసటి రోజు భర్త ఖాజాతో ఇషయం సెప్పి మన పిల్లోని పేరు కృష్ణ అని మార్సుదాము అన్నది.

“ఖాజా ఇంతెత్తు లేసి ఏందీ.., నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయ్యిందా! మనం తురుకోల్లము అట్టాంటి పేర్లు పెట్టుకోకూడదు. తెలుగు రాకపోతే ఏ టూశనో-గీషనో సెప్పించు గాని ఇట్టా పేర్లు మార్సి నన్ను బజారుకు ఈడ్సద్దు.”

మన పక్కింటి లచ్చిందేవితో తెలుగు నేర్పిస్తాలేగాని పిల్లోడికి ఇప్పటినుంచే వాళ్ళు వేరే కులం మనం వేరే మతం అని ఎందుకు విడగొట్టాలా. పేరులో ఏముంది సెప్పండి పిల్లోని మనసు గురించి ఆలోచించాలా. అయినా నా పిల్లోన్ని కులాలకు, మతాలకు అతీతంగా పెంచాలనుకున్నానని గట్టిగానే సమాధానం సెప్పింది గౌసియా.

భార్య ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వినదని ఖాజాకి తెలుసు బయటకి తనను వ్యతిరేకిచ్చాడు గాని తను ఏదైనా బాగా ఆలోచిస్తుందని ఖాజాకి నమ్మకం. “ఏమి సెయ్యలేక లేక సరే నువ్వు ఎప్పుడు నామాట ఇన్నావు గనుక నీ ఇష్టం వచ్చింది సేసుకో. నువ్వేమి ఇంట్లో ఉంటావు నేను జామాత్ వాళ్ళకు ఏమి సెప్పాలో ఏందో అని వదురుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.

“అనుకున్నట్టుగానే అబ్దుల్ పేరు మార్సింది గౌసియ. పక్కింటి లచ్చిందేవితో తెలుగును కృష్ణతో పాటు తానూ నేర్సుకుంది.”

కులం,మతం పేరుతో పిల్లలను బాల్యం నుండే విడతీయకండి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తే చిన్నారుల మనసు సేదతీరుతుంది. మూఢనమ్మకాలకు విలువ ఇచ్చి పిల్లలను ఆ విధంగా పెంచడం కూడా తప్పే.

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు