ఎదురుచూపులు - పద్మావతి దివాకర్ల

waiting for children

అప్పుడే వచ్చిన వార్తా పత్రిక చదువుతున్న రాఘవరావు, "ఏమేవ్! ఇది విన్నావా? మళ్ళీ తుఫాన్ రాబోతున్నదట! విశాఖపట్నానికి నాలుగువందల కిలోమీటర్ల దూరంలో, గోపాల్‌పూర్‌కి మూడువందల కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందట. నాలుగైదురోజుల్లో తీవ్ర రూపం ధరించి తుఫాన్ చెలరేగిపోతుందిట! ఈ సారి తుఫాన్ తీవ్రత, భీభత్సం చాలా తీవ్రంగా ఉంటుందట. మన అబ్బాయి రవి వాళ్ళు ఉన్నచోట ఈ తుఫాన్ తీరం తాకుతుందట." అని పక్కనే కూర్చున్న భార్య సీతమ్మతో ఆందోళనగా అన్నాడు.

"అయ్యో! ఇప్పుడెలాగండీ! మనం దూరంగా ఉన్నాం కాబట్టి, మనకేం ఈ తుఫాన్ వల్ల పెద్ద ప్రభావమేం ఉండదు కాని, పట్నంలో ఉన్న అబ్బాయి రవివాళ్ళకి మాత్రం చాలా కష్టం. తుఫాన్ వల్ల ఏం ప్రమాదం సంభవిస్తుందో ఏమో? ఎందుకైనా మంచిది, ఆఫీస్‌కి సలవుపెట్టి ఇంట్లోనే ఉండమని ఫోన్ చేసి చెప్పండి. అసలే అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఈ తుఫాన్ తాకిడికి కరెంట్ పోతే తాగునీటికి కూడా ఇబ్బందే. క్రితంసారి వచ్చిన చిన్నపాటి సైక్లోన్ కే దగ్గరదగ్గర నెలరోజుల పాటువాళ్ళు చాలా అవస్థలుపడ్డారు చిన్నపిల్లలతో." అందామె ఆదుర్దాగా.

"వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను ఇప్పటినుండి జాగ్రత్తపడమని, జాగ్రత్తగా ఉండమని. అంతకన్న మనమింకేం చేయగలం?" అన్నాడు రాఘవరావు .

అప్పుడే టివిలో కూడా వాతావరణ సంబంధమైన ఈ వార్త ముఖ్యవార్తల్లో రావడంతో దంపతులిద్దరూ చాలా ఆందోళన చెందారు.

పదేపదే టివీలో వస్తున్న స్క్రోలింగ్‌చూసి మరింత కలవరపడ్డారు రాఘవరావు, సీతమ్మ దంపతులు. వెంటనే రాఘవరావు తన కొడుక్కి ఫోన్ చేసి తగు జాగ్రత్తలు చెప్పాడు.

సీతమ్మకూడా భర్తనుండి ఫోన్ అందుకొని తను కూడా చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పింది. చివరికి వీలైతే ఈ లోగానే తమ ఊరికి వచ్చిఉండి, తుఫాన్ తగ్గి మళ్ళీ బళ్ళ రాకపోకలు మొదలైన తర్వాత వెళ్ళవచ్చంది.

అదివిన్న రాఘవరావు ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత, "నువ్వు, వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పడం వాళ్ళు అలాగేనని అనడము ఇప్పటికే చాలాసార్లు జరిగాయి. మన భ్రమగాని వాళ్ళు తమ ఇళ్ళూ, పట్నం వదిలి ఈ పళ్ళెటూరికెందుకు వస్తారు చెప్పు? పట్నంలో అలవాటైనవాళ్ళకి ఇక్కడ ఎలా తోస్తుంది చెప్ఫు? అందుకే రావడానికి ఇష్టపడరు. పండుగలకి రమ్మని పిలుస్తాం మనం. ప్రతీ పండుగకి, దసరా అయినా, సంక్రాంతి ఐనా వాళ్ళు వస్తారని మనం ఎదురు చూడటమే తప్ప ఎనాడైనా వచ్చారా? అబ్బాయి, కోడలు, పిల్లలు ఈ ఊరు వచ్చి దాదాపు పదేళ్ళు పైనే అయింది. మనకీ ఎదురుచూపు మాత్రమే మిగిలింది." అన్నాడు భారంగా నిట్టూర్చుతూ.

"నిజమేలెండి! అయినా వాళ్ళకి తీరుబాటవద్దూ? ఆఫీసు, పిల్లల చదువులతో సతమతమవుతూ ఉంటారు పాపం. అయినా మనమే వెళ్ళి అక్కడ ఉందామన్నా మీరు వినరుగా! ఈ పల్లెటూరు వదలడానికి మీరు ఇష్టపడరు. మీరూ వినరూ, వాళ్ళూ వినరు, మధ్యలో నేను నలిగిపోతున్నాను. మనవలను చూసి ఎన్నాళ్ళయిందో?" అని బాధపడుతూ కళ్ళు తుడుచుకుందామె.

"ఏమేవ్! ఊరికే కొళాయి విప్పకు. అయినా ఆ పట్నంలో మనకెలాగ తోస్తుంది? ఇక్కడైతే ఇరుగూ, పొరుగూ, స్నేహితులు, తెలిసినవాళ్ళూను! ఆ అప్యాయతలే వేరు. తెల్లవారితే కొడుకు కోడలూ ఆఫీస్‌కి, పిల్లలు స్కూళ్ళకెళతారు. మళ్ళీ మనమే అక్కడ ఒంటరిగా మిగులుతాము. అయినా నీ మాటెందుకు కాదనాలి? ఈసారి పండుగకి మనమే అక్కడికెళ్ళి ఓ వారం రోజులుండి తిరిగివద్దాములే. నీకు సంతోషమే కదా! అయితే, ముందు వాళ్ళ ఈ తుఫాన్‌ని ఎలా ఎదుర్కొంటారో ఏమో?" అన్నాడు రాఘవరావు.

"అలాగేనండి! ఈసారి పండుగ మనం అక్కడే జరుపుకుందాం. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు." అందామె మనస్పూర్తిగా.

అయితే మరో రెండురోజులు గడవకముందే ఓ తెల్లవారుఝామున హఠాత్తుగా ఉడిపడ్ద కొడుకు, కోడలు మనవల్ని చూసి ఆశ్చర్యపోయారు రాఘవరావు దంపతులు.

"వచ్చావా రవీ! నిన్ననే మీ గురించి నేనూ, అమ్మా అనుకుంటూ ఉండేవాళ్ళం. అంతలోనే వచ్చేసారు!" ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అన్నాడు రాఘవరావు.

"అవును, నాన్నా!! ఇంకో రెండురోజుల్లో సైక్లోన్ తీరం తాకుతుంది! వాతావరణశాఖ చేసిన హెచ్చరికబట్టి గాలి వేగం రెండువందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్లు ఉంటుందిట, అంటే ఇది మునపటి తుఫాన్‌కన్నా తీవ్రమైనది. ప్రజలనందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలిపొమ్మని ప్రభుత్వ యంత్రాంగం ప్రకటనలు జారీ చేసింది. ప్రకృతి ప్రకోపం వల్ల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఎక్కడ చెట్లు కూలిపోతాయో, ఇళ్ళూ, అపార్ట్‌మెంట్లు కూలిపోతాయో కూడా చెప్పలేం. ఎంత ప్రాణనష్టం ఉంటుందో కూడా చెప్పలేం. ఇప్పటికే అందర్నీ సురక్షిత ప్రాంతాలకి తరలిపొమ్మని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలిస్తోంది. అసలే మాది పట్నం శివార్లోగల అపార్ట్‌మెంట్. కిందటిసారి జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఇప్పటికే అక్కడ ప్రజలందరూ ముందుజాగ్రత్త చర్యగా నిత్యావసరాలు ఇంట్లో పోగు చేసుకోవడంతో దుకాణాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. బజార్లో ఏవీ దొరకటం లేదు, కనీసం ఉప్పూ, పప్పులు కూడా. తుఫాన్ వెలిసిన తర్వాత కూడా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పాలు, నీళ్ళు కూడా దొరకవు. కరంటుండదు. కనీసం కొవొత్తులు కూడా ఎక్కడా దొరకవు. ఎక్కడకీ వెళ్ళడానికి ఉండదు. తుఫాన్ కారణంగా పిల్లల స్కూళ్ళకెలాగూ సలవులు ఇచ్చేసారు. అందుకే ఎందుకైనా మంచిదని, అమ్మ అన్నట్లుగానే మేం కూడా సెలవు పెట్టుకొని వచ్చేసాం." అన్నాడు రవి.

"చాలా సంతోషం! ఈ విధంగానైనా ఇన్నాళ్ళకి ఇక్కడికొచ్చారు. మీ అమ్మ అయితే చాలా బాధపడుతూ మీ కోసం ఎప్పుడూ ఎదురు చూపులు చూస్తూండేది. ఇన్నాళ్ళకి దాని కోరిక తీరింది." రాఘవరావు సంతోషంగా అన్నాడు భార్య వైపు చూస్తూ.

అయితే సీతమ్మకి ఆనందంతో నోటమాట పెగలడంలేదు. ఆనందబాష్పాలతో ఆమె కళ్ళుచెమర్చాయి.

"ఏంటమ్మా నువ్వు మరీన్నూ! వచ్చాం కదా ఇప్పుడు మేము. మిమ్మల్ని అక్కడకి రమ్మంటే రారు. మాకు, పిల్లలకి ఈ పళ్లెటూర్లో ఏమీ తోచదు. అంతేకాక మా సెలవులు, పిల్లల చదువులు కూడా చూసుకోవాలి కదా అమ్మా! అందుకే ఎప్పుడు పడితే అప్పుడు రావడం కుదరదు అమ్మా!" అన్నాడు రవి ఇంట్లోకి వస్తూ.

"అవునులే కన్నా! అయితే మా ఆశ మాకుంటుంది కదా! పోనీ ఇలాగైనా వచ్చారు మరి!" అందామె కోడల్ని, పిల్లల్ని దగ్గరకు తీసుకొని.

చాలా రోజుల తర్వాత కొడుకు, కోడలు , పిల్లల్ని చూడటంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు అక్కడ దగ్గరదగ్గర పదిహేనురోజులు ఉన్నారు. తుఫాన్ తాకిడి ఆ పళ్ళెటూరికి కొద్దిగా తగిలినా దాని ప్రభావం అంతంత మాత్రమే. అయితే అక్కడకి రావడమే మంచిదైయిందని భావించారందరూ ఎందుకంటే, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రవి ఉన్న పట్నంలో అయితే తుఫాన్ భీభత్సం చాలా ఎక్కువుగా ఉంది. అనుకున్నట్లుగానే ప్రాణనష్టం, ఆస్థి నష్టం బాగానే జరిగింది. రహదారులు తెగిపోయి, వంతెనల కూలిపోయి మిగతా ప్రపంచంతో సంపర్కం తెగిపోయింది. వారం రోజులవరకూ విద్యుత్తు, నీళ్ళు లేవు.

మళ్ళీ అంతా పూర్వపు పరిస్థితి వచ్చి రహదారులు, రైళ్ళ రాకపోకలు పునరుద్ధరించిన తర్వాత రవి తన భార్య పిల్లలతో తిరిగివెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఊళ్ళో రాఘవరావు దంపతులిద్దరూ ఒంటరిగా మిగిలారు. వాళ్ళున్న ఆ పదిహేను రోజులూ వాళ్ళకి పండుగలా తోచాయి. మనవలతో అసలు సమయమే తెలియలేదు వాళ్ళకి.

అదిగో ఆ రావడమే రావడం! ఆ తర్వాత అప్పుడే ఓ రెండేళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ పండుగులకి వస్తామన్నవాళ్ళు మరిక ఆ వైపే చూడలేదు. సీతమ్మకి కీళ్ళ నొప్పులు ఉండటం వలన వీళ్ళు కూడా కొడుకు దగ్గరికి వెళ్ళడానికి వీలవలేదు. నిరాశ, నిష్ఫ్రుహలతో రోజులు వెళ్ళదీస్తున్నారు రాఘవరావు దంపతులు.

ఇలా ఉండగా ఓ రోజు సాయంకాలం వడ్లు దంచుతూ సీతమ్మ, 'మళ్ళీ ఓ సారి తుఫాన్ వస్తే బాగుణ్ణు.' అని మనసులో అనుకుంటున్నదల్లా మెల్లగా పైకే అనేసింది.

పరధ్యానంగా పుస్తకం పట్టుకు కూర్చున్న రాఘవరావు ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు.

"అదేం కోరికే, తుఫాన్ రావాలని కోరుకుంటున్నావు?" భార్య వైపు వింతగా చూస్తూ అన్నాడు.

"అవునండి, తుఫాన్ వస్తే అబ్బాయి రవి, కోడలు, పిల్లలు మళ్ళీ మనింటికి వస్తారని నా ఆశ అండీ! వాళ్ళు వెళ్ళి అప్పుడే రెండేళ్ళయింది. ఫోన్‌లో మాట్లాడుకోవడమే కాని ఇంతవరకూ వాళ్ళిక్కడకు వచ్చిందీ లేదు, మనం అక్కడికి వెళ్ళిందీ లేదు. వాళ్ళని మళ్ళీ చూడాలని ఉందండీ! అందుకే అలా అనిపించిందండీ, మళ్ళీ ఈ సారి తుఫాన్ వస్తే తప్పకుండా వస్తారని. వాళ్ళకోసమే కదండీ మరి మన ఎదురుచూపులు." నిట్టూర్చుతూ అందామె.

ఆమె మాటలు విని తెల్లబోయాడు రాఘవరావు.

"కొడుకు, పిల్లలు మనింటికి రావాలన్న నీ కోరిక సమంజసంగానే ఉంది, కానీ తుఫాన్ రావాలని నువ్వు కోరుకున్న కోరిక మాత్రం బాగాలేదు. దానివల్ల ఎంత ప్రాణనష్టం, ఆస్తి నష్టమో తెలుసా? పాపం రైతులకైతే సంవత్సరకాలం పడిన శ్రమంతా వృధాగా గాలికి కొట్టుకుపోతుంది, తెలుసా? మరింకెప్పుడూ అలాంటి పిచ్చి కోరిక కోరకు!" భార్యను మందలించాడు రాఘవరావు.

"మరెలాగండి? ఎన్నాళ్ళీ ఎదురు చూపులు? ఇప్పుడు నాకు ఒంట్లో బాగుంది కదా! మనమే ఓ సారి వెళ్దామండీ, నాకు పిల్లల్ని చూడాలని ఉందండీ." అంది సీతమ్మ బేలగా.

"అలాగే! తప్పకుండా వీలు చూసుకొని వెళ్దాం." అని హామీ ఇచ్చాడు రాఘవరావు.

ఇంకా ఇవాళ, రేపు వెళ్దామనుకొనేలోగా ఇదిగో ఇప్పుడు ఈ వార్త! వార్తా పత్రికలు, టివిలోనూ ఈ వార్తే! ఏ ఇద్దరు కలిసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరికి ఫోన్ చేసినా ఈ వార్తే. అదేమిటంటే, చైనాలో ప్రారంభమైన కరోనా అనే వైరస్ ఇప్పుడు భారతదేశంతో సహా ప్రపంచమంతా అతి శీఘ్రంగా వ్యాపించి ప్రజలను గడగడలాడిస్తోంది. కరోనా బారిన పడి వేలాదిమంది మరణిస్తున్నారు. ఆ వైరస్ గురించే వార్తలంతా. కరోనా గురించి, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి పదే పదే హెచ్చరికలు టివిలో వస్తున్నాయి.

రాఘవరావు వార్తల్లో సారాంశం విడమర్చి చెప్పినా సీతమ్మకి పెద్దగా అర్ధమవలేదు. ఒక్కటి మాత్రమే తెలిసింది, మళ్ళీ తుఫాన్‌లాంటి ఉపద్రవమేదో ముంచుకొచ్చిందని. వార్తల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది ప్రభుత్వం. ఆ వార్తలన్నీ టివిలో వస్తున్నవి.

ఆ రోజు హఠాత్తుగా సీతమ్మ భర్తకి కాఫీ అందిస్తూ, "ఏమండీ!" అంది.

ఏమిటన్నట్లు ఆమెవైపు ప్రశ్నార్థకంగా చూసాడు.

"ఏమండి! కరోనా అని ఏదో వ్యాపించిందట? ఆఫీసులు, స్కూళ్ళు మూసేసారట. అబ్బాయికొకసారి ఫోన్ చెయ్యండి. అబ్బాయి వాళ్ళు మనింటికి మరలా వస్తారేమో?" ఆశగా అడిగింది ఆమె.

అమాయకంగా అడిగిన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసాడు రాఘవరావు. ఆమె అమాయకత్వానికి నవ్వు వచ్చింది రాఘవరావుకి.

"పిచ్చిదానా! నువ్వు కరోనా అంటే ఏమిటో అనుకుంటున్నావు! అది ఒక ప్రాణాంతకమైన వైరస్. అది ఒకళ్ళనుండి ఒకళ్ళకి చాలా సులభంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దాని బారినపడి ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడుతున్నాయి. లక్షలాదిమంది దాని బారిన పడుతున్నారు, వేలాదిమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. నువ్వు అమాయకంగా అడుగుతుంటే నాకు నవ్వు వస్తోంది. కాని నవ్వడానికి ఇది సమయం కాదు. కరోనా కోరలనుండి ప్రజలని రక్షించడానికే మనదేశ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. అత్యవసర విధుల్లో ఉన్నవారు తప్పించి, ప్రజలెవరూ నిత్యవసరాలకు తప్పించి వీధుల్లో తిరగరాదు, అదీ తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే. అంతే కాకుండా మాటిమాటికీ చేతులు శుభ్రపరచటంలాంటివి కూడా తప్పనిసరి. ముఖానికి మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి, ఎందుకంటే ఇంతవరకూ ఈ మహమ్మారికి మందు కనిపెట్టలేదు. అసలు ఈ వైరస్ ఉనికి కూడా ఈ మధ్యనే తెలిసింది. అది తెలిసేలోగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మందులు లేనందువలన, ప్రస్తుతం వైరస్ సోకకుండా నివారణ ఒక్కటే ఉపాయం మాత్రమే కాదు, బ్రహ్మాస్త్రం కూడా. ఇప్పుడు బస్సులు, రైళ్ళే కాదు ఆటోలు, బైక్‌లు కూడా తిరగడానికి వీలులేదు. మరి రవి వాళ్ళు ఎలాగ రాగలరు? అసలు ఇంటోంచి బయటకి అడుగుపెడితే లక్షణరేఖ దాటినట్లే. ఆ లక్ష్మణరేఖ దాటితే దాని పరిణామం, పర్వవసానం చాలా తీవ్రంగా ఉంటాయి సుమా! అయితే వాళ్ళకి అన్ని జాగ్రత్తలూ చెప్పాలి. వాళ్ళు క్షేమంగా ఉంటే అంతే చాలు. ఫోన్ ఉందికాబట్టి రోజూ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు. అంతేగాని ఈ పరిస్థితుల్లోవాళ్ళు వస్తారని ఆశ మాత్రం పెట్టుకోకు. పరిస్థితులు చక్కబడ్డాక మనమే వాళ్ళవద్దకు వెళ్ళి కొన్నాళ్ళుందాము సరేనా!" అన్నాడు రాఘవరావు.

"అయ్యో! ఏదో తెలీక అన్నానండి. ఇందులో ఇంత ప్రమాదం ఉందని నాకు తెలియదు, పిల్లలు ఇంటికి వస్తారన్న ఆ ఒక్క ఆశ మాత్రమే నాతో అలా మాట్లాడించింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండటమే మనకు కావలసింది. ఎప్పుడు వీలైతే అప్పుడే వెళ్దాం లెండి." అందామె నొచ్చుకుంటూ.

రవి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడానికి ఫోన్ అందుకున్నాడు రాఘవరావు.

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు