పశ్చాత్తాపం - లత పాలగుమ్మి

realisation
వేగంగా వెళుతున్న బస్సు లోంచి బయటకు చూస్తూ కూర్చున్న భార్గవి ఆలోచనలు కూడా బస్సుకన్నా వేగంగా పరుగెడుతున్నాయి.

భార్గవికి ఎంత ఆనందం గా ఉందో అంతే టెన్షన్ గా కూడా ఉంది. తెల్సిన వాళ్ళు ఎవరైనానాన్నగారికి చెపితే!!! ఆ ఆలోచనే వెన్ను లోంచి వణుకు పుట్టిస్తోంది. భయంతో గొంతు మింగుడుపడటం లేదు. ఎండాకాలం కాకపోయినా నోరు తడారిపోతోంది.

భగవంతుడా!! "నా ఈ ప్రయాణం గురించి మా ఇద్దరికీ తప్ప మూడో కంటి వాడికి తెలీకుండాచూడు నాయనా". అని తను ఎన్ని మొక్కులు మొక్కుకుందో,!! అమ్మ పరిస్థితి కూడా పాపంఇలానే ఉండి ఉండవచ్చు అనుకుంది భార్గవి.

నాన్నగారు వారం రోజుల కోసం ఢిల్లీ వెళ్ళారు ఏదో కాన్ఫరెన్స్ ఉందని. నాన్నగారు ఇల్లు వదిలివెళ్లడం చాలా తక్కువ. బయటకు వెళితే మడి, ఆచారం కుదరవని, ప్రొద్దున్న, సాయంత్రం విధిగాసంధ్యా వందనం చేసుకోవడం సాధ్యపడదని ఇష్టపడరు. నాన్నగారు ఢిల్లీకి వెళ్ళిన మర్నాడుఅక్కకి డెలివరీ అయిందని మొగ పిల్లాడు పుట్టాడని ఫోన్ వచ్చింది.

అమ్మ ఆనందం పట్టలేక భోరున ఏడ్చేసింది. కూతురి ప్రసవం అంటే తల్లి లేకుండాజరుగుతుందా ఎక్కడైనా........ పిల్ల అంత ప్రసవ వేదన పడుతుంటే తనకి తెలియను కూడాతెలీదు. వెళ్ళి చూసే అదృష్టం కానీ, మీ నాన్నగారిని ఎదిరించి వెళ్ళే ధైర్యం కానీ ఏమీ లేవు నాకుఅని బాధ పడుతుంటే భార్గవే ధైర్యం చేసి తను వెళ్ళి చూసి వస్తానని బయలు దేరింది.

భార్గవి వాళ్ళది చాలా సాంప్రదాయ బద్ధమైన ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబం. నాన్నసోమయాజులు గారు, అమ్మ కాత్యాయని, అక్క వాగ్దేవి .

సోమయాజులు గారు వేదపురాణేతిహాసాలలో మంచి దిట్ట. భారత, భాగవతాలని అవపోసనపట్టారు.

అమ్మ ఈరోజుకీ కచ్చా పోసి చీర కట్టుకుని మడితో వంట వండుతుంది. మా ఇంట్లో స్నానంచేయకుండా అగ్నిహోత్రుడ్ని వెలిగించరు (స్టవ్ వెలిగించరు). మా పూర్వీకులు నిప్పు కూడాకడుగుతారని నానుడి. ఉదయమే నాన్నగారు లేస్తూనే శ్రీహరి, శ్రీహరి, శ్రీహరీ అని ముమ్మార్లు విష్ణుమూర్తిని తలుచుకొని లేస్తారు. శ్రీహరి అనే శబ్దమే మాకు అలారంతో సమానం, ఇంక మేముకూడా లేవాలని అర్ధం.

సముద్ర వసనే దేవి, పర్వతస్తనమండలే!

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే!!

అనే శ్లోకంతో రోజూ ఉదయాన్నే భూదేవిని పూజించి కుడి పాదం భూమి మీద ఆనించి లేవటంఒక అలవాటుగా చేశారు చిన్నప్పటి నుండి .

భూదేవి మన భారాన్ని మోస్తున్నందుకు రోజకి కనీసం ఒక సారి అయినా కృతజ్ఞతా భావం వ్యక్తంచెయ్యాలని నాన్నగారిని ఉద్ధేశ్యం.

నాన్నగారిని చూస్తేనే ఒక పూజ్య భావం, గౌరవ భావం కలిగి తీరతాయి ఎవరికైనా. ఆరడుగులపొడుగు, గంభీరమైన ముఖ వర్చస్సు, పట్టు పంచె ఉత్తరీయం ధరించి విభూతి, కుంకుమధారణతో హుందాగా ఉంటారు.

నాన్నగారు తహసీల్దారు. క్రమశిక్షణకు మారు పేరు, అందుకే ఆఫీసులో అందరికి ఆయనంటేగౌరవంతో కూడిన భయం. ఉదయం ఇంట్లో భోజనం చేసి వెళితే మళ్ళీ రాత్రికి ఇంట్లోనే తినడం. మధ్యలో ఏమైనా పండ్లు, అవికూడా ఇంటి నుండి తీసుకు వెళ్ళినవే. బయట కాఫీ, టీలు కూడాతాగరు. ఎవరినీ తాకరు. ఎవరైనా ఆయన రూములోనికి వెళ్ళాలంటే చెప్పులు బయట విడిచివెళతారు. ఇవన్నీ నాన్నగారు పెట్టిన నియమాలు కావు. తరతరాలుగా మా కుటుంబానికి ఇస్తున్నగౌరవం.

ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే వెనక వైపునున్న పెరట్లోనే స్నానం చేసి సంధ్యా వందనం పూర్తిచేసుకుని మరీ లోనికి వస్తారు. నాన్నగారి వేదోచ్ఛారణలతో మా ఇల్లు ప్రతిధ్వనిస్తుంది. ఎన్నోతరాలుగా మంచి పేరు మా కుటుంబానికి. నాన్నగారిని చూస్తే అక్కని చూడక్కరలేదని అంతాఅంటూ ఉంటారు. అక్క అపురూప సౌందర్య రాశి. చూసిన వాళ్ళు కళ్ళు తిప్పుకోలేని అందంఆమెది. పెద్ద జడతో పట్టు లంగా, జాకెట్టు వేసుకుని తిరుగుతుంటే నాన్నగారు చాలా ముచ్చటపడిపోయేవారు. నేను అచ్చం అమ్మలా ఉంటానని మురిసిపోయేవారు. అక్క నాన్నగారి దగ్గరవేదాలు, పురాణాలు శ్రద్ధగా నేర్చుకుంది. నాకు వాటిపై అంత

మక్కువ ఉండేది కాదు. చిన్నపిల్ల, మెల్లగా నేర్చుకుంటుందిలే అని ఊరుకునేవారు నాన్నగారు.

మా ఇద్దరికీ సంగీతం, వీణ, కూచిపూడి నృత్యం అన్నీ ఇంటి వద్దనే నేర్పించారు.

మా తాతగారు నాన్నగారికి మొగపిల్లల్లేరని బాధ పడేవారట. ఇద్దరు కూతుళ్ళు లక్ష్మీ సరస్వతుల్లానా నట్టింట తిరుగుతుంటే నాకింకేమి కావాలి అనేవారు నాన్నగారు. ఇద్దరికీ వివాహాలు జరిపిస్తేవచ్చే కన్యా దాన ఫలంతో నా జన్మ చరితార్థం అవుతుందని ముచ్చట పడిపోయేవారు. మేముసుమారుగా రోడ్ మీద ఎప్పుడూ నడవలేదని చెప్పచ్చు. ఎక్కడికెళ్ళినా కారులోనే. మమ్మల్నిచూడటం కోసం మేము ఎప్పుడు బయటకు వస్తామా.......అని ఎదురు చూసేవాళ్ళు కూడాలేకపోలేదు మా ఊరిలో.

మా ఇద్దరితో సంగీత కచేరీలు చేయించడానికి నాన్నగారి వద్ద అనుమతి తీసుకున్నారు మాగురువు గారు. నాన్నగారు మొదట ఒప్పుకోలేదు. పిల్లలిద్దరిని తీసుకువెళ్లి మళ్ళీ ఇంటి వద్ద దింపేపూచీ తనదేనని గురువుగారు హామీ ఇచ్చి మరీ నాన్నగారిని ఒప్పించారు.

శామ్యూల్ పేరున్న కర్ణాటక సంగీత విద్వాంసుడు. మాకు సంగీత కచేరీలలో పరిచయంఅయ్యాడు. అతను పాడుతుంటే అందరూ మంత్రముగ్ధులై వినేవారు. అతని సంగీత పరిజ్ఞానంచూసి అందరూ ఆశ్చర్య పోయేవారు. ఏక సంధాగ్రాహి. అవార్డు గ్రహీత. అప్పటికే సంగీతంలోఎన్నో అవార్డులు సంపాదించుకున్నాడు. అతను, అక్క గంటల తరబడి రాగాల గురించిచర్చించుకునేవారు. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పేవాడు.

అతను మ్యూజిక్ లో పీ. హెచ్. డీ. చేస్తున్నాడు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేవారు ఇద్దరూ. మ్యూజిక్ తప్పించి వేరే ధ్యాస లేకుండా ఉండేవారు. అక్క అతనికి హెల్ప్ చేయడానికిఉండిపోయేది. అలా వాళ్ళ స్నేహం ప్రేమగా ఎప్పుడు పరిణితి చెందిందో వాళ్ళకే తెలీదు.

అక్క శామ్యూల్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన రోజు నేను జన్మలో మరిచిపోలేను. ఆరోజు అక్క ఇంటి నుండి ప్రొద్దున్న అనగా వెళ్ళి సాయంత్రం అయినా రాలేదు. అమ్మ టెన్షన్ తో లోపలికిబయటకు తిరుగుతోంది. మధ్య మధ్యలో నీకేమన్నా చెప్పిందా, దాచకుండా చెప్పి ఏడువు అని తిడుతోంది నన్ను. అమ్మని అలా ఎప్పుడూ చూడలేదు. కనీసం నాకైనా చెప్పి వెళ్లనందుకు అక్కమీద కోపం, కించిత్ బాధగాను అనిపించింది. అక్క శామ్యూల్ తో ........... అంతకు మించిఆలోచించే ధైర్యం లేదు ఈ బుల్లి మెదడుకి.

ఇంటి బయట ఉన్న గార్డెన్ లో పూలు కోసే వంకతో అక్క కోసం చూస్తూ గులాబీలు కోస్తుంటే ముళ్ళుగుచ్చుకుని రక్తం వస్తున్నా పట్టించుకోవడం లేదు. నాన్నగారు వచ్చే టైం అయ్యింది, అక్క ఇంకారాలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. మేము ఎవరి కోసం ఎదురు చేస్తున్నామో ఆ రెండు కార్లు సుమారు గా ఒకే సారి వచ్చాయని చెప్పొచ్చు. అక్క వచ్చేసింది అని సంతోషించేలోగా మిన్ను విరిగిమీద పడ్డట్లు అయ్యింది మా అందరికి. అక్క, శామ్యూల్ మేడలో దండలతో దిగుతున్నారు కార్లోంచి. వీధి వీధంతా గుమిగూడారు. అందరూ నోట మాట రానట్లు దిగ్భ్రాంతులైపోయారు. ఆరోజుల్లో మతాంతర వివాహం పెద్ద నేరం కింద పరిగణించేవారు. మతాంతర వివాహాలు ఎక్కడోనూటికో కోటికో ఒకటి వినేవాళ్ళం.

నాన్నగారు మోహంలో నెత్తుటి చుక్క లేనట్లు తెల్లగా పాలిపోయిందో నిమిషం పాటు. నిలువెల్లాకోపంతో వణికి పోయారు. వాగ్దేవీ!!! జీవితంలో నీ మొఖం నాకు చూపించకు, అని అరిచితక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదా నా మృత్యు ముఖం చూస్తావు అని వెంటనే కాత్యాయనీ!!!! అని పెద్దగా పొలికేక పెట్టారు. అమ్మ గబ గబా బయటకి వచ్చి అక్కడ దృశ్యం చూసి ఖంగుతింది, భయంతో ఏడుస్తూ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. నాన్నగారికి ఏమైనాఅయిపోతుందేమోనని భయపడి పోయాము. ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభించిపోయారు.

వాగ్దేవి, శామ్యూల్ ప్రతిమల్లా నిలబడి పోయారు

అమ్మ, నాన్నగారి బాధ చూడలేక భూమి రెండుగా చీలిపోయి అందులో నేను సమాధిఅయిపోవాలనిపించింది నాకైతే. అక్క మీద పిచ్చి కోపం వచ్చింది. అక్క ఇలా చేయడం అస్సలునమ్మశక్యంగా అనిపించడం లేదు.

నాన్నగారు వాళ్ళని ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా శరవేగంతో లోనికి వెళ్ళితలుపేసేసుకున్నారు. అమ్మ తలుపు తీయమని ఎంతో బ్రతిమాలాడింది. కాసేపటికి నాన్నగారిఓంకారం బయటకి వినపడటంతో అమ్మ, నేను కొంచెం స్వాంతన పొందాము.

వెంటనే వార్త ఊరు ఊరంతా గుప్పుమంది.

మర్నాడు ఇంట్లో స్మశాన నిశ్శబ్దం.

ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు.

కానీ ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది.

అమ్మ బాధపడుతూనే పెద్ద ఎత్తున వంటలు చేస్తోంది. ఎందుకో అర్ధం కాక సతమతమవుతున్నా, అడిగే ధైర్యం లేక నాకు చెప్పిన పనులు నిశ్శబ్దంగా చేసుకు పోతున్నాను. నాన్నగారు ఎక్కడాకనపడలేదు.

ఇంత అఘాయిత్యం ఎక్కడైనా ఉందా?? వద్దని చెప్పే ధైర్యం నాకు కూడా ఏడవలేదు అని మాబామ్మగారు ఏడుస్తూ ముక్కు చీదేస్తున్నారు.

పురోహితుల రాకతో అమ్మ నన్ను అక్కడ నుంచి తప్పుకోమని సైగ చేసింది.

ముక్త కంఠంతో మంత్రోచ్ఛారణ జరుగుతోంది.

ఏం జరుగుతోందో అర్థం కాక ముందు వసరాలోకి వెళ్ళి కూర్చున్నా. చాలా మంది జనాలుగుమిగూడి లోపలికి తొంగి చూస్తున్నారు.

వాళ్ళ ద్వారా "అక్కకి శ్రాద్ధ కర్మలు పెడుతున్నారని తెలిసి" కాళ్ళ క్రింద భూమి కంపించిపోయినట్లైంది నాకు.

మనసు పిండేస్తున్నంత బాధ.

ఈ సంఘటన నుండి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది మా అందరికి. నాన్నగారుమౌనవ్రతమే పూర్తిగా. ఇల్లు కదలడమే లేదు. అక్క చేసిన పని జీర్ణించుకోలేక పోతున్నారు. వేదాలు, పురాణాలు క్షుణ్ణంగా అభ్యసించి మంచి చెడు విచక్షణ కలిగిన పిల్ల ఇలా ప్రవర్తిస్తుందనికలలో కూడా అనుకోలేదని మా బామ్మగారితో అని బాధ పడ్డారట నాన్నగారు.

ఊరిలో ఎవరింట్లో ఏ శుభకార్యమైనా మొదటి శుభలేఖ నాన్నగారికే ఇచ్చేవారు. గుడిలో ఏఉత్సవమైనా పెద్ద పీట మా కుటుంబానిదే. చిన్నపిల్లలకి నామకరణం, అక్షరాభ్యాసం లాంటివి, పంచాంగం చూసి మంచి చెడులు చెప్పాలన్నా, పిల్లలెవరైనా తప్పుదోవ పడితే నాన్నగారిచేతే నచ్చచెప్పించేవారు. ఈ సంఘటన తర్వాత నాన్నగారు ఎవరితోనూ సలహా సంప్రదింపులుజరపడానికి తాను అనర్హుడనని భావించి తనని తాను ఇంటికే పరిమితం చేసుకున్నారు.

అక్క వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది. ఎలా ఉందో, ఎక్కడ ఉందో కూడా తెలీదు.

సడన్ గా ఈరోజు ఫోన్ రావడం, నేను ధైర్యం చేసి బయలు దేరటం అంతా కల లాగా ఉంది.

ఈ సుదీర్ఘమైన ఆలోచనలతో అయిదు గంటల ప్రయాణం ఎలా గడిచి పోయిందో తెలీలేదు. బస్ స్టాపుకి శామ్యూల్ వచ్చాడు. ఎంతో అభిమానంగా రిసీవ్ చేసుకున్నాడు. ఏమ్మా భార్గవి!! బాగున్నావా? ఇంట్లో అందరూ ఎలా వున్నారు?? అనడిగాడు శామ్యూల్.

అందరూ బానే ఉన్నారు అని చెప్పింది భార్గవి. కుశల ప్రశ్నల తర్వాత ఇద్దరి మధ్య మౌనం ఇంటికిచేరేంత వరకు.

కార్ హారన్ విని వాగ్దేవి పరుగు పరుగున బయటకు వచ్చింది. బారూ!! (చిన్నప్పటి నుండి బాగాముద్దు వస్తే అలా పిలుస్తుంది అక్క నన్ను) అని నన్ను చుట్టుకు పోయినట్లుగా, గాలి కూడా మాఇద్దరి మధ్యా చేరదేమో అన్నంత గట్టిగా కౌగలించుకుంది భార్గవిని. ఇద్దరి మధ్య మాటలకి తావులేదు. అలాగే ఉండిపోయారు కాసేపటి వరకు.

అమ్మ ఎలా ఉంది?? నాన్నగారిని చాలా బాధ పెట్టాను కదూ!!ఎప్పటికైనా నన్ను క్షమిస్తారా? వచ్చేశానే కానీ ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని గుర్తు చేసుకుని బాధ పడని రోజు లేదు, మళ్ళీ మనం ఇలా కలిసే అదృష్టం ఉందని కలలో కూడా అనుకోలేదే బారూ!! అంది వాగ్దేవి ప్రశ్నలపరంపర తో భార్గవిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ.

అన్నీ గుమ్మం లోనే నిలబెట్టి మాట్లాడతావా దేవీ!! ముందు తనని లోపలికి రానీ..... అన్నాడుశామ్యూల్ .

దేవి అనే పిలుపు కొత్తగా అనిపించింది భార్గవికి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పేరులో షార్ట్ కట్అనుమతించరు.

పెద్ద ఆవరణ, ముందంతా పూల మొక్కలు, వెనకాల అందమైన పొదరిల్లు. ఏ విధమైన భేషజాలులేవు. గుమ్మానికి ఎదురుగా నిలువెత్తు ఏసుక్రీస్తు విగ్రహం ఉంది. అది చూడగానే కొంచెంఉలిక్కిపడింది భార్గవి మనసు. అప్పుడు అక్కని కూడా పరీక్షగా చూసి ఆశ్చర్య పోయింది. అక్కకూడా కచ్చా పోసి చీర కట్టుకుని అచ్చం అమ్మ లానే ఉంది అనుకుంది భార్గవి.

బాబుని తీసుకువచ్చి భార్గవి ఒళ్ళో పెట్టింది వాగ్దేవి. లేత పింక్ కలర్ లో గుప్పెళ్ళు మూసిఅమాయకంగా నిద్ర పోతున్నాడు. సుకుమారంగా ఉన్న పసికందుని ప్రేమతో గుండెలకిహత్తుకుంటూ ఈ అనుభూతి అపురూపం అనుకుంది భార్గవి.

శామ్యూల్ వాళ్ళది పెద్ద కుటుంబం. అతనికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్లు. అతనిఅక్కకి వివాహమైంది. అక్క, బావ గారు ఇద్దరూ డాక్టర్లే.

ఉన్న కాసేపటిలోనే భార్గవికి అర్ధమైంది ఇంటి వ్యవహారాలన్నీ తన అక్కే చూసుకుంటుందని.

ఎవరికేది కావాలన్నా అక్కే. వాళ్ళ అత్తమామలు కూడా అక్క సలహా సంప్రదింపులతోనే అన్నిచేయడం భార్గవికి కొంచెం వింతగా అనిపించింది. అంత గొప్పింటి బిడ్డ మా ఇంట అడుగుపెట్టడం మా అదృష్టం, అప్పటి నుంచి మేము కూడా శాఖాహారులుగా మారిపోయామని వాగ్దేవివాళ్ళ అత్తగారు భార్గవితో చెప్తారు. శామ్యూల్ అయితే సరేసరి. అక్కని మహారాణిలాచూసుకుంటున్నాడు.

దేముని గది చూసిన భార్గవికి నోట మాట రాలేదు. సింహాసనం దగ్గర నుండి అన్నీ తమ ఇంట్లోఎలా ఉన్నాయో అలానే అమర్చుకుంది అక్క అనుకుంది. ఒక క్రిస్టియన్ ఇంట్లో ఇంతలా హిందూసంప్రదాయాలని పాటించడానికి ఒప్పుకున్నందుకు మనసులోనే వాళ్ళ ఔన్నత్యాన్ని కొనియాడిందిభార్గవి.

ఈలోపే ఎవరో వచ్చారు అక్క కోసం. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరిందని, జాతకాలు చూసిపెట్టమని. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది మీ అక్క సలహాల కోసంవస్తూ ఉంటారని చెప్పాడు శామ్యూల్. అక్క ఎక్కడున్నా తన ప్రాధాన్యతని నిలబెట్టుకుంటుందినాన్నగారిలా అనుకుంది భార్గవి.

మర్నాడు ఉదయమే బయలుదేరింది భార్గవి. వాగ్దేవి బాధ పడుతూనే బస్సు ఎక్కించిందిఆమెని, మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అనుకుంటూ. సాయంత్రానికి ఇల్లు చేరుకుంది. అక్కావాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ బయలుదేరేంత వరకు జరిగినవన్నీ పూస గుచ్చినట్లుఅడిగి తెలుసుకుంది వాళ్ళ అమ్మ కాత్యాయని. వాగ్దేవి సంతోషంగా ఉందనే విషయంకాత్యాయనికి ఎంతో ప్రశాంతతని ఇచ్చింది.

వారం రోజులు గడిచిపోయాయి. సోమయాజులు గారు రావలిసిన రోజు దాటి రెండు రోజులు కూడాగడిచిపోయాయి. ఆయన ఆఫీస్ కి ఫోన్ చేస్తే ట్రైన్ మిస్ అయితే కార్ లో బయలుదేరినట్లుగా వార్త, అంతకు మించి ఏమి తెలీదన్నారు. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. ఏ చిన్న శబ్దంఅయినా నాన్న గారు వచ్చారేమో అని ఎదురు చూస్తున్నారు భార్గవి వాళ్ళు.

భార్గవి వాళ్ళ బామ్మగారు, బాబాయిలు అందరూ వచ్చేశారు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి. ఎవరికితోచిన మార్గంలో వాళ్ళు ఎంక్వయిరీ చేస్తున్నారు. కానీ ఏ న్యూస్ తెలీలేదు. భార్గవి వాళ్ళ అమ్మబెంగతో చిక్కి సగం అయ్యింది.

నాన్నగారి ఆచూకీ తెలిసిందని, వెంటనే నాగపూర్ బయలుదేరి రమ్మనమని శామ్యూల్ నుంచిఫోన్ కాల్. శామ్యూల్ కి నాన్నగారి ఆచూకీ తెలియడమేమిటి?? అని అందరి మోహంలో ఆశ్చర్యం, సంతోషం. హుటాహుటిన అందరూ బయలుదేరి శామ్యూల్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళారు.

అది శామ్యూల్ వాళ్ళ అక్క ఇల్లు. వాగ్దేవి గబ గబా బయటకు పరిగెత్తుకు వచ్చి తల్లిని గట్టిగపట్టుకొని ఏడ్చింది. అందరూ ఆమెని ప్రశ్నలతో ముంచెత్తారు. అన్నింటికీ నాన్నగారే సమాధానంచెప్తారని లోపలికి తీసుకు వెళ్ళింది.

వారందరి ఆనందానికి అవధుల్లేవు. సోమయాజులు గారు కూడా చిన్న పిల్లాడిలా ఏడ్చేస్తారువాళ్ళందరిని చూసి. తనని ఈ స్థితికి తీసుకు రావడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారని, ఏమిచ్చి వాళ్ళఋణం తీర్చుకోగలనని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు సోమయాజులు గారు.

నాలుగు వారాలుగా తాను కోమాలో ఉన్నానని, కార్ యాక్సిడెంట్ అయి వంటి నిండా గాయాలతో, ఆపస్మారక స్థితిలో రోడ్ మీద పడి ఉంటే శామ్యూల్ వాళ్ళ అక్క వాళ్ళు తనని తీసుకు వచ్చి వాళ్ళహాస్పిటల్లో జాయిన్ చేశారని, తర్వాత తన బాగ్ లో ఐ. డీ. చూసి వాగ్దేవి తండ్రినని తెలుసుకొనికోమా లో ఉన్న నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి ప్రత్యేక నిగరానిలో ఉంచి సపర్యలు చేసి కోమానుంచి బయట పడేలా చేశారని చెప్తారు సోమయాజులు గారు.

శామ్యూల్ వాళ్ళ అక్క తన తమ్ముడు, మరదలిని పెద్ద మనసుతో క్షమించమని సోమయాజులుగారిని కోరుతుంది.

ఇంకా ఎందుకమ్మా!! నన్ను సిగ్గు పడేలా చేస్తావు........

మతం కులం అనే చాదస్తంతో తన చుట్టు గిరి గీసుకుని ఉన్నానని, అది తగ్గించుకోమని ఆపరంధాముడే తనలో మార్పు వచ్చేలా చేశాడని పశ్చాత్త్తాపంతో వాగ్దేవిని, శామ్యూల్ ని దగ్గరకుపిలిచి క్షమించమని అడుగుతారు. పిల్లలు తప్పు చేస్తే అనుభవజ్నుడిగా సరిచేయవలసిందిపోయి మూర్ఖత్వంతో కన్న కూతురని కూడా చూడకుండా శ్రాద్ధ కర్మలు చేసినఅవివేకినమ్మా........అని బాధ పడతారు.

తరతరాలుగా వస్తున్న పరంపరని అనుసరిస్తున్నానని అనుకున్నానే కానీ కాల మాన పరిస్థితులకిఅనుగుణంగా వచ్చే మార్పుని స్వీకరించ లేకపోయానని వాపోయారు.

కాత్యాయని!! ఈ ముప్పై ఏళ్లలో ఏనాడూ నన్ను ప్రశ్నించకుండా చివరికి బ్రతికున్న కూతురికి శ్రాద్ధకర్మలు చేస్తున్నా కూడా బాధని దిగమింగుకొని నాకు సహకరించావు. నేను చేసిన తప్పులో నిన్నుకూడా భాస్వామిని చేశాను. అందుకు నువ్వు కూడా నన్ను క్షమించాలి అని ప్రాధేయ పడతారుసోమయాజులు గారు.

నాన్నగారూ!! దయ ఉంచి మీరు అలా మాట్లాడవద్దు, మీరెప్పుడూ మాకు గురుతుల్యులే, మీవ్యక్తిత్వం మాకెప్పటికీ మార్గదర్శకమే అని కూతుర్లు ఇద్దరు, మీరు క్షమించమని అడిగి నన్ను పాపం మూట కట్టుకునేలా చేయవద్దని భార్య కాత్యాయని వేడుకుంటారు సోమయాజులు గారిని.

మేమే మీ అనుమతి లేకుండా వివాహం చేసుకున్నాము, మీరే మమ్మల్ని క్షమించండి అని అడిగిమనుమడిని ఆశీర్వదించమని ఆయన ఒడిలో పెడతాడు శామ్యూల్.

సోమయాజులు గారు మనుమడిని చూసుకుని మురిసిపోతారు.

సోమయాజులు గారు ఇప్పుడే ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులుఉండి తమ ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరతాడు శామ్యూల్ మామగారిని.

ఆయన సంతోషం గా తన అంగీకారం తెలుపుతారు. కాత్యాయనిగారి ఆనందానికి అయితేఅవధులు లేవు. ఈ జీవితంలో కూతురి ఇంటికి వెళ్ళే భాగ్యం ఉంటుందని ఆమె అనుకోలేదు. భర్తలో వచ్చిన మార్పుకి సంతోషిస్తుంది.

సోమయాజులు దంపతులు శామ్యూల్ వాళ్ళ అక్కకి, బావగారికి కృతఙ్ఞతలు తెలిపి వాళ్ళని తమఇంటికి ఆహ్వానించి అందరూ అక్కడ నుంచి సెలవు తీసుకుంటారు.

******************

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు