షఫీ - రాము - అఖిలాశ

shafi-ramu

శుక్రవారం వచ్చిందంటే చాలు ఖాదర్ కంటే ముందే గబాగబా రెడి అయ్యే షఫీ ఈరోజు మొఖం దిగేసుకొని కూర్సున్నాడు. మాములుగైతే శుక్రవారం రోజు షఫీ హడావిడి అంతా ఇంతా కాదు నాకు తెల్లకుర్తానే కావాలా, కళ్ళకు సుర్మ శానా పట్టించు, నాని కొనించిన కొత్తబూట్లే ఏసుకొని నమాజుకు పోతానని అన్నింట్లో హుకుం జారిచేసినట్లే తల్లి జరీనాతో మాట్లాడేవాడు.

***

“జరీనా ఇట్టా రా ఒకసారి”

వంటగదిలో ఉన్న జరీనా ఖాదర్ కేకతో హాల్ రూమ్ లోకి వచ్చి ఏం కావాలి అన్నట్టుగా సూసింది .

“ఏమైంది షఫీకి నువ్వు ఏమైనా అన్నావా?”

నాకంత ధైర్యం యాడిది నిన్ను, నీ కొడుకును ఏమైనా అనే శక్తే ఉంటే నేను ఇలా ఎందుకుంటానని తన మటుకు తాను మాట్లాడుకుంటూ పోతాంది.

ఖాదర్ మాత్రం పెండ్లం మాట్లేమి ఇనకుండా అట్నుంచి లేచి షఫీ దగ్గరికెళ్ళి “ఏమైంది రా షన్ను మా బుడ్డోడిని ఎవరో ఎదో అన్నట్టున్నారే అని గారాబం సేస్తూ నాలుగేళ్ళ కొడుకును ముద్దాడుతూ ఎత్తుకున్నాడు.”

షఫీ ముఖంలో ముందులాగా కళే లేదు. నిజానికి షఫీకి శుక్రవారమంటే శానా ఇష్టము. ఎందుకంటే శుక్రవారంరోజు వాల్లమ్మ బాగా రెడీ చేచ్చుంది. మంచి బట్టలు, బూట్లు తొడుగుతుంది. మసీదు నుండి తిరిగివచ్చేతప్పుడు తనకేమి కావాలన్న నాయన కొనిపిస్తాడు. కానీ ఈ శుక్రవారం ఎందుకో షఫీ గమ్మగా ఉండాడు. ఆ మౌనానికి కారణం కనుక్కోడానికే ఖాదర్ ప్రయత్నిస్తాన్నాడు.

షన్ను చెప్పు నానా ఎవరేమన్నారు? దాది(జేజెమ్మ) నీకు డబ్బులు ఇవ్వలేదా? బుజ్జోడికి పొట్ట ఏమైనా నొప్పిస్తోందా ?అని ఖాదర్ అడగసాగాడు.

“నాయనా.., నా స్నేహితుడు రాము లేడూ..., వాడెందుకు మసీదుకు రాకూడదు? మొన్న నేను వాడితోపాటే అంకాలమ్మ గుడికి పోయినాగదా! మల్లా రామును మసీదులోకి ఎందుకు రానియ్యడం లేదని గోముగా అడిగాడు.”

కొడుకు మాటలతో ఖంగుతిన్న ఖాదర్ పిల్లోడికి ఏమని జావాబు ఇవ్వాలో అర్థంకాక సోఫాలో కూలబడిపోయాడు. ఖాదర్ మనసులో ఎవేవో ఆలోచనలు షఫీ సెప్పింది నిజమే గదా! మతాలు పిల్లోలను చిన్నప్పటి నుండే వేరు చేస్తాన్నాయా? ఇప్పుడు షఫీకి నేనేమని సెప్పాలా? ఈ విషయంపై మసీదు పెద్దలతో మాట్లాడాలని అనుకున్నాడు.

“అలా ఏమి కాదు బేటా! మసీదులోకి రాము కూడా రావచ్చు. రేపు శుక్రవారం మనం రామును కూడా మసీదుకు పిలుచుకుపోదాములే అని సర్ది చెప్పి మసీదుకి పోయినారు.”

***

నమాజు పూర్తైతానే మసీదులోని పెద్దలకు తన ఇంట్లో జరిగిన విషయాన్నీ సెప్తూ పిల్లోలను మనం ఇప్పటి నుండే ఇలా ఇడతీస్తే ఏమన్నా బాగుంటుందా? నిజమే సుల్తి కాకుండా మనం ఎవరినైనా మసీదులోకి రానివ్వము అది మన సంప్రదాయం కానీ సంప్రదాయం మన మంచి కోసమేగదా దానివల్ల మనకు నష్టం జరుగుతాంటే దాన్ని మార్చుకోవాల గదా అని పెద్దలందరికీ వివరించాడు ఖాదర్.

“అవును ఖాదర్ నువ్వు సెప్పింది నిజమేనని ఏనబైఏళ్ల ముల్లాఖాన్ ఖాదర్ మాటలతో ఏకీభవించాడు.” కొంతమంది మాత్రం అదెట్టా కుదురుతుంది పిల్లోలకి మనం సెప్పుకోవల్లకానీ.., మన సంప్రదాయాలను మార్సుకుంటే ఎట్టా అని వ్యతిరేకించారు.

వాదన జరిగిన తర్వాత మసీదుకి పెద్దైనా జాఫర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

“చూడండి..! అల్లా మనకు కొన్ని సంప్రదాయాలు, నియమ నిబంధనలు, పద్ధతులు పెట్టాడు కానీ మనమంతా మనషులము అందరం ఆ అల్లా బిడ్డలమే అందరి దైవం ఒక్కడే అటువైపు మన సోదరులు మనల్ని గుడిలోకి రానిస్తాన్నారు.” మనం కనీసం పిల్లోల్లనైనా ఎటువంటి పట్టింపులు సెప్పకుండా ఆహ్వానించాలి. నా నిర్ణయంతో ఎవరేమనుకున్నా సరే ఇకనించి ఈ మసీదులో మాత్రం ఆరేళ్ళ లోపు పిల్లోల్లు ఎవరైనా రావచ్చు అని ప్రకటించాడు.

“దాదాపు తొంబైశాతం మంది జాఫర్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తునట్టుగా తప్పట్లతో వారి సమ్మతాన్ని తెలియజేసారు.”

కులం, మతం అందరూ కలిసుండేలా సేయాలి ఎవరిని విడతీయకూడదు ముఖ్యంగా పసిపిల్లలను.

తరువాతి శుక్రవారం రాముతో కలిసి ఆనందంగా మసీదుకెళ్ళాడు షఫీ.

***

మరిన్ని కథలు

Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా
Aparichitudu
అపరిచితుడు
- డి.కె.చదువుల బాబు